20, ఆగస్టు 2019, మంగళవారం

మాట ప్రియం ..




మాటే ... దేనికైనా మూలం. తీయని పలుకుల మధ్య నిండుకుండ విషం కూడా కప్పెట్టేయవచ్చు. అసలు మనుషుల మధ్య మాట లేకపోతేనే కష్టం . గల గల మాట్లాడే వారు హఠాత్తుగా మౌనం వహిస్తే బెంగ . ఆ మాటకి మౌనం తాళం ఎందుకయిందో తెలిస్తే ..మనసుకి బాధ. మనుషుల వైఖరిపట్ల విముఖత. మౌనాన్నే ఆభరణంగా ధరిస్తే బావుంటుంది కదా ..అని ఆలోచన . వ్రాత పాతదే ..

ఆ మాట గురించి వొక కథ వ్రాస్తే ... ప్రచురణ కోసం యెదురుచూసి యెదురుచూసి వొక ఉదాసీనత అలముకున్నాక యేదో వొకనాడు మధ్యాహ్నం పూట గాఢమైన నిద్రలో వుండగా ఫోన్ కాల్ ద్వారా లేపి మరీ చెపితే ఆ భావాతీతమైన క్షణాన్ని అక్షరాలలో వర్ణించడం అంత సులువుకాదు. సంతోషమో విచారమో ..యేదో తెలియని స్థితి .. సరే ..మొన్న  ఆదివారం ప్రచురింపబడింది  .. "మాటల దారం " కాస్త చదవడానికి ప్రయత్నించండి. వేలిముద్రలు వ్యాఖ్యలు అభిప్రాయాలు చెప్పకపోయినా పర్లేదు .. 


ఈ కథ వెనుక కథ ..

నేను గత సంవత్సరం USA వెళ్ళినప్పుడు మా ఇంట్లో వాళ్ళు మా బంధువులు ఫ్రెండ్స్ కాకుండా.. నేను ఇతరులతో మాట్లాడిన మాటలు.. మా అబ్బాయి ఇంటిప్రక్కనున్న పొరుగు మనిషి .. హాయ్ అని పలకరిస్తే మళ్ళీ తిరిగి విష్ చేసాను. ఒకరోజు బయటకు వెళుతుంటే ఒక బాలుడు కనబడ్డాడు. అయిదారేళ్ళు ఉండవచ్చు. ఆ పిల్లాడిని చూసి ..ఈ పిల్లాడు మన తెలుగు వాళ్ళబ్బాయి లాగా వున్నాడు అని మా కోడలితో అన్నాను. అ పిల్లవాడు ముందుకు నడుస్తున్నవాడల్లా ఆగి వెనక్కి తిరిగి చూసి "వ్వాట్ " అన్నాడు. నేను "నథింగ్" అని చెప్పి నవ్వుకున్నాను.మా అబ్బాయి ఇంటి చుట్టుప్రక్కల చాలామంది మన ఆంధ్రులు ఉండేవారు. కానీ ఎవరూ ఎవరితో మాట్లాడరు. చుట్టుప్రక్కల ఎవరెవరు వున్నారా, యేమిటీ అని అన్నీ గమనిస్తారు కానీ తెలియనట్లు నటిస్తారు. అమెరికా వాళ్ళలా ప్రవర్తిస్తారు. అవసరం లేకపోతే మాట్లాడరు. ఆరు నెలల కాలంలో నేను ఇతరులతో మాట్లాడిన మాటలు ఆ రెండే. షాపింగ్ కి వెళితే అక్కడ స్టాఫ్ పలకరించేవాళ్ళు హాయ్ అంటే ఒక మాట అది తక్కువ హౌ ఆర్ యూ అంటే ఇంకో మాట ఎక్కువైన మాట. ఇంతే ! మనుషులతో మాట్లాడకుండా మూగవాళ్ళలా చిన్న చిరునవ్వు ముఖానికి అంటించుకుని చూస్తూ ఏళ్ళకు యేళ్ళు ఎలా బ్రతికేయగల్గుతారో ఏమిటో ! మనమధ్య కూడా అలాంటి వాతావరణమే ప్రబలిపోతుంది. ఎవరూ మనుషులతో మాట్లాడటం లేదు. నేను ఎక్కువ మాట్లాడేది పలకరించేది నా చుట్టూ వున్న చిన్న పిల్లలను . వాళ్లకి లెక్కలేసుకోవడం రాదు కాబట్టి హాయిగా మాట్లాడతారు. ఇక ఇవాల్టి విషయానికి వస్తే .. నా కథ యిలా నా ఆలోచనల్లోనుండే కాదు వాస్తవంలో నుండి పుట్టిన కథ. అక్షరమంత అబద్దమైనా లేదు. మాటలు కావాలి. ఆ మాటలను కలిపే మనుషులే దారంగా కావాలి. ఆ మాటల దారం మనుషులను పూలలా కలిపి ఉంచాలి అని నా ఆకాంక్ష.  ఈ కథకు నాకు స్ఫూర్తినిచ్చిన  .. ఈ "రమ" అనుభవాలు కూడా యీ కథకు మూలం.
పసుపుపూల వనం ముందు పచ్చని మనసు "రమ" ఈవాల్టికే కాదు నా ..స్నేహజీవితంలో వొకానొక నాయిక. రమ నేనూ ఇద్దరం కలిసిన photos వుండాలి..వెతికి చూస్తాను. ప్రస్తుతానికి .. ఇలా ..






కామెంట్‌లు లేవు: