26, జనవరి 2013, శనివారం

శివరంజని


పాడితే శిలలైన కరగాలి.. జీవిత గతులైనా మారాలి..నా పాటకి ఆ బలమున్నదో లేదో..పాడిన పిదపే తెలియాలి..

పాట  కున్న శక్తి అలాటిదని  మనకి ఎన్నో పాటలు చెపుతూ  ఉంటాయి.

అలా అని  చెపితే మనం నమ్మేస్తామా ఏమిటి అనుకునే వాళ్ళని చూసాను కూడా.   పాటంటే  ఏమిటో వాళ్ళకి తెలిస్తే కదా అనుకున్నాను. రేడియోలో వస్తున్న ఈ పాటని వింటూ..

తర్వాత మీరు వినబోయే  పాట శివరంజని చిత్రంలో పాట అని  ఎనౌన్సర్ చెపుతూ  ఉంటే  విని అలా నిలుచుండి  పోయాను.

అసలు శివరంజని అనే పేరు వింటేనే నాకు పూనకం వచ్చినట్లు ఉంటుంది. రాగాలన్నిటిలోకి  శివరంజని రాగం కి ఒక ప్రత్యేకత ఉంది అని చెపుతారు. బాధాతప్త హృదయాలని సేద దీర్చే గుణం ఆ రాగానికి ఉందట. కానీ  ఆ రాగం మాత్రం విషాద రాగమని సంగీతంతో పరిచయం ఉన్నవాళ్ళు చెప్పుకుంటూ ఉంటె విన్నట్టు గుర్తు. కానీ కొన్నేళ్ళ నుండి శివరంజని అనే పదం వినగానే నాకు "శివరంజని " గుర్తుకు వస్తుంది.

శివరంజని ఎవరంటే..నేను జిల్లా పరిషత్ హైస్కూల్ లో సెకండరీ గ్రేడ్ టీచర్ గా జాయిన్ అయినప్పుడు..ఆ వూర్లో మేము అద్దెకి ఉంటున్న ఇంటి ప్రక్క అమ్మాయి.పద్దెనిమిది ఏళ్ళ వయసు ఉండేదేమో. చంకలో ఒక పిల్ల గర్భంలో ఒక పిల్లని మోస్తూ కనిపించేది.  చాలా అందంగా ఉండేది  ఆమెని చూస్తే తూర్పు-పడమర చిత్రంలో శ్రీవిద్య  రూపమే గుర్తుకు వచ్చేది.

ఆ కనులు పండు వెన్నెల గనులు 
ఆకురులు ఇంద్ర నీలాల వనులు 
ఆ వదనం అరుణోదయ కమలం 
ఆ ఆధరం సుమదుర మధు కలశం .. అన్న సాహిత్యమే గుర్తుకు వచ్చేది.

మేము ఉంటున్న ఆ వూరిలో త్రాగు నీటికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. నగర శివారు గ్రామమే కాబట్టి పట్టణం నుండి కార్పోరేషన్ వాళ్ళు ట్యాంక్ ల తో సప్లై చేసే నీటి కోసం పడి  గాపులు పడవలసి వచ్చేది. అక్కడ ధనవంతులు,పేదవారు అని తేడా లేనే లేదు. ఒకోకరు నాలుగైదు బిందెలు పట్టుకుని క్యూలో నిలబడి నీళ్ళు పట్టుకోవాల్సి వచ్చేది . అలాటి సమయాలలో నాకు తను చాలా సాయం చేసేది. నా చేతుల్లో బిందెలుని చొరవగా  తీసుకు వెళ్లి మంచి నీళ్ళు పట్టి ఇచ్చేది. ఆ ఒక్క ఇబ్బంది తప్ప  అక్కడ ఏ ఇబ్బంది కనబడలేదు నాకు.  అందరూ సహాయం చేసే గుణం ఏ చిన్న అవసరం వచ్చినా సొంత వారిలా ఆదు కునే వైనం చూసి ఆశ్చర్యం వేసేది కూడా.అందుకే ఇష్టంగా అక్కడే ఉండటానికి నిర్ణయించుకున్నాను.

"ఇదిగో.. టీచరమ్మ ! మీ పట్టణం లో లాగా ఇక్కడ పని పాటలు చేయడానికి ఎవరు మనుషులు దొరకరు. ఉదయాన్నే లేచి వాకిళ్ళు ఊడ్వాలి కళ్ళాపి జల్లి ముగ్గులు పెట్టాలి.బారెడు పొద్దేకేదాక పడుకుని లేచి గబ గబా ఉద్యోగాలకి పొతే.. మీకు అద్దెకిచ్చిన ప్రక్క కూడా మేము శుభ్రం చేయం. " అని ఖరాఖండి గా చెప్పేస్తే ముందు తెల్లబోయి తర్వాత చిన్నబుచ్చుకుని కూడా తలూపక తప్పలేదు. ఉన్న చిన్న ఊళ్ళో అద్దె ఇల్లు దొరకడం మాటలు కాదని రెండు రోజులు కాలికి బలపం కట్టుకుని తిరిగినప్పుడు తెలిసి వచ్చింది.మరి.

ఏ  విషయం అయినా నిర్మొహ మాటంగా అనేయడం పల్లె టూరులో వారికి  అలవాటు. వాళ్ళకి మాటల నయగారం తెలియదు  మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడే వాళ్ళ కన్నా..పోన్లే మనసు నొచ్చుకున్నా ఇదేనయం అనుకున్నాను.

పొద్దుగూకే వేళ  దీపాలు పెట్టిన తర్వాత నేను వీధి అరుగు మీద కూర్చుంటే "శివరంజని " తన పాపకి అన్నం తినిపిస్తూ.. మా ఇంటి ముందుకు వచ్చేది. కలుపుగోలు మనిషి. పట్నవాసం అంటే ఇష్టం. పదహారేల్లకే పెళ్లి చేయడం వల్ల ఇంకా అమాయకంగానే కనబడేది.

మామ్మ ఏం  జేస్తున్నారు అని అడిగేదాన్ని. "టీవి చూస్తున్నారు ఆంటీ ..అని చెప్పి ఆపేది కాదు. తన మాటల్లో ఆమె స్వవిష యాలు వినబడుతూ ఉండేవి. మా అత్తా గారి అమ్మ ఆమె. ఇద్దరూ కూతుళ్ళే ! మా ఆయన పెద్ద కూతురి కొడుకు. చిన్నప్పటి నుండి ఆమె పెంచింది కొడుకులు లేరని మా ఆయనని .దత్తత తీసుకుంది. పెద్ద చదువు లేకపోయినా పొలం బాగా వస్తుందని నన్ను ఇచ్చి పెళ్లి చేసారు. అంతా ఆమె చెప్పినట్లే వినాలి. మా ఆయనని కూడా మాట్లాడ నివ్వదు.అత్త కన్నా ఎక్కువ సాధింపులు. పసి పిల్లతో చేసుకోలేకపోతున్నానని మళ్ళీ నీళ్ళో సుకున్నాను అని  హాస్పిటల్ కి వెళ్లి నాలుగు రోజులు మా ఇంట్లో ఉండి వచ్చానని సాధించి పెడుతుంది.నీ పెళ్ళాం ఎల్లి పుట్టింట్లో నెలల పర్యంతం కూర్చుంటే నీకు ఎవరు ఒండిపెడతారు ? నాకు ఓపిక లేదు..మీ చేరెడు మీరు కాసుకోండి అని వేరు పెట్టేసింది. అని చెప్పింది.

మనసులో ఏ మాట దాచుచుకోవడం తెలిసేది కాదు.సాయంత్రం వేళప్పుడే వాకిళ్ళు చిమ్మి అందంగా ముగ్గులు పెట్టేది. రేడియోలో వచ్చే పాటలని తను పాడేది.బాగా చదువుకోవాలని కోరిక ఉండేది. నాకు ఇంతే ప్రాప్తం. కనీసం నా పిల్లలనైనా బాగా చదివించుకోవాలి అని చెప్పేది.

నాకు నవ్వు వచ్చేది. నువ్వే చదువుకునే వయసు. దూర విద్యా కోర్సులలో చేరి చక్కగా చదువుకో అని చెప్పేదాన్ని.

శివరంజని గర్భంతో ఉంది కాబట్టి  కడుపులో ఉన్న బిడ్డ స్థితి గురించి తెలుసుకోవడానికి ఆమెకి పరీక్షలు జరిగాయి. అప్పట్లో అంత కఠిన నియమనిబందనలు ఉండేవి కాదు కాబట్టి..రెండవసారి పుట్టబోయేది ఆమ్మాయే అని చెప్పారని చెప్పింది    "మళ్ళీ ఎవరితో అనబాకండి. మా మామ్మకి తెలిసిందంటే.. మళ్ళీ ఆడపిల్లేనా అని సాధించి పెట్టుద్ది " అని చెప్పింది.

ఓ..మూడు నెళ్ళకి శివరంజని ప్రసవించింది. ఆమెకి మళ్ళీ అమ్మాయే పుట్టినదని అలిగి ..ఆ పిల్లని తల్లిని చూడటానికి హాస్పిటల్ కూడా వెళ్ళలేదు. ఏమిటి మామ్మా.. ఏ పిల్ల అయితే ఏం బోయింది ఆడ పిల్లలు  మీ బిడ్డలే కదా!  అలా తేడా చూపకూడదు..అమ్మాయిలూ మహాలక్ష్మి తో సమానం అన్నా వినేది కాదు. శివరంజనికి అమ్మ సాలు వచ్చింది. అలాగే ఇద్దరూ వెంటవెంటనే ఆడపిల్లలే పుడతారు అని అనుమానం వచ్చినా అత్తా సాలు వచ్చుద్దిలే..అని ఊరుకున్నాను. మా అమ్మాయికి కూతురు వెనుక కొడుకు పుట్టలా.. ఏంటో..మా ఖర్మ ఇలా తగలడింది అని ముక్కు చీదేసేది.

ఇంకొక సారికి అవకశం లేకుండా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించారని పుట్టిన బిడ్డకి అయిదు నెలలు వెళ్ళిపోయినా కాపరానికి తీసుకు రానీయకుండా కత్తి కట్టుకు  కూర్చుంది.  అంతలో ఎండాకాలం రానే వచ్చింది. మామిడి కాయలు సీజన్ .పెద్దగా పని పాటలు లేకుండా తిరిగే శివరంజని భర్త లారీల కాటా వేసే  వే బ్రిడ్జ్ దగ్గర పనిచేసేవాడు. సరిగా ఇంటి మొహం చూసేవాడు కాదు. వాళ్ళు వీళ్ళు జోక్యం చేసుకుని మందలించి శివరంజని ని కాపురం కి తీసుకు వచ్చారు.ఆ అమ్మాయి వచ్చిన ఒక నెల రోజులకే  ఆమె భర్తకి అనారోగ్యం చేసింది. రోజు రోజుకి చిక్కి శల్యం అయిపోసాగాడు. శివరంజని మోహంలో కళా కాంతి లేదు.

పల్లెటూర్లలో ఏ విషయం ఎక్కువ రోజులు దాగదు కాబట్టి విషయం తొందరగానే బయటకి పొక్కింది. శివరంజని భర్త కి ఎయిడ్స్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. అలాగే ఆ అమ్మాయికి కూడా.. రెండవ పిల్లకి టెస్ట్ చేయించారు.అదృష్టవ శాత్తు. ఆ పిల్లకి నెగెటివ్ అని వచ్చింది.ఆతను వ్యాది తో కన్నా నలుగురిలో పడుతున్న అవమానం వలన ,భయం వలన నాలుగు నెలలు కూడా బ్రతకలేదు. మనుమడు చనిపోగానే.. అతని అమ్మమ్మ  కొంత ఆస్తి ఇచ్చి శివరంజని ని,పిల్లలిద్దరిని పుట్టింటికి పంపేసింది.

ఒకదాని వెనుక  కళ్ళ ముందు జరుగుతున్న పరిణామాలకి నేను సైతం మూగపోయాను. రేడియోలలో.టీ విలలో, హోరుమని ప్రచారం చేసే అవగాహన కార్యక్రామాలు అన్నీ గాలిలో ధూళిలో కలసిపోయాయి. అజ్ఞానంతో.. అవగాహనా లోపంతో మహమ్మారి హెచ్ .ఐ వి కి గురిఅవుతున్న వారిని చూస్తుంటే బాద కల్గేది  అలా శివరంజని జీవితం విషాద మాయం అయిపొయింది. ఇద్దరు పసిపిల్లలు, నెత్తిన మోస్తున్న అవమాన భారం,అయ్యో అని చూస్తున్న జాలి చూపులు ఆమెకి నరక ప్రాయం అయ్యాయి. పుట్టింట్లో అంతగా చదువుకొని తల్లి దండ్రులు ఎవరో ఒకరు వచ్చి అని పోయే మాటలతో.. మరింత నోచ్చుకోవడం ఆ ప్రభావాన్ని శివరంజని మీద చూపేవారు.

నాకు చాలా బాధ కల్గేది ... భగవంతుడా  ఈ బిడ్డకి  వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదు అని కోరుకునేదాన్ని.

 రోజులు గడుస్తున్న కొద్దీ శివరంజని తల్లి దండ్రులలో మార్పు వచ్చింది. తమ బిడ్డకి వచ్చిన కష్టానికి బాధపడుతూనే శ్రద్ద తీసుకోకుండా వదిలేస్తే ,సమాజం మాటలని పట్టించుకుంటూ కూర్చుంటే తమ కూతురు తమకి దక్కక పోవడమే కాదు..ఆమె బిడ్డలకి తల్లి లేకుండా పోతుందనే సృహ వచ్చి  శివరంజనికి క్రమం తప్పకుండా హాస్పిటల్కి  తీసుకు వెళ్ళడం మందులు వాడటం  చేయడం వల్ల ఆమె  మళ్ళీ ఆరోగ్యంగా మారింది.

దగ్గర లో ఉన్న ఎయిడ్స్ సెంటర్ వారు, అప్పుడప్పుడూ నాలాంటివాళ్ళు నేను కలసి ఆ అమ్మాయికి ఇచ్చిన సలహాలు సూచనలు వల్ల ఆమెలో ఎయిడ్స్ పట్ల అవగాహన పెరిగింది.భవిష్యత్ పట్ల ఆశాజనకంగా ఉత్సాహంగా ఉండే  శివరంజని చూస్తే నాకు కాస్త  మనసు తేలిక పడేది. ఓ..రెండేళ్ళు అలా గడచిపోయాయి. నాకు ఆ వూరి నుండి ట్రాస్ఫర్ అయింది. మేము సిటీలోకి వచ్చేసాము.

అప్పుడప్పుడు ఆ వూరి వారి ద్వారా శివరంజని కబుర్లు అడిగి తెలుసు కుంటూ ఉండే  దానిని. శివరంజని మళ్ళీ వివాహం చేసుకుంది అని తెలిసి ఆశ్చర్య పోయాను. పాజిటివ్ పెళ్ళిళ్ళ ప్రస్థానంలో శివరంజని తన లాంటి ఇంకొక పాజిటివ్ వ్యక్తి ని పెళ్ళాడింది ఆత ను ప్రభుత్వ ఉద్యోగి. తన పరిస్థితి తెలిసి మరొక తనలాంటి వ్యక్తీ తో కలసి జీవితం కొనసాగించాలని అనుకున్నప్పుడు శివరంజని తారసపడటం వారివురుకి ఆమోదం అయి పెళ్లి చేసుకోవడం జరిగిందని. అది ఇష్టం లేని శివరంజని తల్లిదండ్రులు ఆమెని ఇంటికి రావడానికి అనుమతించలేదని .. తన ఇద్దరి పిల్లలని తీసుకుని అతనితో కలసి హైదరాబాద్ వెళ్ళిపోయిందని విన్నాను.

ఎన్ని ఏళ్ళు గడిచినా నాకు శివరంజనని మర్చిపోవడం నా వాళ్ళ అయ్యేది కాదు. పదహారేల్లకే పెళ్లి పద్దెనిమిది ఏళ్ళకి ఇద్దరు పిల్లలు, భర్త హెచ్ ఐ వి తో చనిపోవడం సమాజం లో ఎదుర్కొన్న  అవమానం అన్నీ ఆ పిల్ల జీవితంలో విషాద ఘట్టాలే!

శివరంజనికి ఒక చెల్లి ఉండేది. శివరంజని జీవితం ఇలా అవడం చూసి ఆ అమ్మాయికి పెళ్లి ఆలోచన చేయకుండా బాగా చదివించారు. ఆ అమ్మయి భర్త ఆమె ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తులు.విదేశాల్లో ఉంటారు. శివరంజనికి తన జీవితం ఎన్నాల్లూ సాఫీగా సాగుతుందో నమ్మకంలేదు. అయినా బిడ్డలని చదివించుకుంటూ స్థిమితంగా ఉంది.

ఆమెని పెళ్లి చేసుకున్న వ్యక్తికి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి..ఇంకొన్నాళ్ళకి మరణించడం ఖాయం అని తెలిసినాక తన  తదనంతరం వచ్చే బెంఫ్హిట్స్ అన్నీ ఆమెకి చెందేటట్లు వ్రాసి.. ఆమెని పుట్టింటికి పంపి.. అతను తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయాడని  చెప్పేవారు. అతని తల్లిదండ్రులు కూడా  తన కొడుకుని  సొమ్ము కోసమే పెళ్ళిచేసుకుంది..చస్తాడని తెలిసి.. అన్నీ చేజిక్కించుకుని వెళ్ళిపోయింది అని అనేవారట.  తల్లిదండ్రుల చెంతకు చేరిన అతనిని  పశువుల పాకలో ఉంచారట   వారి నిరాదరణ తో ఒక వారం రోజుల లోపే  అతను మరణించినట్లు విన్నాను. మళ్ళీ శివరంజని జీవితంలో విషాదమే!

అంటీ! మా అమ్మాయిల  వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు.. నాకు ఏడుపు కూడా రాలేదు. విచ్చలవిడిగా తిరిగి నాకు ఈ రోగం అంటించి పెట్టేడే ..అని కోపం వచ్చేది.నేను చచ్చిపోతాను అని భయం వేసేది. కానీ ఆనంద్ ని నేను ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాను ఆతను నన్ను బాగానే చూసుకున్నాడు. మేము ఒకరి కోసం ఒకరు  అన్నట్లుగా బ్రతికాము. అంత ప్రేమ ఉండేది.ఆనంద్ చనిపోయాక నాకు బ్రతకాలని లేదు చచ్చిపోవాలని ఉంది అంటూ ఏడ్చేది. అలా ఏడ్చే ఆమెని చూస్తే శివరంజని రాగమే గుర్తుకు వచ్చేది. ఆ రాగంలో కూర్చిన పాటలు గుర్తుకు వచ్చేవి.

కుటుంబ సభ్యుల పట్ల అనుబందాలకన్నా.. డబ్బు ముఖ్య పాత్ర వహించడం చూస్తే వెగటు కల్గేది  నాకు. లైంగిక విజ్ఞానం లోపించి..వ్యాదుల బారిన పడే బిడ్డల గురించి తల్లి దండ్రులకి భాద్యత ,అవగాహన కూడా ఉండాలి.
 అసలు పిల్లలకి నైతిక విలువలు గురించి చెప్పేది ఏమన్నా ఉందా?  రాముడు కి ఒకే భార్య ,ఒకే బాణం అలా ఉండాల్సిన నైతిక విలువలను నేర్పే ప్రయత్నం చేయరు..అంతా గుప్పిట మూసి ఉంచి పెంచాలనుకుంటారు. ఇప్పుడు పిల్లలకి అవసరమైన దానికన్నా ఎక్కువే తెలుసు. పిల్లలకి తెలుసు అని పెద్దవాళ్ళకి తెలుసు.అయినా లైంగిక విద్య గురించి, లైంగిక వ్యాధుల గురించి మాట్లాడటానికి జంకుతారు. చాప క్రింద  నీరులా కబళించే వ్యాదుల పట్ల ఎవరికీ పట్టదు .ప్రభుత్వం ఖర్చుపెట్టే వేల కోట్ల రూపాయలు బూడిదలో పోసే పన్నీరు అవుతుంటాయి. యుక్త వయసులోకి వచ్చే పిల్లలకి తల్లి దండ్రులు,గురువులు కన్నా వివరించి చెప్పగల్గే సెక్సాలజిస్ట్  లు,కౌన్సిలర్స్ అవసరం అని  పాఠశాలల  యాజమాన్యం,విద్యాశాఖ అధికారులు  తెలుసుకోరు..ఎందుకు? ఇలాంటి ఆలోచనలతో నాకు తల పగిలిపోయేది.

ఎక్కడ చూసినా హెచ్ ఐ వి బాధితులే! వ్యాధి నిరోధకాల గురించి అవగాహన లేని జనం వ్యాధిగ్రస్తుల పాలిట  చూపుతున్న నిరాదరణ , వైఖరి మారేదేప్పటి కో..!? ఎంతమంది స్త్రీలు తమ తప్పిదం అంటూ ఏమి లేకుండానే.. హెచ్ ఐ వి కి గురి అయి అవమానాల పాల బడుతున్నారో! అర్ధాతర చావులకి గురి అవుతున్నారో! అసలు పెళ్లి కి ముందు  రోగ నిర్ధారణ  పరీక్షల ఫలితాలు ఇవ్వమని అడగడంలో లేదని నిర్దారించుకోవడంలో వచ్చిన నష్టం ఏమిటి..? వివాహానికి పూర్వం ఆరోగ్య పరిక్షా ఫలితాలు  తీసుకోవడం తప్పనిసరి చట్టం చేయడం కూడా అవసరం  అని అనుకునేదాన్ని.

నాలుగేళ్ళుగా శివరంజని గురించి విషయాలేవీ తెలియలేదు. ఈ మధ్య వాళ్ళ అమ్మ,పిల్లలు ఇద్దరితో కలసి మా ఇంటికి వచ్చింది. చాలా చక్కగా ఉంది. పిల్లలిద్దరూ ముత్య్లాలు లా ఉన్నారు. పెద్ద పిల్ల అప్పుడే ఇంటర్ మీడియట్ కి వచ్చేసింది. చిన్న అమ్మాయి చాలా చురుకుగా ఉంది. మా ఇంటి నుండి షాపింగ్ కి వెళ్లాం. శివరంజని ని ఆ చీర కొనుక్కో..ఈ చీర కొనుక్కో! నువ్వు కొనుక్కోక పొతే నాకు డ్రస్స్ వద్దు అని అలుగుతున్న ఆ పిల్లని చూస్తే ముచ్చటేసింది.

శివరంజని ముఖంలో తల్లిగా ఎంతో సంతోషం. నాకు సంతోషం కల్గించింది. అమ్మ-నాన్న  చెల్లి దగ్గరికి వెళ్లి ఆరు నెలలు ఉండి  వచ్చారు ఆంటీ! చెల్లి నాకు లాప్టాప్ పంపింది. నేను ఇప్పుడు.. లాప్టాప్ ద్వారా గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ ని నడుపుతున్నాను.  ఎక్కువ అకౌంట్స్  ఉంటె..మా ఊరిలోనే బ్యాంకు బ్రాంచ్ ఓపెన్ చేస్తారు అని చెప్పారు. నేను పని నేర్చుకుంటున్నాను.  డబ్బుకి ఏం లోటు లేదు. భూముల విలువలు పెరిగి నాకున్న ఆస్తి కోట్ల ధర పలుకుతుంది.భగవంతుడి దయవల్ల ఓ పదేళ్ళు బ్రతికితే నా బిడ్డలు పెద్దవాళ్ళు అవుతారు. అందు కోసం అయినా బ్రతకాలి కదా..! అని చెప్పింది ఎంతో ఆశగా.

 ఆ మాటలు వింటున్న నాకు మళ్ళీ విచారం ముంచుకొచ్చింది. అలా ఏం  జరగదులే! నువ్వు చాలా దైర్యంగా ,నిబ్బరంతో.. మెలుగుతున్నావు. నీలో విశ్వాసమే నీకు బలం,మందు కూడా..

అయినా ఎంత మంది ఏదో ఒక రోగాల బారిన పడి  చనిపోవడంలేదు. ఈ రోజు చూసిన వాళ్ళు రేపటికే మవుతారో తెలియడం లేదు. జీవితం ఆశ నిరాశ ల సయ్యాట. బ్రతకాలి బ్రతికి చూపించాలి . చెప్పాను.. ఉత్సాహం ఇస్తూ..

నవ్వింది. మీరు నన్ను మొదటిసారి చూసినప్పుడు మీరు అన్న మాట పాట మర్చిపోలేదు ఆంటీ..

" రాగాల సిగలోన సిరిమల్లివి సంగీత గగనాన జాబిల్లివి. శివరంజని .. అద్భతమైన రాగం  ఆనందం పంచే  రాగం.. ఈ పేరు ఎందుకు పెట్టారు నీకు  అన్నానట.

కానీ విషాదం నింపుకున్న రాగం . శివరంజని కి తగ్గట్టుగా..

అయినప్పటి స్వర సుర ఝరి తరంగానివి....  ఎన్ని ఆరోహణ లు ఎన్ని అవరోహణలు ఉంటే  ఏమి   జీవన సంగీతాన్ని ఆలపిస్తూ  సాగే రాగ తరంగానివి  అని అనుకుంటూ  ఉంటాను  అని చెప్పాను

శివరంజని నవ్వింది. ఆ నవ్వులు కలకాలం పూయాలి అనుకున్నాను
.

2 వ్యాఖ్యలు:

హితైషి చెప్పారు...

ఆత్మవిశ్వాసంతో,ఆశతో ముందుకు సాగుతున్న శివరంజనిజీవితం..
అనేక రకాల సమస్యలను ఎదుర్కుంటున్నవారికి ఆదర్శంగా కనపడుతుంది. వనజ గారు మరో మంచి మెసేజ్ ఉన్న కధ పరిచయం చేసారు. బావుంది.

భారతి చెప్పారు...

'విహంగ'లొ "జీవితేచ్ఛ", "శివరంజని" ..... ఈ రెండునూ స్పూర్తినిచ్చే సందేశాత్మక చక్కటి కధనాలు. చాలా బాగున్నాయి.
వనజగారు!
ఈ మద్య క్రమం తప్పకుండా మీ పోస్ట్స్ అన్నీ చదవడం అలవాటైనది. అంతటి ఆకర్షణ మీ శైలిలో ఉంది.
అయితే చదవడం...నిష్క్రమించడం ...
చదవడం...నిష్క్రమించడం తప్ప నా స్పందనను తెలపలేకపోవడానికి కారణం ఒకటే...
మీ రచనాప్రజ్ఞకు తగ్గ వ్యాఖ్యానం చేసేశక్తి నాలో లేకపోవడం.