ప్రకృతి కథలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రకృతి కథలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, జులై 2023, శనివారం

కొన్ని సూర్యోదయాలు


 

1. ఆయన వచ్చాడు. వేకువ నే 04:15 కి లేచి యెదురుచూస్తున్నా. ఇప్పటికి వచ్చాడు.. తన లేత కిరణాలతోనే తీక్షణ ను తెలియజేస్తూ.. మరి కాల్చకపోతే శుభ్రపడేది యెలా! 

ఈయనతో పాటు.. మనుమరాలు కూడా వచ్చింది. పళ్ళు తోమకుండా తప్పించుకునేందుకు.. నాయనమ్మ రక్షణగా నిలబడుతుందని. నాయనమ్మ కూడా కఠినాత్మురాలే.. కనబడే ఆయనతో పాటు 😊😊 ఎత్తుకుని తీసుకువెళ్ళి అమ్మకో నాన్నకో అందించి వస్తుంది. (మనసులో వేయి క్షమాపణలు చెప్పుకుంటూ)

2. ఇదిగో.. ఈయన వచ్చేసాడు.. వెలుగుజుత్తులేసుకుని. 

రోజూ చూసే సూర్యోదయమే! కానీ నిత్యనూతనం. 

వెలుగునీడలు మనకు ఎన్నో సత్యాలను బోధ పరుస్తాయి. 

కిరణాల రంగులే.. మనకు ప్రకృతి అంతా కనబడేరంగులు. 

నా అముద్రిత కథలో .. ఈ వాక్యం రాసుకున్నాను. 

“జీవితం వృధా కాకూడదు నీ ప్రేమ వృథా కాకూడదు. 

ఇచ్చుకున్నవాళ్ళు ఇచ్చినంత పుచ్చుకున్నవాళ్ళు పుచ్చుకున్నంత” అని. 

రోజు వృధా కాకూడదు.. అని సూర్యుడు నుండి పాఠం నేర్చుకుందాం. 

లోకమిత్రాయనమః 🙏


3. లోక మిత్రునితో.. నా సంభాషణ:

నా భావనా ప్రపంచానికి మూలం ప్రకృతి యే కదా!

నీవు రాక పూర్వం మరొక తావున వుందువని నాకు పదేళ్ళు వచ్చాక చదువుకున్నాను. మా ఉనికికి ఆధారమైన నేలపై నిలబడి మా చుట్టూ మేము తిరుగుతూ నీ చుట్టు కూడా తిరుగుతున్నామని.

 ఉదయపు నడకలో వొంటరిగా అడుగులు వేస్తూ…ఇలా ఆలోచన చేస్తుంటాను మానవ నిర్మితమైన ఈ రహదారులు ఏర్పడకముందు ఇదంతా ఓ పచ్చిక సముద్రమో కొండలో బండలో నిండిన నిర్జనారణ్యమే కదా! అప్పుడూ యిప్పుడూ నీ దయావర్షం సమానమే కానీ.. ఇప్పుడు మరికొంత ప్రచండం ఈ సకల జీవకోటికి నొప్పి ని కలుగజేస్తుంది అంటే అది మనిషి తప్పిదమే కదా! 

విజ్ఞాన వీధుల్లో సంచరించడం అంటే ప్రకృతి ని ప్రేమించడం గౌరవించడం పూజించడం. నా వంతు భాద్యతగా ..  చెబుతుంటాను. చేస్తుంటాను. 

Save Soil 🌍

save trees 🌲  🌳 

Save  Water 💦 

Save power 🔌🛥️ 

Save food 🥘 🌾 

Save  money 💰 

ఫలితం మనది కాకపోయినా.. ప్రయత్నం విడనాడకూడదు. మనం ఇలా వున్నామంటే పూర్వీకుల పుణ్యఫలమే కదా!

ఉదయరాగం -వనజ




9, జూన్ 2021, బుధవారం

మెరుపు

 మెరుపు (మైక్రో కథ)

చెప్పవూ .. చెప్పవూ.. 

కథ చెప్పవూ.. అమ్మ మెడ చుట్టూ చేతులేసి గోముగా అడిగారు పిల్లలు.

నల్లని తెరేసుకున్న పలకల పెట్టెను చూస్తూ… 

చిన్నగా నవ్వుకుని గొంతు సవరించుకుందామె.

గూటిలో దీపం వెలుగుతూంది

ఇల్లంతా మసక వెలుతురులో  స్నానం చేస్తుంది. 

బయట ఉరుముల గర్జనలకు భయపడి విసురుగా లోపలికొచ్చిన గాలి తొడుక్కోవడానికి చొక్కాని వెదుక్కుంటుంది

నాన్న మనసు గుబులు దుప్పటి కప్పుకుంటుంది 

ధాన్యం ఇంకా కల్లం లోనే వుంది. చినుకులకు చేయి అడ్డుపెట్టుకుంటూ  చీకటిలో వడి వడిగా అడుగులేసాడు. ఇదిగో…నేనూ వస్తున్నా అంటున్న ఇల్లాలి మాట వినిపించుకోకుండా. 

కాసేపటి తర్వాత పెళపెళమంటూ పిడుగు పడిన శబ్దం అది చెట్టుపై కాదు, కుటుంబంపై

ఆ ఘాతానికి ఇల్లాలు నేల కూలేదే మరో చెట్టులా..

పిల్లలు చెట్టుకొకరు పుట్టకొకరవుతారని నిబ్బరం చేసుకుంది. ధైర్యం అరువు తెచ్చుకుంటుంది రోజూ.

కథ చెప్పమని అడిగిన పిల్లలకు తన కథనే  కథలు కథలుగా వర్ణించి చెబుతుంది.

కథ వింటూన్న పిల్లలు దిగులుగా చూస్తూ మెల్లిగా అమ్మ రెక్కల కింద దూరి గట్టిగా వాటేసుకుంటారు చెట్టు మీద పిట్టలా. 

 పిల్లలిద్దరూ.. మబ్బు పడితే చాలు ఆకాశం వైపు చూసి అర్జునా ఫల్గుణా చేతులు జోడిస్తారు. మెరుపును చూస్తూ హడలిపోతారు. చినుకు జాడ చూస్తే కోపపడతారు మా ఇంటిపై కురవొద్దు పో పో.. అంటూ.

అమ్మ నోటిపై వేలుంచి పిల్లలను మందలిస్తుంది. పొట్ట చూపించి ఎలా అని ప్రశ్నిస్తుంది. పిల్లలెళ్ళి అమ్మ ఆకాశాన్ని హత్తుకుంటారు.


కథ ఆడియో బుక్ గా YouTube లో…