ప్రశ్నావళి
1.మీ గురించి… మీ బాల్యం, విద్య, వృత్తి…
జ:సాధారణమైన జీవన నేపథ్యం నాది. మధ్యతరగతి వ్యవసాయదారుల కుటుంబంలో ద్వితీయ సంతానంగా పుట్టాను. కృష్ణాజిల్లా కుంటముక్కల గ్రామం నా జన్మస్థలం. నా విద్యాభ్యాసం అంతా మైలవరంలో గడిచింది. పద్దెనిమిదవ యేట వివాహం.మంచి ఉద్యోగం చేయగల అర్హత కల్గిన చదువులు వున్నా నాభర్త కూడా వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకోవడం వల్ల వ్యవసాయ క్షేత్రానికే అంకితమైపోయాను.అంత ఎక్స్ ప్లోరర్ లేని అమాయకమైన గృహిణిని నేను. ముప్ఫై దాటిన తర్వాత నగరానికి వచ్చిపడ్డాను. దూరవిద్య ద్వారా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసాను.ఆర్థికస్వావలంబన సాధించేక్రమంలో దానితోపాటు విస్తృత లోకజ్ఞానం సముపార్జించాను. గృహిణిగా ఉంటూనే చిన్నపాటి దుకాణం ఎంబ్రాయిడరీ యూనిట్ నిర్వహించి పదిమందికి ఉపాధి కల్పన కల్పించాను. నా పని నేను చేసుకుంటూనే సమాజాన్ని బాగా పరిశీలించేదాన్ని. అప్పుడు నాకు కల్గిన ఆలోచనలే…నా రాతలకు ప్రేరణ.
2.ఎప్పటి నుండి రచనలు చేస్తున్నారు? (కథలు ఎప్పటి నుండి రాస్తున్నారు) మీకు రాయాలి అన్న ఆలోచన ఎక్కడ, ఎప్పుడు, ఎలా పుట్టింది?
జ:నేను కాలేజీ లో చదువుకున్నప్పుడు కొన్ని కథలు వ్యాసాలు వ్రాసాను. కాలేజీ మ్యాగజైన్ లో వ్యాసాలు వచ్చేవి.కథలు మాత్రం స్నేహితులు చదివేవారు. 1996 లో సీరియస్ గా కథ వ్రాసాను. పత్రికలకు పంపితే తిరిగొచ్చింది. ఆ కథ “జాతర”. ఇప్పటికీ అచ్చుతప్పులు దిద్దటం తప్ప ఒక్క వాక్యం కూడా మార్చని కథ అది. ఆకాశవాణిలో ప్రసారమైంది.సంవత్సరానికి రెండో మూడో వ్రాసి అవి ప్రచురణకు నోచుకోకపోతే నిరాశపడి చించేసేదాన్ని. బ్లాగ్ వ్రాయడం మొదలెట్టాక వేలమంది చదువుతున్నారని తెలిసాక విరివిగా వ్రాయడం మొదలెట్టాను.
3.రచనలు చేసే క్రమంలో ఎప్పుడైనా శిక్షణ తీసుకున్నారా? లేదా workshops లాంటివి ఎప్పుడైనా అటెండ్ అయ్యారా? (అయితే వాటి వివరాలు తెలుపగలరు)
జ:లేదు, నేను ఎక్కడా శిక్షణ తీసుకోలేదు, రచయితగా మారిన తర్వాతనే రెండుసార్లు వర్క్ షాప్ కు వెళ్ళాను. అక్కడ అనేక మెళుకువలు నేర్చుకున్నాను.
4.మీరు method రైటరా? లేక impulsive రైటరా?
జ:Impulsive writer నే!
5.మీరు కవితలు కూడా రాస్తుంటారు కదా! కథ, కవితా ప్రక్రియల్లో ఏది రాయడానికి ఎక్కువగా మొగ్గుచూపుతారు? ఎందుకు?
జ:అప్పటికప్పుడు కల్గిన ఆలోచనను బట్టి కవితో కథో రూపుదిద్దుకుంటుంది.కథ వ్రాయడానికే ఇష్టపడతాను.ఆలోచనాత్మకమైన పాత్రల చిత్రీకరణ కు కథలో స్కోప్ ఎక్కువ వుంటుంది. కవిత్వంలో స్కోప్ తక్కువ. నా కవిత్వం ఆత్మాశ్రయమైనది.మూడొంతులు personal to social లో ప్రయాణిస్తూ వుంటుంది.
6.కథకు, సమాజానికి మధ్య ఉన్న సంబంధం పై మీ అభిప్రాయం…
జ:అవినాభావ సంబంధమే! మనిషి మనిషికి ఒక కథ కాదు అనేక కథలు.ఊహాజనితమైన కథల్లో కూడా మనుషులే వుంటారు.
7.మీరు రాసిన కథల్లో ఎప్పుడైనా మీరు ఒక పాత్రగా ఉన్నారా?
జ:ఉన్నాను. అయిదు కథల్లోనూ ఒకే పేరు వున్న పాత్ర నేనే!
8.మీరు కథ రాయడం మొదలు పెట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు కథా రచనా ప్రక్రియలో మీరు గమనించిన మార్పులు ఏమన్నా ఉన్నాయా?
జ:పనిగట్టుకుని ప్రత్యేకంగా గుర్తింపబడాలని కొత్తదనంగా చెప్పాలన్న తాపత్రయంలో పడి కథకు అన్యాయం చేస్తున్నారు. అది పాఠకులకు చేరడం కష్టం. రచయితలు చదువుకోవాల్సిన కథలు వ్రాసేమని భ్రమపడుతూ రచయితలు కూడా విసుగ్గా పక్కన పడేసే కథలు వ్రాస్తున్నారు. పాఠకుడిని చేయి పట్టుకుని కథలోకి నడిపించాల్సిన బాధ్యత రచయితదే.ఇది నేను గమనించిన మార్పు.
9.మీ కథల్లో తరచుగా ఏ అంశాన్ని కథావస్తువుగా ఎంచుకోవడానికి మీరు ప్రాధాన్యతను ఇస్తారు?
జ:ఈ అంశాన్ని మాత్రమే కథగా వ్రాయాలని పనిగట్టుకుని వ్రాయలేదు. నన్ను ఎక్కువ కుదిపేసిన అంశాన్ని వ్రాస్తుంటాను. ఎక్కువ స్త్రీల సమస్యలు వారి వేదన గురించి వ్రాస్తుంటాను కాబట్టి స్త్రీవాద రచయితను అనుకుంటారు.నేను అలా అనుకోను. అన్నిరకాల కథలు వ్రాసాను. మనిషి అంతర్ముఖ ఆలోచనలు గురించి వ్రాయడం నాకిష్టం.కానీ పత్రికల్లో వచ్చే కథలకు నిడివి సమస్య వుంది.అందుకే సొంతంగా డైరక్టుగా కథల సంపుటి వేస్తున్నాను. రచయితలకు సంతృప్తినిచ్చే కథలు రావాలంటే వెబ్ పత్రికలు బ్లాగ్ లు అవసరమైన కాలం ఇది.అంతకన్నా రచయితలకు పాఠకులు కావాల్సిన సమయం ఇది. రచయితకు పాఠకులుండటం కన్నా గొప్ప అదృష్టం ఇంకొకటి లేదు.
10.మహిళలు ప్రతిరోజూ ఇంటా బయటా ఎదుర్కొనే పలు సమస్యలపై మీరు మీ కథల ద్వారా స్పందిస్తూ ఉంటారు. అంతే కాకుండా మీ కథల్లో చాలా వరకు స్త్రీ పాత్రలు స్వతంత్రంగా, ధైర్యంగా, ఒకరికొకరు ఆసరాగా ఉంటారు కదా! వారిని అలా సృష్టించడం వెనుక ఏదైనా ప్రత్యేక కారణముందా?
జ: నేను వ్రాసే కథలెప్పుడూ నేల విడిచి సాము చేయవు. జీవన శకలాలపై నుండి నడచి వచ్చిన పాత్రలు కాబట్టి ధీరోదాత్తంగా స్వేచ్ఛగా సహానుభూతితో మెలుగుతాయి. పాత్రలను నేను సృష్టించడం తక్కువ. కథనం బిగువుగా వుండటానికి తగుమోతాదులో ఫిక్షన్ పై ఆధారపడతాను అంతే! నా అనుభవాలు ఇతరుల అనుభవాలే నా కథలకు మూలం.
11.మీ కథల్లో మీ పాత్రలు చెప్పే కొన్ని వాక్యాలు చాలా సూటిగా గుర్తుండిపోయేట్టుగా ఉంటాయి. భాషకు ఇంత సామర్థ్యం, చతురత ఉంటుందన్న విషయాన్ని మీరు మొట్ట మొదట ఎప్పుడు, ఎలా గుర్తించారు?
జ: అదంతా సహజంగా వ్రాస్తుంటాను.అంత ప్రత్యేకంగా వ్రాస్తున్నట్లు నాకు తెలియదు కూడా… పాత్రల చిత్రణ బట్టి వస్తుందనుకుంటాను.భాష శక్తివంతమైనది! దానిని బాగా వాడుకోవాలి.దుర్వినియోగం చేసుకోకూడదని సున్నితంగా చెప్పవచ్చు.కానీ అవసరమైనంత కఠినం ప్రదర్శిస్తూనే బలమైన మాటలతో చెప్పాలనుకుంటాను.
12.బ్లాగ్ గురించి మీకు మొదట ఎలా తెలిసింది? అందులో రాయడం వెనుక ఏమన్నా ప్రత్యేక కారణం ఉందా?
జ: ఒక స్నేహితురాలు చెప్పారు. ఆమె ఆకాశవాణిలో ఆర్ జె గా చేసేవారు. పత్రికల్లో వచ్చిన మీ కవిత్వాన్ని, వ్యాసాలను, ప్రసారమైన కథానికలను సాహిత్య వ్యాసాలను అక్కడ భద్రపరుచుకోండి…అని బ్లాగ్ ను పరిచయం చేసారు.అలా బ్లాగ్ కు వచ్చాను.
14.మీ రచనలు పుస్తకంలో ముందు అచ్చయ్యాయా? లేదా బ్లాగ్ లో అయ్యాయా?
జ: కవితలు అచ్చు అయ్యాయి. ఆకాశవాణిలో కథానికలు ప్రసారం అయ్యాయి. కథలను పత్రికలకు పంపితే నిడివి ఎక్కువని తిరస్కరించేవారు. బ్లాగ్ లో ప్రచురించాను. తర్వాత వెబ్ పత్రికలు ప్రచురించాక ధైర్యం వచ్చి పత్రికలకు పంపాను. అలా సాగింది నా రచనా ప్రయాణం.
13.బ్లాగర్ గా దాదాపు 12 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీరు గడించిన కొన్ని ముఖ్యమైన అనుభవాలు ఏమన్నా పంచుకోగలరా?
జ:సాధారణ స్త్రీ ని అసాధారణ స్త్రీగా మార్చింది. బ్లాగ్ వ్రాయడం ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. బ్లాగ్ వ్రాయకపోతే నేను రచయితను కాలేకపోయి వుండేదాన్ని.కాగితం మీద వ్రాయడం తప్పు రాస్తే చించి సరికొత్తగా మళ్ళీ వ్రాయడం నాకు చాలా విసుగైన విషయం. కీ బోర్డు నాకు పెన్నిధిలా దొరికింది :)
14.ఒకప్పటి బ్లాగ్ స్థానాన్ని ప్రస్తుతం ఫేస్ బుక్, యూట్యూబ్ లు భర్తీ చేస్తున్నాయని మీరు భావిస్తున్నారా?
జ: అవును. మార్పు వేగవంతం అయింది.
15.గతం తో పోలిస్తే, 2013-14 నుండి మీ బ్లాగ్ పోస్టుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది కదా! పుస్తకం నుండి ముఖ పుస్తకం వరకు అక్కడ నుండి దృశ్య మాధ్యమం వరకు సాహిత్యం చేసిన “ఈ” ప్రయాణం లో బ్లాగ్ తన పాత్రను నిర్వర్తించి విశ్రాంతి తీసుకుంటుందనుకుంటున్నారా? ప్రస్తుతం బ్లాగ్ అనేది ఒక మృత మాధ్యమంగా మీరు పరిగణిస్తారా?
జ: బ్లాగ్ కి విశ్రాంతి లేదండీ. నేను బ్లాగ్ వ్రాయడానికి చాలా ఇష్టపడతాను. అయితే నా దృష్టి అంతా కథలపై వుంది. వ్యాసాలు వ్రాయడానికన్నా కథ వ్రాయడంలో మంచి కథలను చదవడంలో చర్చించడంలో ఆసక్తి పెరిగి బ్లాగ్ పై శీతకన్ను వేసానే తప్ప బ్లాగ్ ని నిర్లక్ష్యం చేయలేదు. ఒక విధంగా చెప్పాలంటే బ్లాక్ నాలెడ్జ్ పెరిగిపోయి ఏమీ వ్రాయలేని నిస్సహాయత ఆవరించింది. మెదడులో బ్లూ ప్రింట్ రూపంలో పరిణితి చెందిన నా ఆలోచనలు చాలా వున్నాయి. వ్రాయడానికి సమయం తీసుకుంటున్నానంతే!
16.ఆన్లైన్, పుస్తక ప్రచురణల్లో మీరు దేనిని సులువైన ప్రచురణా మాధ్యమంగా భావిస్తారు?
జ: ఆన్లైన్ ప్రచురణ చాలా సులువు, తక్కువ ఖర్చు కూడా.
17.మీ సొంత కథలను పుస్తకంగా/ఆఫ్ లైన్ మ్యాగజైన్స్ లో ప్రచురించడానికి ఇష్టపడతారా లేదా సోషల్ మీడియా/ ఆన్లైన్ మాగజిన్స్ లో ప్రచురించడానికి మొగ్గుచూపుతారా?
జ: ఆఫ్ లైన్ మ్యాగజైన్స్ లో, సొంత కథల పుస్తకంగా వేయడానికి ఇష్టపడతాను.
18.ఇంటర్నెట్ ఒక కొత్త ప్రచురణా మాధ్యమంగా మారడం వలన పబ్లికేషన్ అనేది కొందిరికే కాకుండా అందరికీ అందుబాటులోకి వచ్చిందంటారా? మీరు వ్యక్తిగతంగా ఈ మాధ్యమాన్ని ఎంచుకోవడంలో ఇది కూడా ఒక కారణంగా భావించవచ్చా?
జ:అవును. పత్రికలు అందరి రచనలనూ ప్రచురించవు. అలాంటపుడు ఈ మాధ్యమం ఔత్సాహిక రచయితలకు చక్కని వేదికైంది.
19.ఒకప్పటికన్నా ఇప్పుడు వస్తున్న రచనలలో(ముఖ్యంగా ఆన్లైన్ రచనలలో) నిపుణుల పర్యవేక్షణ లోపించడం వలన “quality of writing” తగ్గిపోయిందంటారా?
జ: నిస్సందేహంగా నాణ్యత తగ్గింది. అందుకే చదవడం కూడా తగ్గింది. తామరతంపరగా ఆన్లైన్ పత్రికలు రావడం కూడా సాహిత్యానికి మంచిది కాదు. రచయితలకు సూచనలు ఇచ్చి కథలను సవరించవచ్చు.అలాంటి శ్రద్ధ తీసుకునే ఎడిటర్స్ లేరు. రచయితలకూ నేర్చుకునే ఓపిక లేదు.
20.సోషల్ మీడియాలో ఏదైనా ప్రచురిస్తే, ఆ content కు ఎంతవరకు సెక్యూరిటీ ఉందని మీరు అనుకుంటున్నారు? (ఒక వేళ సెక్యూరిటీ లేదని మీరు భావిస్తే, ఆ విషయం తెలిసి కూడా ఎందుకు సోషల్ మీడియా లో ప్రచురణలు చేస్తున్నారు?)
జ: సోషల్ మీడియాలో కంటెంట్ కు భద్రత లేదు. పత్రికల్లో వచ్చాక ప్రచురించినా చౌర్యం జరుగుతుంది. రచనలు పాఠకులకు చేర్చడానికి రచయిత పడే తాపత్రయం వల్ల చౌర్యానికి గురవుతాయని తెలిసినా ప్రచురిస్తున్నాను.
21.శాశ్వతం.. అశాశ్వతం.. అంటూ పుస్తకం, ఆన్లైన్ రచనలపై జరుగుతున్న చర్చ పై మీ అభిప్రాయం?
జ: ఆన్లైన్ పుస్తకాలు భద్రపరచడం సులభం కావచ్చేమో కానీ పాఠకులు ఎక్కువ కాలం, ఎక్కువ సమయం కేటాయించి చదవలేరు. పుస్తకం ఇచ్చిన సౌలభ్యం అనుభూతి ఆన్లైన్ పుస్తకాలలో కొరవడుతుంది. పుస్తకాలను బహుమతిగా పొందడం ఇవ్వడంలో ఆనందం వుంది.
22.Facebook ఎక్కువ వాడకంలోకి వచ్చాక మీ బ్లాగ్ పోస్టులకు, పుస్తకాలకు అది ప్రచార వేదికగా ఎంత వరకు ఉపయోగపడింది? అంతకు ముందుకి, ఆ తరువాతకి మీ పాఠకుల సంఖ్యలో ఏమన్నా మార్పులు గమనించారా?
జ: ఫేస్ బుక్ వచ్చాక పాఠకులు ఎక్కువయ్యారని చెప్పవచ్చు. ఫేస్ బుక్ ప్రచార వేదికగా ఉపయోగపడింది కానీ..సీరియస్ గా చదివే పాఠకులు తగ్గిపోయారు. ఎందుకంటే ప్రచారాటోపం వల్ల నాణ్యత లేని కథలు కూడా మంచి కథలుగా చెలామణిలో వున్నాయి.
23.ప్రింట్ లో ప్రచురణ చేసేటప్పుడు ప్రచురణకర్తల నుండి మీరు అందుకున్న తోడ్పాటు గురించి కానీ, ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కానీ ఎమన్నా అనుభవాలు పంచుకోగలరా?
జ:ఇబ్బందులు వున్నాయి. అడుగడుగునా మనం చూసుకోకపోతే..మనం అనుకున్నట్టు పుస్తకం రాదు. ప్రూఫ్ రీడింగ్ సరిగా వుండదు.అనవసర వ్యాఖ్యానాలు కూడా వున్నాయి. అవి నన్ను బాగా బాధ పెట్టాయి కూడా.
24.ప్రచురణకర్తల నుండి నవలా రచయితలను లభిస్తున్న ఆదరణ కథా రచయితలకి లభిస్తుందా? కథల ప్రచురణలు మరింత ప్రాచుర్యం పొందడానికి ప్రచురణకర్తల సపోర్ట్ ఎంతవరకు అవసరమని మీరు భావిస్తున్నారు?
జ:ప్రచురణ కర్తల నుండి రచయితలకు సహకారం లేదు. రచయిత సొంత డబ్బుతో పుస్తకం ప్రచురించుకున్నా అమ్మకాలు లేవు అంటున్నారు. రచయితల పని పుస్తకాలు అమ్ముకోవడం కాదు. అలాగే రచయితలు కూడా తాము వ్రాసినదంతా పుస్తకాల రూపంలో మార్చాలన్న తాపత్రయం మంచిది కాదు. చదువరులు మొహమాటంతో కాదు ఇష్టంతో పుస్తకాలు కొనాలి చదవాలి.
25.కథా పాఠకులలో మీరు రాయడం మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటివరకు మీరు ఎటువంటి మార్పునైనా గమనించారా?
జ:పెద్ద కథలను చదవడానికి ఇష్టపడటం లేదు.చదవడం కన్నా వ్రాయడంలో ఆసక్తి పెరిగింది. పాఠకులే రచయితలై పోతున్నారు.
26.పాఠకుల పఠనా సమయం తగ్గిపోతోందని మీకెప్పుడైనా అనిపించిందా? మీరు రచనలు చేయడం మొదలు పెట్టినప్పటికీ ఇప్పటికీ మీరు ఎలాంటి మార్పును గమనించారు ఈ విషయంలో?
జ:పెరిగిన శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం మూలంగా వరదలా వచ్చిపడుతున్న అనేక ప్రక్రియల్లో పాఠకుడు మునిగిపోతున్నాడు. ఒడ్డుకు చేరి సేదతీరి పుస్తకం పట్టుకోవడం కష్టం అవుతుంది. పాఠశాలల్లో పాఠ్యేతర రీడింగ్ పీరియడ్స్ అవసరం వుంది అనిపిస్తుంది.అప్పుడే భావితరం పాఠకులుంటారు.
27.ఇప్పుడు వస్తున్న మైక్రో ఫిక్షన్, ఫ్లాష్ ఫిక్షన్ లాంటి ప్రయోగాలపై మీ అభిప్రాయం? అన్ని తక్కువ పదాలలో అందమైన, అర్ధవంతమైన కథానికను కూర్చడం ఎంతవరకు సాధ్యమంటారు? మీరెప్పుడైనా ఆ ప్రక్రియలో రాయడానికి ప్రయత్నించారా?
జ: కొన్ని కథలు వ్రాసాను. వాటికి చురుకు ఎక్కువ అనుభూతి తక్కువ.అలాంటి కథలు కాలానికి నిలబడవు. అలా వ్రాయడం నాకిష్టం లేదు.వ్రాయను కూడా.
28.ఇప్పుడు వస్తున్న యువ కథా రచయితల రచనలపై మీ అభిప్రాయం?
జ:బాగా వ్రాస్తున్నారు కానీ ఒక కథతోనే ప్రసిద్దులైపోవాలనే ఆరాటం కనబడుతుంది.
29.మీకు మీ సమకాలీన రచయితలతో సంబంధాలు ఎలా ఉన్నాయి? వాటి ప్రభావం మీ రచనలపై ఎలా ఉంది?
జ : సహరచయితలు అంటే మూడు తరాల రచయితలు అని అనుకోవాలి. నేను అందుబాటులో ఉన్న అందరి కథలను చదువుతాను. కానీ రచయితలతో పరిచయం తక్కువ. ఎవరి ప్రభావం నా రచనల పై ఉండదని స్పష్టంగా చెప్పగలను.
30.“కథ” భవిష్యత్తులో ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు?
ఏక పుట కథలు, సూక్ష్మ కథలు మాత్రమే ఉండగలవు అనిపిస్తుంది.
31.మీ రచనలు మీకు సంతృప్తిని ఇచ్చాయా? ఎలాంటి రచనలు చేయాలనే ఆకాంక్ష ఉంది?
జ:రాజకీయ కథలు వ్రాయాలనే ఆకాంక్ష ఉండేది, రెండు మూడు కథలు కూడా వ్రాసాను. కులం మతం జెండర్ వర్గం ఇవన్నీ కూడా రాజకీయ కోణాలే కదా .. ప్రత్యేకించి వ్రాయడం ఎందుకు అనుకుని మానేసాను. నేను వ్రాసిన కథలు నాకు చాలా సంతృప్తిని ఇచ్చాయి.
ధన్యవాదాలు
ధన్యవాదాలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి