వీడ్కోలు చెప్పని పలవరింత
- వనజ తాతినేని
ఓ సీతాకోకచిలుక తన రెక్కలు కదుల్చుతూ
నన్ను పలకరిస్తుంది.
నా లోచూపు లో బందించబడిన ఆ దృశ్యం
ఇంకా తాజాగానే ఉంది
వీడ్కోలు సమయంలో నువ్వు అరచేతిని
ఇలా కారు అద్దం పై వుంచినట్లు ..
నువ్వు అర్థం చేసుకునే వుంటావ్!
ఇవతలి వైపున నా అరచేతిని ఆన్చడానికి
నొప్పి వొకటి సహకరించలేదన్నమాటే కానీ
కారు ముందుకు కదలడం మాత్రమే నని
సంశయం మాత్రం కానే కాదని..
గుర్తుంచుకుని శ్రద్ధ తీసుకుని మరీ .. ప్రదోషసమయంలో
మనిద్దరికి ఇష్టమైన సుందరేశ్వరుడి దర్శన భాగ్యాన్ని ఇప్పించడమూనూ..
ఆ తులసి తీర్థం లో గాఢత పరిమళం లాగా
నేనో ఆధారంగా నిలబడతాననే వాగ్దానం
నువ్వో పుష్పించేనో ఫలించేనో తీగవవుతావు
అనే సందేశం నా ఒంటిని మంటి ని
ఇంకా అంటి పెట్టుకునే వుందని.
నిజం చెప్పనా!? వీడ్కోలు తర్వాత
ఏ తిరనాళ్ళలోనో తప్పిపోయిన పిల్లాడి
బేలతనం నన్నావహించిందని
ఇది జన్మాంతరం కొనసాగుతుందని.
(శీలావీ ఫాంట్ తో ప్రచురింపబడిన కవితా సంకలనంలో)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి