12, సెప్టెంబర్ 2011, సోమవారం

రజనీగంధ

ఆ పూల రంగు, అందం మత్తెక్కించే పరిమళం.. 

సరిలేదు నీకెవ్వరూ ఓ..విరిబోణి..సరిలేరు నీకెవ్వరూ.. 
పారిజాతాలైనా, పొగడ పూలైనా మల్లెలైనా, జాజులైనా, సంపెంగలైనా, మొగలి పూలైనా అనుకుంటాను చచ్చేంత ఇష్టంతో..
రజనీగంధ,నిషిగంధ,లిల్లీ పూలు,ట్యూబ్ రోజ్ ఇలా ఏ పేరుతో..అయినా పిలవబడే పూల గాడమైన పరిమళం మనసును మైమరిపించేది... 
నాకు చాలా ఇష్టమైన పూలు..వాటి గాఢ మైన  పరిమళం ఆస్వాదించినప్పుడు..ఓహ్..చెప్పలేను. ఒక విధమైన మత్తు ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

నా చిన్నప్పటి నుండి మా ఇంట్లో ఒక్క   కుదురు అయినా ఉండేది.ఇక ఆ దుబ్బులోనుండి ఒక నిట్టనిలువైన శీర్షం పైకి..రావడం మొదలైందా దాని వైపే నా చూపులు ఎప్పుడు మొగ్గ వేస్తుందా ఎప్పుడు పువ్వు వికసిస్తుందా? అని ఎదురు చూపులు. ఎవరు కోయడానికి వీలు లేదు సర్వ అధికారాలు నావే! 

అలా .. ఆ కుదురులని పుట్టింటి ఆస్తిగా రామాయణ,భాగవత, భగవద్గీత తెచ్చుకున్నంత గొప్పగా,పవిత్రంగా  తెచ్చుకుని మా తోటలో కాస్త కళాత్మకంగా నాటి మురిసి పోయాను. ఆ కుదురులన్ని పూసే కాలం వచ్చి పూస్తే పండుగే నాకు వాటి పరిమళాలను ఆస్వాదిస్తూ అప్పుడప్పుడు విన్న ఈ పాట ఎవరు వినకుండా పరమ రోతగా పాడుకున్నాననుకోండి. ఇప్పుడు మీరు చూడండీ..ఎంత..అందం..ఎంత మధురం,ఎంత సౌరభం

గాలి గంధాన్ని మోసుకోస్తుందేమో..ఏమో కానీ వింత పరిమళాలని పోగేసుకుని ఓ తెమ్మెర అయి పలకరించి పులకరింపజేసి పోదూ! 

మా కృష్ణమ్మ ఒడిలోను, లంక పొలాల్లోనూ ఈ విరిబోణి విరగపూసి స్వామీ పాదాల చెంతనూ పూదండలోను స్వయంవరమాలికలోను,అలంకరణలలోను,   వేడుకలోను వేదనలోను నిలిచి
సాటిలేరు సరిలేరు నాకెవ్వరు అంటుంది.

ఈమెకి..పున్నాగపూలు..అక్క లేదా చెల్లెలు  ఏమో..! కార్తీకం   రాకుండానే.. పూసి తెల్లవారక ముందే రాలి నేలంతా చిక్కగా పరచుకుని..దారంతా ..సువాసనలు వెదజల్లుతాయి. వీటికి వ్యాపార లక్షణం రాలేదు ఎందుకో..అనుకుంటాను..ఇష్టంగా..ఖర్చు లేకుండా ఏరుకుని..దండలు..గుచ్చుకుంటూ..

ఏమైనా..ఈ పూల పరిమళం.. వెంటాడే గత జన్మాల జ్ఞాపకం.

3 కామెంట్‌లు:

కొత్త పాళీ చెప్పారు...

nice

ధాత్రి చెప్పారు...

పూల పరిమళాన్ని ఆఘ్రాణించినట్టుగా ఉంది మీ టపా చదువుతుంటే..:)

వనజ తాతినేని చెప్పారు...

Dhatri gaaru.. Thank you very much.