రైతుల దగ్గర పంట కొనండి వారికి సాయపడండి అనుకుంటున్నాం. పండించిన రైతు దగ్గర కిలో బీరకాయలు Rs/ 60 తీసుకుంటున్నారు. అరకేజీ బీరకాయల్లో వొకటి పెద్దది మరొకటి చిన్నది. పెద్దకాయ ముదిరింది గట్టిగావుంది పీచుకట్టింది.. డోర్ డెలివరీ ఇచ్చి వెళ్ళిపోయారు.(plastic బకెట్ క్రిందకు వేలాడేస్తే అందులో వేసి వెళ్ళిపోతారు) ఆ ముదురుకాయ చెత్తబుట్ట పరం చేసి చిన్నకాయతో ఉల్లిపాయ కలిపి వండుకుని ఆ పూటకు కూర మమ అనిపించాను.
పేకెట్ పాలు వాడవద్దని డాక్టర్ సూచిస్తే గేదెపాలు లీటర్ 80 రూపాయలు లెక్కన పోసి వెళతాడు వొకతను. కాఫీ కని కొద్దిగా పాలు కాయటానికి పొయ్యి మీద పెట్టగానే ఢాం ఢాం అనే శబ్దాలతో ఆ పాలు విరిగి దబ్బలై పోతాయని సందేశం వస్తుంది. మళ్ళీ పాల పేకెట్ల కోసం బజారున పడాలి. అప్పటికీ ముందే చెప్పాను. మీకు పాలు లభ్యత వుంటేనే పొయ్యండి. దొరకక పోతే చెప్పండి. అంతే కానీ కల్తీ పాలు పొయ్యొద్దు అని. మాటకు మాత్రం అలాగే అంటారు. వారంలో నాలుగు రోజులు ఇదే తంతు. అసలు పాలు పాలపదార్దాలు మానేస్తేపోతుంది.. అనుకుంటా. స్యయంగా గేదెలను మేపుకుని పాలు పిండుకుని తాగగల్గితే పాల జోలికి వెళ్ళాలి లేకపోతే లేదు అని నిర్ణయించుకోవడం వుత్తమం.
అపుడపుడు పొలం చూసుకోవడానికి వెళతానా.. ఒక యేడాది కాలంలో పంట పంటకి దున్నినప్పుడల్లా హద్దులను చెరిపేసి ఒక అడుగు వెనక్కి జరిగి గనెం రూపురేఖల్ని మార్చేసారు. ఇలా యెలా చేస్తారు. రోజూ చూసే నువ్వు గమనిస్తావు కదా.. వారిని అడ్డుకోవడమో లేదా మాకు తెలియజేయడమో చేయాలి కదా అని కౌలుదారుడిని గట్టిగా కోప్పడితే.. ఆయనకు మతిస్థిమితం లేక అలా చేస్తుంటాడని అంటున్నారు. యాక్సిడెంట్ జరిగి కోలుకున్నప్పుడు నుండి విపరీతంగా ప్రవర్తిస్తున్నాడంట. ఇపుడు వాళ్ళ వాళ్ళే లైన్ లాగి గనేలు వేసుకుందామని అంటున్నారు. రెండురోజులలో ఆ పని చేయిద్దాం కబురు పెడదాను రండి అని అంటాడతను.
హద్దులు చెరిపేసి ఇతరుల పొలం తమ దాంట్లో కలుపుకోవాలను వ్యక్తి గతంలో పైకి క్రిందకు ఐదు సెంట్లు భూమిని కలుపుకుని వున్నాడు. రీ షెడ్యూల్డ్ చేయడానికి నేను అఫ్లికేషన్ పెట్టుకుని సర్వేకి వెళితే సర్వేయర్ మీ పొలంలో వాళ్ళది ఐదు సెంట్లు కలిసి వుందని వారి భూమిలో మార్క్ చేస్తే మీది తప్పు కొలత మా పొలంలో కలసిందని యెలా చెబుతారు పడమటి పక్క ఉత్తరం పక్క కలిసి వుందేమోనని గొడవ పడి.. నోరు పారేసుకున్నాడు. ఇక ఇది తేలదండీ.. మీరు కలెక్టర్ కు అర్జీ పెట్టుకోండి. గ్రామ అడంగళ్ మ్యాప్ తెచ్చి ఈ సర్వే నెంబర్ లో వున్న పొలం అంతా కొలిస్తే కానీ ఇది తేలదు అని క్లోజ్ చేసాడు సర్వేయర్. ఆడవాళ్ళు భూమి సమస్యలపై వివరణ కోరితే పురుషులు ఈ ఆడాళ్ళకు ఏమి తెలుసు అని లోలోపల హేళన చేస్తూ పైకి నిర్లక్ష్యపు మాటలు, అవమానించే లకారాలు మాట్లాడతారు. కష్టార్జితంతో కొనుకొన్న పొలాన్ని ఆక్రమించుకుంటే ఎంత బాధో నొప్పో వాళ్ళకెలా తెలుస్తుంది. వాళ్ళకు తాత ముత్తాలనుండి వచ్చిన ఆస్థి చాలక పక్కనోడి పొలం ఆక్రమించుకోవడం. అడిగితే అవమానించడం. ఆ మాటల వల్ల ఎంత అవమానం వేసిందో నాకు. వారం రోజులు మాములు మనిషిని కాలేకపోయాను. ఏడ్చాను కూడా.
అసలు ఆ పొలం కొన్నప్పుడే మేము కొలతలు వేసి హద్దులు వేసుకుని అపుడు రిజిస్ట్రేషన్ కి వెళ్ళాల్సింది. బంధువులే కదా.. 60 ఏళ్ళ పై బడిన ఒరిజినల్ డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్స్ ఇసి అన్నీ కరెక్ట్ గా వున్నాయని అపుడు పొలంలో పంట వుందని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం.
వాళ్ళ అన్నదమ్ముల పిల్లలలో ఒకతను అక్కా.. మీకు డాక్యుమెంట్ టు డాక్యుమెంట్ కరెక్ట్ గా వుంది. ఐదు సెంట్లులో పంటేగా పండించుకుంటాడు. తర్వాత భూమి కొలిపించి నేను వొప్పజొపుతానుగా అన్నమాట నీటిమీద రాతల్లా అయిపోయాయి. ఒకవైపు 5 సెంట్లు లెక్కతేలలేదు. ఇంకా వెనక్కి జరుగుతుంటే కడుపుమండి పోతుంది.కళ్ళల్లో వొత్తులేసుకుని యెన్నాళ్ళని కాపలా కాసుకోగలం. మన ఇరుగు పొరుగు చల్లగా వుండాలి. మనం దుర్మార్గంగా ప్రవర్తించకుండా నిజాయితీగా వుండాలి అనుకోవాలి తప్ప.
ధర ఎక్కువ తీసుకున్నా వస్తువును నిజాయితీగా అమ్ముదాం అని పాడి పంటకూ లేదు. కాయ పండూ పప్పులు ఉప్పులు నూనె అన్నీ కల్తీనే. మనిషీ మనసూ అన్నీ కల్తీలే. వ్యాధి నిరోధక టీకాలో మందు లేకుండానే మభ్యపెట్టడం దొంగదారిన ఇళ్ళకు తీసుకొచ్చి అమ్ముకోవడం. నిజాయితీ స్వచ్చత దేనికీ లేదు. ఆలోచిస్తున్న కొద్దీ బాధ కోపం ... అసహనం. భూమి పై ఈ మాత్రం కూడా బ్రతికే అర్హత మనిషి లేదు. కలుషితమైన మనసులు మనుషులు కలుషితమైన ఆహారాలు.ఇక శారీరక మానసిక సామాజిక ఆరోగ్యాలు ఏం బాగుంటాయని 😢🙃
ఈ మనషులకు ఏమౌతుందసలు!? ఎటువైపు వీరి పయనం!?🤔
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి