1, మే 2011, ఆదివారం

రోజూ ఈ సమయానికి కరంట్ పోవాలి

ఆదివారం వచ్చిందంటే.. నాకు పండగే..! కొంచెం పనులు లేట్ గా చేసుకోవచ్చు... ఇలా.. నెట్ లో.. తలదూర్చవచ్చు. కొత్త విషయాలు తెలుసుకోవచ్చు.. lumosity  లో మెదడుకు పదును పెట్టుకుంటూ.. కొంచెం చురుకు పెంచుకునే ప్రయత్నం చెయ్యవచ్చు.. ఇలా.. యోచిస్తూ..ఉంటాను..సమయం మన చేతుల్లో ఉంటుందా ఏమిటి..? మన సమయాన్ని దోచేయడానికి ఎవరో.. దొంగలా.. కాచుకు కూర్చునే  ఉంటారు...అనుకున్నవన్నీ చేయకుండానే ఆదివారం అయిపోయింది. సాయంత్రం  ఒక ముఖ్య మైన కార్యక్రమంని  రద్దు చేసుకుని ఇంట్లో ఉండాల్సి వచ్చింది. కొంచెం నలతగా ఉన్నా నాకిష్టమైన వ్యాపకం + భాద్యత రెండు నేరవేర్చుకోవాలనుకుంటే.. ఒక బంధువు వస్తానని కాల్ చేసి చెప్పి  మరీ.. రాకుండా .. నా పనులని అస్తవ్యస్తం చేసినందులకు కోపం తో..ఉన్నాను. సరే ఒక టపా పడేద్దామని..

 ఇదిగో.. ఇలా.. మొదలెట్టనా..!? పవర్ కట్.. ఇంట్లో ఉండలేక పుట్టలోని పాముల్లా.. బిల్డింగ్లో ఉంటున్న అందరూ.. ఒక్కొక్కరే బయటకి..వస్తున్నారు. నేను నిశ్శబ్దం భరించడం నా వల్లకానట్లు.. బేటరీ రేడియో  పెట్టాను.అందరూ వచ్చేసి మాట మాట కలుపుకుంటున్నారు. మాటలు ఇలాటప్పుడే బాగా కలుస్తాయి..వరండాలో.. కుర్చీలు వేసి కొందరికి.. చల్లగా కింద కొందరికి ఆశీనాలు ఏర్పాటు చేసి .. మాటలు మొదలెట్టాం. ఒకటే నవ్వులపువ్వులు.. ప్రపంచ నవ్వుల దినోత్శవం ..అని కాదులెండి. ఎప్పుడూ..అంతే..! పగలు సమయాలు  అయితే..ఇలాటప్పుడు.. నా కొడుకు.. అందరిని పోగేసి  పెద్దపచ్చీసు గళ్ళు కట్టి  నా ఊపిరి తీసి మరీ ఆట ఆడేవాడు .. గవ్వలతో.. పందేలు వేసి..అందరిని ఓడకోట్టేవాడు. ఆ హంగామా గుర్తుకు వచ్చింది. అప్పుడు  నేను అనుకుంటూ ఉండేదాన్ని..పర్వాలేదు.. ఇంకా మానవ సంబంధాలు ఇక్కడ బాగానే ఉన్నాయి..అని. ..

 నగరం వచ్చి మా పల్లెలో.. కలిసినా.. పల్లె పట్టణ కలబోత  తో.. మా కాలని చాలా బాగుంటుంది.. అనుకుంటాను నేను.. అందరు అలా అనుకునే ఇటు వచ్చేసి బోలెడంత డిమాండ్ వచ్చేసి..అద్దెలు ఆకాశం అంటుతున్నాయి.. అని తిట్టుకుంటూ ఉంటాం లెండి మా హౌస్ ఓనర్  వినకుండా..

అసలు మేము ఈ ఇంట్లోకి వచ్చిన కొత్తలో.. నేను చాల బిజీగా ఉండేదాన్ని.. ఎవరితోనూ  పెద్దగా పరిచయం లేక కలవలేక పోయేదాన్ని. ఒక సంవత్సరం వరకు  అసలు.. ఈ బిల్డింగ్లో.. ఎన్ని వాటాలు ఉన్నాయి ఎవరెవరు ఉంటున్నారు.. ఏమిటో ..ఏమి.. తెలిసేది కాదు.. నేను ఎవరితోనో.. ఇలా చెపుతున్నప్పుడు నాకే  సిగ్గేసింది. మనం ఏమిటో.. తెలియాలంటే .. మన ఇరుగు పొరుగు తో.. ఉన్న సంబంధ బాంధవ్యాలు  చెపుతాయి..అంటాను..నేను.

మనిషి  సంఘ జీవి.ఇప్పుడైతే.. అంతర్ముఖి. ఎవరికి నచ్చిన ప్రపంచం వారిది. ప్రక్కవాళ్ళతో మాట్లాడటం అంటే పరమ బోర్. అవి  కాలక్షేపపు  బటాణి కబుర్లు.. భూతద్దం తో.. వెదికినా మనఃస్పూర్తిగా మాట్లాడే వారు లేరు.  నోటితో మాట్లాడతాలు.. నొసలు విరవడాలు.. మనం వెళ్ళగానే ప్రక్కనున్న ఇంకొకరితో మన గురించి మాట్లాడటాలు..  అంతస్తులు బేరీజు వేయడాలు.. ఇవన్నీ ఉంటాయనే వాటితో పాటు  నాకు నిజంగా తీరిక లేకపోవడం కూడాతో.. నేను.. ఎవరితో.. మాట్లాడేదాన్ని కాదు.  కాదు.. ఒక సంఘటన తర్వాత నేను మారిపోయాను. ఆ సంఘటన ఏమిటంటే.

 ఒకసారి మా ఎక్సరే  నెల నెలా వెన్నెల లో.. "మానవసంబంధాలు" అనే అంశం ని.. సూచించాను..ఆ.. అంశం గురించి మాట్లాడేటప్పుడు " మా పక్కింటావిడ కి నాకు చెత్త సంబంధం " అన్నాను. అందరూ..ఆశ్చర్యంగా చూసారు.. నిజమే! నేను చెప్పింది ..అన్నాను.. వివరణ ఇస్తూ.. నిజమే.. దాదాపు పక్క పక్కనే సంవత్సరం బట్టి ప్రక్కప్రక్క ఇళ్ళలో.. ఉంటున్నాం. కనీసం నేను పలకరింపుగా నవ్వినా ఆవిడ నవ్వదు.ఇంకా నేను ఆమెతో  ఏమి మాట్లాడను..? కానీ.. రోజూ మాత్రం ఆవిడకి నాకు ఒక సంబంధం .. అదీ.. చెత్త సంబంధం. అంటే.. మా ఇంట్లో చెత్తని నేను ఆవిడ ఇంట్లో చెత్తని ఆవిడ కలసి..  ఇద్దరం ఇద్దరికీ మద్యన ఉన్న స్థలంలో.. ఒకసారి వేస్తూ.. ముఖ ముఖాలు.. చూసుకుంటాం ..అంతే! అన్నాను. అన్న తర్వాత కానీ.. నాకు మా బిల్డింగ్ లో..ఉన్న ఎవరితో.. నేను మాట్లాడనని.. హటాత్తుగా గుర్తుకొచ్చింది. అంతే.. అప్పటి నుండి.. కొద్ది కొద్దిగా అందరిని పరిచయం చేసుకుని మాట్లాడుతున్నాను.. "ఏకాకి కాకుండా.. కాకుల కులం  అని  అయినా అనిపించుకోవాలని"..అన్నమాట. .

ఇప్పుడు.. అందరూ.. ఏ అవసరం వచ్చినా.. అక్కా.. అంటూ.. కొందఱు.. మేడం ..అంటూ కొందఱు .. ఆంటీ.. అంటూ కొందఱు నన్నే పలవరిస్తారు..కలవరిస్తారు. నీళ్ళు అయిపోయాయి మోటార్ వెయ్యమనో.. బయటికి వెళుతున్నాం ..మా వాళ్ళు వస్తే.. తాళాలు ఇవ్వమనో.. లేట్ అవుతుంది గేటు తాళాలు వెయ్యకండి అనో.. సిలిండర్ వేయించుకోండి కొద్దిగా ..అంటూ.. ఇలా.. అన్నమాట.మా ఇంటి ఓనర్ గారి కన్నా నేనే ముఖ్యం అందరికి..ఆఖరికి కోత్త వాళ్ళు ఎవరైనా వస్తే.. నేనే ఇంటి యజమాని అనుకుని నాకే చెబుతూ ఉంటారు.. అయ్యబాబోయ్! ఆవిడ వింటే ఎక్కడ ఫీల్ అవుతారో అని నాకు..బెంగ. వెంటనే.. నేను కాదండీ.. ఇంటి యజమాని ఆవిడే నండీ..అంటూ..సరిదిద్దే ప్రయత్నం చేస్తాను. .ఆవిడ మాత్రం  చాలా గొప్పగా.. ఇంట్లో ఉన్న వాళ్ళందరు  ఇంటి యజమానులే లెండి..అంటారు. అంతే కాదు. కాయగూరలు.. పళ్ళు.. ఏవి అమ్మేవాళ్ళు వచ్చినా.. చక్కగా బేరం ఆడి అందరిని  గొంతు పోయేటట్లు కేకలు పెట్టి మరీ కొనుక్కోమంటారు. ఎవరు చెబుతారు చెప్పండి అలా.. ఒకటి మాత్రం చెప్పడం మరచాను.. మా మూడో అంతస్తు లో.. ఉన్న ఒకావిడ నన్ను   ఆంటీ..అంటుంటే కోపం వచ్చేది. ముఖానే  చెప్పేసాను.. మీ పిల్లలకి ఆంటీ ని కానీ.. మీకు కాదు  అని. ఎందుకంటే ఆమె పిల్లలు.. ఇంజినీరింగ్ రెండవ సంవత్సరం చదువు  చదువుతున్నారు కాబట్టి. అది తప్ప ఎలాటి రిమార్కులు లేని  అందమైన ఇరుగు పొరుగు సంబంధ బాంధవ్యాలు మావి. కాఫీలు.. టీలు .. కూరలు..ఇచ్చిపుచ్చుకుంటూ.. ఏ.టి.ఏం కెళ్ళి డబ్బు తెచ్చుకున్నంత ఈజీగా అప్పు పుట్టించుకుంటూ .. రోగం, నొప్పి వస్తే.. ఓదార్పుగా పలకరించుకుంటూ..  హాయిగా ఉంటున్నాం. రేపు మా ఇంటి ఎదురుగా రెండు కుటుంబాలు ఉన్నాయి.. వాళ్ళు అసలు.. పలకరు.. అంటే వాళ్ళు మమ్మల్ని వెలివేశారు..అన్నమాట. రేపు వాళ్ళని కాఫీకి పిలవాలి. అన్నాను.. (nescafe ప్రకటన  చూశానులెండి. అది నాకు బాగా నచ్చింది.)  అందరూ ..అలాగే..అన్నారు. ఇక నేను చెప్పేదేమిటంటే ..


మన చుట్టూ ఉన్న ప్రపంచంలో..ఉన్న వారిని అంటరాని వారిగా  చూస్తూ.. ఎక్కడెక్కడో.. ఉన్న వారితో.. మొబైల్ చాటింగ్, నెట్ చాటింగ్ చేస్తూ.. కొత్తవారితో.. స్నేహాలు చేసినంతగా  అంత ఈజీగా ..మన ఇరుగు పొరుగు లతో.. మనం స్నేహం గా ఉండలేక పోతున్నాం. అకారణ ఈర్ష్యాద్వేషాలు.. అంతస్తుల బేరీజులు..మనుషులని విడగొడుతున్నాయి. మన ప్రక్కవారితో.. హృదయపూర్వకంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అప్పుడు అందరూ.. మనవారే.. అంటాను నేను. పడమటింట్లో.. సాయంసమయం దీపం పెట్టి "ఇరుగు చల్లన పొరుగు చల్లన " అనుకోవడం అంటే ఇలా.. ఉండటం అని..అనుకుంటూ.. ఉండగానే.. దీపాలు వెలిగాయి.. మెల్లగా.. ఎవరి వాటాల్లోకి వాళ్ళు.. ఎవరి మనసుల్లోకి వాళ్ళు.. రేపు సోమవారం ఎవరి పనుల్లోకి వాళ్ళు. నాకైతే.. రోజూ.. ఈ.. సమయానికి.. కరంట్ పోవాలి ..అనిపించింది.

కామెంట్‌లు లేవు: