11, ఫిబ్రవరి 2012, శనివారం

వ్యాపార శైలి

మొన్నొక రోజు మా కాలనీ లోఉన్న జనరల్ స్టోర్స్ కి వెళ్ళా నండీ! 

సాధారణంగా హొల్  సేల్  వ్యాపారుల వద్ద మనం కొనుగోలు చేస్తే.. 6  %  నుండి 12  % వరకు  మనకి కలసి వస్తుందని చెపుతారు.ఆ లేక్కల్లన్నీ నాకు అంత తెలియదు కానీ నాలుగైదు నెలలకు ఒకసారి అలా వన్ టౌన్ కి   వెళ్లి అన్నీ కొనేసుకుని, కష్టపడుతూ తెచ్చేసుకుని..  సర్దేసుకుని.. ఎప్పుడైనా నిండుకున్న వస్తువులని మా కాలనీ స్టోర్ లోనే   మాత్రం  కొంటూ ఉంటాను.

ఎందుకంటే.. నగరాలలో.. వూరికి చివరగా కొత్తగా కాలనీలు ఏర్పడ్డప్పుడు...ఆ కాలనీలో ఒక షాప్ పెట్టి  ..అందరికి కావాల్సిన వస్తువులని అందించడానికి చాలా శ్రమ పడతారు. డబ్బు కొంచెం ఎక్కువ పుచ్చుకున్నా సరే.. ఒక  నిత్యావసర వస్తువు దగ్గరలో లభించడం అనేది ఆనందమే! లేకుంటే ఎంతో దూరం వెళ్లి సమయం  ఎక్కువ పట్టి.. కొన్నిసార్లు వెళ్ళ లేక,వెళ్ళే వాళ్ళు లేక.. అవసరాలని వాయిదా వేసుకుని సర్దుబాట్లు చేసుకుని బ్రతికేయడం అలవాటే! అలాగే.. అలా కొత్తగా ఏర్పడ్డ కాలనీలు అభివృద్ధి చెందే టప్పటికి ఆ కాలనీలో షాప్ పెట్టినవాళ్ళు నాలుగు  రెట్లు ఆర్ధికంగా అభివృద్ధి చెందటం చూస్తుంటాం కూడా.. ఆ రకంగా నాలుగు రెట్లు అభివృద్ధి చెందిన షాప్   మా కాలనీ లో షాప్. నేను కూడా మొదట్లో ఓ.. నాలుగేళ్ళు అలానే అన్నీ వారి దగ్గరే కొన్నాను. కాస్త ఎంకరేజింగ్ గా ఉంటుందని.  రేట్లు తేడా.. సరిచూసుకుంటే..బాగా ఎక్కువ తేడా ఉందని గమనించి తర్వాత అక్కడ అన్నీ కొనడం మానేసాను. 

నేను ఎప్పుడు వెళ్ళినా నాతొ మాట్లాడుతూనే.. ఓ.పది మంది తరవాత నాకు కావాల్సిన వస్తువు అందిస్తారు. నేను త్వరగా వెళ్ళాలమ్మా..అని అంటే..మీరు అయితే ఓపికగా వెయిట్   చేస్తారు  కొందరు  అసలు ఆగరు  అంటారు.  నాకు కావాల్సిన లిస్టు ఎక్కువ ఉండటం తో..వేచి ఉండక తప్పని పరిస్థితి.  నేను ఉన్న కాసేపటిలో ఎక్కువగా.. రీ చార్జ్ లు, పాన్ పరాగ్ లు,గుట్కాలు..కోసం వచ్చే   వాళ్ళని చూస్తే..నిత్య అవసరాలు ఇవే  కదా అనిపిస్తుంది .

ఇంకో తమాషా   విషయం చెప్పనా!?  నాకు ఆశీర్వాద్ ఉప్పే కావాలండీ! ఆశీర్వాద్ గోధుమ పిండే కావాలండీ అంటారు ఒకోకరు.  అవి లేవని చెపితే ఇంకోటి వేరేది తీసుకోవడానికి ఇష్టపడరు. బ్రాండ్ నే మ్ కాదండీ!  ఆ  ఆశీర్వాద్ బ్రాండ్ పై వస్తువులు అన్నీ..ఓ.. మతం అవలంభిస్తున్న భక్తుడు దేవుని ఆశీర్వాదంతో.. ఆశీర్వాద్ బ్రాండ్ నే మ్  తో వ్యాపారం ప్రారంభించి.. లాభాలార్జించి  వారి లాభాలలో.. ౩౦ % ని మత వ్యాప్తికి పేదల సేవకి ఖర్చు పెడుతున్నారట..అని చెపుతుంటే.. నోరు వెళ్ళ బెట్టాల్సి  వచ్చింది.  గోపురం బ్రాండ్ గుర్తుకు వచ్చింది. దేశీయ   ఉప్పు, స్వచ్చమైన గిరిజన తేనే..సంప్రదాయ చేనేత వస్త్రాలు ఇలా గుర్తుకు వస్తూనే ఉంటాయి కదా! ఇలా స్థానిక ప్రాంతీయత,దేశీయ.విదేశీయ వస్తువుల మాయాజాలంలో   చిక్కుకుని కొనుగోలు శక్తి తగ్గుతున్నా సరే  అప్పు భరోసాతో.. జీవిత  కాలాన్ని నెట్టేస్తున్న విని యోగ ..దారులం కదా! 

సరే మళ్ళీ విషయంలోకి వెళ్ళిపోదాం. నేను నా ముందు పది మంది కొనుగోలు దారుల లో ఎనిమిది మందికి  ఆ షాప్ ఆమె ఒకే విషయం చెప్పడం గమనించాను. 

అది అందరికి పది రూపాయల  లోపు చిల్లర లేదని.. చెప్పి  ఒక రూపాయి బ్రూ కాఫీ పేకెట్ లు, లేదా సుర్ఫ్ పేకెట్ లు   ఇస్తుంది అనడం కంటే..అంట గడుతుంది ..అనడం బెటర్.  పిల్లల కైతే చాక్లెట్ లు ఇవ్వడం గమినించాను. 

ఇక్కడ మన అందరికి తెలిసిన విషయం  ఏమంటే.. 

మన దేశంలో..దారిద్ర్య రేఖకి దిగువున బ్రతుకుతున్న  పూటకి  గతిలేని కడు పేదలకి కూడా  ఇన్ స్టంట్   కాఫీ రుచిని పట్టు కుచ్చు లాంటి జుట్టు నిచ్చే ఉదార వాదులు, చిరుగులు ఉన్నా మురికి లేని తెల్లని బట్టలు వేసుకోమని ఇచ్చే సర్ఫ్ పేకెట్ లు..  డిప్ చాయ్ లు , ముష్కిల్ జిందగీలో  భాదని మరపించి నశ్యం పొడులు.. అన్నీ పేదవాడికి అందే ధరలోనే!  ప్రతి వీదిలోను ఏమున్నా లేక పోయినా ఆ సాచే లు  మాత్రం తోరణాలు తోరణాలుగా దర్శనమిస్తూ  ఆ సాచే లు ఇచ్చే అత్యధిక  లాభాల కిక్కు ఎక్కిన వస్తు తయారీదారులు.. మధ్య తరగతి వినియోగదారులని కూడా వాటిని కొనడానికి అలవాటు చేసేసారు అనాలో.. కొనుగోలు శక్తి తగ్గి..అవసరాలని కుదిన్చుకున్నారో అనాలో తెలియని స్థితి. 

  ఇంతకీ.. ఇక్కడ ఆ షాప్ ఆవిడ ఏం చేస్తున్నారు అంటే..  ఆమె వద్దకు వచ్చిన డబ్బుని మరలా చిల్లర లేదు అనే నెపంతో.. వెనక్కి వెళ్ళనీయకుండా.. అవసరం ఉన్నా లేకపోయినా సరే..తప్పనిసరిగా ఆ డబ్బుకి సరిపడ సాచేలని ఇస్తున్నారు. ఆ మిగులు చిల్లర లోను వ్యాపారం చేసి.. ఎక్కువ లాబాలని ఆర్జించడం ని ద్యేయం చేసుకున్నారు అని నాకు అర్ధమైపోయింది. అది కూడా వ్యాపార దక్షత అనాలేమో! 

  సాచేల వల్ల ఆరోగ్యానికి,పర్యావరణానికి యెంత నష్టమో కదా! అది తెలిసినా కొనడం తప్పదు.తప్పించుకోలేని ఉచ్చు కదా.అనిపించింది. 

వినియోగదారుడి కొనుగోలు శక్తిని అంచనా వేసి.. వాళ్లకి అందుబాటు ధరలో కి వస్తువుని అందించి (అవి నాసి రకం )  వినియోగదారులే  మా దేవుళ్ళు అని కీర్తించే.. వినిమయ వ్యవస్థలో.. కోట్లాది రూపాయాల లాభాలు వల్ల ఖాతాల్లోకి.. వెళుతున్నా సరే.. ఇంకా వినియోగదారుడిని ఎలా మోసం చేయాలో ఎప్పుడు ఆలోచించే.. తయారీదారులు, వ్యాపార దారుల వ్యాపార శైలి ని తిట్టుకుంటూ..  మెచ్చుకుని తీరాల్సిందే! 

ఇంత చెప్పానా!! ఆఖరికి ఆ షాప్ ఆమె నాకు చిల్లర లేదని  ఆరు రూపాయలకి సరి పడా.. ఒక 5 రూపాయల బ్రూ..సాచే ,ఒక అగ్గిపెట్టె..ఇస్తే.. నోరు మూసుకుని వద్దనుకుండా తీసుకుని వచ్చేసాను .అదీ సంగతి. . 

3 వ్యాఖ్యలు:

తెలుగు పాటలు చెప్పారు...

bagundi andi chivaraku meetokuda koninchesharaa:)

రాజి చెప్పారు...

నిజమేనండీ ఈ మధ్య అపోలో మెడికల్ షాప్ లో కూడా చిల్లర లేదని హాల్స్ బిళ్ళలు ఇచ్చాడు..
అన్ని చోట్లకి విస్తరించిన "వ్యాపార శైలి" అన్నమాట ఇది.

జ్యోతిర్మయి చెప్పారు...

చిల్లర మహాలక్ష్మి..