7, ఆగస్టు 2019, బుధవారం

స్పీక్ అవుట్..

నాకు ప్రశ్నించే వాళ్ళంటే యిష్టం .  పదే పదే ప్రశ్నించడాన్ని నచ్చక నన్ను నా కుటుంబసభ్యులే విసుక్కున్నందుకు కోపగించుకున్నందుకు, సమాధానమివ్వకుండా మాట దాటేసి మనుషులే మరీ దూరంగా జరిగినందుకు మరీ మొండితనంగా ప్రశ్నించడం నా అలవాటు. సమాధానం రాదని తెలిసినా మౌనంగా వుండేదాన్ని కాదు.
మా అబ్బాయికి పంతొమ్మిది ఏళ్ళప్పుడు ఒక ప్రశ్న వేసాడు. అమ్మా ..నాన్నగారు అలా ఆస్తులన్నీ అమ్మి నాశనం చేస్తుంటే మెదలకుండా నీకేమి పట్టనట్టు అలా వూరుకుంటావేమిటీ, నీకు భాద్యత లేదా .. వాటిని కాపాడి పిల్లాడికి యివ్వాలని" అని అన్నాడు. అప్పటిదాకా నాకు సంబంధించని ఆస్తిపాస్తుల గొడవ నాకెందుకులే అనుకున్నదాన్ని ఆ మాటతో .. మేల్కొని ఆస్తులు అమ్ముతాను అన్నప్పుడల్లా ఉక్కుపాదం మోపాను. అలా కొంత నిలిచింది. ఆ ప్రశ్న నా కొడుకు వేయకుండా వుంటే నేను పట్టనట్టే వుండేదాన్ని.
ఇక రెండవసారి ప్రశ్న నాకు :). ఎప్పుడూ ..నేను ఫోన్ చేసి మాట్లాడటం లేదు అనకపోతే.. నువ్వే యెందుకు ఫోన్ చేయకూడదూ ..నీ దగ్గర ఫోన్ లేదా.. డబ్బులు లేవా, సమయం లేదా అని ప్రశ్నించడం మొదలెట్టాడు. నేను ఇంకెప్పుడూ ..ఆమాట అంటే వొట్టు. నేనే ఫోన్ చేస్తాను. మా అత్తమ్మ నా పట్ల యెలా వున్నా కొంత కినుక వహించి నేను ఆమె వద్దకు వెళ్ళడం మానేస్తే .. ఎందుకు రావు నువ్వు  అని ప్రశ్నించి  నా భాద్యత  గుర్తు చేస్తే ... మనసులో యెన్ని వున్నా ఒక కోడలిగా ఆమెకు పెద్ద వయసులో యెంత సహాయకారిగా వుండాలో అంత వరకూ నేను వుండి తీరుతున్నాను. అలా ఎవరు ప్రశ్నించినా జవాబుదారిని నేనైనప్పుడు తప్పకుండా నన్ను నేను దిద్దుకుంటాను. అందులో నాకేమీ నామోషీ లేదు.
ఇలా ఎవరు సమంజసమైన ప్రశ్న వేసినా నాకు చూడముచ్చటగా వుంటుంది. స్నేహాన్ని కాపాడుకోవాలనే దుగ్ధ లేకుండా ప్రశ్నించి నామీద హోరాహోరీగా పోరాడే వాళ్ళు (ప్రశ్నించేవాళ్ళు ) అంటే నాకిష్టం.

మొన్న కొత్తకథ 2019 ఆవిష్కరణ సభ తెనాలి  ASN కాలేజ్ లో విద్యార్ధుల మధ్య జరిగినప్పుడు .. డిగ్రీ ఫైనలీయర్ అమ్మాయి వొక ప్రశ్న వేసింది. స్త్రీలకు తమ తమ ఇష్టాలకు అనుగుణంగా వొంటరిగా వుండి ఆత్మ గౌరవంతో బ్రతికినప్పుడు యెక్కువ విలువ వుంటుందా..గృహిణిగా అందరినీ మెప్పిస్తూ బ్రతకడంలో విలువ వుంటుందా అని. అదేదో భేతాళ ప్రశ్నలా అనిపించింది నాకు. ఆది కావ్యం నుండి పురాణ ఇతిహాసాల నుండి నేటి సాహిత్యమంతా చదివినా .. నీకు సమాధానం చాలా తేలికగా అర్ధమవుతుంది అమ్మా ..రచయితలైనంత  మాత్రాన నీ ప్రశ్నకి సమాధానం చెప్పగల్గినవాళ్ళు యెవరూ లేరు. సమాధానం చెప్పినా భిన్నాభిప్రాయాలు ఉన్న సమాజంలో యేది మంచిది అన్నది మనకి మనం నిర్ణయించుకునేది. ఇంకొకరు నిర్ధారించేది  కాదు.  గుడిపాటి వెంకటాచలం మాత్రం ఆత్మ గౌరంగా బ్రతకమని చెపుతారేమో కానీ ఆచరణలో అది యెలా సాధ్యమో చెప్పడం కష్టం అని చెప్పాలని అనుకున్నాను. కానీ ఆ అమ్మాయి సమూహంలో తప్పిపోయింది. బహుశా పెళ్ళయ్యే వరకూ ఆ ప్రశ్న అడుగుతూనే వుంటుందేమో..తర్వాత అర్ధం చేసుకుంటుందేమో మరి.
చివరగా చెప్పేదేమిటంటే ప్రశ్నించే నోటిని అదుపు చేసే శక్తులు మన మధ్యనే చాలా వున్నాయి. ప్రశ్నించే వారికి మద్దత్తుగా  వెళ్ళిన వారిని అదుపు చేయాలనే మూకలు కాచుకు కూర్చునే వున్నాయి. అయినా ప్రశ్నించే వాళ్ళంటేనే నాకిష్టం. అందుకే నన్ను కొందఱు డబుల్ టంగ్ అంటుంటారు. నా వ్యతిరేకతను అర్ధం చేసుకోరు నా సానుభూతిని అర్ధం చేసుకోరు. ఏది మాట్లాడినా రాసినా  గుడ్డిగా మద్దతు తెలిపితే మన వర్గం లేకపోతే శత్రు వర్గం అనే సంకటస్థితిలో ... తటస్థ అభిప్రాయాలు కల్గి వుండటం నేరం. ఏదో ఒకటి మాట్లాడాలి.. మాట్లాడాలి. లేకపోతే ఫలానా వర్గం కన్నింగ్ లు అనిపించుకోవడం సాధారణమైపోయింది. ప్రశ్నిస్తే .. మెజారిటీ అహంకారం అయి కూర్చుంటుంది. ప్రశ్నించడం నాకిష్టమైనా నోరు మూసుకుని కూర్చోవాల్సి వస్తుంది. తప్పదు మరి కాలం ఎలాంటిది ? మరి యిలాంటి కాలంలో మాట్లాడు ..మాట్లాడితేనే ... ఇంకొందరు మాట్లాడితేనే మనం ప్రశ్నిస్తేనే  చర్చ జరిగి మరిన్ని అభిప్రాయాలు బయటకువస్తాయి అని చెప్పడం సబబుగా వుంటుందా అని ఆలోచిస్తున్నా.   కానీ నేనిప్పుడు క్రమేపీ పిరికిదానిగా మారుతున్నా .. మొన్ననే facebook ఫ్రెండ్  దేవీరమ  క్రొత్తపల్లి చెప్పారు ..నేనంటే ఫైర్బ్రాండ్ ని కనబడని మెతక అని  :) .  నిజమేనేమో ... అనుకుంటే తప్పులేదసలు 

కామెంట్‌లు లేవు: