feeling alone
నాకో మనిషి కావాలి
త్వరితగతిన నాతో సంభాషించే మనిషి కావాలి
ఎవరితో నైనా మాట్లాడాలి
ఎవరితోనైనా పోట్లాడాలి
పోనీ ..ఎవరిపైనైనా కోపగించుకోవాలి
ఎవరి పైనైనా కినుక వహించాలి
ఎవరినైనా ఆత్మీయంగా హత్తుకోవాలి
జనారణ్యంలో మాట్లాడే మనిషే కరువయ్యాడు .
మనిషంటూ ఎవరున్నారు ?
అందరూ యంత్రాలే!
వడి వడిగా జడి జడిగా అందరూ చేరేది
ఆ యంత్ర సన్నిధానానే !
ఎటు చూసినా నాలుగు గోడలేనా
ఐదో గోడలూ ఉన్నాయి
మనిషికి మనిషికి మధ్య ఉన్న గోడ ఏ చరిత్రకందని వింత
దాని పొడవు వెడల్పు ఎవరూ ఊహించనిది
కొయ్య ముఖాలు వేసుకుని
చిన్న చిరునవ్వు చిందని పేదవాళ్ళు
అతిభద్రతా వలయంలో చిక్కి
ప్రతి వారిని అనుమానంగా చూసేవాళ్ళు
ముఖం మీదనే తలుపులు ధడేల్మని మూసుకునేవాళ్ళు
మనిషన్నవాడికి మొహం వాచిపోయినట్లు
దూరాన్నో తీరాన్నో వెతుక్కుని మాటలమూటని విప్పుకునేవాళ్ళు
గుంభనంగా కష్టసుఖాలు దాచేసుకుని
పైపై మెరుగులతో ఆనందాన్ని పులుముకునేవాళ్ళు
ఇరుగు-పొరుగు మంచి- చెడు, సాయం - సేవ
అన్నీ డిక్షనరీ లో భద్రంగా దాచేసి
మన పని మనం చేసుకుంటూ
ఇతరులెవరిని పట్టించుకోని మంచి వాళ్ళు
ప్రక్కనోడి పేరేమిటో కూడా తెలియని అతిమంచి వాళ్ళు
సమాజపు ఉనికి అవసరంలేనివాళ్ళు
ఆఖరికి వల్ల కాటికి మోసే నలుగురులేక
నాలుగు చక్రాల బండిపై నిశ్శబ్దంగా తరలింపబడే వాళ్ళు
వీళ్ళందరి మధ్య మనిషి జాడ వెతుక్కోవడం
ఆగాధమైన జలనిధిలో ఆణి ముత్యాన్ని వెతుక్కోవడమేనని
అనుకున్నానేమో ... నేను ... ఓ దరి చేరాను ..
ఇలా.. మాటై మనసై వాక్యమై ! .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి