5, జనవరి 2019, శనివారం

रंग उनकी छाया ఈ రోజుల్లో యెవరి జీవితంతో వాళ్ళు పోరాడలేక చస్తుంటే మధ్యలో వీరిలాంటి వారితో పోరాటం మరీ కష్టం అయిపోతుంది. ఎక్కడ చూసినా మనుషులమధ్య సత్సంబంధాలు మాయమైపోతున్నాయి. అయినవాళ్ళ మధ్య ప్రాణ స్నేహితులు అనుకున్న వాళ్ళ మధ్య కూడా యెన్నో విబేధాలు అగాధాలు. యధాలాపంగానే ఆ మనుషులు గురించి యీ ముచ్చట. మనుషుల మనస్తత్వాల గురించే యీ ముచ్చట.

వందమంది పొగడ్తల మధ్య వొక్కరన్నా విమర్శించాలి. లేక పోతే నాకసలు నిద్రబట్టి చావదు.. విమర్శించే వారే నా అసలైన మిత్రులు అన్నాననుకోండి.

మరురోజు యెవరికి వారూ విమర్శించే వాళ్ళలో ముందుంటారు.

సమయాన్నిబట్టి స్పందించేవారే పొగడ్తల పూల మాల చేతిలో లేనివారే అసలైన మిత్రులు అని నాకు తెలుసు.. అని మళ్ళీ అనాల్సివస్తుంది.

ఏది వెలుగు యేది చీకటి !? ఈ మాయా ప్రపంచంలో..

అతుకుల బొతుకులు భూమికే తప్పడంలేదు ఇక మనిషి యెంత ? అని భారంగా నిట్టూర్చడమే.

పెదవి విప్పి కష్టమేమిటో చెప్పకుండా శ్రమ పడుతూ నవ్వుతూ నటిస్తూ బ్రతుకుతుంటారు కష్టం విలువ తెలిసివారు.

చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్లే కష్టం పేరు చెప్పుకుని కష్టపడకుండా సుఖపడుతున్నారు బ్రతకడమెలాగో తెలిసిన వారు.తీసుకోవడం అంటే ఇవ్వడమంత తేలికైన పని కాదని అర్దంకాని అర్ధజీవులు వారు. వారు కష్టపడేవాళ్ళను చేతకానివాళ్ళగా జమకడతారు. మనుషుల స్వభావం యెలాంటిదంటే తనవాళ్ళే అయినా వారు బాగుంటే మనసొప్పదు. ఎప్పుడూ బాధలు పడుతూ నిస్సహాయంగా ఉంటే వీళ్ళకి లోలోపల ఆనందం. సహాయం చేసినట్టు చేస్తూనే వెన్నువిరిచే మాట్లాడటం వీరికి అలవాటు. కాలం కలిసొచ్చి ఆర్ధికంగా బాగున్నా భరించలేరు. తనకున్నది వేరేవారికి వుండకూడదు. తనకు లేనిదీ వేరేవారికి వుండకూడదు. ఇలాంటి తీవ్రమైన మనస్తత్వం కల్గి వుంటారు.

ఇక వాళ్ళు స్నేహం విషయంలో యెలా వుంటారంటే..

మనుషులతో స్నేహంగా వుండాలంటే వాళ్ళ గురించి తెలియకుండా వో పూసేసుకోవడంతో మొదలెడతారు.పరిచయం అవ్వగానే వాళ్ళను అమాంతం కావిలించుకోవడం వాళ్ళ యింట జొరబడిపోయి సలహాలివ్వడం ఇదిగో యిదిలాకాదు యిలా చేయాలని వుచిత సలహాలివ్వడం, పెత్తనం చేయడం సాధారణం అయిపోతుంది వీరికి. చిన్న చిన్న అవసరాల నుండి పెద్ద పెద్ద సాయాలు దాకా స్నేహం ముసుగులో మనుషులను బకరాలు చేయడం వీళ్లకు అలవాటు. నా అంత నిజాయితీ పరులు లేరంటూనే లోపల అంతులేని రహస్యాలు నేర్పరితనముగా దాచేసుకోవడం వీరికి కరతలామలకం. సాయం చేసినట్టు పైకి నటిస్తూనే వెనుక గోతులు తవ్వడం. వీళ్ళ స్నేహం యెలా వుంటుందంటే రక్త సంబంధీకులని కూడా గడ్డిపోచల్లా ప్రక్కకు తోసేయడం స్నేహితుల ముందు అయినవాళ్ళన్నీ ఈసడించుకోవడం తీసి తీసి పడేయడం. కష్టంలో రక్త సంబంధీకుల పక్కన నిలబడినదానిని కూడా గొప్పగా చెప్పుకోవడం పరిపాటి. అక్కడ వారు చేసింది కూడా యేమీ వుండదు. యెవరు లేకపోయినా జరిగేవి జరగక మానవు కదా! స్నేహితులముందు అయినవాళ్ళని యెంత దుష్టులుగా చిత్రీకరిస్తే అంత సానుభూతి కురుస్తుంది అనే చీఫ్ ట్రిక్స్ (అల్ప బుద్ది) కల్గి వుండటం. ఇంతా చేసి రక్తసంబంధీకులకన్నా స్నేహితులే ముఖ్యం అనుకున్న వాళ్ళకి ఆ స్నేహాలు కలకాలం నిలబడతాయా అంటే అదీ వుండదు. మూణ్ణాళ్ళ ముచ్చటే అదీ. మంచివాళ్ళతో స్నేహం పొద్దు పడమటికి వాలేటప్పుడు పెరిగే నీడలాంటిదని వూరికే చెప్పలేదు పెద్దలు.

ఇలాంటివారు అర్ధం చేసుకోవాల్సింది యేమిటంటే..

ఎంత ప్రాణ స్నేహితులైన యెంత తోడబుట్టినవారైనా యెవరి మనస్తత్వాలు యెవరి ఆర్ధిక పరిస్థితులు వారికి వుంటాయి. పరిధులు ప్రమేయాలు గుర్తించకుండా అన్నింటిలో జొరబడిపోయి వీళ్ళు చెప్పినది జరగడం లేదన్న అహంతో విమర్శించడం అసలు చేయకూడదు. వ్యంగంగా చులకనగా మాట్లాడటం, దుమ్మెత్తిపోయడం యివి వాళ్ళ లక్షణాలైయితే అవచ్చు కానీ యెంత సొంతవాళ్ళైనా పరాయి వాళ్ళ మీదైనా తమ అభిప్రాయాలు రుద్దాలనుకోవడం తమ మాటే చెల్లాలనుకోవడం సమంజసం కాదు.


ఇంకో విషయం యేమిటంటే తమ పిల్లలే విజ్ఞానఖని, గని, తెలివికలవాళ్ళగానూ, తతిమ్మా వాళ్ళ పిల్లలు ఎందుకు కొరగాని వాళ్ళగానూ, అసమర్థులుగానూ చిత్రించడం మాట్లాడటం వీళ్లకు వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను చిన్నబుచ్చడం మంచిదికాదని గాయ పడతారని తెలియని వయసుకూడా కాదు వాళ్లది.

గాయపడిన వాళ్ళు మౌనంగా వుంటారు. గాయపరిచినవాడు ఇంకనూ చెలరేగి కారుకూతలు కూస్తాడు. ఎక్కడ ఆపాలో తెలిసినవాడు విజ్ఞుడు కాబట్టి ఆ స్నేహాన్నో ఆ బందుత్వాన్నో అక్కడితో కత్తిరించేసి ప్రశాంతంగా బతుకుతారు. అలా బ్రతకడం కూడా యిష్టం వుండదు వారికి. గూఢచారి అవతారం యెత్తి కొత్త కొత్త ఐ.డి లతో సంచారం చేస్తూ వుంటారు. ఈర్ష్యా ద్వేషంతో మండిపడేవాడు యెక్కడా ప్రశాంతంగానూ ఆరోగ్యంగానూ వుండలేరు ఇక వారిని భగవంతుడే కాపాడాలి.


నాలుక విషం పూసిన కత్తిలాంటిది. విషపూరితంగా మాట్లాడితే మనసులు విరిగిపోతాయి. మళ్ళీ అవి అతకడం కష్టం. మనుషులు మానసికంగా మరణించాక భౌతికంగా బ్రతికున్నా లేనట్టే లెక్క.


మనుషుల రంగులు నీడలు అర్ధమయ్యాక భౌతిక మానసిక దూరాలు మరింత పెరుగుతాయి. 


PS : ఎవరికైనా apt గా అనిపిస్తే వ్రాసిన ఆ తప్పు నాది కాదు. అలాంటి మనస్తత్వం కల్గి వుండటం కల్గి వున్నవాళ్ళు తారసపడటంగా మాత్రమే భావించాలి.

 (పాత పోస్ట్ .. పొరబాటున డిలీట్ అయింది .. మళ్ళీ ప్రచురిస్తున్నాను