22, మార్చి 2016, మంగళవారం

సత్యవతి కథలు



మూడువందల యాబై  పేజీలు  నలబై  కథలు . సత్యవతి కథలు పేరిట మార్చి ఇరవై వ తేదీన విజయవాడలో  ఆవిష్కరించబడిన కథా సంకలం. ఇష్టంగా ఈ కథల సంపుటిని కొనుక్కోచ్చుకున్నాను. చాలా కథలు అదివరకు చదివినవే ! అయినా మళ్ళీ మళ్ళీ చదవాలనే ఆత్రుత.  కొన్ని పనులని వాయిదా వేసుకుని చదువుతూనే ఉన్నాను . 


అన్ని కథలూ ఏదో చెప్పాలనుకుని  చెప్పే ప్రయత్నం చేసిన కథలే! చైతన్యం నిండిన కథలే ! ఈ కథలలో చాలా పాత్రలు తమ అస్తిత్వాన్ని తాము కాపాడుకోవాలనే సృహ కల్గిన కథలు.  


కాలం మారుతుంది. దాదాపు అరవై   సంవత్సరాల కాలం నాటి నుండి నేటి వరకూ స్త్రీల జీవితాల చుట్టూ పెనవేసుకున్న అనేకానేక ఉక్కు కౌగిళ్ళ స్వరూపాలని మనముందు తీసుకొచ్చి నగ్నంగా నిలబెట్టి ఉతికి ఆరేసిన కథలివి. మంత్రనగరి లో అనసూయ దగ్గర మొదలై చాలా పొడుగ్గా ఉండి మంచి కుంచె ఉన్న గట్టి చీపురుతో ఎప్పటికైనా పని బడుద్ది గందా.. అనుకున్న స్వర్ణ కథ వరకూ వచ్చి ఆగిన కథలు.   

పురుషుడుకేం ఎప్పుడూ బాగానే ఉన్నాడు. గంగి గోవుల్లాంటి అమాయకమైన ఆడవాళ్ళని హింసించి,అదిలించి,బెదిరించి,మభ్యపెట్టి,కపట ప్రేమ చూపించి,బతిమలాడి,బామాలి ఎలాగైతేనేం తనకి కావాల్సినట్టు ఆనందంగా ,విలాసంగా,అహంకారంగా బ్రతుకుతూనే ఉన్నాడు. అతని జీవితంతో ముడిపడిన స్త్రీకి మాత్రం నిత్యం చేదు అనుభవాలే !  సత్యవతి గారి కథల్లో ఎక్కువ కథలు పీడిత స్త్రీల కథలే! ఒక పావు వంతు మాత్రం ప్రపంచీకరణ నేపధ్యంలో గడుసుగా మారిన ఇప్పటి స్త్రీల కథలు.  


ముందుగా .... సత్యవతి గారిని అందరికి పరిచయం చేసిన కథ ... "ఇల్లలకగానే " ఈ కథ పూర్తీ పేరు "ఇల్లలకగానే పండగౌనా" . పెళ్లికి  ముందు ఎంతో  చలాకీగా, ఉత్సాహంగా, చదువు సంధ్య అన్నీ ఉన్న అమ్మాయి  పెళ్ళవగానే ఇంటి భాద్యతతో   తానేమిటో తన పేరేమిటో  కూడా మర్చిపోతుంది. భర్తని, తల్లి దండ్రులని అందరిని  తన పేరు అడుగుతుంది. కానీ ఎవరూ చెప్పరు. స్నేహితురాలు ప్రమీల కలిసి తన గురించి చెప్పేదాకా శారద అనే ఇల్లాలు తనవేరో మర్చిపోతుంది. మెదడులో అరలన్నీ కూడా ఇల్లెంత బాగా అలకాలీ అనే విషయం మీదే కేంద్రీకృతమై ఉంటాయి. తర్వాత తనెవరో గుర్తించుకుని ఇంటికొచ్చి అటకెక్కి పాత పైళ్ళు తిరగదోడి తన సర్టిఫికెట్స్ ,బహుమతులు ,బొమ్మలు అన్ని పిల్లలకి గర్వంగా చూపుతుంతుంది.  ఇది ఇల్లలకగానే కథ. ఆడపిల్లకి పెళ్ళవగానే కుటుంబం భర్త పిల్లలు తప్ప తన గురించి సృహే ఉండకూడదు ఉంటే  వైఫ్ ఆఫ్ గానే ఉండిపోవాలనే ఆధిపత్య భావజాలానికి అనుగుణంగా స్త్రీని ఇంటికే పరిమితం చేసిన తీరుని వ్యంగంగా చెప్పిన కథ ఇది . 


గోధూళి వేళ కథలో చెరువు తులసమ్మ గా ప్రసిద్దికెక్కిన మహాలక్ష్మి కథ ఊహాత్మకంగా చెప్పిన తీరుకి ఆశ్చర్య పోవాల్సిందే! ఎనిమిదో ఏట పెళ్ళైన మహాలక్ష్మి పైటేసుకుని పదిహేనోయేట అత్తవారింట్లో కాలు పెట్టినతర్వాత మొగుడే కాకుండా మూడు తరాల ఆడవాళ్ళు వంకాయ కాల్చుకు తిన్నట్టో ,చిలకడ దుంప కాల్చుకు తిన్నట్టొ కాల్చుకు తింటే రాత్రివేళ భర్త కాల్చుకుతింటాడు. ఆ కష్టం సుఖం తల్లితో చెప్పుకుంటే ఆమె నవ్వేసి "అత్తింట్లో కాపురం అనుకుంటే అచ్చంగాయలు ఆడుకోవడం అనుకున్నావా ? ఆడ పుటకంటే అంతే  మరి. మేమంతా అల్లా బాధలు పడ్డవాళ్ళమే,అదే అలవాటవుతుంది "అని చెపుతుంది. తర్వాత మహాలక్ష్మి రోజూ సాయంత్రం తులసి గట్టు మీద కూర్చుని ఏడ్చి ఏడ్చి అలా పది సంవత్సారాలు ఏడవడం మూలంగా చెరువు తయారైన విధం అందులో నీళ్ళు ఉప్పగా ఉండటం అనే వర్ణన వెనుక దాగిన వేదన,దుఃఖం ఎలాంటిదో మనం అర్ధం చేసుకోవాలి.  ఇందులో హాస్యంకన్నా అప్పటి కాలంలో స్త్రీల కడగండ్లకి అద్దం  పట్టిన అద్భుతమైన చిత్రీకరణ కనబడుతుంది.నాకైతే తులసమ్మ చెరువు వర్ణన ఎంత నచ్చిందో !  గోధూళి వేళకి ఇంటికి చేరుకోవాలనే ఆత్రుత,ఒత్తిడి తో నలిగిపోతూన్న ఉద్యోగినులైన స్త్రీల మానసిక స్థితికి అద్దం  పట్టిన కథ ఇది  


అరుణ సంధ్య కథలో అరుంధతి మౌనం వెనుక బ్రద్దలయ్యే అగ్నిపర్వతాలూ..ప్రవహించే  ఆలోచనల లావాని పసిగట్టగల్గింది కోడలు లత మాత్రమే! కొడుకు రవి, కూతురు కరుణ దృష్టిలో ఆమెప్పుడూ అదో తరహా మనిషే. ఆమె బ్రతుకు మీద నిర్ణయం ఎప్పుడూ ఆమెది కాదు.మరిగే కాఫీ నెత్తి మీద పోసినా, తినే అన్నం మొహానికి పులిమినా పుట్టింట్లో పది రోజులుండి మళ్ళీ ఇంటికొస్తే  పగిలిపోయిన గాజులు,ఎండిన పూలు,ఖాళీ కండోమ్ పాకెట్లని ఊడ్చేసుకుని, పరుపులు ఎండేసుకుని ఇల్లంతా డెట్టాల్ తో కడిగేసుకుని మళ్ళీ సుఖంగా కాపురం చేసుకున్నప్పుడు కూడా  ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన వచ్చిన అరుంధతికి పుట్టింది మొదలు    ఏం చదవాలో,ఏం బట్టలు వేసుకోవాలో,ఎలా మాట్లాడాలో, ఎవర్ని పెళ్ళాడాలో తండ్రి నిర్ణయిస్తే.. ఏం వండాలో,ఏం తినాలో,ఎక్కడ నవ్వాలో,ఎందుకు నవ్వకూదదో,ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదో భర్త నిర్ణయిస్తాడు. ఏది ధర్మమో పిల్లలు నిర్ణయిస్తారు. ఏదీ తనది కాని జీవితంలో మరణమైనా తనది కావాలనుకున్న ఆమె ఆశ నిరాశ అవుతుంది. తెల్లని దూది పింజె మబ్బులు అరుణిమలో కరిగి పోవడం,పడమటి ఆకాశమంతా గాయపడిన హృదయంలా అయిపోవడం ఆపై చీకటి ముసురుకు రావడం చూస్తూ కూర్చుంది అరుంధతి. అంతలోనే కరిగిపోయిన అన్ని రంగుల్ని చూసి ఆశ్చర్యపడింది అంటూ కథ మొదలవుతుంది. అరుంధతి తన జీవితం సూర్యుడస్తమించడానికి  ముందున్న ఆకాశంలా ఉందని రాబోతున్నదంతా  చీకటని అంతకు ముందు ఎన్ని రంగులున్నా  కరిగి పోక తప్పదని చెప్పినట్లు  ప్రతీకగా ఆరంభంలోనే కవితా వాక్యాలతో ఆకట్టుకుంది. .  


ప్రపంచీకరణ నేపధ్యంలో మారుమూల పల్లెటూళ్ళలోకి కూడా చొచ్చుకుని రాగల్గిన  బహుళజాతి సంస్థల ప్రవేశాన్ని, వస్తు వ్యామోహాల మధ్య  ఇరుకున్న మగువని,   మార్కెట్ మాయాజాలాన్ని విదేశీ చదువులు, ఉద్యోగాలు ఆఖరికి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటూ దేవుడిని,  వ్రతాలని, పూజలని అన్నింటిని మోసుకుపోగల్గేలా మారిన,స్త్రీల జీవన పరిణామ క్రమాన్ని పద్నాల్గేళ్ళ క్రితం వ్రాసిన మంత్రనగరి కథలో కళ్ళకి కట్టినట్లు చూపించారు. చాలామంది అమ్మాయిలు ఇంటర్మీడియట్ లోకి రాగానే కలల్లోకి పిట్స్ బర్గ్ వేంకటేశ్వరుడు,నయగారా జలపాతం వస్తాయట   అని సుతిమెత్తని వ్యంగాన్ని నొప్పి తెలియకుండా ఇంజెక్ట్ చేస్తారు . ఝాన్సీ పిన్ని చెప్పిన కథలో సూర్యుడిని చూడని చీకటి గదుల్లో పెరిగిన అనసూయ కి పెళ్లైంది పిల్లలు  పుట్టారుఒళ్ళంతా తెల్లగా పాలిపోతుంది దానికి కారణం సూర్యరశ్మి తగలకపోవడమే ! ఆమె కూతురు కృష్ణవేణి తండ్రిని ఎందుకు బడి మాన్పించావ్ నాన్నా అని అడిగినందుకు మెడ మీద సాచి కొడతాడు ఆమె తల ఒంగిపోతుంది పెళ్ళయ్యాక ఆమె భర్త ఆమె తలెత్తి మాట్లాడటం భరించలేక మెడ మీద మేకు కొడతాడు. కృష్ణవేణి కూతురు ఝాన్సీ లక్ష్మి పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఆడపిల్లలాగా ఉండటం అంటే ఏమిటీ ? అలా ఉండాలని ఎవరు చెప్పారు ? ఆడ లక్షణాలు అంటూ ఏమి ఉండవు అవన్నీ నామీదకి రుద్దడానికి నేను అమ్మమ్మని, అమ్మని కాదు అంటూ పురుషాహంకార పితృస్వామ్య ప్యూడల్ భావాలని తనపై రుద్దకుండా ఎదురుతిరుగుతుంది. ఈ ముగ్గురూ కూడా వాళ్ళ జీవితాల్లో అణ చివేతని భరిస్తూనే తన కూతురికి  తనలాంటి ఇరుకు జీవితం ఉండకూడదని భర్తతో పోరాడి  పిల్లలకి ఆసరాగా నిలుస్తారు. నాలుగో తరం వచ్చేసరికి కాస్త స్వేచ్చ స్వాతంత్ర్యం,చదువు, ఉద్యోగాలు, మనసుకి నచ్చినవాడిని పెళ్లి చేసుకునే దైర్యం వచ్చిన్దనుకున్న దశలో ఓ నీలికళ్ళ తెల్ల మనిషి భుజానికి ఒక సంచీ తగిలించుకుని వచ్చి రక రకాల వస్తువులు పరిచయం చేసి తర్వాత   సంచీ దులిపేసుకుని వెళ్ళడం లాంటి విషయాన్ని కథా గమనంలో అలఓకగా జొప్పించి మెప్పించిన తీరు ప్రశంశనీయం.


"గాంధారి రాగం" కథలో  మేథమేటిక్స్ లో కాలేజ్ ఫస్ట్ ,యూనివర్సిటీలో ఫోర్త్ ర్యాంక్, గర్ల్స్ స్టేట్ షెటిల్ చాంపియన్ , విదేశీ యువతితో ఇంగ్లీష్ లో చక్కటి సంభాషణ చేయగల్గిన సరస్వతి తనకన్నా తక్కువ చదువుకున్న భర్త సుబ్బారావు చాటున భాద్యత గల్గిన గృహిణిగా పిల్లలని పెంచుకుంటూ అతనికి కావాల్సినవి అందించుకుంటూ ఇంటెడు పనిముట్లుమధ్య ఒక మానవ పనిముట్టుగా షడ్రుచులశాకపాకాల  మధ్య పరిగెత్తుతూ పదిహేడేళ్ళు గడిపేస్తుంది.  గుండె రాగం తెలియనిభర్త,  గుండె రగిలించే రాగం పాడుతూ,  తనతో గాంధారి రాగం పాడిస్తున్నవాడికి తనేమిటో మర్చిపోలేదని నిరూపిస్తూ  కొడుక్కి కఠినమైన లెక్కచేసి పెడుతుంది.  కూతురు గీతకి షటిల్ ఇలా పట్టుకోవాలి, సర్వీస్ ఇలా చేయాలి అంటూ నేర్పుతుంది . ఆశ్చర్యపోతున్న కూతురిని చూస్తూ రేపటి నుంచి నేను ఆడతాను అంటుంది.  స్త్రీ సహజ తెలివితేటలని,ప్రతిభా పాండిత్యాన్ని బయటపడనీయకుండా గృహిణిగా పరిమితం చేసి తమ పాదాల క్రింద అణిచివేసిన పురుషుల  తీరుకి అద్దం  పట్టిన కథ  ఇది.


నలబై కోట్ల స్త్రీలున్న భారత దేశంలో ఓ ఇరవయ్యి మంది ప్రపంచస్థాయిలో ప్రతిభా మూర్తులుగా వెలిగిపోతుండగా వారిని చూసుకునే మురిసిపోతూ ఒకప్రక్క, ఆడపిల్ల పుట్టడమే శాపంగా భావించే   కోట్ల మంది మూర్ఖులు ఒకప్రక్క, తండ్రి చనిపోవడం మూలంగా ఆగిన  చదువు  అన్నావదిన నీడన నలబయ్యి ఏళ్ళు వచ్చేదాకా పనిమనిషిగా ఉండి గతిలేక తనకన్నాచాలా పెద్ద వాడైన సుందరాన్ని పెళ్ళాడుతుంది. తన కడుపునా ఒక బిడ్డ పుడతాడని ఆశపడుతుంది.  గోమతిని వంటింటికి పడక గదికి మాత్రమే  పరిమితం తప్ప ఈ వయస్సులో బిడ్డ ని కనడం నామోషీ  అని భావించి   మత్తు మందు ఇచ్చి మోసంచేసి గర్భస్రావం చేయించి రహస్యంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్  చేయించుకున్న సుందరరావు లాంటి పురుషునికి  గుణపాఠం చెప్పడానికి, ,ఆరోగ్యం నాశనమై పోతున్నా కొడుకుని కనాల్సిందే లేకపోతే ఒదిలేస్తాననే పూచిక భర్తకి బుద్ది  చెప్పాలని, పురుషుల అన్యాయాలకి బలైపోతున్న తనలాంటి వారందరినీ పోగేసి వారికి బుద్ది  చెప్పాలనే ప్రయత్నంలో, సాదు స్వభావులుగా ఉన్న స్త్రీ కూడా తిరగబడటం అనేది గొప్ప మలుపు ఉన్న   "గోవు" అనే కథ ఇది. అందరిని  తప్పక ఆకట్టుకుంటుంది. 

తల్లి చనిపోయిన కొన్నేళ్ళకి   తండ్రి పెళ్లి చేసుకుంటే అందుకు మనసులోనే వ్యతిరేకించి ఉన్న ఇంటిని ఆమెకే వ్రాసేసాడని ఆలోచన చేసిన రోష్ని తండ్రి ఆ ఇల్లు ఆమెకి వ్రాయకుండా రెండో పెళ్లి చేసుకోవడానికి ముందే తనకి అన్నయ్యకి   వ్రాసేసాడని తెలుసుకుని పశ్చాతాపబడుతుంది. ఆ ఇల్లు మీకే వ్రాసినట్లు ముందు మీకు తెలిసుంటే వృద్దాప్యంలో మీ బదులు ఆయనకీ సేవ చేసే మనిషి దొరికిందని  సంతోషించేవాళ్ళు మీరంతా ఆవిడని చీదరించుకునే వాళ్ళు కాదు అంటాడు రోష్ని భర్త. వృద్దాప్యంలో భార్య వియోగం తర్వాత పెళ్లి చేసుకుంటూ కూడా ఉన్న ఆస్తులని మొదటి భార్య బిడ్డలకి రాసేసి ఇంకొకామెకి అన్యాయం చేసినా ఒకింత ఆమెని పట్టించుకున్న  రామారావు పాత్ర, హుందాగా ప్రవర్తించిన శేషు పాత్ర మలి వివాహాలపట్ల కొంత గౌరవభావం కల్గిస్తూనే  బిడ్డల మనస్తత్వాన్ని ఎండగట్టే కథ. 

ఇలా ప్రతి కథ నర్మగర్భంగా కొన్ని చోట్లా, సూటీగా కొన్ని చోట్లా, వ్యంగంగా కొన్నిచోట్లా, ఆవేదనతో చాలా కథలని అనుభవిస్తాం. చదవడానికి కాసేపు విరామమిచ్చి చదివిన కథ గురించి ఆలోచిస్తాము. నేటి తరం స్త్రీల స్వేచ్చా స్వాతంత్ర్యాల వెనుక నిన్నటి తరంలో నలిగిపోయిన స్త్రీల మానసిక సంఘర్షణ, అస్తిత్వ వేదన అన్నీ ఈ కథల్లో  ఉన్నాయి . అందరూ తప్పక చదవవలసిన కథలు ఇవి .  చదివిన వాటిపట్ల స్పందిస్తూ చిన్నసమీక్ష వ్రాసుకున్నాను. ఇంకా కొన్ని వ్రాయలేక పోయాను. మళ్ళీ  తీరిక చూసుకుని తప్పకుండా వ్రాస్తాను . 


కొన్నాళ్ళ క్రిందట  సత్యవతి గారితో మాట్లాడుతున్నప్పుడు "పేరు లేని పిల్ల"  తర్వాత మీరేమీ వ్రాయలేదు ... వ్రాయండి సత్యవతి గారూ...  అని అడిగాను అభ్యర్ధనగా !

ఇంకానా .... ఇంకేమి వ్రాస్తానండీ బాబూ ! అన్నారు .

నిజంగానే ఇన్ని కథలు వ్రాయడానికి ఎన్ని అహోరాత్రాలు ఆలోచించి ఉంటారు . ఆ ఆలోచనలని కాగితంపై పెట్టడానికి ఎన్ని గంటలు శ్రమించి ఉంటారు ? గృహిణిగా, ఉద్యోగినిగా అన్ని భాద్యతల మధ్య రచనలు చేయడమన్నది ఇంకో పెద్ద భాద్యతగా భావించి  తపస్సుగా మార్చుకుని ఇన్నికథలు అందించారు. మొదటి చూపులోనే ఆకర్షణలో పడిపోయి అదే ప్రేమ అనుకుని పొరబడి పెళ్లి చేసుకుని విడిపోయి విడాకులకి వెళ్ళిపోయి స్వేచ్చగా బ్రతకడమే స్త్రీవాదం అని భావించే కథలు వస్తున్న కాలంలోనే నిజంగా స్త్రీలు అనుభవిస్తున్న బాధలు ఇవి .. వీటికి పరిష్కారం ఏమిటీ ..ఏమి చేయాలి అని ఆలోచింపజేసే కథలు ఇవి. ఇలాంటి కథలు వ్రాసిన సత్యవతి గారికి మనఃపూర్వక అభినందనలు,ధన్యవాదాలు చెపుతూ ... 



        


    

కామెంట్‌లు లేవు: