24, జనవరి 2019, గురువారం

పువ్వులాంటి మాట

పువ్వులాంటి మాట 


నువ్వు నేను నాణానికి చెరోవైపు 

మనద్దరిది పూర్తి సత్యంకాదు పూర్తి అబద్ధం కాదు

నేను ప్రేమ హస్తాన్ని అందిస్తాను 

గతంలో పొరబాట్లను తలచుకుని సిగ్గిల్లుతూనే 

నువ్వు నన్ను క్రోధంగా చూస్తూ  మరింత ద్వేషిస్తూ  

దూరం జరుగుతావు వునికి బలపరుచుకుంటూ


రాతి గదుల మధ్యనో సమాధులలోనే దేవుడు 

లేడనే సంగతి తెలిసి కూడా 

కారణాలు వెతుక్కుని మరీ ద్వేషించుకునే మనం 

ఇంకోచోట కుక్కలా విశ్వాసం చూపిస్తూ తోకలూపుతుంటాం 

కాల నాళికలో జీవిత క్రమమంతా  ఇమిడి పోతుండగా 

కలం పోటులో విషం చిమ్ముకోవడం యెందుకు.

కడదాకా ద్వేషాన్ని మోయడమెందుకు . 


చేతికి చిక్కని సంశయాల మనసును

చుట్టుకునే పొగమంచు తెరలను 

వామ హస్తంతో  కొద్దిగా పక్కకు జరిపి 

పువ్వుల్లాంటి  ఒక చిన్న మాట కలుపుకుందాం 

మట్టి పరిమళాన్ని మట్టిలో కలిసిపోయేదాకా 

ఆస్వాదిద్దాం. రా ..మిత్రమా .. 

చేయి చేయి కలిపి అసలు శత్రువును అంతం చేద్దాం

మట్టి మూలం ఒకటే అని రుజువు చేద్దాం.




కామెంట్‌లు లేవు: