27, అక్టోబర్ 2025, సోమవారం

యూ మేక్ మి హ్యాపీ గ్రాండ్ పా..

You make me Happy Grandpa 

                          - వనజ తాతినేని 


నిజం చెప్పు.. అబ్బాయీ!!

నా చిటికెన వేలు పట్టుకుని నాతో నడుస్తూ 

అమాయకంగా ముచ్చట్లు చెబుతున్న పసివాడికి 

నీతి బోధల కథలు చెప్పాలా వద్దా? 


కాస్త అటు ఇటుగా మనం చూసే 
ప్రపంచాన్నే వాడూ చూస్తున్నాడు. 

మనం పీల్చే గాలి వాడు పీలుస్తున్నాడు. 

బహుశా వాళ్ళమ్మ  వాడికి మంచి ఆహారాన్ని 

వద్దన్నా మాయ చేస్తూ కథలు చెప్తూ తెరపై 

కార్టూన్ కథలు చూపిస్తూ తినిపిస్తూ ఉంటుంది. 


వాడు పసివాడుగా వున్నప్పుడే ఎక్కువగా

నచ్చేసాడు నాకు. 

మన మాయలో పడ్డట్టు నటిస్తూనే 

మనను మాయలో పడేసేవాడు. 

ఇంక వాడికి తెలియనిది ఏమి లేదు. 


కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ  

తెలుసుకోవాల్సింది తెలుసుకుంటూ అవసరమైనవి 

అనవసరమైనవన్నీ పోగుచేసుకుంటాడు. 

ఏది అట్టి పెట్టుకున్నాడో ఏది ఖాళీ చేస్తాడో 

ఎలా చెప్పగలం మనం? 

ఏదైనా ఒకటి రెండు స్వీయానుభవాలు 

తర్వాత జాగురకతతో వుంటాడేమో! 


మనం చెప్పాల్సింది నిప్పు కాలుతుంది 

నీటిలో దిగకూడదు మేడ మీద నుండి పడిపోతావు

రోడ్డుకి ఎడమ పక్కనే నడవాలి.

ఆ ఆకులు పండ్లు తినకూడదు 

మనిషిని గుడ్డిగా నమ్మకు లాంటి భద్రతా 

హెచ్చరికలు మాత్రమేనా!  ఇంకేమీ వద్దా!?


అమ్మ నాన్న తప్ప వేరెవరూ లేని ఇంట్లో
తాను విన్నవి కన్నవి  చేసినవి బలవంతంగా
చేయించినవి ఇలా ప్రతి పని  నుండి ఏదో వొకటి 
నేర్చుకుని అనుభవాన్ని ప్రోది చేసుకుంటూ  
ఆ చిన్నారి పెద్దల చిటికెనవేలు విడిపించుకుని 
ముందుకు వెళ్ళిపోతాడు. 


నేనెప్పుడైనా తలపులలో  వొకసారి.. 

వద్దన్న పనులు చేసే ఆకతాయిని

చిత్రాంగి కబుర్లు చెప్పే అమ్మాయిని

చూసి రమ్మంటే ఏకంగా కాల్చి వచ్చే కోతిని

స్నేహితుడి ఏడుపు చూసి ఆనందించే ప్రకోపిని..   

వాళ్ళను ఇలాంటి కొన్ని బండ గుర్తులతో 

జ్ఞాపకం చేసుకొంటానేమో! 

వారేమో .. మనతో గడిపిన కాలాన్ని చాపలా 

చుట్ట చుట్టుకుని నెత్తిన మోసుకెళతారేమో!? 


కానుకగా బాహ్యంగా కనిపించే కొన్ని 

వస్తువులను ఇచ్చి వెళ్ళగలనేమో!  

కానీ అంత కన్నా అపూర్వమైన నిధి కూడా 

ఇచ్చి వెళ్ళగలం అన్న సంగతి నీకూ తెలుసు. 

రుజువులు దశాబ్దాల క్రితం మరణించిన 

అమ్మమ్మ ను తాతయ్యను నువ్వు జ్ఞాపకం చేసుకోవడం. 


మా అమ్మమ్మ గుర్తుగా నా దగ్గర 

ఓ స్టీల్ కేన్ వక్కపొడి డబ్బా వున్నాయి. 

మా నాయనమ్మ తాతయ్య గురించి 

పురావస్తు ఆధారాలు  నా దగ్గర ఏమీ లేవు. 

కల్మషం లేని నది వొడ్డున స్వేచ్ఛగా 

ప్రేమతో సంచరించిన  కాలం, 

పిచ్చాపాటి మాటల్లా అనిపించే కొన్ని

అద్భుతమైన విషయాలు అందులో నిబిడీకృతమైన 

నీతి కథల్లాంటి సందేశాత్మక దృశ్యాలు 

అమూల్యమైన జ్ఞాపకాలు మినహా! 


నాక్కావల్సివచ్చినప్పుడల్లా గతాన్ని తలుచుకుంటూ 

నా నెత్తిన చుట్టిన చాపను పరుచుకుని 

ధూళి లాంటి జ్ఞాపకాలను ఏరుకుంటాను. 

అందులో నాకో సందేశం వుంటుంది. 

నాకై నేనెలా వుండాలో ఇతరుల పట్ల 

ఎలా మెలగాలో అని. 


ఇప్పుడు చెప్పు!? 
మన పసివాడికి ఏమైనా చెప్పాలా వద్దా!? 
అదీ వీడియో కాల్ లోనే కదా! 


బతికివున్న అమ్మ నాన్నలనే మర్చిపోతున్న

తరానికి ప్రతినిధి నువ్వు. 

పిల్లలకు చెప్పేవి పోసుకోలు కబుర్లు అనుకుంటావ్ నువ్వు. 

మీ విలువైన సమయం మొబైల్ ఫోన్ లో  

దాగి ఉంటుంది గనుక. 


కాల సృహ లేని ముసలి వాళ్ళ తాపత్రయం

తమ ముద్ర ను పిల్లల మనసులో 

నాటి పోదాం అనే దుగ్ధ కొంత 

ఏకాకి బతుకుకి కాస్త ప్రేమ రంగు అద్దుకోవాలనే 

అత్యాశ తప్ప ఇంకేముంటుంది చెప్పు?


I love you Grandpa 
My sweet sweet grandpa .. 
you make me happy ..
అని అడుగుతున్నట్టు కలలు 
ఊరిస్తున్నాయి రా!
కన్నీరు కూడా వొంటరైంది. 
తుడిచే చేయొకటి కరువై. 

21/10/2025 The Federal.com నేటి మేటి కవిత గా ప్రచురితం.

కామెంట్‌లు లేవు: