9, జూన్ 2012, శనివారం

కార్పోరేట్ కాలేజీలు - సౌకర్యాలు

జూన్ మొదటి వారంలో విజయవాడ అనేక ప్రాంతాల నుండి వచ్చే పిల్లలు, వారిని వెంటబెట్టుకుని వచ్చే పెద్దలు తో.. చాలా సందడి సందడి గాను ఉంటుంది. పిల్లలని వదిలి వెళ్ళే పెద్దల ముఖాలలో దిగులుని కప్పిపుచ్చుకుంటూ..నవ్వులు అతికించుకుని.. బిడ్డలకి జాగ్రత్తలు చెబుతూ..వెను వెను తిరిగి చూసుకుంటూ వెళ్ళే దృశ్యాలు కళ్ళబడుతూనే ఉంటాయి.

ఇక పిల్లలైతే దిగులు మేఘాల్ని కురవ కుండా ఆపడం వారి తరం కాక .. వెక్కి వెక్కి ఏడ్పులు తో.. తల్లి దండ్రులకి టా టా లు చెపుతారు.

పదుల సంఖ్యలో ఉన్న కార్పోరేట్ క్యాంపస్ ల లో .. ఇలాటి దృశ్యాలని ఒక ఆరేడు ఏళ్ళగా చూసి చూసి కొంచెం బండపారి పోయిన మనసు నాది.


పరిచయస్తులు,బంధువులు, స్నేహితుల పిల్లల కోసం నేను చాలా సార్లు ఆ క్యాంపస్ లకి వెళ్ళడం అలవాటే!

ఎక్కువగా లంచ్ అవర్స్ కి ముందే నేను అక్కడికి చేరుకుంటాను.రంగు రంగుల సేతాకొక చిలుకల్లా అమ్మాయిలూ క్లాస్ రూం లనుండి బయటకి వస్తారు.

వాళ్ళ చేతుల్లో బుక్స్ తో పాటు భోజనం తినడానికి ప్లేట్,వాటర్ బాటిల్..తో..మెస్ వైపు వెళతారు. అంటే వాళ్ళ రూం కి అయిదు గంటల తర్వాత లభించే ఒకటిన్నర గంట బ్రేక్ సమయంలో వాళ్ళు రూం కి వెళ్లి ప్లేట్ తీసుకుని మళ్ళీ మెస్ కి వెళ్ళే సమయం ని సేవ్ చేసుకుని అరకొర కతికి.. వచ్చి క్యాంపస్ లో పేరెంట్స్ కోసం వెదుక్కుంటారు. వాళ్ళ పేరెంట్స్ లేదా బంధువులో,ఫ్రెండ్స్ వస్తే పర్వాలేదు. కాని వాళ్ళు కాని వారు కోసం కూడా వారు వెదుక్కుంటారు. ఎందుకంటే..మొబైల్ పోన్ ల కోసం.

"ఆంటీ' ఒక సారి మొబైల్ ఇస్తారా..!? ఇంటికి కాల్ చేసుకోవాలి అంటారు. సరే ..పోన్లే పాపం అని వాళ్లకి మన మొబైల్ పోన్ ఇచ్చామా.. ఓ..అరగంట వరకు మన పోన్ మన చేతిలోకి రాదు. ముందు తీసుకున్న అమ్మాయి పోన్ ఇచ్చేసరికి ఇంకో అమ్మాయి రెడీగా ఉంటుంది.

అలా ఎవరి చేతిలో మొబైల్ ఉందా అని .. అన్వేషిస్తూ.. రిక్వెస్ట్ చేస్తూ తిరుగుతుంటారు.

నాలుగు రోజుల క్రితం నా అనుభవం చెపుతాను ..చూడండి.

మా "హేమంత" ని 4 వ తేదీన హాస్టల్ కి పంపి వచ్చింది మా చెల్లెలు. నెక్స్ట్ డే నేను వెళ్లాను.

ఇంకా లంచ్ బెల్ మ్రోగలేదు. నేను వెళ్ళిన తర్వాతనే పిల్లలందరూ క్లాస్ రూం ల నుండి బిల బిల మంటూ బయటకి వస్తున్నారు. రావడం రావడం తోనే .."ఆంటీ " ఒక సారి మీ మొబైల్ ఇవ్వరా ..అని అడిగింది..ఒక అమ్మాయి
నేను ఆ పాప చేతికి మొబైల్ ఇచ్చాను.

తల్లికి మిస్ కాల్ చేసింది. కొంచేపటికి అటువైపు నుండి కాల్ వచ్చింది.
కాల్ రావడమే తరువాయి ..ఆ అమ్మాయి ఒకటే ఏడుపు. నాకు ఇక్కడ అసలు ఏమి నచ్చలేదు. నేను ఇక్కడ ఉండను నన్ను తీసుకు వెళ్ళిపో!..అంటుంది. ఆ అమ్మాయిని అంతకు క్రితం రోజే తల్లి-దండ్రి వచ్చి స్వయంగా జాయిన్ చేసి వెళ్ళారు.

ఈ ఒక్క రోజులోనే ఆ అమ్మాయి ఎదుర్కున్న ఇబ్బందులు ఇవి: హాస్టల్ రూం లో రూం కి ఆరుగురు మాత్రమే ఉంటారని చెప్పిన యాజమాన్యం ఒక్కో రూం కి 8 మందికి కేటాయించడం ఒకటైతే..ఆ రూం నడవడానికి కూడా వీలు లేకుండా.. కిక్కిరిసి ఉండటం రెండు ఫ్యాన్ లు మాత్రమే ఉండటం.. జరిగింది.సంవత్సరానికి లక్షా ముప్పై అయిదు వేలు చెల్లించి సౌకర్యంగా ఉంటుందనుకుని భ్రమపడే తల్లిదండ్రులకి కార్పోరేట్ కాలేజీలు ఇచ్చే షాక్ లు ఇవి.

ఇక తరగతి గదులలో ఒక్కో సెక్షన్ కి 80 మంది పైనే విద్యార్ధులు. ఒక్కో పిరియడ్ రెండు గంటల సమయం . రెండు క్లాస్స్ లు,ఒక గంట క్లాస్స్ ఒకటి. తరగతి గదుల్లో ప్రక్కన రెండు టాయిలెట్స్ మాత్రమే. అక్కడ తగిన నీటి సౌకర్యం లేకుండా ఉంటే.. పిల్లలు చదువులు పేరిట ఆ ఖార్ఖాన ల లో ఎలా ఉండగలరు.? ఎంత నరకం?

ఫుడ్ కూడా ఏ మాత్రం క్వాలిటీ లేని పుడ్ లు. ఇక త్రాగు నీరు సౌకర్యం వెయ్యి మంది మంది విద్యార్దులు ఉన్న కేంపస్ లో రెండు,మూడు చోట్ల మాత్రమే త్రాగు నీరు వచ్చే సదుపాయం.

అప్పటి దాక ఇంటి వాతావరణంలో హాయిగా పెరిగిన ఎక్కువ మంది పిల్లలు అలాటి ఇరుకైన,పరిశుభ్రం లేని,గాలి వెలుతురూ రాని గదులలో ఎలా ఉంది చదువుకోగలరు?

తల్లిదండ్రుల మీద ఇంటి మీద బెంగతో పాటు సాధించాలిసిన మార్కుల అంచనాలు,విపరీత మైన వత్తిడి.,మెరిట్ ల పేరిట ప్రతి నెల జరిగే shuffling .మధ్య వాళ్ళ చదువులు సవ్యం గా ఎలా సాగుతాయి.?

మోయలేని భారాన్ని భరిస్తూ ఎన్నో ఆశలు తో పిల్లలని అక్కడ జాయిన్ చేసే తల్లిదండ్రులకి ఇవన్నీ తెలుసు. అయినా కూడా ఒక్క రెండేళ్ళు ఎలాగోలా ఓర్చుకుని మంచి రాంక్ తెచ్చుకుంటే ముందు ముందు భవిష్యత్ బాగుంటుంది ఆన బుజ్జగింపులు పెద్దల ఓదార్పుతో.. కొంచెం తేరుకుని అయిష్టంగానే తలలు ఊపే పిల్లలు..ఇలా చూడాల్సి వస్తూ ఉంటుంది.

ఎక్కడ ఎక్కడ నుండో ఒక రోజంతా ప్రయాణం చేసి వచ్చి ఓ..రెండు గంటల సేపు పిల్లలకి కనబడి వాళ్ళతో గడిపి వెళ్ళే తల్లిదండ్రుల కళ్ళల్లో ఆశ, ఈ ఇంటర్ మీడియట్ విద్య కలసి కార్పోరేట్ కాలేజీల కొంగు బంగారం ..డాక్టర్,ఇంజినీర్ ల వేలం వెర్రి.


కూలినాలి చేసుకునే కుటుంబం కూడా బిడ్దల భవిష్యత్ కోసం అప్పోసప్పో చేసి ఈ కార్పోరేట్ కాలేజీలకి చెల్లించి అక్కడే చదివిస్తారు తప్ప ప్రభుత్వ జూనియర్ కలాశాలలకి పంపడానికి ఎంత మాత్రం ఇష్టపడటం లేదు.


నేను
చూసిన దృశ్యం ఒకటి చెపుతున్నాను. ఎంత హృదయం ద్రవించింది అంటే.. ఇప్పటికి ఆదృశ్యం మర్చిపోలేక పోతున్నాను.

సరిగా వస్త్రధారణ కూడా చేసుకొని ..స్త్రీ.. చూస్తుంటేనే కడు పేదరాలిగా కనబడుతుంది.ఆమె తన బిడ్డని కాలేజ్ లో జాయిన్ చేయించడం జరిగింది.నేను వెళ్ళిన రోజు తన బిడ్డని చూడటానికి ఆమె వచ్చి.. ..చెట్టు క్రింద కూర్చుని ఉంది. ఆమె బిడ్డ తల్లిని చూడగానే తల్లి దగ్గరకి వచ్చింది.
"అమ్మా.. ఇయ్యాలనే ఎందుకు వచ్చినావ్? నిన్ననే కదా నేనీడకు వచ్చింది .ఇంత ఎండలో పడి నువ్వెందుకు వచ్చావే!నాన్న నీకు బస్ చార్జీకి డబ్బులు ఇచ్చాడా? కాళ్ళకి చెప్పులు కూడా లేవు.. ఎండకి కాళ్ళు కాలినయ్యా అమ్మా.. అంటూ తల్లి పాదాలను ఒళ్ళో పెట్టుకుని చూసింది.
నిన్ను చూసేదానికి నేను రాకపోతే ఎత్తాగే బిడా! నిన్న దినం మిషన్ కాడ నీ డ్రస్స్ లు ఈయలేదు కదా..ఇయ్యాల పట్టుకుని వచ్చినా..బాగా కుట్టినాడేమో చూసుకో.. ఒకో జతకి కి నూట అరవయ్యి రూపాయలు తీసుకున్నాడు కుట్టుకూలి. నేను ఒక రోజు పనికి బోతే కాని వాడికి కుట్టుకూలి ఈయలేను. నేను అయినా మిషను కుట్టుడు నేర్చుకుని ఉంటే చానా డబ్బులు సంపాదిచ్చుకొంటేనే గదా!..నాకులా ఎదవ బతుకు నీకోద్దె తల్లి .. బాగా చదువుకుని ఇంజినీరువి కావాలి.అని చెపుతూ.. బ్లూ క్యారీ బాగ్ లో నుండి..కొత్తగా కుట్టిన్చుకోచ్చిన డ్రస్స్ లు తీసి ఇచ్చింది. ఒక బాక్స్ లో తినడానికి తెచ్చింది.బిడ్డకి ముద్దు ముద్దుగా తినిపిచ్చుకుంటుంది. పిల్ల తింటూ. అమ్మా.. పారి నుండి నువ్వు ఇట్టా రాబాకు.. చక్కగా .మంచి చీర కట్టుకుని రాయే! నాతొ పాటు చదువుకునే టాళ్లు.. నిన్ను ఇట్టా చూత్తే ఎగతాళి చేస్తారు..అని చెప్పింది.
అట్టాగే బిడ్డా .. ..నూరు రూపాయలు బెట్టి....చీర కొనుక్కుంటాను.చెప్పులు కొనుక్కుంటాను. సారికి ఎట్టాగో ఓర్చుకో బిడ్డా ! ..అంది ఆమె .కారుతున్న చెమటని తుడుచుకునేందు చేతి రుమాలు లేక ..చీర కొంచెం పైకి తీసి లోపల ఉన్న అడుగు లంగాతో మొహం తుడుచుకుంటూ..

ప్రక్కనే కూర్చుని చూస్తున్న నాకు బాధో కాక మరేమిటో ఏమిటో తెలియదు.కానీ కళ్ళు చిప్పిల్లాయి. తల్లి ఆశ లో ప్రాణం ఉంది. బిడ్డ బిడియంలో పేదా గొప్ప తారతమ్యం చూపే మనుషుల మనస్తత్వం కనబడింది.

ఇంకో ప్రక్క చూసానా..అక్కడ కారులో నుండి దిగిన హై క్లాస్స్ తల్లిదండ్రులు.
డ్రైవర్
గబా గబా ..కార్పెట్ ని పరచి డిక్కీ లోనుండి.. రెండు కేరేజీలు,వాటర్ బాటిల్స్ సరంజామా తీసి కార్పెట్ పై సర్ది . దూరంగా వెళ్ళిపోయాడు. వాళ్ళు అమ్మాయి కోసం ఎదురు చూపులు. కాస్త ఆలస్యంగా వచ్చింది రాగానే కొబ్బరి నీళ్ళ బాటిల్ అందించారు. కాసిని తాగి..తల్లి దండ్రులతో.. కబుర్లు చెపుతుంది. సి బాగా ఆన్ చేస్తున్నారా..అని అడుగుతుంది తల్లి. .. ఏదో పర్లేదు.. అయినా నేను రోజు డే స్కాలర్ గా వెళతాను కదా! ఇక్కడ హాస్టల్ లో ఎందుకు మమ్మీ! బందీఖానా నేను భరించలేను నాకు చదువు వద్దు నేను వచ్చేస్తాను డాడ్ ..మీరు అయినా ఒప్పుకొండి . నేను బాగా చదువుతానని ప్రామిస్ చేస్తున్నాను కదా..అంటుంది వాళ్ళ పిల్ల. ఎలాగోలా సంవత్సరం కాస్త ఎడ్జస్ట్ అవు. మంచి రాంక్ తో నువ్వు బయటకు వస్తే అంతే చాలు. రోజు నేను నీకు ఏం కావాలంటే అది తీసుకు వచ్చి ఇచ్చి వెళతాను.. మా బంగారు కదా.. బాగా చదివి మంచి రాంక్ తెచ్చుకో. టాప్ టెన్ రాంక్ లలో నీ పేరు,ఫోటో ఉండాలి. లేక పొతే మాకు ఎంత చిన్నతనం ..అంటుంది హై క్లాస్స్ మమ్మీ.

ఇలాటివి
చూస్తుంటే .. అసలు ఎవరికీ చదువులు అవసరం? ఎవరికీ రాంక్ పిచ్చి.. నాకేమి అర్ధం కాలేదు.
ఒక ప్రక్క జూనియర్ కళాశాలల్లో నిండుకొని సీట్లు.మరొక ప్రక్క కోళ్ళ ఫారాల్లాంటి తరగతి గదుల్లో, వసతి గదుల్లో మ్రాగ్గుతున్న పిల్లలు. ఏమిటీ.. వేలం వెర్రి .. బాబోయి శత కోటి నమస్కారాలు.

నేను ఒకప్పుడు ఇలా ఒక కార్పోరేట్ కాలేజ్ ఇంటెన్సివ్ బ్యాచ్ లో ..నా బిడ్డని జేర్చి.. అష్టకష్టాలు పడిన దాన్నే! నరకం అంటే ఏమిటో చవి చూసిన దాన్నే!మధ్య తరగతి మందహాసం ఎలా ఉంటుందో.. నేను ఇంకో పోస్ట్ లో చెపుతాను. సమయాభావం వల్ల రోజు కి ఇంతే!

ఒక్క మాట. ఎవరైనా కార్పోరేట్ కాలేజెస్ లో పిల్లలని జేర్పిస్తే..ప్యాకల్టీ గురించి దిగులు కన్నా సౌకర్యాలు గురించి కాలేజ్ యాజమాన్యంతో చర్చించండి.

టాయిలెట్ నిర్వహణ పరిశుభ్రత విషయాల్లో ,గాలి వెలుతురూ లభించడం మొదలైన సౌకర్యాలు ఉండే టట్లు ఉంటేనే మీ పిల్లలని అక్కడ జేర్పించండి. లేదా మీ ఆడ పిల్లలు రక రకాల గైనిక్ సమస్యలతో..అనారోగ్యములతో .. జీవితాన్ని అసహ్యించుకుంటూ చదువు చదువుకునే దుస్థితి లని గుర్తించి వారిని మానసిక హింస నుండి , ఆత్మ హత్యల నుండి కాపాడండి అని మాత్రం చెపుతున్నాను. నేను కొన్నేళ్ళు గా అలాటి చేదు అనుభవాలని చూస్తున్నాను కాబట్టి చెబుతున్నాను.

ఇంకొక మాట ఏమిటంటే.. అలా రెసిడెన్షియల్ కాలేజెస్ లో ఉండే పిల్లలని చూడటానికి వెళ్ళేటప్పుడు.. మీ ఇంట్లో ఉండే రెండో,మూడో సెల్ పోన్ లని ఫుల్ చార్జింగ్ పెట్టుకుని తీసుకుని వెళ్ళండి. అది ఖచ్చితంగా సేవే!అని నేను అనుకుంటాను.:)

పోన్ ఉందా..! ఇస్తారా..?అని అడిగిన పిల్లలందరికీ మీ మొబైల్ పోన్స్ ఇచ్చి వాళ్ళ ఇళ్ళ దిగుళ్ళని,చదువుల ఒత్తిళ్ళని,ఇబ్బందులని ఇంటివారితో చెప్పుకుంటూ..ప్రేమగా మాట్లాడుకుంటూ ..కాస్త తెరిపిన పడటానికి సహకరించండి. పిల్లలలో ..మన పిల్లలు ఉన్నారనుకుంటే పెద్ద ఇబ్బంది అయిన పని కాదు కదా! :)


13 వ్యాఖ్యలు:

భాస్కర్ కె చెప్పారు...

corporate college jeevithani bhagha raasarandi, pillalu perge koddi collegelu thaluchookoni bhayapadalemo.

అజ్ఞాత చెప్పారు...

ఇప్పుడున్న చదువుల పరిస్థితిని చాలా బాగా వ్యక్తీకరించారు... ప్రతి ఒక్కరిలోనూ ప్రస్తుతం ఇలాంటి సంఘర్షణే జరుగుతోంది..

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

good and useful post for parents.your post focussed a real environment in these colleges.

Meraj Fathima చెప్పారు...

prasthutha kaala paristhulanu chakkagaa vivarinchatamlo medi pai cheyi vanajagaaru

అజ్ఞాత చెప్పారు...

Really touching and informative. All is not rosy with corporate education.

జలతారు వెన్నెల చెప్పారు...

corporate college ante? residential ones ? like chaitanya etc? I have some more questions. I will ask them when you answer these questions.

శ్యామలీయం చెప్పారు...

డబ్బుపిచ్చి ప్రజలు బిడ్డలకీ ఆ పిచ్చి యెక్కించటానికి డబ్బుపిఛ్చి చదువులకోసం యంత్రాల్లా మార్చి హింసిస్తున్నారు. అయ్యో!

అజ్ఞాత చెప్పారు...

ఇంజనీరింగ్, మెడిసిన్ తప్ప మరో వృత్తి లేకుండా పోయిన సమాజంలో కార్పొరేట్ కళాశాలల వైభోగం ఇలానే వెలుగుతూ ఉంటుంది. నలిగిపోయే పిల్లలు కొంతకాలానికి మెషీన్లుగా మారిపోతారు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

కార్పోరేట్ కాలేజి లలో పిల్లలకి కష్టాలు ఉంటాయని తెలుసు కానీ ఇంత దుర్భరం గా ఉంటుందని ఇప్పుడే తెలిసింది.

కార్పోరేట్ కాలేజి యాజమాన్యాలకి సద్బుద్ధి కలుగు గాక అని ప్రార్ధించడం తప్ప మరేమి చెయ్యలేమా ?

lalithag చెప్పారు...

మరి పిల్లలని ఈ కాలేజీలలో ఎందుకు చేర్పిస్తున్నారు? పెద్దగా చదువుకోని తల్లిదండ్రుల సంగతి సరే. చదువుకున్న వారు? ఈ రోజే ఇంకో ఆర్టికల్ చదివాను.
http://www.msnbc.msn.com/id/47751459/ns/health-the_new_york_times/
ఎందుకిలా ఉంది పరిస్థితి? ప్రైవేట్ స్కూళ్ళలో, "మంచి స్కూళ్ళు" అని పేరు తెచ్చుకున్న స్కూళ్ళలో పిల్లలని చేర్పించకపోవడమే నయమేమో అనిపిస్తోంది ఈ ఆర్టికల్ చదివాక. ప్చ్ :(

satyadigital చెప్పారు...

amma meru baga rasaru ee vishayanni konchem andariki telesela sahakarinchandi. mee abhimani Pendurthi bhaskar

Raj చెప్పారు...

కార్పోరేట్ కళాశాల చదువుల గురించీ, అక్కడి వసతుల గురించి, పిల్లలూ, తల్లితండ్రుల మనోవేదననీ చాలా చక్కగా తెలియచేశారు..

వనజ తాతినేని చెప్పారు...

The tree Bhaskar gaaru..
@mhsgreamspet..ramakrishna gaaru
@oddula Ravishekhar gaaru..
@meraj Fathima gaaroo..
@kashTE phalE gaaru..
@Jalataaru vennela gaaru
@Shyamaleeyam gaaru..
@puraanapanda phani gaaru..
@Bulusu subrahmanyam gaaru..
@ lalithag gaaru
@satya digital gaaru..
@Raj gaaru..

mee andari spandanaki dhanyavaadamulu.

మరొక పోస్ట్ లో కార్పోరేట్ విద్యా సంస్థల గురించి వ్రాస్తాను. అప్పుడు వివరంగా చర్చించుకుందాం.
అందరికి మనఃపూర్వక ధన్యవాదములు. సమయాభావం,భాద్యతలు మూలంగా .. వివరంగా స్పందించలేక పోతున్నాను. మన్నించండి.
అందరికి ధన్యవాదములు.