స్నేహం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
స్నేహం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, ఆగస్టు 2019, మంగళవారం

మాట ప్రియం ..




మాటే ... దేనికైనా మూలం. తీయని పలుకుల మధ్య నిండుకుండ విషం కూడా కప్పెట్టేయవచ్చు. అసలు మనుషుల మధ్య మాట లేకపోతేనే కష్టం . గల గల మాట్లాడే వారు హఠాత్తుగా మౌనం వహిస్తే బెంగ . ఆ మాటకి మౌనం తాళం ఎందుకయిందో తెలిస్తే ..మనసుకి బాధ. మనుషుల వైఖరిపట్ల విముఖత. మౌనాన్నే ఆభరణంగా ధరిస్తే బావుంటుంది కదా ..అని ఆలోచన . వ్రాత పాతదే ..

ఆ మాట గురించి వొక కథ వ్రాస్తే ... ప్రచురణ కోసం యెదురుచూసి యెదురుచూసి వొక ఉదాసీనత అలముకున్నాక యేదో వొకనాడు మధ్యాహ్నం పూట గాఢమైన నిద్రలో వుండగా ఫోన్ కాల్ ద్వారా లేపి మరీ చెపితే ఆ భావాతీతమైన క్షణాన్ని అక్షరాలలో వర్ణించడం అంత సులువుకాదు. సంతోషమో విచారమో ..యేదో తెలియని స్థితి .. సరే ..మొన్న  ఆదివారం ప్రచురింపబడింది  .. "మాటల దారం " కాస్త చదవడానికి ప్రయత్నించండి. వేలిముద్రలు వ్యాఖ్యలు అభిప్రాయాలు చెప్పకపోయినా పర్లేదు .. 


ఈ కథ వెనుక కథ ..

నేను గత సంవత్సరం USA వెళ్ళినప్పుడు మా ఇంట్లో వాళ్ళు మా బంధువులు ఫ్రెండ్స్ కాకుండా.. నేను ఇతరులతో మాట్లాడిన మాటలు.. మా అబ్బాయి ఇంటిప్రక్కనున్న పొరుగు మనిషి .. హాయ్ అని పలకరిస్తే మళ్ళీ తిరిగి విష్ చేసాను. ఒకరోజు బయటకు వెళుతుంటే ఒక బాలుడు కనబడ్డాడు. అయిదారేళ్ళు ఉండవచ్చు. ఆ పిల్లాడిని చూసి ..ఈ పిల్లాడు మన తెలుగు వాళ్ళబ్బాయి లాగా వున్నాడు అని మా కోడలితో అన్నాను. అ పిల్లవాడు ముందుకు నడుస్తున్నవాడల్లా ఆగి వెనక్కి తిరిగి చూసి "వ్వాట్ " అన్నాడు. నేను "నథింగ్" అని చెప్పి నవ్వుకున్నాను.మా అబ్బాయి ఇంటి చుట్టుప్రక్కల చాలామంది మన ఆంధ్రులు ఉండేవారు. కానీ ఎవరూ ఎవరితో మాట్లాడరు. చుట్టుప్రక్కల ఎవరెవరు వున్నారా, యేమిటీ అని అన్నీ గమనిస్తారు కానీ తెలియనట్లు నటిస్తారు. అమెరికా వాళ్ళలా ప్రవర్తిస్తారు. అవసరం లేకపోతే మాట్లాడరు. ఆరు నెలల కాలంలో నేను ఇతరులతో మాట్లాడిన మాటలు ఆ రెండే. షాపింగ్ కి వెళితే అక్కడ స్టాఫ్ పలకరించేవాళ్ళు హాయ్ అంటే ఒక మాట అది తక్కువ హౌ ఆర్ యూ అంటే ఇంకో మాట ఎక్కువైన మాట. ఇంతే ! మనుషులతో మాట్లాడకుండా మూగవాళ్ళలా చిన్న చిరునవ్వు ముఖానికి అంటించుకుని చూస్తూ ఏళ్ళకు యేళ్ళు ఎలా బ్రతికేయగల్గుతారో ఏమిటో ! మనమధ్య కూడా అలాంటి వాతావరణమే ప్రబలిపోతుంది. ఎవరూ మనుషులతో మాట్లాడటం లేదు. నేను ఎక్కువ మాట్లాడేది పలకరించేది నా చుట్టూ వున్న చిన్న పిల్లలను . వాళ్లకి లెక్కలేసుకోవడం రాదు కాబట్టి హాయిగా మాట్లాడతారు. ఇక ఇవాల్టి విషయానికి వస్తే .. నా కథ యిలా నా ఆలోచనల్లోనుండే కాదు వాస్తవంలో నుండి పుట్టిన కథ. అక్షరమంత అబద్దమైనా లేదు. మాటలు కావాలి. ఆ మాటలను కలిపే మనుషులే దారంగా కావాలి. ఆ మాటల దారం మనుషులను పూలలా కలిపి ఉంచాలి అని నా ఆకాంక్ష.  ఈ కథకు నాకు స్ఫూర్తినిచ్చిన  .. ఈ "రమ" అనుభవాలు కూడా యీ కథకు మూలం.
పసుపుపూల వనం ముందు పచ్చని మనసు "రమ" ఈవాల్టికే కాదు నా ..స్నేహజీవితంలో వొకానొక నాయిక. రమ నేనూ ఇద్దరం కలిసిన photos వుండాలి..వెతికి చూస్తాను. ప్రస్తుతానికి .. ఇలా ..






27, జనవరి 2019, ఆదివారం

మొక్కలండీ మొక్కలు

మొక్కలండీ మొక్కలు

స్నేహ మందారంతో 
నది వొడ్డున వేచి చూస్తున్నానా
నువ్వు నలుగురిని పోగేసుకుని 
నలుపు గురమెక్కి దండయాత్రకు దౌడు తీసావు.

నీ వొరలో ద్వేషమనే కరవాలం వున్నంతవరకూ
దాని పిడిపై నీ పిడికిలి పదేపదే బిగుసుకుంటుంది. 
ప్రేమ విత్తనాలు వెదజల్లని భూమి 
ఎడారి వనాలై విస్తరిల్లుతుంటుంది.

ఇసుక తుఫాను చుట్టేయక ముందే
ఒయాసిస్ లకై వెతుక్కోక ముందే
పాతుకుపోతున్న పగను పక్కన బెట్టి 
కాసిని ఖర్జూరపు,అంజూరపు మొక్కలైనా 
నాటుకుందాం రా...

కొన్నాళ్ళకి మన పిల్లల పిల్లలకైనా
తీయని ఫలాలు దక్కుతాయి.
నమ్మకంగా చెపుతున్నా..
నగుమాటు మాటలనుకోకు మిత్రమా!

Pic Courtesy  Pinterest  

24, జనవరి 2019, గురువారం

పువ్వులాంటి మాట

పువ్వులాంటి మాట 


నువ్వు నేను నాణానికి చెరోవైపు 

మనద్దరిది పూర్తి సత్యంకాదు పూర్తి అబద్ధం కాదు

నేను ప్రేమ హస్తాన్ని అందిస్తాను 

గతంలో పొరబాట్లను తలచుకుని సిగ్గిల్లుతూనే 

నువ్వు నన్ను క్రోధంగా చూస్తూ  మరింత ద్వేషిస్తూ  

దూరం జరుగుతావు వునికి బలపరుచుకుంటూ


రాతి గదుల మధ్యనో సమాధులలోనే దేవుడు 

లేడనే సంగతి తెలిసి కూడా 

కారణాలు వెతుక్కుని మరీ ద్వేషించుకునే మనం 

ఇంకోచోట కుక్కలా విశ్వాసం చూపిస్తూ తోకలూపుతుంటాం 

కాల నాళికలో జీవిత క్రమమంతా  ఇమిడి పోతుండగా 

కలం పోటులో విషం చిమ్ముకోవడం యెందుకు.

కడదాకా ద్వేషాన్ని మోయడమెందుకు . 


చేతికి చిక్కని సంశయాల మనసును

చుట్టుకునే పొగమంచు తెరలను 

వామ హస్తంతో  కొద్దిగా పక్కకు జరిపి 

పువ్వుల్లాంటి  ఒక చిన్న మాట కలుపుకుందాం 

మట్టి పరిమళాన్ని మట్టిలో కలిసిపోయేదాకా 

ఆస్వాదిద్దాం. రా ..మిత్రమా .. 

చేయి చేయి కలిపి అసలు శత్రువును అంతం చేద్దాం

మట్టి మూలం ఒకటే అని రుజువు చేద్దాం.




29, ఆగస్టు 2012, బుధవారం

నా చెలిమి కలిమి

ఓ. పదమూడు రోజుల క్రితం .. ఓ.. బ్లాగర్ నెచ్చెలి .. మా ఇంటికి వస్తానని చెప్పారు.
ఆమెని కలవబోతున్నానని సంతోషం ఒక ప్రక్క, ఆమె వస్తే సరిగా అతిధి మర్యాదలు చేయగలనో లేదో..అన్న బెంగ కొంత.

 నూటమూడు టెంపరేచర్ పెట్టుకుని మరీ ఎదురుచూసిన కొలది నిరాశే మిగిలింది.
ప్చ్.. ఏదో ఇబ్బంది ఏర్పడి ఉంటుంది.. అందుకే వాళ్ళు రాలేదు  అనుకున్నాను.  సాయంత్రం హాస్పిటల్కి వెళ్లాను. ఇక అక్కడ నుండి మొదలయింది నా అనారోగ్య పర్వం.

విపరీతమైన జ్వరం,తలనొప్పి..ఆ జ్వరాన్ని కంట్రోల్ చేయడానికి ఇంజక్షన్స్ ఇచ్చారు. ప్రిస్కిప్షన్ ప్రకారం మందులు వేసుకుంటుంటే చాలు..ఒకటే వాంతులు. నాకు ఊహ తెలిసాక ఎప్పుడూ..ఇలాటి జ్వర తీవ్రత ఎదుర్కోలేదు.గ్రుక్కెడు మంచి నీళ్ళు త్రాగినా..సరే ఇమడ కుండా  ఒకటే వాంతులు.

అలా రెండు రోజులు బాధపడ్డాను. రెండవరోజు మధ్యాహ్నం కి మగతగా పడిపోయి ఉన్నాను.  అప్పుడు నా ఫ్రెండ్ వైష్ణవి .. వచ్చింది. ఇంత జ్వరం, అనారోగ్యం పెట్టుకుని నాకు ఫోన్ కూడా చేయకుండా ఉన్నావని కోప్పడింది. మాకు  ఆప్తుడైన ఒక మిత్రుడు తనకి ఫోన్ చేసి చెప్పగానే ఉన్న ఫళాన బయలుదేరి వచ్చేసింది.

ఎందుకు..వైషూ ..!? నీకు ఎగ్జామ్స్ కదా!చదువుకోకుండా ఇలా వచ్చావు అన్నాను. తను డి ఎస్ సి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంది. నీకన్నా నాకు ఎగ్జామ్స్ ఎక్కువ కాదులే! అంటూ వారం రోజులపాటు నన్ను అంటి పెట్టుకుని ఉంది. రెండు పూటలా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడం, డాక్టర్ చెప్పిన ప్రకారం మందులు  ఇవ్వడం దగ్గర నుండి.. నాకు సపర్యలు చేసింది. నాకు సెలైన్స్ ఎక్కిస్తున్నప్పుడు రాత్రింబవళ్ళు నన్ను పసిపాపలా కనిపెట్టుకుని.. ఒక అమ్మలా సేవ చేసింది.

వైరల్ ఫీవర్ అనుకున్నది కాస్త డెంగ్యూ అని నిర్ధారణ అయ్యాక,జాండిస్ లక్షణాలు బయటపడిన తర్వాత తను చాలా కంగారు పడింది. ఎమర్జన్సీ లో జాయిన్  చేసినప్పుడు నా వాళ్ళు అందరికన్నా ఎక్కువగా దిగులు పడింది. ప్లేట్లెట్స్ కౌంట్ బాగా పడిపోతే నాకు ఏమైనా అవుతుందేమోనని ఏడ్చేసింది.అనుక్షణం కంటికి రెప్పలా కాచింది. నేను ఆహారం సహించక తినడానికి మొండికేస్తే కోప్పడి బిడ్డకి తినిపించినట్లు తినిపించింది.

నేను హాస్పిటల్ లో ఇన్ పేషంట్ ఉండటానికి  ఇష్టపడక పేచీ పెడితే.. డాక్టర్ తో మాట్లాడి..రెండు పూటలా.. ట్రీట్మెంట్ కి తీసుకుని వస్తానని పర్మిషన్ ఇప్పించుకుని.. ప్రతి రోజు రెండు పూటలా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది. అన్నయ్య,చెల్లెలు,నాన్న గారు ఇంతమంది ఉన్నా కూడా తనే నా ప్రక్కన ఉంది..
వైరల్  ఫీవర్ ఉన్నవాళ్ళకి నిద్రపట్టక పోవడం అనేది సర్వసాధారణమైన విషయం.
నేను విపరీతమైన తలనొప్పితో  నిద్ర రాక కొట్టుకుంటుంటే నా తల నిమురుతూ.. అమ్మలా చిచ్చుకొట్టి నిద్ర పుచ్చేది.
అలా సేవలు చేసింది. తనకి చాలా ముఖ్యమైన పరీక్షలకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా.. ఎగ్జాం రోజున వెళ్ళింది.
తను బాగా పరీక్ష వ్రాయలేదని కూడా నాకు తెలుసు.

ఇదంతా నేను ఇవాళ వ్రాసుకోకపోతే నాకు మనఃశాంతిగా ఉండలేననిపించింది.

స్నేహితులు అందరికి ఉంటారు. అందరూ వారి వారి వ్యక్తిగతమైన పనులు మానుకుని శ్రద్ద తీసుకుని హెల్ప్ చేయరు. ఇక్కడ హెల్ప్ అనడం కన్నా సేవ అనడం సబబు కూడా.

నిజానికి నా ఫ్రెండ్ వైషూ ..స్థానంలో నేనున్నా కూడా.. నేను కూడా అలా చేయలేను.అలా సేవ చేయగల శ్రద్ద,ఓపిక నా దగ్గర శూన్యం  కూడా.

ఇతరులకి సేవ చేయడంలో అంకితభావం ఏ కొందరికో ఉంటుంది.

స్నేహం విషయంలో నేనెప్పుడూ గర్వంగా ఫీల్  అవుతూ ఉంటాను. అది మరొకసారి ఋజువైంది.

సాగర సంగమం చిత్రంలో కమలహాసన్ మిత్రుడు శరత్ బాబు. శరత్ బాబు కమలహాసన్ కి మిత్రుడు. అతను మిత్రునికి సాయం చేయడం అనేది సామాన్యమైన విషయం. కానీ శరత్ బాబు భార్య కూడా భర్త స్నేహితుడికి సేవలు చేస్తుంది..సాధారణ మధ్య తరగతి కుటుంబాలలో స్నేహానికి చక్కని నిర్వచనం ఇచ్చిన దృశ్యాలు నాకు అప్పుడప్పుడూ గుర్తుకు వచ్చేవి. అలాగే మా ప్రకాష్ కూడా..నన్ను అర్ధరాత్రి అపరాత్రి అని చూడ కుండా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడం నాకు కళ్ళు చెమరింపజేసాయి.

ఇన్ని రోజులు ఇంత  అనారోగ్యంగా ఉన్నా కూడా దూరంగా ఉన్న  మా అత్తమ్మకి కాని, మా బాబుకి కానీ తెలియనివ్వకుండా..జాగ్రత్తగా చూసుకున్నారు.

 ప్లేట్ లెట్స్ 40,000 పడిపోయి ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్ళిన నాకు మా చెల్లెలు చూపిన  శ్రద్ద , నా ఫ్రెండ్ వైష్ణవి చేసిన సేవ వల్ల నేను తొందరగా కోలుకోగల్గాను.

నేనిప్పుడు ఒకటి అనుకుంటాను. నేను నా స్నేహితులకి ఏమి ఇచ్చాను అని కాదు..వాళ్ళ నుండి నేను ఏమి పొందానన్నదే గుర్తుంచుకోవాలనుకుంటున్నాను.

కొన్నాళ్ళ క్రితం స్నేహం-స్వార్ధం అని పోస్ట్ వ్రాసినప్పుడు నా మనసులో స్నేహం పట్ల ఎలాటి భావం ఉందొ.. ఇప్పటికి అదే భావం ఉంది. అంతకన్నా  ఇప్పుడు ఎక్కువ గౌరవభావం పెరిగింది.

ఇదండీ ..నా చెలిమి కలిమి.





13, ఆగస్టు 2012, సోమవారం

స్నేహం - స్వార్దం

స్నేహంలో స్వార్దం ఉంటుందా!

చాలా మంది స్నేహంలో స్వార్దం ఉండదు నిస్వార్దంగా ఆలోచిందే నిజమైన స్నేహం అంటారు.
అసలు స్వార్దం అంటే ఎలాటి స్వార్దం?

నాకు ఒక స్నేహితురాలు ఉంది. తను నాకు ఒక ఉత్తరం ద్వారా  పరిచయం అయినప్పుడు సంతోషం కల్గింది.

ముందుగా ఆమె నన్ను చూడటానికి వచ్చారు. అప్పుడు నేను కొంచెం ఆశ్చర్య పోయాను.నేను ఆ చొరవ చేయలేకపోయానే అని బాధ పడ్డాను కూడా. !

ఆమె గురించిన వివరాలు చెప్పారు. ఒక రోజు మా ఇంట్లో ఆతిధ్యం స్వీకరించారు.  మరుసటి రోజు వెళుతూ నన్నొక ప్రశ్న అడిగారు

 "మీరు మా సంస్థలో పని చేయడానికి రాగలరా?" అని.

ఆమె హిందూ ధర్మ ప్రచార సభలో స్వచ్చందంగా  అంకిత భావంతో పని చేస్తారు. నాకు అలాంటి సంస్థలలో పని చేయడానికి ఆసక్తి లేదు. ఆమె లా నేను అంత అంకితభావంతో పని చేయలేను అని కూడా  నాకు తెలుసు. అందుకే నేను ఆ పని నా నా వల్ల కాదని నిర్మొహమాటంగానే స్పష్టంగానే  చెప్పాను.అందుకు ఆమె కొంచెం కినుక వహించారు.

నా నుండి వీడ్కోలు తీసుకుని .. వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకి నాకొక ఉత్తరం అందింది.

ఆ ఉత్తరంలో ఇలా ఉంది. మీరు దేశ భక్తికి,దేశ గౌరవంకి సంబంధించిన సంస్థలో పని చేయడానికి వీలు కాదని చెప్పారు. మీ స్నేహం నాకు నచ్చలేదు అని..చెబుతూ..

ఇంకా నా పని వాళ్ళ పట్ల నేను చూపించే ఔదార్యం,చొరవ తనకి నచ్చలేదు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి.మీ పట్ల యజమాని  అన్న విలువ వాళ్ళకి లేదు   అని వ్రాసారు.
ఆమె అలా ఉత్తరం వ్రాసిన విధానాన్ని చూసి నేను చాలా నోచ్చుకున్నాను.

నేను మళ్ళీ ఆమెకి రిప్లై వ్రాయలేదు. నా దగ్గర పనిచేసే ఆడ పిల్లలు .. ఆ ఉత్తరం చూసి బాధపడ్డారు. ఇదేంటి ఆంటీ.. మిమ్మల్ని ఆమె ఇలా అనేసారు అని నన్ను అడిగేవారు.  (ఆమె పోస్ట్ కార్డ్ పై  ఆ లేఖ వ్రాసారు ). మా దగ్గర పని చేసేవాళ్ళలో అమ్మాయిలు ఇంటి పిల్లలు లాగానే ఉండేవారు. నేను వంట చేసుకుంటూనో..వేరే డిజైనింగ్ పనిలోనే ఉన్నప్పుడు .. ఫోన్ లిఫ్ట్ చేయడం చేస్తుంటారు కాబట్టి నాకు మరీ అంత పర్సనల్ అంటూ ఉండేవి కాదు కాబట్టి..ఆ చొరవ వారికి ఉండేది.

నిజానికి ఆమె మా ఇంటికి వచ్చినప్పుడు నా దగ్గర పనిచేసే ఒక వ్యక్తీ మానసిక పరిస్థితి బాగోలేదు. అందువల్ల నేను అతని పట్ల సానుభూతి చూపుతూ.. చూసి చూడనట్లు పోయేదాన్ని. ఆమెకి ఆ సంగతి తెలియక అలా వ్రాసారు

కొన్నాళ్ళకి మరలా ఆమె మా ఇంటికి వచ్చారు.. నేను మాములుగానే ఆహ్వానించాను. ఆత్మీయంగానే మాట్లాడాను. ఆమె తను వ్రాసిన ఉత్తరం గురించి ప్రస్తావించి ..అలా వ్రాసినందుకు క్షమించమని అడిగారు. నేను ఆ సంగతి ఎప్పుడో మరచిపోయాని అని చెప్పాను.

తర్వాత తర్వాత ఆమె నాకు మంచి స్నేహితురాలయింది. తను బాగా అలసిపోయినప్పుడు భాద్యతల నుండి తప్పించుకుని ఓ..రెండు రోజులు మా ఇంట గడపడానికి వస్తూ ఉంటుంది. ఇష్టమైన పాటలు వినిపిస్తూ,పుస్తకాలు చదువుతూ ..రకరకాల చర్చలు లేవనెత్తుతూ.. సంతోషంగా ఉంటుంది.

ఆమె వచ్చిన రోజుల్లో ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ కాల్ చేసినా, ఎవరైనా వచ్చినా వారితో కూడా స్నేహంగా ఉండటం ఆమెకి నచ్చదు.  ఒక ఫ్రెండ్ తన వైవాహిక జీవితంలో తలెత్తిన  ఇబ్బందులవల్ల కొద్ది కాలం మా ఇంట్లో ఉండటానికి నేను అవకాశం కల్పించాను. తను చదువుకోవడానికి,కొద్దిగా ఆర్ధిక స్థిరత్వం సంపాదించుకోవడానికి సాయం చేస్తే బావుంటుందని నేను అనుకున్నాను.  ఆమె అలాగే కొన్ని నెలలు మా ఇంట్లో ఉంది.తర్వాత మాకు దగ్గరలోనే ఓ..ఇల్లు చూసుకుని వెళ్ళిపోయింది కూడా. ఆమె వస్తే చాలు ,లేదా ఇంకెవరైనా వస్తే   వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా..అన్నట్లు చూస్తుంది. లేదా వెంటనే బయలు దేరి వెళ్ళిపోతుంది.  రెండు మూడుసార్లు  నేను అది   గమనించి ఎందుకు లా చేస్తున్నావు అని అడిగాను. నీ అంత ఓపిక నాకు లేదు.వాళ్ళ సోది నేను వినలేను  నాకు కొంచెం మంది స్నేహితులు ఉంటె చాలు. మీ విస్తారమైన స్నేహ ప్రపంచంలో నేను ఇమడలేను.. ఇక్కడ నాకు విలువలేదు.. అందుకే దూరంగా ఉంటాను అని చెప్పింది.

ఆమె స్నేహంలో నాకు స్వార్దం కనిపించింది.ఆమె వెళ్ళిన కొన్నాళ్ళకి ఆమెకి ఒక ఉత్తరం వ్రాసాను.

ప్రియమైన స్నేహితురాలికి.. ఓ..ఆత్మీయ లేఖ.

పరిమితమైన స్నేహితులు ఉండటం ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు.  చిన్ననాటి స్నేహం, జీవన విధానానికి తగ్గట్టు అవసరమైన స్నేహాలు, అభిరుచిలు కలసిన స్నేహాలు, ఎన్నటికి విడిపోని  గాఢమైన స్నేహాలు.. వీటి మధ్య బ్రతుకుతున్న చాలా మందికి కొంతమందికే పరిమితమైన స్నేహం ఉండాలనుకోవడం సాధ్యం కాకపోవచ్చు.   నేను అందుకు అతీతం ఏమి కాదు.

స్నేహం అంటే కాస్తంత సాయం చేయడం, ఎదుటిమనిషి ఉన్న స్థితిని అర్ధం చేసుకోవడం, మనం  వారికి అండగా ఉన్నామని భరోసా  ఇవ్వడం..

ఇందులో మనకి కొన్ని వ్యక్తీ గత ఇబ్బందులు ఉండవచ్చు కాని వాటిని ప్రక్కనపెట్టి మన స్వంత వాళ్ళకి, రక్త సంబందీకులకి అయితే మనం చేయమా? అని మనకి మనం ప్రశ్నించుకోగల్గితే ..  ఎలాటి ఇబ్బంది ఉండదు కదా  నీకు నావల్ల కల్గిన ఇబ్బందికి క్షమించు....

ఆఖరిగా ఒక మాట.. నిత్యం మన చుట్టూ ఉన్న వాళ్ళతోనే స్నేహంగా ఉండటం సాధ్యం కానప్పుడు వారికి సాయం చేయలేను అని భావిన్చుకున్నప్పుడు .. పై పై మాటలతో వారికి  స్నేహం రుచి - రంగు చూపిస్తూ కప్పదాటు స్నేహం నేను చేయలేను,నటించలేను   అంటూ  ఉత్తరం ముగించాను.

లింగ బేదం  లేని వారి పట్ల చూపే స్నేహంలోనే ఎన్నో అభ్యంతరాలు ఉంటె.. ఇక స్త్రీ-పురుష స్నేహాలు ఎలా ఉంటాయి అని నాకు గొప్ప సందేహం ముంచుకొస్తుంది. అది ఏమిటంటే ...  అసలు స్నేహంలో స్వార్ధం ఉండాలా-వద్దా?

 నా ఈ అనుభవం తర్వాత  మనఃస్పూర్తిగా  స్నేహహస్తాన్ని  ఇవ్వడం సాధ్యం కానివాళ్ళు ఇక సంస్థలలో ఎలా అంకిత భావంతో పని చేయగలరు..అని అనుకుంటాను. ఇంతకీ ఆ మిత్రురాలు నాతొ స్నేహం కట్ చేసుకుందా ..!? అంటే అదేమీ  లేదు..

ఆమె వచ్చినప్పుడు పవర్ కట్ లేకుంటే  ఇంట్లో '"చిట్టేమ్మ" సీరియల్ చూస్తూ ఉంటారు. భారతీయ సంస్కృతి సంప్రదాయం నాశనం చేసిందని విమర్శిస్తూ  రాధిక గురించి ఆవిడ వ్యాఖ్యనిన్చుతారు. నేను ఆమెతో తగవు పడతాను.. అదీ సంగతి.

ఫ్రెండ్ షిప్ అంటే.. నా మాటల్లో..

 అండర్ స్టాండింగ్, కేరింగ్,షేరింగ్,సపోర్టింగ్... అంతే!!


మైత్రి దినోత్సవం నాడు వ్రాసుకోవాల్సిన పోస్ట్..ఈ రోజు ఇలా.. మనసైంది. :)

24, ఏప్రిల్ 2012, మంగళవారం

అపురూప స్నేహం విలువ

మనలో చాలా మంది ఒక పని ని సహజంగా చేయడానికి సాధ్య పడని అప్పుడు, కొన్ని నియమాలకు విరుద్దంగా వెళ్ళాల్సి వచ్చినప్పుడు.. ఆ పని ని సమర్ధవంతంగా పూర్తి చేసుకోవడానికి దొడ్డి దారులు వెతుకాల్సి వస్తుంది.
మన పని పూర్తి కావాలంటే..డబ్బు,అధికారం,పలుకుబడి..ఇలా ఎవేవైనా ఉపయోగపడతాయని ఆలోచించడం ..తర్వాత ఆ ప్రయత్నాలు చేయడం మామూలే!

ఎందుకో.. చాలా విషయాలు మూడో శక్తి లేకుండా పని పూర్తీ కాని దరిద్రపు వ్యవస్థ. నేను నిజాయితీగా ఉంటాను. కష్టపడి పనిచేస్తాను. నా దగ్గర నైపుణ్యం ఉంది.అని గొంతెత్తి అరచినా.. అవెందుకు పనికి రావు.. జస్ట్ ఒక పై రవీ పోన్ కాల్ చాలు క్షణంలో పని పూర్తి అయి పోతుంది. అలా ఒక పని జరుగుతుందని ఆశించి ..వెళ్ళిన నాకు .. ఒక జీవిత కాలానికి చూడని ఒక మహోన్నత వ్యక్తిత్వాన్ని చూసిన అనుభవం ఒకటి ఈ పోస్ట్ లో చెప్పదలచాను.

ఒక సంవత్సరం క్రితం..అనుకుంటాను.. మా చెల్లి వాళ్ళ అమ్మాయి "అప్పు" చదువుకు సంబందించి .. ఒక కార్పోరేట్ కాలేజ్ లో.. సి.ఓ. బ్యాచ్ లో.. మొదటి సెక్షన్ లో ప్రవేశం అప్పుడు..తనకి ఫీజ్ రాయితీ కొంత లభించింది. ఎందుకంటె తను 8 వ తరగతి నుండి IIT JEE Concept Oriented గా తీర్చిదిద్దబడింది. పైగా 10 తరగతిలో మంచి మార్కులతో..పాస్ అయింది. సహజం గా అలాంటి పిల్లలపై కార్పోరేట్ కాలేజ్ ల వల వేసే ఉంటుంది. ఎందుకంటె.. rank ల పంట పండిస్తారని.

సంవత్సరానికి లక్ష పాతికవేలు ఫీజు చెల్లించాల్సిన ఉన్న CO batch లో మా "అప్పు" ని 60 % ఫీజు రాయితీ తో అడ్మిషన్ ఇచ్చారు. సడన్గా మా చెల్లెలి కుటుంబానికి ఆర్ధిక ఇబ్బంది కలగడం వల్ల..మిగతా ఫీజు ..ఇతరత్రా ఖర్చులు..కలిపి ఇంకొక లక్షరూపాయలు భారం అయింది. అలాటప్పుడు..మిగిలిన ఫీజ్ కి కూడా రాయితీ ఇచ్చే అవకాశం లభించే మార్గాల కొరకు అన్వేషణ మొదలబెట్టింది.మా చెల్లెలు.

అదే సమయంలో.. ఒక అవకాశం కలసి వచ్చింది. శ్రీ చైత్యన ఫౌండర్ & చైర్మన్ BS రావు (సత్యనారాయణ గారు).. మా house owner లక్ష్మి గారి అన్నయ్య ప్రాణ స్నేహితులు . ఆ విషయం నాకు తెలుసు. లక్ష్మి గారి అన్నయ్య సాంబ శివరావు గారు..బి ఎస్ రావు గారు బాల్య స్నేహితులు. అలాగే గుంటూరు లో వైద్య కళాశాలలోను సహాధ్యాయులు.
మిత్రులు ఇరువురు దారులు వేరు వేరు అయినా ఒకే ప్రాణం. యెంత అపురూప స్నేహం అంటే.. యెంత బిజీ షెడ్యుల్ లో ఉన్నా సరే.. శ్రీ చైతన్య విద్యా సంస్థల నిర్వహణలో తలమునకలై ఉన్నా సరే తన స్నేహితుడి తలిదండ్రులని కూడా నెలకి ఒకసారి అయినా వచ్చి స్వయంగా చూసి ఒక గంట కూర్చుని..మంచి చెడు కనుక్కుని వారికి అవసరమైనవి అన్నీ ఓ..కొడుకులా సమకూర్చి వెళ్లాలని అనుకుంటారు. అక్కడెక్కడో. అమెరికా దేశంలో ఉన్న .తన మిత్రుడు చేయలేని భాద్యతలు కొన్ని అయినా తీర్చగల్గానన్నఆనందం బిఎస్ రావు గారిది. ప్రతి విషయానికి మా సత్యనారాయణ అన్నయ్య అని ..చెపుతుంటారు కాబట్టి.. మాకు వారిరువురి మిత్రుత్వం గురించి తెలుసు.
"అక్కా.. సాంబశివరావు ..గారి ద్వారా పూర్తీ ఫీజు రాయితీ కోసం ట్రై చేద్దామా!? అని అడిగింది మా చెల్లెలు. నాకు ఎందుకో సాంబశివరావు గారిని ఆ విషయం గురించి రికమండ్ చేయమని అడగడం ఇష్టం లేక పోయింది.

ఎందుకంటే..సాంబశివరావు అన్నయ్య (నేను వారిని అన్నయ్య అని పిలుస్తుంటాను.నిజానికి నేను రక్త సంబందం కాని వారిని అన్నయ్య అని పిలవడం పెద్దగా ఇష్టం ఉండదు కూడా! ) అలాటి విషయాలకి వ్యతిరేకం. ఆయన పెళ్లి కూడా వరకట్నం అనే ప్రసక్తి లేకుండా జరిగిపోయింది..అట. కష్టపడి చదవడం,నిజాయితీగా ఉండటం.అందరి కష్టసుఖాల్ని గమనించడం..పేదవారికి.విద్యార్ధులకి వేలకొలది డాలర్లు సాయం చేయడం.. చేస్తుంటారు సాంబశివరావు అన్నయ్య.

ఆయన గురించి తెలిసి ఉన్న దానిని అవడం వల్ల నాకు మా "అప్పు " ఫీజు రాయితీ గురించి అన్నయ్యతో రికమండ్ చేయించడం గురించి నేను అడగాలని అనుకోలేదు.అదే విషయం ని మా చెల్లికి నేను చెప్పాను. మనమేమి హెల్ప్ చేయమని అడగడం లేదు కదా! పూర్తి ఫీజు రాయితీ లభించే అర్హత మన అమ్మాయికి ఉంది. సాంబశివరావు అన్నయ్య ఒక మాట చెబితే.. రెండు సంవత్సరాలకి కలిపి దాదాపు నాలుగు లక్షల రూపాయలు సేవ్ అవుతాం. ఒక్క మాటే కదా.. నీకిష్టం లేకపోతే నువ్వు అడగవద్దు..నేను అడుగుతాను అని నిష్టూరంగా అంది మా చెల్లి. ఇక తప్పదు అనుకుని.. సాంబశివరావు అన్నయ్య ని కలవడానికి మా చెల్లిని వెంటబెట్టుకుని తీసుకుని వెళ్లాను.

మా చెల్లెలిని అన్నయ్యకి పరిచయం చేసాను. అన్నయ్య ..పిల్లలు యెంత మంది? ఏం చదువు కుంటూ న్నారమ్మా! ..అని అడిగారు. ఆయన ఆత్మీయమైన ప్రశ్నకి మా చేల్లెల్లికి దుఖం ముంచుకు వచ్చింది. మా "అప్పు " IIT లో సీట్ సంపాదించు కోవాలి అన్న లక్ష్యం తోనే సంవత్సరానికి లక్ష రూపాయల పీజులు పోసి..కాన్సెప్ట్ స్కూల్లో చదివిస్తూ.. అప్పుడు ఆర్ధిక పరిస్థితి చతికిల పడటం ..వల్ల తను కాస్త బాగా బాధలోని,ఒత్తిడిలోనూ ఉంది. కదిలిస్తే.. కన్నీళ్లు కార్చేస్తూ బేలగా మారిపోయింది. అప్పుడు నేనే జోక్యం చేసుకుని మా '' అప్పు" చదువు,పీజు రాయితీ విషయం గురించి చెప్పి.. "సత్యనారాయణ గార్కి" కొంచెం పాప గురించి చెప్పగలరా ?అన్నయ్యా..! అని అడిగాను

సాంబశివరావు అన్నయ్య మౌనంగా రెండు నిమిషాలు అలా ఉండిపోయారు. తర్వాత ఇలా చెప్పారు.
అమ్మా.. సత్యనారాయణ డి నాది నలబై ఏళ్ళ స్నేహం . ఏ రోజు కూడా.. నేను ఒకమాట కూడా ఇలా చేయాలి అని నేను చెప్పి ఉండలేదు. నాకు ఏం కావాలో తనకి తెలుసు. నేను ఎయిర్ పోర్ట్ లో ప్లైట్ దిగే సమయానికి కారు తీసుకువచ్చి రెడీగా ఉండటం,,నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు నాకు ఏం అవసరం అవుతాయో చూడటం..నా తల్లిదండ్రులని కూడా తన తల్లిదండ్రులుగా చూసుకోవడం చేస్తుంటాడు.నేను చెప్పకుండానే..అన్నీ చేసే తనకి ఈ పని చేయి..రా అని చెప్పడం ..నేను ఎప్పుడు అడగని విషయం. తను నాప్రాణ స్నేహితుడే! ఎన్నో విద్యా సంస్థలు సంపాదించి ఎంతో మంది డాక్టర్లని,ఇంజినీర్లు చదవడానికి శిక్షణ ఇచ్చే నంబర్ వన్ సంస్థ చైర్మన్ కావచ్చు. అతని స్వవిషయాలలో నేను ఎప్పుడు జోక్యం చేసుకోను. అతను నా విషయం లో ఆసక్తి కనపరచడు. మా వృత్తులు,మా పనులు.. వీటన్నిటి అతీతమైన "స్నేహం " తప్ప ఇలా చిన్న పాటి రికమండేషన్ కూడా మా మధ్య ఉండవు.

ఒక సారి మా చిన్న మామ గారు కావూరి గారి మనుమడికి కూడా చైతన్య లో సీట్ కోసం రికమండ్ చేయమన్నారు. అతను చదువులో చాలా పూర్. ఆలాటి విద్యార్ది కోసం..నా భార్య వైపు బంధుత్వం కోసం అయినా కూడా నేను సత్యనారాయణ ని అడగలేకపోయాను. భార్య వైపు బంధువుల కోసం కొన్ని చేయక తప్పని పరిస్థితుల్లో కూడా నేను జోక్యం చేసుకోలేదు. నేను అలా రికమండ్ కాల్ చేయడం ఇబ్బంది అని కాదు కాని.. మా ఇద్దరి స్నేహం విలువ.. అలా రికమండ్ చేసే స్థాయి గల స్నేహం కాదమ్మా.. అన్నారు.

నేను వెంటనే ఏదో మాట్లాడబోయాను. అన్నయ్య నా మాట వినకుండానే ..గబా గబా ..మేడమీదకి వెళ్లి అయిదు నిమిషాల్లో తిరిగి వచ్చారు. అప్పుడు..అన్నయ్యకి నేను మనస్పూర్తిగా సారీ చెప్పి.. మీ మనస్తత్వానికి విరుద్దంగా..మిమ్మల్ని ఒక పని చేసి పెట్టమని అడిగాను. నన్ను క్షమించాలి ..అన్నయ్యా.. మీ లాటి వ్యక్తిని,వ్యక్తిత్వాన్ని నేను అర్ధం చేసుకోలేకపోయాని అని చెప్పాను. వెంటనే మా చెల్లి కూడా అన్నయ్యా ..అక్క మీ గురించి చెప్పింది. తను అడగను అనికూడా అంది. నేనే బలవంత పెట్టాను. మీ పంధా ని,మీ స్నేహాన్ని మేము అర్ధం చేసుకున్నాను. మీరు అలా రికమండ్ చేయలేదని బాద కూడా లేదు అన్నయ్యా.. అలా అడిగి మిమ్మల్ని బాద పెడితే క్షమించండి ..అంది.

అమ్మా.. నేను అమ్మాయి గురించి చెప్పి రికమండ్ చేయ లేక పోయాను అన్నబాధ ఉంది .అలా అని నేను నా పద్దతికి విరుద్దంగా అలా ఆ స్నేహితుడిని అడగలేను. కానీ నా వంతు గా అమ్మాయిని ..నా మేనకోడలే అనుకుని ..మిగతా ఫీజు నేను కడతాను..అని .. జేబు లోనుండి డబ్బు తీసి చెల్లి చేతిలో పెట్టేసారు. నేను చెల్లి కూడా నిర్ఘాంత పోయాం. మేము వెళ్ళింది ఒకందుకు,అక్కడ చూసింది..ఒక ఉన్నత వ్యక్తిత్వంని.. సాయం లభించదు అన్న దిగులు లేదు..కానీ మళ్ళీ అక్కడే..ఓ..సాయం అందించిన ఆపన్న హస్తం.

వారు మళ్ళీ ఇలా అన్నారు. అమ్మా.. కష్టాలు నాకు తెలుసు. నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టి కష్ట పడి చదువుకున్న వాడినే.మిమ్మల్ని అవమానించాలని నేను ఈ సాయం చేయడం లేదు. ఒక తెలివైన విద్యార్ది పీజు లు కట్టలేక చదువు ఆగ కూడదు.అని చెప్పారు. అది మా సొంత అన్నయ్య కూడా చేయని సాయం అన్నమాట. .

నేను శ్రీ చైతన్య CO బ్యాచ్ ఫీజులు సంవత్సరానికి ఒక్కో విద్యార్ధికి రెండు లక్షలు అని చెబితే..ఆశ్చర్య పోయారు. మీ మిత్రులు వందల కోట్లకి పడగలెత్తారు ఇప్పుడు అని చెప్పి నేను నవ్వాను. ఇక్కడ అంత ఫీజుల..అమ్మా..అన్నారు. నేను ఎప్పుడు వ్యక్తిగతం, ఆర్ధిక వివరాలు ఏమి అడగను..అందరు బాగున్నారా..అనేదే తప్ప ఆర్ధిక పరిస్థితులని గూర్చి అడగను ..అని చెప్పారు. ఆ రోజే మద్యాహ్నం కి అన్నయ్య రిటర్న్ అయ్యారు. జరిగిన విషయం హౌస్ ఓనర్ లక్ష్మి అక్కకి చెప్పాను. "అయ్యో!వనజా..అన్నయ్య అల్లా ఎప్పుడు రికమండ్ చేయరు. "శిల్ప"ని చైతన్య లో జాయిన్ చేసినప్పుడు కూడా.. అందరి దగ్గర తీసుకున్నట్లుగానే పీజులు తీసుకుంటాను అంటేనే .. ఆ కాలేజ్ లో చదివిస్తాం అని వాగ్దానం తీసుకున్నాకే అక్కడ జాయిన్ చేసాం. అన్నయ్య స్వభావానికి విరుద్దం అలాటివి. నాకు చెబితే..సత్యనారాయణ అన్నయ్యకి నాన్న ద్వారా చెప్పించి అడిగిన్చేదాన్ని కదా!" అన్నారు.

నేను ఎప్పుడు ఒకటి అనుకుంటూ ఉంటాను. చిన్న పాటి విషయాలకి కూడా..స్నేహాన్ని అడ్డంగా వాడేసుకుంటూ.. స్వార్ధం తో మెలిగే మనుషులు మద్య.. ఇద్దరి మిత్రుల అపురూప స్నేహం వెనుక నెలకొని ఉన్న ఉన్నత మైన విలువలు,చిన్న పాటి పనులకి కూడా ఉపయోగించుకొని నిబద్దత ఈ రోజుల్లో ఎక్కడ ఉన్నాయి. అవసరాలకి స్నేహాన్ని అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకుని తర్వాత మొహం చాటేసే స్నేహాల మధ్య.. ఒక ఉన్నత మైన స్నేహాన్ని, ఉన్నత వ్యక్తిత్వాలని చూడటం..నాకు చాలా అబ్బురం. మా అబ్బాయికి కూడా చాలా సార్లు ఆ విషయం చెప్పి.. మా అబ్బాయికి సాంబశివరావు అన్నయ్య ని చూపించాలనుకున్నాను. కానీ కుదరలేదు.

అపరిమితముగా దనం సంపాదించడం, గొప్పగా మెలగడం .ఇతరులకి చిన్న మెత్తు సాయం కూడా అందించలేని పరమ లోభుల కన్నా .. తను నిజాయితీగా సంపాదించుకుంటూ..అందులో సగ భాగం పైగానే పేద విద్యార్ధులకి సాయం అందిస్తూ.. ఆఖరికి తను వ్రాసిన పుస్తకం పై లభించే రాయితీ మొత్తాలని కోడా పేద విద్యార్ధులకి సాయం అందించడంలోను, ఇతరుల ఇబ్బందిని గమనించి స్నేహంగా వెళ్లి ఇంటి అవసరాలకి కావాల్సిన గ్రాసరీ ని కూడా తీసుకు వెళ్లి అందించి.. వారి కోసం ఏమి దాచుకొని .. సాంబ శివరావు అన్నయ్యని. మంజుల గారిని చూస్తుంటే..
ఇంకా ఈ లోకంలో..మానవత్వం,నిబద్దత,ఉన్నత విలువలు యొక్క చిరునామా కనబడుతుంది. venkata S Musunuru .. అన్నయ్య అమెరిక పేరు. Granger -indiana ఉంటారు. Anesthesiology.లో బుక్స్ వ్రాసినందుకు గాను వారి సేవలకు గాను.. అవార్డులు వచ్చినట్లు విన్నాను కూడా.

ఇక్కడ వారి ఫోటో కూడా పెట్టి ఉండేదాన్ని. కానీ అన్నయ్యకి ఇలా చెప్పడం కూడా ఇష్టం ఉండదు.
ఆయనలో.. మరో మంచి కోణం .. ని చెల్లిని ప్రాణంగా చూసే అన్నయ్యని ,చిన్నమెత్తు కష్టం కూడా రానీయని అన్నయ్యని.ఒకవేళ కష్టం వచ్చినా తీర్చే అన్నయ్యని .ఓ..మంచి కొడుకుని, తండ్రిని కూడా నేను చూసాను. అలాంటి అన్నయ్య ఉండటం అదృష్టం మాత్రమే కాదు..గర్వపడటం కూడా. ఈ పోస్ట్ వ్రాయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. ఎందుకో నేను స్నేహానికి ఇచ్చిన ఆవిలువ కి గ్రేట్ ఫీల్ లోకి వెళ్ళిపోయాను కూడా. స్నేహమేరా జీవితం-స్నేహమేరా శాశ్వతం ..అంటారు కదా!

ఇంతకీ..మా "అప్పు " చదువు కి కూడా సాయం చేయడం ..ఒక విధంగా గొప్ప విషయం అనుకుంటాను. ఎందుకంటే..ఒక ఉన్నత వ్యక్తిత్వం ఏమిటో.. ఒక మనిషిలో చూడ గలిగాము కదా! మా పిల్లల కి ఆదర్శం అంటే ఏమిటో చెప్పగల్గుతూ..ఓ. స్నేహం విలువ ఇది..అని చెప్పడం తక్కువ విషయమేమీ కాదు కదా! మా "అప్పు " కి ఇలా చెప్పాను. నువ్వు బాగా చదువుకుని.. ఆ.. అంకుల్ సాయం చేసినట్లు పదిమంది పిల్లలకి అయినా హెల్ప్ చేయగలగాలి. అప్పుడే ఈ సాయానికి విలువ ఉంటుంది అని. ష్యూర్ .. పెద్దమ్మా..అని అంది అమ్మాయి. పిల్లల్లో ఆత్మ విశ్వాసం, సేవా భావం ,వ్యక్తిత్వపు విలువలు నేర్పాల్సిన బాధ్యతా యుతమైన పని కూడా ఉంటుంది కదా!

ఇకపొతే..వెంటనే మా చెల్లెలికి ఉన్న ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోయి..ఇప్పుడు వాళ్ళే ఫీజ్ లు కట్టుకోగాల్గే స్థితి లో కి వచ్చేసారు. మా "అప్పు" 93 %. మార్క్స్ తో.. A ** సెక్షన్లో.. TOP టెన్ గా ఉండటానికి ట్రై చేస్తుంది. కార్పోరేట్ కాలేజ్ లు రాంక్ ల పంట కోసం..విద్యార్దుల పై ఒత్తిడి,పిల్లల మానసిక ఒత్తిడి గురించి మరొక పోస్ట్ లో వివరిస్తాను. ఇప్పటికి ఇక సెలవు.

4, ఫిబ్రవరి 2012, శనివారం

కలవని స్నేహమా! మరణం సత్యమా?

కాలం   బహు చిత్రమైనది. 
ఎవరిని ఎప్పుడు కలుపుతుందో .. ఎప్పుడు ఎందుకు   విడదీస్తుందో.. అంతా అదో అంతు తెలియని నిగూడ రహస్యం 
ఓ.. ఇద్దరి మనసుల మధ్య స్నేహాన్ని చిగురింపజేసి ఆలోచనలని ఆత్మీయతని కలబోసుకునుని ఎన్నటికి   వీడని చెలిమి బలిమితో ముందుకు సాగాలనుకుంటారు. కానీ ఎందుకో  హటాత్తుగా  దారులు వేరవుతాయి   ఆ చెలిమి చేయి జారుతుంది. చేజారిన చెలిమి కై  జీవితాంతం వెతుక్కుంటూనే ఉంటారు. తాము వెతుకుతున్న చిన్న నాటి స్నేహం చేరువైతే..ఆ ఆనందం చెప్పనలవి గాదు.

అందుకే ..ఎవరైనా  స్నేహితులు ఎవరైనా వారు మిస్ అయిన స్నేహితుల గురించి చెపుతుంటే.. వారిని వెదకడాని   నేను సహాయం చేస్తుంటాను. ఆ స్నేహితులు కలుసుకున్న     అపురూప క్షణాలని కళ్ళ చెమరింపల మధ్య,హృదయ ద్రవిన్పుల మధ్య ఆనందంగా వీక్షిస్తాను . 

"కొప్పర్తి" గారు ప్రస్తుతం ఆంద్ర ప్రదేశంలో ప్రముఖంగా పేర్కొన్న   దగ్గ  పది మంది కవులలో ఒకరు . వారిని నేను రెండు మూడు సభలలో చూడటం..వారి ప్రసంగాన్ని శ్రద్దగా వింటూ చాలా నెలల పాటు మననం చేసుకుంటూ కవిత్వంని మరింతగా  లోతులు గా చూడటం నేర్చుకుంటున్నాను . 2010 డిసెంబెర్ నెలలో జరిగిన 'తానా" కవిత్వం  పోటీలను "మా ఎక్సరే  సాహితీ సంస్థ నిర్వహించినప్పుడు నేను  ఆ   కవిత్వం ప్రోగ్రాం ని నిర్వహించాను. అప్పుడు "కొప్పర్తి" గారు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.అప్పటి పరిచయంలో.. మాటల్లో మా వూరి ప్రస్తావన వచ్చింది. మాది పోరంకి .. వూరు ఆనగానే కొప్పర్తి   గారి కళ్ళల్లో  లో ఓ.. సంతోష వీచిక కదలాడటం చూసాను. వెంటనే.. నాకు   పోరంకి లో  ఒక స్నేహితుడు ఉండాలి. అతని అడ్రస్స్ కొంచెం   కనుక్కుని   చెప్పమని వివరాలు అందించారు. నేను వారు ఇచ్చిన వివరాలు ప్రకారం రెండు మూడు సార్లు వెతికి   చూసాను. కానీ సఫలం కాలేక పోయాను.

అదే విషయం ని మళ్ళీ కొప్పర్తి   గారు..ఓ..సభలో కలసి   అడిగే వరకు నేను వారి స్నేహితుడి చిరునామా కనుక్కుని ఇవ్వలేకపోయాను . నిజానికి నేను కనుక్కోలేకపోయాను   అని చెప్పడానికి కూడా  సిగ్గు పడ్డాను.  
మొన్నీ మధ్య డిసెంబర్ 25 న మళ్ళీ వారు మా ఎక్సరే అవార్డ్ల పంక్షన్ కలసినప్పుడు .. నాకు  వారి స్నేహితుల గురించి మరింత వివరాలు అందించారు. నేను వెంటనే ఒక   పేపర్ పై వ్రాసుకుని నా హాండ్ బాగ్ లో భద్ర పరచుకున్నాను. 

తెల్లవారి మళ్ళీ కొప్పర్తి   గారి నుండి పోన్ వచ్చింది. మర్చి పోకుండా వారి స్నేహితుల వివరాలు అడిగి చెప్పమని రిక్వెస్ట్ చేయడం వల్ల వారు ఎంతగా తన స్నేహితుని కోసం పరితపిస్తున్నారో..అర్ధం అయింది.వెంటనే..నేను నా ల్యాండ్ లైన్  ముందు కూర్చుని అరగంట లోపునే వారి స్నేహితుని వివరాలు కనుక్కున్నాను. ఎక్కడో చిన్న ఆచూకి దొరికింది. అలా రోజు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఒక స్నేహితునికి తన స్నేహితుని చిరునామా తెలిసి మాట్లాడటం అనే మహత్తర క్షణం కోసం నేను ఎదురు చూసాను. కానీ..ఓ..నాలుగు రోజులకి చిరునామా దొరికింది  మాకు సమీపంలోనే వారు ఉన్నట్లు తెలుసుకుని     కొప్పర్తి గారి స్నేహితుడి  ఇంటికి .. నేను కొన్ని   నిమిషాలలోనే నా తూనీగ పై..  తూనీగ కన్నా ఆనందంగా పరుగులు తీశాను. ఇద్దరి మిత్రుల కలయిక   కళ్ళారా చూడాలనుకున్నాను.

అక్కడికి వెళ్ళగానే నాకు తెలిసిన విషయం చాలా బాధ కల్గించింది.  ఎప్పుడో..బాల్యంలో వీడిన ఆ చెలిమి హస్తం తిరిగి కలవకుండా విధి విడదీసింది అని నాకు   తెలియగానే నేను నిస్సత్తువుగా  కూలబడి పోయాను.అసలు జరిగినది ఏమంటే ..  కొప్పర్తి గారి స్నేహితుడు బ్రెయిన్ ట్యూమర్ వల్ల మరణించారని చెప్పారు. నాకు  కల్గిన ఆశానిఘాతం కి నేను తేరుకోలేక పోయాను. ఈ విషయం కొప్పర్తి గారీకి  చెప్పాలా వద్దా ..అని ఆలోచించాను.  ఆరోజు జనవరి 1 వ తేది ఆ విషయం చెప్పి వారిని బాధ పెట్టడం ఇష్టం లేక   ఊరుకున్నాను. నేను అసలు విషయం చెప్పడం వల్ల కొప్పర్తి గారు ఎంత బాధపడతారో..నాకు తెలుసు. వారి ఇరువురి స్నేహంపట్ల.. కోవేలకుంట్లలో .. వారు గడిపిన బాల్యం,విజయవాడలో..వాళ్ళ కాలేజి   కబుర్లు కొప్పర్తి    గారి మది పుటల్లో..యెంత గాధంగా ముద్రించుకుని ఉన్నాయో,వారి స్నేహం యెంత గొప్పదో.. వారి చెపుతుంటే విని.. కూడా వారికి  ఈ విషయం చెప్పడం భావ్యం కాదేమో అని నెల్లాళ్లుగా ఆలోచిస్తూనే ఉన్నాను.

కొప్పర్తి గారి మనసులో వారి స్నేహితుడిని బ్రతికి   ఉంచి.. ఎక్కడో  ..ఆచూకి   తెలియని మిత్రుడిలా ఉన్చేయాలని అనుకున్నాను. మరలా నా నిర్లక్ష్యం  వల్లనో లేదా ఎదుటి మనిషి కి చిన్నపాటి సహాయం చేయని మనిషిగా నేను మిగిలిపోవడం మంచిదా అని ఆలోచిస్తున్నాను.  ఈ రోజు కాకపోయినా   ఎప్పుడైనా కొప్పర్తి గారికి విషయం చెప్పడం మంచిదా లేదా..అని ఆలోచిస్తూనే ...

 ఇన్నాళ్ళకి ఈ రోజు నేను  కొప్పర్తి గారికి  మిత్రుడి మరణం తాలూకు  సమాచారాన్ని అందించి.. ఆ నాటి చెలిమి ఒక కలలా ముగిసిపోయింది మిత్రమా.. మరల కలవలేని ఆ చెలిమి..నాలో..ఇంత విషాదాన్ని నింపింది అని అనిపించేలా   వారికి ఈ రోజు తెలియ పరుస్తూ ఉన్నందుకు బాధగాను,బరువుగాను  కూడా ఉంది.  ఆ  మిత్రుడి ఆశల వల ఖాళీగానే మిగిలిపోయింది. కలల అల స్నేహ తీరం ని తాక  కుండానే సముద్ర గర్భంలోనే నిశ్చలంగా ఉండిపోయింది    

జీవన మార్గంలో దారులు వేరైనప్పుడే కాదు మృత్యువు కూడా చెలిమిని విడదీస్తుంది.    " ఒక శాశ్వతమైన వాక్యం కోసం జీవించినంత కాలం వ్రాస్తూనే ఉండాలి"అన్నది కొప్పర్తి గారి  మాట.   అది "స్నేహం  కోసం పరితపిస్తూ ఉండటం కూడా నేమో! 

స్నేహమా!మరణంలో కూడా  నీ నీడగా  నేను లేకుండా చూసుకున్నావా ? నన్ను నీ జ్ఞాపకాలతో జీవించి మరణించమని. ..  అంటుందేమో.. నిజమైన స్నేహం. 
కలవని స్నేహమా! మరణం సత్యమా?   మిత్రుని మరణాన్ని చేరవేసినందుకు   క్షమాపణలతో ..  ఈ   పోస్ట్.      
             

12, నవంబర్ 2011, శనివారం

స్నేహం



జీవితం  చాలా  చిన్నది   ఎవరో ఎక్కడో..ఏమిటో.. తెలియ కుండానే.. కలసి నాలుగడుగులు వేస్తె చాలు స్నేహం కుదిరే రోజులు. ఓ..గంట కాలక్షేపపు కబుర్లు చెప్పుకుంటే చాలు సన్నిహితులు అయిపోతుంటారు.కలసి ఓ..రోజు గడిచిందంటే పాత బడి పోతుంటారు.

రోజు కొత్తదనం ముంగిట్లోకి వచ్చి కొత్త ముగ్గు వేసి తెల్లవారేసరికి ఇంకో కొత్త ముగ్గు కోసం వేదికినట్లు.. స్నేహం మారిపోవాలి.. వీలయితే నిన్నటి స్నేహం మర్చి పోవాలి.

ఈ స్నేహాల పిచ్చి ముదిరిపోతుంది. "నా" అని చెప్పుకోవడానికి ఓ..నలుగురు  అయినా లేని వందలమంది స్నేహితులు ఉంటున్న రోజులివి. ఏదో ..ఒక నాడు..  మనమంటూ..మనని మనంగా ఏ బేషజాలు లేకుండా బహిర్గతం చేసుకునేది స్నేహితుల వద్ద మాత్రమే.. మనిషి కి,మనసుకి ఆశ్రయం లభిచేంది స్నేహితుని ఇల్లే నట. ఆటువంటి చోటు స్వర్గ ధామమని నానుడి.


ఇటీవల కాలంలో..నేను చూడగానే ..నాకు బాగా నచ్చిన  పోయెం  పిక్చర్ ఇది .. ఇలా మీ అందరితో పంచుకుంటూ ...   (ఈ చిత్రం కూల్ కేటగిరీస్.కాం నుండి సేకరించినది).

7, ఆగస్టు 2011, ఆదివారం

స్నేహ దీపాలు

స్నేహం అంటే.. 

నేను గతంలో.. ఈ విషయమై  రెండు పోస్ట్ లు వ్రాసాను.అందుకే..మళ్ళీ వ్రాయబోను. నాకు చాలా ఇష్టమైన పాటలు రెండు.. నా చిన్నప్పుడు విన్న పాటలు..ఇప్పటికి వినే పాటలు..  ఒకటి రంగూన్ రౌడీ. లో..ఓ..జాబిలీ వెన్నెలా ఆకాశం ..వేటూరి గారు అరటి పండు ఒలిచి పెట్టినంత తేలికగా చిన్న చిన్న పదాలతో.. ఎంత గొప్ప భావాన్ని జోప్పించారో!.

అందుకు కారణం అంతకు  ముందే వచ్చిన ముకద్దర్ కా  సికిందర్ ..చిత్రంలో.. కళ్యాణ్ జీ   ఆనంద్ జీ..అందించిన  ట్యూన్స్ కావచ్చు..లేదా అంజాన్ సాహిత్యం కావచ్చు ఏమో! కానీ చిన్నతనం లోనే..ఆ పాట సాహిత్యం అంటే చాలా ఇష్టం ఏర్పడింది. 

ఇంకొక విషయం ఏమంటే.. ఆ చిత్రాన్ని వడ్డే రమేష్  (వడ్డే నవీన్ వాళ్ళ తండ్రి.) వాళ్ళు నిర్మించిన చిత్రం ..నవీన్  తల్లి.. (నళిని) మా వూరి ఆడపడుచు.అందుకని.. వారి  బేనర్ పై నిర్మించే చిత్రాలపై.. మావూరి వారందరికీ.. క్రేజ్ ఉండేది.పెద్ద వాళ్ళు..సినిమాలకి వెళుతూ.. పిల్లలని తోడ్కొని వెళ్ళేవారు. అలా ఆ చిత్రం చూసి.."ఓ..జాబిలీ" పాట కి ..వీరాభిమానిని అయ్యాను.

 తర్వాత నేను ఇంటర్ లో ఉండగా.. డిల్లీ నుంచి వచ్చి మా కాలేజ్ లో చేరిన ఒక అమ్మాయి..రోజు అదే పాట పాడేది. తన గొంతు ఎంతో..బాగుండేది. అలా హిందీ పాటకి.. బానిస అయి పోయి..తర్వాత వివిదభారతిలో..రెండు బాషలలో..ఆ పాటలు విని..  తరాత దూరదర్శన్ లో.. ముకద్దర్ కా సికిందర్ చూసి..అమితాబ్..ఎక్స్ ప్రేషన్స్ కి.. హృదయం కరిగి కన్నీరు మున్నేరు  అయిపోయి..(పైకి..కనపడుతూనే ఉండటం స్పెషల్ అన్నమాట) మహదానందంతో..లీనమైపోతూ   ఉంటాను.  ఇది ఈ పాటల  వెనుక కథ.

ఎందుకో..ఓ..జాబిలీ సోలో..(పి.సుశీల)ఇష్టం నాకు.

పాట సాహిత్యం:

ఓ ..జాబిలీ ..వెన్నెలా ఆకాశం 
ఉన్నదే నీకోసం (ఓ )
ఎదురు చూసింది నిదుర కాసింది (ఎ)
కలువ  నీ కోసమే..
వెలుగువై రావోయి 
వెలుతురే తేవోయి 

నువ్వు లేక నవ్వ లేక 
ఎందరున్నా ఎవరు  లేక 
జంట గాని  తోడు లేక ఒంటిగా నేనుండలేను ..
స్నేహ దీపాలు వెలగనీ చాలు 
చీకటే లేదోయి వెలుతురే కావోయి 
వెలుతురే తేవోయి..(ఓ)

గువ్వ లాగా  నువ్వు రాగా
గూడు నవ్వే గుండె నవ్వే 
వేకువల్లె నీవు రాగా 
చీకటంతా చెదిరిపోయే 
తుడిచి కన్నీళ్లు కలసి నూరేళ్ళు (తు) 
జతగా ఉందామోయి
వెలుగువే  నీవోయి వెలుతురే కావోయి..(ఓ)

బాల్యంలో.. మిత్రుని కోసం ఓ..అమ్మాయి పడే ఆరాటం..యెంత బాగా చెప్పారో కదా వేటూరి. 
అలాగే .. డ్యూయెట్  కి..అదే సాహిత్యం.  
తెలుగు పాట  సాహిత్యానికి..దృశ్యానికి.. హింది పాట  నేపధ్యం కి,భావానికి..అభిమాని ని.. అయి..ఈ పాటలు రెండు స్నేహం ..కోసమే..కదా! అందుకే గుర్తు చేస్తూ.. వింటూ..చూస్తూ..   

  ఏ వయసులో నైనా మనిషి కి.. మనసుకి..ఒక మనసైన స్నేహం కావాలి. ఆ స్నేహం  కోసం ఆరాటపడే.. రెండు హృదయాల పాటలే.. స్నేహ హృదయానికి..ఈ నాటి బహుమతులు.. వనజ 

5, జనవరి 2011, బుధవారం

స్నేహం అంటే..

 ముసుగు స్నేహాలు  ఎలా చేయాలి ? అందుకు సేఫ్ పద్దతులు ఏమిటీ?  అని ఒక స్త్రీ అడగడం  ఏమైనా బాగుందా చెప్పండి!?

ముసుగు స్నేహాలు ఎందుకు చేయాలి ? అసలు .. స్నేహం  అంటే  ఏమిటి ..?
ఇప్పుడు  ఇరువురు  స్త్రీ -పురుషుల మధ్య  స్నేహం సాధ్యమేనా? విదేశాల సంస్కృతి మన దేశంలో అంతగా పొసుగుతుందా..?  అంత విచ్చలవిడి సంస్కృతిని మనం కోరుకుంటున్నామా!? ఇన్నిటిని..పరికించాలి..

 మొదటగా.. స్నేహం అంటే.. ప్రొద్దుటే.. పూసి  సాయంత్రానికి వాడిపోయే పువ్వులాగా.. స్నేహం వయసు చిన్నదిగా ఉండకూడదు. పువ్వులోని   పరిమళంలా.. జీవన పర్యంతం మనవెంట ఉండాలి!? అనుకుంటే.. అలాటి స్నేహాలు.. ఎందుకుండటం లేదు అని అనుకుంటే.. ప్రతి  ఒక్కరూ అవసరం కోసం, కాలక్షేపం కోసం  స్నేహం చేయడం ఎంత వేగంగా.. స్నేహం చేస్తారో.. అంత వేగవంతంగా మరుగున పడేయడం సర్వ సాధారణమైన రోజులివి..

 అక్కడక్కడా.. నిజమైన స్నేహం  ఆనవాళ్ళు ఉన్నప్పటికీ.. అత్యధిక శాతం ఈ..స్నేహాలే కాబట్టి..  మనిషి..కి  స్నేహం విలువ  చెప్పడం  ప్రామాణికాలు నిర్దేశించడం చాలా క్లిష్టం కూడా! అయితే ఒక పాతికేళ్ళ క్రితం వరకు.. ఆడ-మగ పిల్లల మధ్య స్నేహాలు పది  పన్నెండు ఏళ్ళు  వచ్చేవరకు అరమరికలు లేకుండా కొనసాగేవి. తరవాత దూరాలు .. కొనసాగేవి.
అంతగా..  అయితే కొన్ని ప్రేమలు.. అతి తక్కువ పెళ్లివరకు దారి తీసిన స్నేహాలు. ఇవి.. అప్పటి కాలం స్నేహాలు..
ఇవాళ స్నేహం అనే పదానికి ఆకర్షణ అనేది మూలమేమో! చిన్న చిన్న పిల్లలని  గమనించండి..వారి మాటలలో ముదురు కబుర్లు.
అందుకు.. మీడియా ప్రభావం చాలా ఉంది. చదువుకునే  ఇద్దరు ఆడ మగ పిల్లలు ఉన్నారంటే వాళ్ళ మధ్య ఖచ్చితంగా.. ప్రేమ ఉండాలనేట్లు తీసే.. సినిమాలు.  హద్దులు.. దాటటానికి ప్రేరేపించే మాటలు..  హావ .. భావాలు ప్రకటించడం  ఇవన్ని వైపరీత్యం  కాదా..! 

 స్నేహం .. అంటే  కష్ట-సుఖాలలో, మంచి-చెడు విషయాలలో మనసు పంచుకుని  తోడుగా ఓదార్పుగా.. ఉండటం  అనుకోవడం మానేసి..
స్నేహం అంటే.. ఆకర్షణ... దేహాలు కలయిక.. అనుకోవడం మన సంస్కృతి లో భాగం కావాలా..!? స్త్రీ-పురుషుల మద్య స్నేహం ఏ దారి అయినా గోదారి లోకే.. దారితీసినట్లు..దేహాల కలయికకే దారి తీస్తుందా!?  ఎలాటి కాలయాపన లేకుండా.. పరిచయం కాగానే.. డేటింగ్  ప్రపోజల్.. పెట్టుకోవడం.. ఇద్దరూ ఓ..కే..అనుకుంటే.. ఒక పని అయిపోవడం .. తర్వాత దేహాలు దులిపేసుకోవడం. ఇది విదేశీ సంస్కృతి. అది మనం నేర్చుకుని సమస్యలు లేని నురక్షిత  మైన   సెక్స్ సంబంధాలు కొనసాగించడం ఎలా.. !? ప్రమాదం లేని స్నేహం అంటే అనుకోవడం ఇదేనా?.

దీనికి.. నా.. స్పందన ఏమిటంటే..  అసలు.. స్నేహం ముసుగులోనే.. మన భారతీయ సమాజంలో..విచ్చలవిడి శృంగారం  నేరుపుతున్నారు. దానికి  ఎన్నో.. తార్కాణాలు. ఎంత అమాయకంగా.. సేఫ్ సెక్స్  గురించి.. మన భారతీయ వనితలకి  చెప్పడం కన్నా వారి మీద జరిగే దాడులని ఎలా ఎదుర్కోవాలి అన్నది నేర్పడం, ప్రేమ పేరిట నయవంచకుల పాలిట పడి  అవాంచిత గర్భధారణ  దాల్చడం గురించి, కామ పిశాచాల బారి నుండి.. ఎలారక్షించుకోవాలో, లైంగిక వేధింపులుని, ఎలా ఎదుర్కోవాలో. లాంటివి. చెప్పడం బాగుంటుంది తప్ప ముసుగు స్నేహాలు  ఎలా చేయాలి ? అందుకు సేఫ్ పద్దతులు ఏమిటీ ? అని ఒక స్త్రీ అడగడం  ఏమైనా బాగుందా చెప్పండి!? 

ఒకే..బాణం, ఒకే భార్య.. అంటూ..ఉగ్గుపాలతో భోధించిన మన సంస్కృతి ఇప్పుడు  విశృంఖల  శృంగారంలో తీసుకోవాల్సిన  జాగ్రత్తలు చెబుతుందా.?  ప్రమాదకరమైన ముసుగు స్నేహాలు చేయమని  చెపుతారా..?పారదర్శకమైన స్నేహంని కోరుకోవడం తప్పు కాదు కదా!? భారతీయ ఫెమినిజం కూడా దీనికి అతీతం కాదని నా అభిప్రాయం.
ఈవాళ.. యెన్ 72  ల గురించి , కండోమ్స్  గురించి తెలియంది ఎవరికి చెప్పండి? పల్లెల్లో సైతం  అవగహన   వచ్చేసింది. టీ.వీ.ల ప్రభావం మరి. గుప్పిట మూసినంత సేపే రహస్యం. అవగాహన పేరిట, లైంగిక విద్య పేరిట అన్ని బట్ట  బయలు అయ్యాక మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఎవరికి చెప్పనవసరం లేదు.

మన భారతీయ సమాజం పిల్లి  పాలు త్రాగుతూ తాను కళ్ళు మూసుకుని తనని ఎవరు చూడ లేదు  అనుకుంటుంది లాగా ఎవరు ఎవరిని పట్టించుకుండా   తమకి స్వేచ్ఛ లభించింది కదా   అని ఆ లభించిన  స్వేచ్ఛతో  నైతిక విలువలు వదిలేసి   గొంగట్లో  తింటూ వెంట్రుకలు అనుకుంటున్నట్లు ఉంది పరిస్థితి.

కొద్దిగో.. గొప్పో.. సభ్య సమాజంలో విలువలతో బ్రతికే..వాళ్ళు ఉన్నారు. శాస్త్ర సాంకేతిక  పరిజ్ఞానం అందుబాటులోకి  తెచ్చుకుని విద్యల పట్ల, ఉద్యోగాల పట్ల స్పష్టమైన దృక్పధంతో ఉన్నారు తప్ప  స్త్రీలు  ఎన్నెన్ని సమస్యలని ఎదుర్కుంటున్నారు? అలాటి సమస్యలలో ఇంకొక సమస్య రాకుండా ఉండాలంటే! అంటూ.. వైదేహి గారు.. అభిప్రాయం చెప్పండంటూ.. ఆహ్వానించడం అభినందనీయం. కానీ ఆవిడ  అడిగిన తీరు సమర్ధనీయం కాదు.
 మామూలు స్నేహానికే  భయపడుతున్నట్లు బ్రతికే మన భారతీయ స్త్రీలు.. (అంటే  మన గురించి మనం వెలిబుచ్చుకునే  స్థానం లోనే మన అసలు.. చిత్రం పెట్టడానికి భయపడే మనం )  డేటింగ్ సంస్కృతిని.. ఆహ్వానించడానికి, అబద్దపు స్నేహాలు చేయడానికి జాగ్రత్తలు.. ఇలా తీసుకోవాలి  అలా తీసుకోవాలి అని చెప్పడానికి..సాహసిస్తారా..చెప్పండి.!?

ముందు స్నేహం అనే ఆ.. పదానికి  అర్ధం నిర్వచించండి.. తర్వాత.. స్త్రీ-పురుషుల మధ్య లైంగిక కలయికలకి.. స్త్రీలు.. ఎలాటి జాగ్రత్తలు.. తీసుకోవాలో, కలయికల తర్వాత ఆ.. సంబంధాలు ఎలా కొనసాగిన్చుకోవాలో.. వద్దనుకుంటే.. ఎలా వదిలించుకోవాలో చెప్పుకోవచ్చు.  సెక్స్ ఈజ్ బయలాజికల్ నీడ్స్. ఎవరూ కాదనం కానీ..  అంతకన్నా విలువైనవి నైతిక విలువలు. అవి లేనందుకే విదేశాలలో కుటుంబ వ్యవస్థ నాశనం అయింది. అలాటి సమాజం మనకు వాంఛితమా!? ఆలోచించండి.!!!! నేను ఇలా బ్లాగోముఖంగా ఆవిడ అడిగినదాన్ని నిరశిస్తున్నాను.

 స్త్రీ-పురుషుల మద్య అక్రమ సంబంధాలకి.. ఆకర్షణ అని పేరు పెట్టుకుంటే  బాగుంటుంది.. స్నేహం అని ఉదహరించ వద్దని మనవి.
ఆ.. పదానికి నా దృష్టిలో అపారమైన విలువ ఉంది..  ఏ  దేశం లో అయినా స్త్రీల గతి దుర్గతి ఎలా ఉందంటే.. ఒకసారి శరీరాన్ని.. పురుషుడికి ఇస్తే వందల సార్లు వేలసార్లు  ఆమెని అణచిపెట్టడం ఎక్కడైనా ఉంది. ఆఖరికి భర్త అయినా సరే ఆమెని అణచి ఉంచడానికే ప్రయత్నం చేస్తాడు. అలాటి  స్థితిలో మహిళలు.. స్నేహం చేస్తారా?అంత అసమానత, ఆసహాయత ఉండటం  మహిళలకి శాపం ..ఏమో!!  "ఆకాశంలో   సగం మనం"  వినడానికే.. బాగుంటుంది..అలా కాకుంటే   కాస్తైన  బెటర్  అని అనుకుంటే. ఇలాటి  చర్చ వచ్చి ఉండేది కాదేమో!

నేను ఈ అభిప్రాయం వెలిబుచ్చుతూ ఎవరిని కించ పరచ లేదు. వాస్తవికతని కాస్త  తీవ్రతగా చెప్పాను అంతే!  స్నేహం చేయండి. అది ఆత్మీయంగా.. ఆధారంగా  ఉండాలి. కొందఱు పురుషులు పరిధిలు దాటినందుకే.. సమాజం  నాశనం అవుతుంది. ఇక మహిళలు కూడానా!? వద్దు వద్దు..  అని నేను విన్నమిస్తాను. ముసుగు  స్నేహాలు   వద్దు. అలాగే  అనవసర  స్నేహాలకి  తెర తీయకండి అంటాను నేను.