18, ఏప్రిల్ 2015, శనివారం

నాల్గింట మగనాలి







నాల్గింట మగనాలి

గడప లోపల హింస
గడప బయట ద్వంస
రచించే జ్ఞానపీఠాలు వాళ్ళు
కౌగిళ్ళకారాగారాలు
మోటుసరసాల ధర్డ్ డిగ్రీలు
తప్పని సరి శిక్షలు
అంతెందుకూ  కట్టు బానిసవీ
వారసులని కనే ఖార్ఖానావీ
జన్మాంత ఖైదీవీ కూడా నువ్వే !
ఆడపిల్లని అరణంగా రాసిచ్చిన మానవజాతికి
అమ్మవి నువ్వే బొమ్మవి నువ్వే !

********************

మేడమ్, జీ , సోదరీ , అమ్మా  అంటూ
 గౌరవం ఒలికిస్తూనే
వంకర ఆలోచనలు చేస్తూ ఉంటాడు
దేవతలా పూజించాలంటూనే
అవయవాల కొలతలతో
అంచనా వేస్తాడు
నాతిచరామి అంటూనే
నరకలోకాన్ని సృష్టిస్తాడు
సహభాగంగా గుర్తిస్తే చాలనుకుంటే
తోటి మనిషిగా గుర్తించడానికే
వెన్నుజూపుతాడు.
వాడినని ఏం లాభం ?
***********************


వేడికోళ్ళతో త్యాగనిరతులతో
నిన్ను కీర్తిస్తే కరిగి వరదై కరుణ జూపే
తాయివి నువ్వు.
తనువంతా కరిగించి మనసంతా కుదించి
ఓ పాత్ర లో ఒదిగేస్తావ్
వీడ్కోలు యాత్రలో నీ పై దండలై పూసేది ఈ త్యాగాలే
నీ జన్మ చరితార్ధం చేసిన గాధలని
తామ్రపత్ర లేఖలపై భద్ర పరిచి
యుగయుగాలు పాఠాలు బోధిస్తారు
స్త్రీ జాతి మణిరత్నంగా కీరిస్తారు

*********************
ఆకాశాన సగం మనం
అయినా మనల్నిఆణిచేసేది నిజం
ఆబల లంటూ అల్పంగా చూస్తే
అసహనం అంచులు దాటితే
ఉగ్ర కాళికనై ఉరుములు కురిపిస్తా
రుద్రభూమిలో రుధిరం తాగేస్తా
వేయి తలల ఆదిశేషు నై
 విలువల వ్యాకరణం నేర్పిస్తా
నీ ధీరత్వం వీరత్వం అన్నీ
కూకటి వేళ్ళతో పెకిలిస్తా

కామెంట్‌లు లేవు: