15, అక్టోబర్ 2025, బుధవారం

ఎర్ర ముఖముల్ వస్త్రం

 ఎర్ర ముఖముల్ వస్త్రం  -వనజ తాతినేని 

నా జ్ఞాపకాల ఊరేగింపు మొదలైంది. 

ఎర్రటి మఖముల్ గుడ్డలో  మూల విరాట్ అయిన 

నీ రూపాన్ని చుట్టి  హృదయ సింహాసంపై కూర్చుండబెట్టాను.

పక్కనే కొన్ని నీ కవితల పుస్తకాలు ఉత్సవ విగ్రహాల వలె నిలుచుని వుండాయి.  

రెండు కాళ్ళ  ఈ రాతి రథం నెమ్మెదిగా  నీవుండే వీథిలోకి కదిలివస్తుంది. 


నువ్వు   వార  పోయడానికి రెండు బిందెలతో  

పన్నీరు కన్నీరు నింపుకుని ఎదురుచూస్తూనే వుండి వుంటావ్.  

కమల నయనాలను దివ్వెలుగా వెలిగించి స్వాగతం పలుకుతావ్

స్వచ్చమైన నీ మనసుకి విలాసం లాంటి నారికేళ ఫలం

మధురమైన నీ వాక్కు లాంటి అమృతపాణి  కదళీ ఫలాలు 

సమర్పణకు సిద్దం చేసావ్ 

నీరాజనం ఇవ్వడానికి  నీ హృదయాన్నే కర్పూరకళిక మార్చావ్


 

 నీకు నేనివ్వగల ప్రసాదం ఏమైనా వుందంటే అది

 రెండు పొడి పొడి మాటలను కండ చక్కెర పలుకులగాను 

మొహమాటపు దరహాసాన్ని పువ్వులగానూ ఇచ్చి పోతాను.

నన్ను నువ్వు అమితంగా ప్రేమించడంలో నా తప్పేం వుందసలు? 

అయినా ఆ ఎర్రటి ముఖముల్ వస్త్రాన్ని 

తిరిగి ఇచ్చేయమంటావని భయమేసిందనుకో!

కామెంట్‌లు లేవు: