20, అక్టోబర్ 2025, సోమవారం

కానుక

 



కానుక

వారు తమ సంతోషాన్ని పంచుకుంటే నువ్వు కూడా సంతోషించు. 

వారు తమ జీవితాల్లో తప్పిదాలు చేసే వుంటారేమో! 

వారి గతాన్ని ముఖాలకు పూసి నువ్వు తీర్పులు ఇవ్వబోకు 

వారు ఇప్పటికే బోలెడంత పశ్చాత్తాపం 

ప్రకటించే వుంటారు

బాధితుల ముంగిట తలను వంచి క్షమాపణలు కోరే వుంటారు.

అవతలివారు కూడా కన్నీటిపొరల మధ్య 

మన్నించే వుంటారు. 

కాలం ఒడిలో కరుకు గుండెలు కూడా మెత్తనవుతాయి. 

ఎవరు మాత్రం దీర్ఘకాలం ద్వేషాన్ని మోయగలరు.. చెప్పు ?  

మనం కూడా మెత్తబడి పోదాం. 

ఒకరి జీవితాన్ని మరొకరు యెన్నడూ జీవించలేరు.

వారి జీవితాన్ని వారిని జీవించనిద్దాం

సంజాయిషీలు అడక్కుండా 

చూపుల చురకత్తులు గుచ్చకుండా

కాసిన్ని మనఃపూర్వక నవ్వులను పువ్వులుగా మార్చి కానుకగా ఇద్దాం. 

కామెంట్‌లు లేవు: