2, సెప్టెంబర్ 2011, శుక్రవారం

మరో రాజేశ్వరి చచ్చిపోయింది

కొన్నాళ్ళ క్రితం నాకొక  విషయం తెలియగానే ఆశ్చర్య పోయాను. నీరజ ఆత్మహత్య చేసుకుని చనిపోయిందంటే జీర్ణించు కోలేకపోయాను. ఆదే  విషయం నన్ను వెంటాడింది.
అప్రయత్నంగా "మరో రాజేశ్వరి చచ్చిపోయింది" అనుకున్నాను.

రాజేశ్వరి చచ్చిపోయింది అనగానే  చాలా మందికి టక్కున చలం గారి  మైదానం గుర్తుకు వస్తుంది.

నిజంగా అలాటి కథే ఇది. 

వివాహం స్త్రీకే కాదు పురుషుడికి అవసరమైన తప్పని సరి బంధం. "వాడికేమిటి వాడు మగవాడు, మగవాడు  తిరగక చెడ్డాడట" అనే పాతకాలపు వాసనలు ఇప్పుడు పనికి రావు. ఆలస్యం  అయితే వీడికెవరు పిల్లని ఇవ్వరు  ఎవరో ఒక అమ్మాయని  కాకుండా ఈ తెలివి తక్కువ వెధవాయికి మంచి తెలివైన పిల్లని చూసి పెళ్లి చేయాలి అని అబ్బాయి బామ్మ తమ బంధువుల కుటుంబాలన్నీ గాలించి జల్లెడవేసి ఓ..చక్కని పిల్లని కట్టబెట్టినప్పుడు..ఈ  రాజేశ్వరి అనబడే నీరజ  వయసు పదహారేళ్ళు. 

పెళ్లి అనగానే  అబ్బాయి  తరపు వాళ్ళు పెట్టె నగలు,చీరెలు,పొలాలు  ఆస్తులు ముందు..అబ్బాయి మొద్దు  రూపం. తెలివితక్కువ తనం ఏమి  కనబడలేదు నీరజ తల్లిదండ్రులకి.(అలాగే ఇప్పటి తల్లిదండ్రులకి కూడా అని నా అభిప్రాయం.)

నీరజకి  పెళ్లి అయింది.అత్తా-మామల మాటున బామ్మతెలివితేటల పాటున ఇద్దరి పిల్లల తల్లి యింది.ఇద్దరు  పిల్లలు..స్కూల్ కి..వెళ్ళే కాలానికి బాతిక్ ప్రింటింగ్ &డైయింగ్ నేర్చుకుని..ఒక పది మంది వర్కర్స్ తో ఒక  యూనిట్ నడపడం మొదలైంది. అలాగే  ఆమె పరిచయం అయ్యింది  నాకు.

మా షాప్ కి కావాల్సిన హ్యాండ్ ప్రింట్ చీరలు కొనుగోలు చేయాల్సి వచ్చినప్పుడు వైజాగ్ లో ఉన్న దుకాణాదారు నాకు చెపితే కానీ  తెలియరాలేదు నాకు. మాకు కూసింత దూరంలో ఉన్నఆ యూనిట్ గురించి విని  మొదటి సారి  అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడామె  పనితనం,పర్యవేక్షణ అన్నీ చూసి ఆశ్చర్యపోయాను.

ఊరికి చివరగా ఉన్నఇంటిలోనే యూనిట్ నడుపుతూ ఇతర ప్రాంతాలనుండి వచ్చే ఆర్డర్స్ ప్రకారం రంగు రంగుల కలయికతో అందమైన ప్రింట్లతో చీరెలు తయారు చేయించేది. భర్త ఒక మంచి కూడలిలో హాండ్లూమ్ హవుస్ నిర్వహిస్తూ పొద్దున్నే స్కూల్లో పిల్లల్ని దించేసి షాప్ కి వెళ్ళిపోతే తిరిగి రాత్రికే రావడం. ప్రతి పనిని ఆవిడే స్వయంగా చూసుకునేది. గట్టిగా వ్యాపారం నిర్వహించేది.ఎప్పుడైనా నాకు రిమార్క్ పీసెస్ వచ్చినా ఆరునెలల తర్వాత మాత్రమే ఆ పీస్ కి బదులు పీస్ ఇచ్చేది.నేను మనసులో తిట్టుకునేదాన్నికూడా. ఇదంతా ఎందుకు చెప్పడం అంటే  మనిషి నిక్కచ్చి తనం గురించి తెలియజెప్పడానికి అన్నమాట. 

అలా ఉండే నీరజ  ఒకానొక రోజు తన యూనిట్లో పనిచేసే ఒక వర్కర్తో కలసి ఊరువిడిచి వెళ్లిపోయింది. కొన్నాళ్ళకి ఆమెని వెతికి తీసుకుని వచ్చారు. ఆమె వెంట పడినవాడు వీరి ధనబలం ముందు పరపతికి భయపడి పారిపోయాడు.  తిరిగొచ్చిన  ఆమె ఎన్నాళ్ళో బ్రతికి లేదు. ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇప్పుడు ఆ  బాతిక్ యూనిట్ లేదు. ఆమె భర్త నడిపే షాప్ లేదు.ఈ పట్నం నుండే ఆ కుటుంబం వెళ్ళిపోయి ఏ మూలో ముఖం దాచుకుంది.



ఈ విషయం  ఓ నల్గురు కూర్చున్నప్పుడు..చర్చకు వచ్చింది.

ఒకావిడ ఇలా అన్నారు. "ఆడవాళ్ళకి..కొవ్వెక్కితే ఇలాటి చేష్టలే చేస్తారు" అని తన భర్త  తిట్టిపోస్తుంటే సిగ్గేసింది" అంది. 

ఆమె భర్త యెంత ఉత్తమ పురుషుడో ఎవరికి తెలియదన్నట్టు అంది ఇంకొకామె రహస్యంగా అక్కసుగా.
ఆ విషయం గురించి కొంతమంది అభిప్రాయం ఇలా ("చలం" మైదానం చదివి ఆ ఆలోచనల ప్రభావం ఉన్న వారి మాటల్లో వారి అభిప్రాయాలు.)


నీరజ వివాహము జరిగినప్పుడు  ఆమె   వయసు పదహారు. పెళ్లి అంటే ఏమిటో..తెలియదు.ఓ పెద్దింటి కోడలు కాబోతుంది.అయింది కూడా. భర్త చాకులాంటి కుర్రాడు, చదువుకున్న వాడు, అందగాడు కానేకాదు.అయితే ఏమి ఇద్దరి పిల్లల తండ్రి. ఇంకా ఏం అర్హతలు కావాలి? మగవాడికి అది చాలదా? ఒక తీవ్రమైన ప్రశ్న.

చాలదు.ఆ అమ్మాయి మనసు వికసించాక చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తన కళ్ళతో చూసాక తన దగ్గర పనిచేసే వ్యక్తిలోని చురుకుదనం, ఆకర్షణ, హాస్యోక్తి ఇవన్నీ భర్తలో లేకపోవడం మన్ను తిన్న పాములా డబ్బుకోసం తాపత్రయపడే ఓ..సగటు మనిషి పట్ల ఆమెకి విరక్తి భావం పెంచుకుని ఉండవచ్చు. అందుకే అలా చేసి ఉండవచ్చు. అలా ఉన్నారని నచ్చిన వాడితో వెళ్ళిపోతారా? అనుకోవచ్చు కానీ ఆమె చెప్పిన కారణాలు అవే కావచ్చు

వెళితే వెళ్ళింది. వెళ్ళిన తరువాత తిరిగి రాకూడదు. వచ్చిందా చచ్చినట్టు తిట్టినా, కొట్టినా  భరించాలి. లేకుంటే క్షమా గుణాన్ని,సానుభూతిని ఇముడ్చుకోలేక జరిగిన తప్పు-ఒప్పులకి భాద్యత వహిస్తూ బ్రతికే అర్హత కోల్పోయి త్వర త్వరగా జీవితాన్ని ముగించుకోవాలి.

బొట్టు బిళ్ళ ఎంపిక చేసుకునేంత స్వేచ్ఛ భర్తని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ లేని అన్నాళ్ళు  ఎప్పుడో..ఒకప్పుడు ఎందుకో ఒకందుకు  ఎవరిపైనో మనసు పారేసుకుని ఎందుకు గడప దాటాలి? దాటినా మళ్ళీ ఎందుకు తిరిగి రావాలి? ఆ వెంటపడి వెళ్లినవాడి  నిజ స్వరూపం తెలిసిపోయి భ్రమపడితిని, పొర బడితిని అని చింతించినదా?

అవును నీరజకి ఈ ఆలోచనలు ఎందుకు రాలేదు.ముందువెనుకలు ఆలోచించకుండా,విచక్షణా జ్ఞానం లేకుండా ఓ పిరికివాడితో,నట్టడివిలో ఒదిలి పోయే  వాడిని నమ్ముకుని ఎందుకు వెళ్ళాలి.

స్త్రీకి శరీరం ఉంది వ్యాయామం కావాలి.
స్త్రీకి మెదడు ఉంది ఆలోచన ఉండాలి.
స్త్రీకి హృదయం ఉంది అనుభూతి ఉండాలి.
నిజమే ఇవన్నీ కావాలి వాటితోపాటు లోకజ్ఞానం, విచక్షణా జ్ఞానం కూడా కావాలి.
గుంటనక్కల్లాంటి పురుషుల పాల్బడకుండా ఉండే తెలివితేటలూ కావాలి. ఇవన్నీ లేకుండా మనసు పడిన మగవాడిని అత్యంతంగా ప్రేమించే మనసు మాత్రం వద్దు. అలాంటి ప్రేమించే కొంత మంది భాషలో కామించే మనసు ఉంటే రాజేశ్వరి లు వీధి వీధినా ఉంటారు.

ఇలా సాగుతూ మంచి-చెడులు ఎంచుతూ రాయి విసిరే అర్హత లేకున్నా అడుగడుగునా మాటలతో కుళ్ళ బొడిచే లోకంలో రాజేశ్వరి  లాటి నీరజ బ్రతకడం అవసరమా? అందుకే చచ్చిపోయింది.

ఆవును తప్పు నీరజ ది మాత్రమేనా? నాకు.సమాధానం దొరికే లోపు రెండు స్ట్రాంగ్ కాఫీలు, ఓ తలనొప్పి మాత్ర మాత్రం కావాలి. మరొక బ్లాగ్ పోస్ట్ అవసరపడుతుంది.

12 కామెంట్‌లు:

ప్రవీణ చెప్పారు...

wonderful post, I will be sharing this link in FB.

జ్యోతి చెప్పారు...

అన్నింటికి మించి గుండె ధైర్యం కావాలి. నచ్చాడనుకున్నవాడితో వెళ్లిపోవడానికి, వాడు మంచివాడు కాదనుకున్నప్పుడు తిరిగి వచ్చాక సమాజాన్ని ఎదుర్కోవడానికి లేదా సాటి ఆడవారి కుళ్లబొడిచే మాటలు విని బాధపడకుండా ఉండడానికి తట్టుకోలేక పోతే చావడానికి కూడా చాలా ధైర్యం కావాలి. నీరజ ధైర్యవంతురాలే ఐనా సమాజాన్ని ఎదుర్కోలేకపోయింది. ధైర్యంగా చనిపోయింది. దీనివల్ల ఎవరికి లాభం లేదు,,, నష్టం అంతకన్నాలేదు. కుటుంబం కూడా కొన్నేళ్లైతే తనని మర్చిపోతారు. మీలాటివారే తనను అప్పుడప్పుడు గుర్తుచేసుకునేది.....

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జ్యోతి గారు స్పందించినదులకు ధన్యవాదములు.నిజంగా నేను నీరజని మర్చిపోలేక ఈ పొస్ట్ వ్రాసాను. ఎవరు లోపాలు లేకుందా క్లీన్ చిట్ ఉండరు. కానీ సమాజం తప్పు చేసిన అనుకున్నవారిని..అంధువల్ల వాళ్ళకి ఏం నష్టం లేకపోయినా బాధించడం వల్లనో,ఆత్మ నూన్యతా భావంవల్లనో మరణించి..సమాజానికి సవాల్ విసురుతారు.ఆ పోకడ గురించి ఒక్క క్షణం అయినా ఆలొచింపజేయాలని జాగరుకలని చేయాలని నా ఆశ వివాహ వ్యవస్థ డొల్లతనం కనబడటం లేదూ ఇక్కడ.
@ ప్రవీణా ధన్యవాదములు. వీలైతే చలం రచనలు చదవండి.

Praveen Mandangi చెప్పారు...

పెళ్ళైన ఆడది లేచిపోతే ఒకలాగ, పెళ్ళి కాని ఆడది లేచిపోతే ఇంకోలాగ చూస్తుంది కదా సమాజం http://patrika.teluguwebmedia.in/2010/06/blog-post_25.html లేచిపోవడానికి నేను అనుకూలమే. సమాజంలో అదే అభ్యుదయకరమైనదని నమ్ముతాను.

జ్యోతిర్మయి చెప్పారు...

వనజ గారూ, 'నీరజ వివాహము అప్పటి వయసు పదహారు.పెళ్లి అంటే ఏమిటో..తెలియదు'. తెలిసినా కూడా ఒక వ్యక్తితో జీవితం పంచుకోవంటే అ వ్యక్తి గురించి ఎంత అవగాహన కావాలి. కొన్ని జీవితాలు అలా ముగుస్తుంటే యెంత బాధగా వుంటుందో..

MURALI చెప్పారు...

"ఊహ తెలియని వయస్సులో పెళ్ళి జరిగిపోయింది" కాదనటంలేదు. అలా అని ఊహ తెలిసాక మనసు మరొకరిని వెతుక్కోవటం మంచిదేనా? ఇలా అన్నా అని నన్ను పురుషాహంకారి అని కొందరనొచ్చు. నాకు బాధలేదు. ఇలా పెళ్ళయ్యాక కూడా ప్రేమించటం, వాళ్ళతో వెళ్ళిపోవటం చేస్తే కొన్ని రోజులకి భారతదేశంలో కూడా వివాహ వ్యవస్థ లేకుండా పోతుంది. మనం కొన్న వస్తువుకంటే పక్కవాడి వస్తువు ఎప్పుడూ అకర్షిస్తుంది. అలా అని మనసు పాడు చేసుకుంటే బ్రతకలేం. పెళ్ళి కూడా అంతే. కొన్నేళ్ళయ్యాక దంపతుల మధ్య ఆకర్షణ తగ్గుతుంది. జోవియల్‌గా బయట కనిపించేవాడూ నచ్చుతాడు. మనసు పడతారు. కానీ ఆ మగవాడు కూడా తన భర్తలానిటివాడే. వాడిలోనూ లోపాలుంటాయి. కొన్నిరోజులు పోతే వాడి మీడ ఖూడా ఆకర్షణపోతుంది. ఈ వాస్తవాన్ని కూడా మనసులో ఉంచుకోవాలి.

MURALI చెప్పారు...

తప్పు చేసినా వెనక్కి వచ్చిన నీరజను అక్కున చేర్చుకునే సంస్కారం మన సమాజానికి ఇంకా రాలేదు. రావాలని ఆశించటంకంటే తప్పు చేయకుండా బ్రతకాలనుకోవటమే మన సమాజనికి హితం.

శశి కళ చెప్పారు...

యెమిటొ అండీ..ఆలొచిస్తూ ఉంటె బుఱ వేడీ
అవుతున్ది.ఖర్మ సిద్దాంతమె మెలనుకుంటాను

madhu చెప్పారు...

Nijamandi Vanjagaru..mana Indian society lo aada varki oka nyayam magavariki voka nyayam...Manishi alochanallo maarpu raanatha varaku manishi lo manvatvapu vilavalu peraganantha varaku elanti yenni jeevaalu (aatmalu) bali avutayo....?
she should have thought about her kids before she take such step or die...she punshed her kids for not of their mistake.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Madhu..Thank you very much for your comment.

Manavu చెప్పారు...

సంసారాలు చేయడానికి కావల్సింది "సమ ఉజ్జీ తనం" కాదు సర్దుకు పోయే గుణం . ఒకరికి ఇల్లాలు గా మారెటప్పుడు ఆ అమ్మాయికి తన బాగస్వామిని ఎంచుకునే స్వేచ్చ లేకపొవడం దురద్రుష్టమే కావచ్చు. కాని ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యాక , వారిని సమాజంలో తల ఎత్తుకోలెకుందా చేసె స్వాతంత్ర్యం ఆమెకు ఎలా ఉంటుంది? ఇలాంటి వారి జీవితాలు చివరకు ఇలాగే ముగిసిపోయే అవకాశాలే మన సమాజంలొ ఎక్కువుగా ఉంటాయి. మీ విజయవాడ కు దగ్గరలో ఉన్న జి. కొండూర్ పోలిస్ స్తేషన్లో ఇలాంటి కేసు ఒకటి నమోదు అయి చివరకు ప్రియుడు చనిపోయి గొడవ జరిగితే అది పోలిస్ కాల్పుల వరకు వెల్లింది దీని మీద నేను రాసిన పోస్ట్ లింక్ లో చూడవచ్చు.తను చేస్తున్న పని సరి అయినదే అనే నమ్మకం ఉంటే గౌరవ ప్రదంగా విడాకులు తీసుకుని ఎవరి ఏడుపు వారు ఏడవచ్చు కాని, ఇలాంటి నీతిమాలిన పనులు చేసి పిల్లల్ని సమాజంలో తలవంచుకునేలా చేసే హక్కు ఏ తల్లి తంద్రులకు ఉండదు గాక ఉండదు.
"లేచి పోయే రాజెశ్వరీలు ,కసెక్కి పోయే కామేశ్వర రావులు" ఉన్నంత కాలం జి.కొండూరు లాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి!". http://ssmanavu.blogspot.in/2013/07/blog-post_2084.html

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

నరసింహారావు గారు నేనేమి సమర్దిస్తూ ఈ పోస్ట్ వ్రాయలేదండి కాకపొతే మీరు చెప్పినంత తీవ్రంగా నేను చెప్పకపోయినా "ముందువెనుకలు ఆలోచించకుండా,విచక్షణా జ్ఞానం లేకుండా ఓ..పిరికివాడితో,నట్టడివిలో ఒదిలి పోయే వాడిని నమ్ముకుని ఎందుకు వెళ్ళాలి}? అని అనుకున్నాను కూడా !
మీరన్నట్టు స్త్రీ వాదం అన్నింటిని భుజానవేసుకుని అన్నింటికీ పురుషుడే కారణం అని చూపించే కాలంలో మాత్రంలేదని ఖచ్చితంగా చెప్పగలను