సదాచారాలను పతనం కాకుండా కాపాడుకోవాలి
ఈ విషయం పై " జనవిజయం " లొ.. నా వ్యాసం
ఈ లింక్ లో ...
ఎందరో తత్వవేత్తలున్న భారత భూమి సంస్కృతీ సాంప్రదాయాలకు పేరెన్నికగన్నది. అనాదిగా మనదేశంలో భౌతిక విలువలకంటే భౌద్ధిక విలువలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాము. ప్రపంచంలోనే మన సంస్కృతి ఔన్నత్యానికి అత్యంత విలువ ఉంది. నాటి వివేకానందుని బోధనలనుండి నేటివరకూ మన సంస్కృతీ సాంప్రదాయాలను విదేశస్తులు మెచ్చుకుంటుంటే మన యువత విదేశీ మోజుతో ఆ గొప్పతనాన్ని తూలనాడడం బాధాకరం. బిజీ గజిబిజి జీవన విధానంలో పడి తల్లిదండ్రులు సైతం వాటిని పిల్లలకు నేర్పే పనిని అవసరమైనంత శ్రద్ధ, బాధ్యతతో చేయడం లేదనిపిస్తోంది. అన్నింటా డబ్బుకే ప్రాధాన్యం పెరగడంతో విలువలు తగ్గిపోతున్నాయి. నేటికీ గ్రామీణ ప్రాంతాలలో అయినా, పట్టణాలలో అయినా చాలా వరకూ తల్లులే ఆ బాధ్యతను కొంతమేరకు నెరవేరుస్తున్నారు. విద్యావ్యవస్థలో, కుటుంబంలో మన సంస్కృతిని కాపాడుకునే ప్రయత్నం అందరూ చేయాలి. దిగజారిపోతున్న మన ఉన్నత విలువలను నిలబెట్టుకోవలసిన గురుతర బాధ్యత మనందరిపైనా ఉంది. స్వయంగా జాతిపిత గాంధీజియే చెప్పారు తన పై చిన్నప్పుడు తన తల్లి చెప్పిన నీతి కథలు బాగా పని చేశాయని. తల్లిదండ్రులను కావడిలో పెట్టి మోసిన శ్రావణకుమారుని కథ తన జీవితంపై ప్రభావం చూపిందని గాంధీజీ అనేవారంటే చిన్నప్పటినుండే పిల్లలపెంపకంలో సంస్కృతీ సాంప్రదాయాల ప్రభావం ఎలా ఉంటుందో గమనించవచ్చు.
ప్రస్తుత కాలంలో ఏ కుటుంబంలోనైనా సంప్రదాయం బ్రతికి ఉందంటే దానికి కారణం మహిళలే! మూడొంతుల సంప్రదాయాన్ని తమ భుజస్కంధాలపై ఇష్టంగానో బలవంతంగానో మోసేది స్త్రీలు. నేటికీ గ్రామీణ ప్రాంతాలతో సహా చూసినా మహిళలే మన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడడంలో, పిల్లలకు నేర్పడంలో మేలైన పాత్రను నిర్వహిస్తున్నారు. సమాజమంతా ఈ పాత్రను పోషించాలి. విద్యావిధానంలో కూడా మన సంస్కృతిలోని ఔన్నత్యాన్ని చిన్నతనం నుండే పిల్లలకు అలవడే విధంగా పాఠ్యాంశాలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కొన్ని ఆచారవ్యవహారాలూ తరతరాలుగా మనని అంటిపెట్టుకుని ఉన్నాయంటే కారణం అవి ఇచ్చే శారీరక మానసిక ఆరోగ్యం మాత్రమే కాదు సంప్రదాయాన్ని పాటించడం వల్ల మన ఆహార్యం, నడవడిక హుందాగా ఉండి చూసినవారిలో గౌరవాన్ని పెంపొందిస్తుందని మనకి అనుభవ పూర్వకంగా తెలియడం వల్ల సంప్రదాయాలని ఇంకా పాటిస్తున్నాం.
సదాచారాన్ని తల్లిదండ్రులు ఆచరించడం వల్ల బిడ్డలకి ఎంతో కొంత ఆ సంస్కారం అలవడుతుంది ఆచరణ లోపం ఉన్నా భక్తి భావనలో లోపం ఉండకూడదని మనకి పెద్దలు చెపుతూ ఉంటారు కదా! కానీ నేటి పిల్లలకి మన సంస్కృతీ సంప్రదాయాల పట్ల విముఖత కలుగుతున్నది. వారి జీవన శైలి అంతా .. కేవలం తరగతి గదులకి, పుస్తకాలకే పరిమితం చేయబడటం వల్ల వాళ్ళలో ఆచార వ్యవహారాల పట్ల అనాసక్తి. తల్లిదండ్రులు చెప్పబోయినా వారు వినని పరిస్థితి. అందుకే మన ఆచార వ్యవహారాలలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుని నానాటికి మన సంస్కృతీ సాంప్రదాయం కనుమరుగవుతున్నాయి ..
గతకాలంలో కంటే స్త్రీలలో విద్యావకాశాలు మెరుగవడం, ఉద్యోగ అవకాశం ఉండటం వల్ల అన్నిచోట్లా మార్పులు చోటు చేసుకుంటున్నట్లే గృహజీవనంలో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి నేటి స్త్రీల ఆలోచనా విధానాలవల్లనే మన సంస్కృతికి సంప్రదాయానికి భంగం వాటిల్లుతుందని అనేవారు ఉన్నారు. ఇంటా బయటా చాకిరి చేసుకుంటున్న మహిళలు కూడా సత్ సంప్రదాయాన్ని పాటిస్తూ కార్తీక స్నానం, తులసి పూజ, ఆకాశ దీప దర్శనం చేసుకుంటున్న వాళ్ళు కొందరైతే బారెడు ప్రోద్దిక్కినా నిద్ర లేవకుండా నిద్ర లేచినా నది నెత్తిన సూర్యుడు వచ్చేటప్పటికి కూడా నైట్ గౌన్ లని మోస్తున్న స్త్రీలు ఉన్నారు. విచిత్ర వస్త్రధారణ చేసుకుని జుట్టు విరబోసుకుని కరాళ నృత్యం చేస్తున్నట్లు ఊగిపోతుండటం, మధుమధ్యపానాల సేవనలో మునిగిపోతుండటాన్ని చూస్తున్నాం. లేదా భక్తి ప్రపత్తులతో మెలగాల్సిన చోట హంగు ఆర్భాటాల ప్రదర్శన ఎక్కువై అదే అసలయిన భక్తి మార్గమని భ్రమలో ఉండేవారిని చూస్తున్నాం
ఇక పురుషుల విషయానికి వస్తే భాద్యతలని విస్మరిస్తున్న పురుషులు ఉన్నారు కారణాలేవైనా ప్రొద్దు గుంకగానే గృహ మార్గం పట్టేవారి సంఖ్యా చాలా తక్కువే! బౌతిక వస్తువుల ప్రలోభానికి లోనయి వేళాపాళా లేని అన్నపానాదులు చేస్తూ, విందు వినోదాలకి, భోగాలాలసకి అధిక ప్రాధాన్యతనిస్తూ, ధనాన్ని సమస్తంగా తలుస్తూ .. దైవం యొక్క ఉనికిని ఆక్షేపిస్తూ పాప పుణ్య మార్గాలని నమ్మకుండా, మత విశ్వాసాలని లెక్క చేయకుండా ఆధునిక జీవన శైలితో జీవన సాగరంలో చుక్కాని లేని నావలా సాగిపోతున్నారనిపిస్తుంది. అశాంతి, అసహనం చోటుచేసుకుని, అభద్రతా భావంలో కళ్ళెం లేని గుర్రంలా పరుగులు పెడుతున్నారు ఇక సంస్కృతిని సంప్రదాయాన్ని కాపాడుకోవడం ఎలా సాధ్యం? ముందు తల్లిదండ్రులు ఆచరించగల్గితే కదా ..మన పిల్లలు మనని అనుసరించగల్గేది.
సాంప్రదాయాన్ని, సదాచారాలని కాదని ఆరోగ్య సూత్రాల కన్నా, శుచి శుభ్రం కన్నా మనకి కావాల్సిన అనుకూలతని ఆపాదించుకుని జీవనాన్ని సాగించడం అలవాటైపోతుంది. దేవతా మూర్తులకి సైతం కుంకుమ అలంకరించం మాని స్టిక్కర్లు అంటించడం, దీపం స్థానే విధ్యుత్ దీపాన్ని ఉంచడం చేస్తున్నారు. గతంలోకన్నా ఇప్పుడు మనకి తెలియని విషయాలు చెప్పేందుకు, తెలుసుకునేందుకు అనేకానేక సౌలభ్యాలున్నాయి మనలో భావ దారిద్ర్యం నెలకొని ఏది మనకి అవసరమో ఏది అనవసరమో తెలుసుకోకుండా లభించిన అవకాశాలని దుర్వినియోగం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతి ఇంట్లో ఉంటున్న టీవి. కార్యక్రమాలని చూస్తూ బద్దకాన్ని పెంచుకుంటున్నారు. అలాగే ఇంటర్నెట్ సదుపాయం ఉన్నవారు సోషియల్ నెట్వర్క్ లలో అధిక సమయాన్ని వృధా చేస్తూ కాలక్షేపపు కబుర్లకి అలవాటు పడిపోతున్నారు. ఇక అక్కడ ఉండే అనేక ప్రలోభాలకి మహిళలు లోనవుతున్నారు. ఈ కాలంలో మహిళల వస్త్రధారణలోను అలంకరణలోను ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆడంబర జీవనంలో కోల్పోతున్నవి తక్కువేమీ కాదు .
ఏ మతాన్ని పాటించని దైవాన్ని విశ్వసించని వారికి కూడా ఆచారవ్యవహారాలు మేలే చేస్తాయి తప్ప ఎలాంటి కీడుని కల్గించవు. విజ్ఞానం,శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మనిషికి అత్యంత అవసరమే! ఆధునిక జీవన సరళిలో ఏది బ్రాంతియో ఏది క్రాంతియో తెలుసుకోలేని ఉరుకుల పరుగుల జీవనంలో తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు మన సంస్కృతీ సంప్రదాయాలు విచ్చిన్నం అవుతున్నాయనేది నిజం. అందుకే సంప్రదాయ పరిరక్షణ పేరిట చెవుల్లో ఇల్లు కట్టుకుని మరీ బోధిస్తున్నారు.
సంస్కృతిని సంప్రదాయాన్ని పాటించకుండా స్త్రీలైనా పురుషులైనా తమని తాము మార్చుకోకుండాను, కుటుంబంలో అందరిని మార్చడానికి ప్రయత్నించకుండానూ ఏ విధమైన ఉత్తమ ఫలితాలని సాధించలేరు కదా! సౌలభ్యం కోసం వస్త్హ్రదారణల, భోజన పద్దతులలో మార్పు అవసరం అయి ఉండవచ్చు. ఆధునికత అంటే మనని మనం కోల్పోవడం ఇతరులని అనుకరించడం కాదు. మనం మనంగానే ఉంటూ ఇతరుల ఆచార వ్యవహారాలని గమనిస్తూ.. వేటిలో మంచి ఎక్కువున్నదో తెలుసుకోవడం మార్పుని ఆమోదయోగ్యంగా మార్చుకోవడంలో అభ్యంతరం లేకపోయినా తరతరాలకి మనం అందించే సంస్కృతీ సంప్రదాయాన్నినిర్లక్ష్యం చేయడం భావ్యం కాదు. సదాచారం పాటించడం, సంస్కృతీ సాంప్రదాయాలని జీవన శైలిలో నిబిడీకృతం చేసుకోవడం ద్వారా మనిషి మనుగడ అర్ధవంతంగా, ఆహ్లాదంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. విచ్చిన్నమవుతున్న సంస్కృతీ సంప్రదాయాల పగ్గాలు స్త్రీ పురుషులిరువురి చేతుల్లోనూ ఉన్నాయి.
2 కామెంట్‌లు:
చాలా బాగా చెప్పేరు. తల్లి తండ్రులు సరిగా లేకపోతే పిల్లలెలా ఉంటారు? ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదని నానుడి కదా! అదేంటండి, ఉరుము ఉరిమి మగలం మీద పడ్డట్టు నా ’కాలక్షేపం కబుర్ల’మీద పడ్డారు. :)
Good information to know and right to the point. Thanks for this well written post, i'll follow up for more updates if you keep posting them.
Tollywood News
కామెంట్‌ను పోస్ట్ చేయండి