18, జూన్ 2021, శుక్రవారం

మన మూలాలు మన భాష

 చిన్నితల్లి ముచ్చట్లు

చిన్ని తల్లికి 15 వ మాసం నడుస్తుంది. నీలాలనింగిని అబ్బురంగా చూడటం యెగిరే పక్షులను చూసి ముఖం చాటంత చేసుకుని సంతోషంగా నవ్వడం వెళుతున్న విమానాలను చూస్తూ వాటి శబ్దాన్ని వింటూ జంకుగా మూతిముడుచుకుని చూడటం చేస్తుంది. 

అమ్మమ్మ తాతయ్య లను చూసి... దా.. దా.. అని పిలిచి చేయి పట్టుకుని .. ఆరుబయట పచ్చని పచ్చికపై చెప్పులు లేని చిన్ని చిన్ని పాదాలతో గజ్జలు ఘల్ ఘల్  మంటూండగా వేగంగా అటునిటు తిరగడం తల్లికి యిష్టంగా మారింది.  పెరటితోటలో విరిసిన పూలను కన్నార్పకుండా చూస్తూ వుంటుంది. రెండక్షరాల పదాలు పలుకుతుందీ చిలక. వాళ్ళమ్మ శ్రద్దగా నేర్పుతుంటుంది

ఇంతకు ముందే తారంగం తారంగం తాండవకృష్ణ తారంగం, ఏల వచ్చెనమ్మ కృష్ణుడు యేల వచ్చెను శ్రద్దగా.. ఆసక్తిగా యిష్టంగా చూస్తుంది.  పిల్లకి సంగీత రసజ్ఞత కూడా వుంది. రిథమిక్ గా అపాదమస్తకం కదిలిస్తూ వుంటుంది కూడా.  

 మా మనుమరాలి కోసం కోడలు అన్ని ఇంగ్లీష్ పుస్తకాలు (పంచతంత్రం తో సహా) ఆర్డర్ పెట్టి ఇక్కడ డెలివరీ ఇచ్చేవిధంగా కొనుగోలు చేసింది. ఇదేంటి ఇందులో తెలుగు పుస్తకాలు ఏవి అన్నాను ఆశ్చర్యపోయి. అక్కడమ్మాయే కదండీ.. అందుకే ఆ భాష అన్నారు మా చిన్న వియ్యపురాలు వియ్యంకుడు. లేదు అని ఇంగ్లీషు లో అరిచాను.. నా మనమరాలు పుట్టుకతోనే రచయిత అనుకుంటున్నాను.నాలా కవి కథకురాలు అవ్వాలి.. తెలుగు రాకుంటే ఎలా (అని అరిచేసాను కరిచేసాను అనుకునేరు అలా చేయకుండా  ) అని నెమ్మదిగా అన్నాను. ఎయిర్ పోర్ట్ కనుక  మనసులో అనుకున్నది బిగ్గరగా చెప్పడం బాగోదని అలా నెమ్మదిగా వున్నాను కానీ గొంతులో తీవ్రత అణిగేది కాదు. మరి జరగబోయేది అలాంటి అవమానమని నా భావన భావ వుద్వేగం కూడానూ. క్షణకాలం భవిష్యత్ అలాగే వుంటుందేమో అని భయం పట్టుకుంది కూడా.  

విమానాశ్రయం నుండి తీసుకువెళ్ళే సామాను ఎక్కువ బరువు వుండటం వల్ల పుస్తకాలు వెనక్కి వచ్చాయి. దాదాపు పన్నెండు కిలోలు. అవి ఎపుడో అపుడు వెళతాయి కానీ.. మా కోడలు  “చిన్నితల్లి” కి 56 అక్షరాలను అక్షరం అక్షరం విడదీసి ఉచ్చారణ స్పష్టంగా వుండే రీతిలో సరైన పెదవుల కదలికతో  పలకడం నేర్పుతుంది. బుడ్డది  తదేకంగా వాళ్ళ అమ్మ నోటి వొంకే చూస్తూ.. వుంటుంది. కొంచెం విరామం తర్వాత ఆ పదం పలికే ప్రయత్నం చేస్తుంది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నా.  తెత్తు (చెట్టు) అంటుంది. నా ఆనందం అంతా యింతా కాదు. నా ఆనందం నాది.  ప్రకృతి ప్రేమికురాలిని కదా మరి.

అమ్మ నాన్న తో సహా అన్ని  పిలుపులూ మాతృభాష లోనే.  నేను నా కొడుకుకి “నాన్న గారూ” అని పిలవడం నేర్పించాను. ఎందుకో ఆ పిలుపు మనసులకు దగ్గరగా కాకుండా దూరంగా అయినట్టు  గంభీరమైన భావన కల్గించినదని అనుభవంలోకి వచ్చాక.. మనుమరాలితో “నాన్న” అని పిలిపించి  ఈ పిలుపే మధురంగా వున్నట్టు భావన కల్గుతుందని అనుకుంటాను. 

నా మనుమరాలు యెన్ని భాషలైనా నేర్చుకోనివ్వండి కానీ మాతృభాష పై బాగా పట్టుండాలని మన భాషను చదవడం వ్రాయడం కూడా బాగా రావాలని నా ఆకాంక్ష. నా రచనలు చదవగల్గే విధంగా చదివితే చాలని అనుకోవడం స్వార్దం అవుతుంది కానీ మన తెలుగు మాండలికాలన్నీ చదివి అర్దం చేసుకోవాలనే అత్యంత ఆశ కూడా. 


పిల్లల పెరుగుదల   అమ్మమ్మ  నానమ్మలూ తాతయ్యలతో వుండాలి. అది తల్లిదండ్రుల శ్రద్దను బట్టి వుంటుంది. వారు మాతృభాషతో అవసరం ఏముంటుంది అనుకుంటే పిల్లలకు పెద్దలతో అనుబంధం వుండదు. యాంత్రికమైన తరాలు మారుతుంటాయి. “Roots” నవలను మనమెందుకు ఇష్టపడుతున్నాం, మెక్సికన్ సంస్కృతికి మనకు బోలెడు పోలికలు వున్నాయని ఎందుకు సంబరపడుతున్నాం? భారతీయులందరూ ఎక్కువగా ఒకే కమ్యూనిటిలో వుండాలని ఎందుకు ఆరాట పడతారు? కొత్తచోట మన వాళ్ళను చూస్తే ఎందుకు సంబరపడతాము.. వీటికి అర్దం తెలుసుకోగల్గితే మనం కోల్పోయిన విలువ తెలుస్తుంది. ప్రపంచదేశాలు అవలీలగా చుట్టగల్గిన వారు మన భాష కోసం తపన పడుతున్నారు. వేదన పడుతున్నారు తప్పిదాలను తల్చుకుని. అనుబంధాలు శూన్యం కాకపోవచ్చు కానీ భాష అనే వారథి సాంస్కృతిక పెన్నిధి కదా!

నా మనుమరాలు బాగా గడగడా చదివే కాలానికి తమిళనాడులో కూడా తెలుగు భాషకు ఇతర దక్షిణాది భాషలకూ ప్రాముఖ్యతనివ్వాలని యిప్పటి ముఖ్యమంత్రి తీసుకున్న  నిర్ణయాలు ఆదేశాలూనూ అంతకు ముందే ఆస్ట్రేలియా దేశంలో తెలుగు ను ఇంకొక భాషగా నేర్చుకోవడానికి అవకాశం కల్పించి ఆదేశాలను జారీ చేసి అమలులోకి వచ్చిన సంగతి గుర్తొచ్చి.. హమ్మయ్య (అమ్మయ్య సరైనది అనుకుంటున్నాను) మన మాతృభాష కు వెలిగిపోయే రోజులు వచ్చేసాయని సంతృప్తి పడుతున్నాను.

‘అమ్మలాంటి కమ్మనైన గంగిగోవు పాలనొదిలి ఖరము పాల కొరకు ఇంగిలీషు షోకు వెంట  ఈ పరుగులెందుకు?''  అనకూడదు కదా.. అక్కడ పుట్టిన వారిని మనలా వుంచాలనుకునే వుండాలనుకుని చేసే ప్రయత్నాలన్నీ మన మూలాలను మర్చిపోనివ్వకుండా చేసే ప్రయత్నాలే.

అప్రయత్నంగా..   ఇప్పటికిపుడే నా మనమున పెదవుల పలికిన  లలితా చాలీసాలో వొక పాదము”శ్వేత వస్త్రము ధరియించి, అక్షర మాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి. జ్ఞాన జ్యోతిని నింపితివి”

 నేర్చుకున్న యే అక్షరమైనా అది యే భాషైనా అమ్మ కరుణతోనే కదా! శ్రీ మాత్రే నమః 🙏

ప్రస్తుతం నాయనమ్మ లోకం  అంతా చిన్నితల్లి చుట్టూరా.. నే!


కామెంట్‌లు లేవు: