మెరుపు (మైక్రో కథ)
చెప్పవూ .. చెప్పవూ..
కథ చెప్పవూ.. అమ్మ మెడ చుట్టూ చేతులేసి గోముగా అడిగారు పిల్లలు.
నల్లని తెరేసుకున్న పలకల పెట్టెను చూస్తూ…
చిన్నగా నవ్వుకుని గొంతు సవరించుకుందామె.
గూటిలో దీపం వెలుగుతూంది
ఇల్లంతా మసక వెలుతురులో స్నానం చేస్తుంది.
బయట ఉరుముల గర్జనలకు భయపడి విసురుగా లోపలికొచ్చిన గాలి తొడుక్కోవడానికి చొక్కాని వెదుక్కుంటుంది
నాన్న మనసు గుబులు దుప్పటి కప్పుకుంటుంది
ధాన్యం ఇంకా కల్లం లోనే వుంది. చినుకులకు చేయి అడ్డుపెట్టుకుంటూ చీకటిలో వడి వడిగా అడుగులేసాడు. ఇదిగో…నేనూ వస్తున్నా అంటున్న ఇల్లాలి మాట వినిపించుకోకుండా.
కాసేపటి తర్వాత పెళపెళమంటూ పిడుగు పడిన శబ్దం అది చెట్టుపై కాదు, కుటుంబంపై
ఆ ఘాతానికి ఇల్లాలు నేల కూలేదే మరో చెట్టులా..
పిల్లలు చెట్టుకొకరు పుట్టకొకరవుతారని నిబ్బరం చేసుకుంది. ధైర్యం అరువు తెచ్చుకుంటుంది రోజూ.
కథ చెప్పమని అడిగిన పిల్లలకు తన కథనే కథలు కథలుగా వర్ణించి చెబుతుంది.
కథ వింటూన్న పిల్లలు దిగులుగా చూస్తూ మెల్లిగా అమ్మ రెక్కల కింద దూరి గట్టిగా వాటేసుకుంటారు చెట్టు మీద పిట్టలా.
పిల్లలిద్దరూ.. మబ్బు పడితే చాలు ఆకాశం వైపు చూసి అర్జునా ఫల్గుణా చేతులు జోడిస్తారు. మెరుపును చూస్తూ హడలిపోతారు. చినుకు జాడ చూస్తే కోపపడతారు మా ఇంటిపై కురవొద్దు పో పో.. అంటూ.
అమ్మ నోటిపై వేలుంచి పిల్లలను మందలిస్తుంది. పొట్ట చూపించి ఎలా అని ప్రశ్నిస్తుంది. పిల్లలెళ్ళి అమ్మ ఆకాశాన్ని హత్తుకుంటారు.
కథ ఆడియో బుక్ గా YouTube లో…
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి