19, జూన్ 2012, మంగళవారం

కావ్య ఆయుధం


మోహన సహజంగా దైర్య వంతురాలు. చిన్న చిన్న విషయాలకి పెద్దవైన సమస్యలకి కూడా భయపడదు.

స్త్రీలు సుకుమార హృదయులు అంటారు. ఆ సుకుమారం కావాల్సి వస్తే ఆమె శరీరంలోనూ,ఆమె ప్రవర్తన లోను, మాటలోనూ, మనసులోనూ పువ్వు
లా మెత్తనైన సుకుమారమే వుంటుంది. చాలా విషయాల్లో వజ్ర కఠోరమైన మనసు ఉంటుంది.

ఆమె మొండి మనిషి. ఒక విషయానికి ప్రాముఖ్యతనిస్తే అదే విషయానికి కట్టుబడి వుంటుంది.అలాగే తన ఆలోచన తప్పని తెలిస్తే యితరుల ఆలోచన కూడా మంచిదని అనిపిస్తే తన అభిప్రాయాన్ని మార్చుకుంటుంది. అటువంటి ఆమెకి ఒక సమస్య వచ్చి పడింది.

ఇంట్లో టీవి పెడితే అందులో ధారావాహిక హత్యోదంతాలు, సీరియల్స్ లో తుపాకులు పట్టుకుని తిరిగే లేడీ విలన్లు, కొట్టుకోవడాన్ని యె౦జాయ్ చేస్తూ ప్రోత్సహిస్తూ వుండే లాగా వస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే వొడలంతా వణుకు ముంచు కొస్తుంటుంది.

హింస నట్టడవుల్లో కాదు, తుపాకీ గుండ్ల శబ్ధం దేశ సరిహద్దుల రక్షణలో కాదు నడిమింట్లోనే వున్నట్లు వుంటుంది.

ఆమెకి హింస అంటే అంతులేని భయం. చాప క్రింద నీరులా జనజీవితాలని కబళించే హింస ప్రక్కనే భయం భయంగా బ్రతుకుతున్నట్లు వుంటుంది. కన్ను తెరిస్తే హింస. కన్ను మూసే దాక తప్పదా? అనుకుంటుంది.

మనసుకైన గాయం,శరీరానికైన గాయం యేదైనా గాయం గాయమే కదా! తక్కువో,యెక్కువో గాయం చేసిన బాధ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది కదా  అనుకుంటుంది.

మోహనకి హింస అంటే నిజంగా భయమే! ఎవరైనా చిన్న పిల్లని చిన్న దెబ్బ కొట్టినా బేలగా మారిపోతుంది.

మోహన చిన్నప్పుడు ఆమె తండ్రి తల్లి రాజేశ్వరిని చీటికి మాటికి కొడుతుండేవాడు. ఆమె మౌనంగా భరించేది.అలాగే తల్లి కాకుండా కొంత మంది తల్లి లాటి ఆడవాళ్ళు నోటికి పనిచెప్పి గయ్యాళితనాన్ని అపాదించుకున్నారు. పాపం భర్త కొడితే కొట్ట గలరా, తిడితే యెదురుగా తిట్టగలరా? వాళ్ళ అణువూ అణువూ ప్రతివతా లక్షణాలని బోధించి బోధించి అత్తవారింటికి పంపిన పెంపకమాయే! మొగుడు తిడితే పడాలి,కొడితే పడాలి. వాళ్ళు లేనప్పుడు ఆ కోపాన్ని పిల్లలపై ప్రదర్శించాలి, ఇతరులపై గయ్యాళి తనం ప్రదర్శించాలి. అంతే తెలుసు.

అవన్నీ చూస్తున్న మోహన యె౦దుకు వీళ్ళంతా మొగుడి అహంకారాన్ని భరిస్తారు.రోకలి బండ తీసుకుని తిరిగి కొడితే ఏమవుతుంది అనుకునేది. నేనైతే యిలా వుండను,ఇలా పడను గాక పడను 
మనసులోదృఢంగా అనుకుంది    

ఆలాంటి రోజులు ఆమెకి రానే వచ్చాయి. ముందు తరాన్ని చూసి చూసి మోహన తన కాలంకి కాస్త నోరు పెగిలే దైర్యం వచ్చింది. బానిసత్వాన్ని, మొగుడి దౌష్ట్యాన్ని, వ్యసనాలని భరించాల్సి రావలసిన అవసరం లేదని తెలుసుకుని ప్రశ్నించడం మొదలెట్టింది. అక్కడా మొగుడి అహంకారమే కనబడింది. అతని కర్కశ పాదాలకి ఆమె దేహం బలి అయ్యేది. రక్తం ధారలై కారేది, మొగుడిని చూస్తే భయం కల్గేది. బేలగా, దైన్యంగా మారిపోయేది. చీటికి మాటికి కళ్ళల్లో కన్నీళ్లు కాపురం చేసేవి.

తనని హింసించిన వాడిని కత్తితో పొడిచి చంపాలని అనుకుంది. కానీ ఆమె ఆ పని చేయలేక పోయేది.వాడు సృహ తప్పేలా కొడుతున్నా,అందుబాటులో కత్తి ఎదురుగా కనబడుతున్నా పొడిచి చంపేయాలనే కక్ష  వున్నాకూడా ఆ పని చేయలేక భరించేది. ఏళ్ళ తరబడి భరించి భరించి మొగుడి నుండి దూరంగా పారిపోయింది.

మోహన కి ఓ కూతురు ఉంది. ఆ పిల్ల పేరు కావ్య.  ఇప్పుడు ఆ పిల్లకి ఆత్మ విశ్వాసం, చదువు-ఉద్యోగం వున్నాయి.

తల్లిలో పేరుకుని వున్న భయాన్ని చూస్తే బాధ. టప్ మన్న చప్పుడు వినబడితేనే భయం తో వణికి పోతుంది. ఎవరినో కొడుతున్నారు  అనేది. అలాటి దృశ్యాలు చూడకుండా,కనబడకుండా జాగ్రత్తలు తీసుకోవడం సాధ్యం కాదు కనుక టీవిని త్యజించేసింది.

మోహన కూతురు కావ్యకి పెళ్లి అయింది. ఆ పెళ్ళికి ముందు అబ్బాయి గుణ గణాలు విచారించి జాగ్రత్తలు తీసుకుని మంచి అబ్బాయి అనుకుని నమ్మకం కుదిరిన తర్వాతే పెళ్లి జరిపించారు. అయినా సంవత్సరం లోపులోనే అల్లుడు అమ్మాయి పై చేయి చేసుకున్నాడు.రక్తం కళ్ళజూచాడు, ఎముకల డాక్టర్ ట్రీట్మెంట్ అవసరం తెప్పించాడు. ఇక సాక్ష్యం లేకుండా  మనసుకి తగిలిన గాయాలెన్నెన్నో!

ఒక రోజు అల్లుడిలోనూ మొగుడు అనే అహంకారాన్ని కళ్ళారా చూసిన పాపానికి మోహనలో భయం రేగింది. పిచ్చిదయిపోయింది.

ఓ గదిలోకి వెళ్లి గడియ వేసుకుని కూర్చుంటుంది. పురుషుడిని యెవరిని చూసినా భయం. అమ్మో! వాడు చంపేస్తాడు,రక్తం కారేటట్లు కొడతాడు. ఇదిగో చూడు నా తల పగిలిపోయింది. నా చెవి తెగిపోయింది నా పళ్ళు వూడిపోయాయి. నాకు యిలాంటి మొగుడు వద్దు, ఇంకెవరికి వద్దు, వద్దు వద్దు..అసలు ఆడవాళ్ళకి మొగుడేవద్దు అని తనలో తనే మాట్లాడుకుంటుంది.

కావ్యా!  నీ మొగుడిని కత్తితో పొడిచి చంపేయి. ఎన్ని తరాలు భరిస్తాం ? అని ఆ చీకటి గదిలోనుండే అరుస్తుంది, ఏడుస్తుంది. ఆ మాటలు విన్న బయటవాళ్ళు పాపం పిచ్చి పట్టింది అనడం కావ్యకి వినబడింది. తల్లి దాక్కున్న గది ముందుకి వెళ్లి తలుపు తట్టింది. మోహన తలుపు తీయలేదు.
ఇంకో ప్రక్కకి వెళ్లి కిటికీ తెరవబోయింది ఆ కిటికీ కూడా తెరుచుకోలేదు.

అమ్మా!తలుపు తీయమ్మా! అని పిలిచింది. తలుపు అయితే తీయలేదు కాని మోహన కూతురితో ఇలా చెప్పింది. 

"కావ్యా! నీకు నా రాత రాకూడదని అనుకున్నాను. తరాలు మారినా ఆడదాని తలరాత మారలేదే తల్లీ! మొగుడుని తిడితే తిడతారేమో కాని కొడితే కొట్టలేరు.అది క్షమా గుణమేమో, బలహీనతేమో!"

మొగుడు అనేవాడు నోటికి పని చెపుతాడు,కాలికి పని చెపుతాడు,చేతులకి పని చెపుతాడు. ఇంకా వేటికైనా పని చెపుతాడు. ఇవన్ని మొగుడి బలం యేమో! అబల శరీరం అలాటివన్నీ వోర్చుకోగలదా? మనసు గాయపడకుండా ఉంటుందా ?

నేను యీ హింసని చూడలేను , చూడలేను చచ్చిపోతాను, నేను చచ్చి పోతాను. పొగిలి పొగిలి యేడుస్తుంది.హృదయవిదారకంగా యేడుస్తుంది. తల్లి యేడుపు యుగ యుగాల బానిసత్వం లో నుండి వుబికి వస్తున్న గంగా ప్రవాహంలా తోచింది. మండుతున్న అగ్ని పర్వతం నుండి వెదజల్లబడుతున్న లావాలా తోచింది.

స్త్రీల పై అత్యాచారాలకి పాల్పడేవాళ్ళు , హత్యలకి పాల్బడే వాళ్ళు ఆమెని శారీరక బలహీనమైనదిగా భావించి అలా చేయగలరు అంటే వొప్పుకోలేము. స్త్రీకి  తన  మాన ప్రాణాలపై దాడి జరుగుతున్నప్పుడు మానసికంగా బలహీనమైపోతుంది. ఆ మానసిక బలహీనత పైనే వాడు దెబ్బ కొట్టి తనకి కావలసిన విధంగా జులుం విసురుతాడు.  ప్రవర్తిస్తాడు.  నేను మానసికంగా బలహీనం కాకూడదు. అప్పుడే శారీరకంగా బలహీనం కాలేను. ఈసారి నా భర్త కొడితే నేను వుపేక్షించ లేను అని ఆలోచించసాగింది కావ్య. కాసేపు ఆగిన తర్వాత అనుకుంది.

అవును, మొగుడు దాష్టీకాన్ని భరించాల్సిన అవసరం యేముంది? అతను కొడితే కొట్టనవసరం లేదు,తిడితే తిట్టనవసరం లేదు.చంపాల్సిన వసరం లేదు.మరో రాజేశ్వరి, మరో మోహన లా ఈ తరం స్త్రీ గా నేను అలా వుండకూడదు నా చేతిలో ఒక ఆయుధం ఉంది. అది చట్టం ఆనే ఆయుధం.చట్ట సహాయం తీసుకుంటాను న్యాయ దేవతకి మొరపెట్టుకుంటాను. వ్యవస్థ పై నాకు నమ్మకముంది. అదే నా ఆయుధం అనుకుంది. ఆ దిశగా కదిలింది.

11 కామెంట్‌లు:

కాయల నాగేంద్ర చెప్పారు...

కావ్య నిర్ణయం సరయినది. హింసించే భర్తలకు బుద్ది చెప్పాలంటే కావ్యలా ధైర్యం చేయాలి.

హితైషి చెప్పారు...

కారణాలు ఏవైనా భార్య ని భర్త హింసించడం అంటే అనాగరిక లక్షణం.లక్షల మంది రాజేశ్వరిలు,మోహన్లు,కావ్యలు కళ్ళ ముందు మెదిలారు. అయ్యో మోహన అనిపిస్తుంది. ఇవాలా చట్టం ఎంతొ అండగా ఉంది.కావ్య లా ఆలోచించడమే కావాలి.
ఎప్పటిలాగే కత్తిలాంటి పోస్ట్ వనజ గారు.

జలతారు వెన్నెల చెప్పారు...

వనజ గారు, ఇక్కడ 911 కాల్ చేస్తే నిమిషంలో కాప్స్ ఇంటికి రావడమే కాక , చెయ్యి చేసుకుంటున్న అబ్బాయిలను అర్రస్ట్ కూడా చేస్తారు. కాని ఒక్కోసారి అబ్బాయి కూడా అవేశం లో చేసిన పొరపాటుకు, చాలా పెద్ద శిక్ష అనుభవిస్తాడు. కాని చెయ్యి చేసుకునేంత దిగజారిపోయాడంటే అతనికి శిక్ష పడాల్సిందేనేమో!

చాలా మంచి పోస్ట్ అండి. నేను కూడా త్వరలోనే నాకు తెలిసిన ఒక జంట ఇదే విషయంలో విడిపోయిన కథ రాస్తానండి

అజ్ఞాత చెప్పారు...

one-sidedగా అనిపించినా, కథ బాగుందండి.
వేధించి,సాధిస్తూ, వేపుకుతినే భార్యల మీద విసిగి చేయి చూసుకుని, ఆ తరువాత తమ ఖర్మకు మౌనంగా రోదించే కొంతమంది భర్తలూ వుంటారు. అనాగరికులను వారించడానికి గత్యంతరం లేకున్నా ఒక్కోసారి అనాగరికమైన పద్ధతులను ఆశ్రయించాల్సి వస్తుంది.

పల్లా కొండల రావు చెప్పారు...

ఎవరు ఎవరిని హింసించినా , శారీరకమైనా - మానసికమైనా హింస హింసే.

శాంతి కోసం యుద్ధం చేయడం అనివార్యం. అది చట్టమా? మరో రకమైన పోరాటమా? అనేది అక్కడి పరిస్తితిని బట్టి ఉంటుంది.

మహిళలలో సంఘటితమన ఆలోచనలు రానంతవరకూ ఇవి తప్పవు. వ్యవస్థతో పాటే ఈ అవస్థలు పూర్తిగా మారతాయి.

ఈ లోగా వీలైనంత చైతన్యం - సంఘటిత పోరాటాలకు సిద్ధం కావడం మహిళలో రావలసిన అవసరమైన చైతన్యం.

సీరియల్స్ పై నియంత్రణ తీసుకు రావలసిన అవసరం ఉన్నది.

ఈర్ష్యా ద్వేషాలు - తమను తాము కించ పరచుకోవడం అనే అవలక్షణాలను దాటి ఐక్యంగా మహిళలు చైతన్యవంతంగా, శాస్త్రీయంగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది.

ఇప్పుడిప్పుడే ఆ సంఖ్య పెరుగుతున్నది. ఆ దిశగా ఆలోచించే వారిలో నేను గమనించిన వారిలో ఒకరైన వనజ గారికి అభినందనలు.

అజ్ఞాత చెప్పారు...

సందేశం మంచిదే అయినా, కథగా రాయడం.... క్షమించండి, అంతగా రాణించలేదు. కాకపోతే మీ ఆవేశం అర్ధమవుతోంది.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

పురాణపండ ఫణి గారు.. మీరు వెలిబుచ్చిన అభిప్రాయానికి మనఃస్పూర్తిగా స్వాగతం. ఆవేశం తగ్గిన తర్వాత చూస్తే..నాకు అలాగే అనిపించింది. మీ సూచనకి మరి మరి ధన్యవాదములు. ఇదే అంశాన్ని మంచి కథగా వ్రాసే ప్రయత్నం చేస్తాను.
SNKR గారు మీ అభిప్రాయానికి ధన్యవాదములు.
నేనొక మాట చెప్పదలచాను. స్త్రీలలో మూర్కత్వం ఉంటుంది. కానీ వాళ్ళు పురుషులని శారీరకంగా హింసించిన దాఖలాలు తక్కువ. కారణం ఏదైనా హింస అనేది అనాగరికం కదండీ. ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి? తర్వాత వగచి ఏం ప్రయోజనం?

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కాయల నాగేంద్ర గారు.. మీ స్పందనకి ధన్యవాదములు.
@జలతారు వెన్నెల గారు.మీరు చెప్పినటువంటి సంఘటనే ఇక్కడ కూడా జరిగింది.స్త్రీల పై చేయి చేసుకోవడం,క్రూరంగా హింసించడం ని మాత్రం నేను వ్యతిరేకిస్తాను.పాపం ఈ కథలో మోహన చూడండి..పిచ్చిడైపోయింది.మోహన సజీవ పాత్ర..అండీ!
@ హితైషి మన మధ్య "మోహన" lani చూడాల్సి వచ్చినందుకు నాకు చాలా బాధ కల్గుతుంది. అందుకే ఈ పోస్ట్.థాంక్ యు!
@కొండలరావు గారు థాంక్ యు వేరి మచ్..అండీ! భర్త దురుసుతనంతో బాధ పడిన వారందరూ..చట్టాన్ని ఆశ్రయిస్తే ఆ కాపురాలు నిలబడవు.కానీ హింసని అది తర తరాల హింసని ఇంకా భరించాలా చెప్పండి! భర్త తప్పు చేసినా, వేదించినా,మానసిక హింసకి గురి చేసినా భార్య కొట్టడం మాత్రం చాలా తక్కువండి. మరి భర్త మాత్రం ఎందుకు కొట్టాలి. అతను మానషిక హింస పేరుతొ..చట్టాన్ని ఆశ్రయించ వచ్చును కదా!అని మహిళల కొందరి ప్రశ్న . ఆ ప్రశ్న లో నిజం ఉండి కదండీ! మీ స్పందనకి ధన్యవాదములు.
స్త్రీలు లభించిన అవకాశాలని మిస్ యూజ్ చేస్తున్నారు. అది గమనించకపోలేదు .కాని మోహన లాటి వాళ్ళ కోసం ఈ పోస్ట్.
స్పందించిన అందరికి ధన్యవాదములు.

అజ్ఞాత చెప్పారు...

వనజ గారు, అలాంటి గృహిణిహింస చూశాను, అందుకే కేస్ బై కేస్ చూడాలి.

/స్త్రీలలో మూర్కత్వం ఉంటుంది.కానీ వాళ్ళు పురుషులని శారీరకంగా హింసించిన దాఖలాలు తక్కువ. కారణం ఏదైనా హింస అనేది అనాగరికం కదండీ/
మూర్ఖత్వం... దానికి లింగభేధం లేదు. :)
శారీరిక హింసకన్నా మానసిక హింస వల్ల కలిగే దుష్పరిణామాలు అధికమని సంజయుడు, దృతరాష్ట్రునితో అన్నట్టు తిక్కన రాసిన పద్యం గుర్తు-
తనువున విరిగిన అలుగులు .. సో, శారీరిక హింస దెబ్బపడిన చోట మాత్రమే బాధిస్తుంది, మానసిక హింస నిద్రలేకుండా చేసి బాధిస్తుంది.
ఏదో సరదాగా చర్చిస్తున్నా కాని, కేస్ బై కేస్ చూడాలి. స్త్రీలు హింసకు సాఫ్ట్‌వేర్ వుపయోగిస్తే కొంతమంది పురుషులు హార్డ్‌వేర్ ఆశ్రయించడం సాధారణంగా చూస్తాము.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

SNKR గారు..సాఫ్ట్ వేర్ Vs హార్డ్ వేర్ పోలిక కేక.. :))

Saraswathi Durbha చెప్పారు...

చట్టపరంగా విడాకులు తీసుకునే వెసులుబాటు ఎంతమందికి ఉంటుంది? మొదట ఆర్ధిక స్వతంత్రం ఉండాలి ఆ తరువాత కుటుంబ సభ్యులో, బంధువులో, స్నేహితులో కనీసం ఒక్కరైనా ఆమెకు వత్తాసుగా ఉండాలి. ఇవ్వేవీ ఆమెకు సమకూరకుండా చూసే "సాఫ్ట్ వేర్" ఆ భర్త దగ్గర ముందే ఉంటుంది. కూతురు ఏమైపోయినా అల్లుడికే వత్తాసుపలికి నోరు మూసుకొని ఉండమని చెప్పే తల్లిదండ్రులెందరో ఉన్నారు.