15, ఆగస్టు 2013, గురువారం

రహస్య స్నేహితుడు

ప్రతి రోజు ... ఉదయాన్నే  ఓ  స్నేహితుడు నన్ను తన  చిరునవ్వుతో  పలకరిస్తాడు .   ఆ నవ్వు చూస్తే మురళీ మోహనుడు ఇంత మోహనంగా నవ్వి ఉంటాడా ? అని అనిపిస్తుంది. పెద్దగా నవ్వడం రాని నాకు...నవ్వడం నేర్పి వెళతాడు . ఎంత మంచివాడో కదా !

అలాగే సాయం సమయమప్పుడు వచ్చి గేటు  ముందు నిలబడి నేను కనబడే దాక వేచి ఉండి  మరీ నన్ను తన చిరునవ్వుతో పరామర్శించి వెళుతుంటాడు. దాదాపు అలా ఒక ఆరేడు నెలలుగా జరుగుతుంది

కనీసం ఆ స్నేహితుడిని నేను పలకరించను కూడా పలకరించను. తన పేరేమిటో,ఊరేమిటో కూడా తెలియదు. మా మధ్య ఏదో గత జన్మల బంధం ఉన్నట్టు నేను తనకి కనబడకపోతే అలాగే మా గేటు బయటే నిలబడి ఉంటాడు. కావాలని  నేను బయట కనబడకుండా అతనిని  పరీక్షించడానికి ఇంటిలోపలనే ఉండి కిటికీకి అమర్చిన పరదాల మధ్య నుండి చూస్తూ ఉంటాను . నేను కనబడేదాకా,  అతని చిరునవ్వు అంటువ్యాధిని  నాకు అంటించే దాకా అతను అక్కడినుండి కదలడని తెలిసాక . అయ్యో ! అతనిని అలా మా గేటు ముందు పడిగాపులు కాయించ కూడదు అని జాలి తలచి బయటకి వస్తాను. నన్ను చూడగానే మాములుగా నవ్వే నవ్వుకన్నా ఇంకా మోహనంగా నవ్వుతాడు, వెంటనే తుర్రు మంటాడు

ఉదయాన్నే అయితే నేను కనబడకపోతే ఏం చేస్తాడో  తెలుసా ? నేను వాకిట్లో పెట్టిన ముగ్గుని తదేకంగా చూస్తూ ఉంటాడు. నేను కనబడ్డాక  వెంటనే  వెళ్ళిపోతాడు

నాకైతే కొత్తలో చాలా చిత్రంగా అనిపించేది. రోజు ముగ్గు చూసి అది వేసిన నన్ను చూస్తాడు అనుకునే దాన్ని. అలా అని అతను  వాకిట్లో  ముగ్గులు వేయని మతానికి  చెందిన వాడిలా తోచలేదు. చెవికి పోగు కుట్టించుకుని హిందువుల  కుటుంబంలో పుట్టినతనిలా ఉన్నాడు. సరే జడ వేసుకోని నా రూపం వింతగా తోచేమో  అలా చూస్తున్నాడనుకునేదాన్ని. రోజులు గడుస్తున్న కొద్ది  ఇవేమీ కాదని నాకు అర్ధమై పోయింది.

ఈ రహస్య స్నేహితుడు ఏ జన్మలో నాకు స్నేహితుడబ్బా !? అనుకుంటూ గత జన్మ జ్ఞాపకాలలోకి వెళ్లి అతన్ని కనుక్కోవాలని అన్వేషణ మొదలెడతాను. ఊహు .. అది నీ వల్ల  కాదన్నట్లు అతని మనోహరమైన  ..ఓ .అల్లరి నవ్వు నన్ను తాకి వెళ్ళినట్లు ఉంటుంది. అతను  నాతో పలకపోవచ్చు కానీ  అతనిని ఛాయా చిత్రంలో బందిస్తుంటే మాత్రం వద్దని అనలేదు, అందుకే ఇలా బంధించి  అతనిని మీకు పరిచయం చేయాలని ఇలా వచ్చేసాను మీకు చూపాలని తెచ్చేశాను.

ఇదిగో .. ఇతడే ..నా గతజన్మల రహస్య స్నేహితుడు ...


నిన్న ఉదయం  వాకిట్లో ముగ్గు వేసుకుంటుంటే ఇలా దర్శనమిచ్చాడు. ఎంతటి గడుసువాడంటే  వెళ్ళేటప్పుడు అన్న రిక్షా తొక్కుతుంటే దర్జాగా కూర్చుని వెళతాడు. తిరిగి వచ్చేటప్పుడు అన్నని ఆ రిక్షా పై చెయ్యి కూడా వేయినివ్వడు. ఎంత కాన్పిడేన్సో ! 





ఈ రోజు ఇలా నన్ను పలకరించి నేను ఎంత పెద్దాడిని అయిపోయానో అని చెప్పీసి వెళ్ళిపోయాడు. నేను ఫోటో తీసుకుంటుంటే ... ఒకటే నవ్వుకుంటున్నాడు. 
చెప్తా ..చెప్తా .రేపటి  నుండి నేను దొంగాట మొదలెడతా ... అసలు కనబడను.  :) ఎందుకంటే ఈ ఫోటో చూస్తే ... నేను అప్రయత్నంగా చిరునవ్వులు చిందిస్తాను.

అనుబంధాల అల్లిక అంటే ఇదేనేమో ! జవం,జీవం ఉన్నప్పుడు అందరూ మనవాళ్ళేనని  నాకనిపిస్తూ ఉంటుంది.  ఎన్నాళ్ళొ  చెప్పలేను, కాని  ఇప్పుడు నా రోజును ఆహ్లాద భరితంగా చేసే ఈ గతజన్మల రహస్య స్నేహితుడికి .... 

సలాం -ఎ -ఇష్క్ మేరి జాన్ ... కన్నయ్యా .. !


14 కామెంట్‌లు:

జలతారు వెన్నెల చెప్పారు...

:) నేను చదవటం మొదలుపెట్టినప్పుడు సూర్యుడి గురించి రాస్తున్నారేమో అనుకున్నా..బాగుంది వనజ గారు.

Sharma చెప్పారు...

కాదేదీ కవిత కనర్హం అన్నారో మహా కవి శ్రీ శ్రీ .
ఈ రోజు మీ కధ చదివిన తర్వాత కాదేదీ కధ కనర్హం అనక తప్పదు .

buddhamurali చెప్పారు...

అనేక రకాల ఆలోచనలకు ఆస్కారం ఇచ్చే విధంగా శిర్షిక ఉంది ( అలానే ఉండాలి కుడా ) బాగుంది . వీలుంటే మీ రహ స్య స్నేహితున్ని స్కూల్ లో చేరి చదువుకోమని చెప్పండి . చురుగ్గా ఉన్నాడు . ప్రభుత్వ స్కూల్ లో చదువుకు ఖర్చేమి ఉండదు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జలతారు వెన్నెల గారు ... :) థాంక్ యూ !!!!!!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Sharma గారు పొరబడ్డారేమో! ఇది కథ కాదండి. వాస్తవం. పోస్ట్ కేదీ కాదనర్హం అంటే బావుంటుంది కదా ! ధన్యవాదములు

sphurita mylavarapu చెప్పారు...

బాగున్నాడండీ మీ రహస్య స్నేహితుడూ...:)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

బుద్దా మురళీ గారు .. నేను మీలా జర్నలిస్ట్ కాబోయి తప్పిపోయి .. ఇలా గృహిణిగా ఉన్నానండీ! టపా శీర్షిక పేలాలి :) తర్వాత కంటెంట్ సంగతి. కాదంటారా!? అలాగే మీ స్పందనకి ధన్యవాదములు
ఈ బుడత స్నేహితుడు బడికి వెళతాడు. సాయం సమయం వేళ స్కూల్ డ్రెస్స్ లోనే దర్శనమిస్తాడు. నేను ఇంకా అతనితో మాట్లాడటం మొదలెట్టట లేదండి. వాళ్ళ తండ్రిదనుకుంటా ఆ రిక్షా బండి. సరదాగా త్రోక్కుతున్నాడు అలా.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

స్పురిత మైలవరపు .. :) థాంక్ యూ !!

అజ్ఞాత చెప్పారు...

మీరు మాత్రమే రాయగల టపా :)

ధాత్రి చెప్పారు...

Soo cute.. :))

SRINIVASA RAO చెప్పారు...

daily enno vishayaaulu chusthumtaamu....casual gaa theesukuntaamu....Okaa chinna vishayaani(mee drushtilo kaadanu kondi) inthaa aahlaadangaa........hats up andi...

Manasa Chamarthi చెప్పారు...

మీకు ప్రేమించడమూ, ప్రేమించబడటమూ తెలుసండీ..అంతే...
అపరిచితుల్లా కనిపించే రహస్య స్నేహితుల చిరునవ్వులతో ఉదయాస్తమయాలను వెలిగించుకోగల గొప్ప హృదయం మీ సొంతం! అందుకే మీకతను మురళీమోహనుడయ్యాడు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మానస గారు .. మీ వ్యాఖ్యకి హృదయపూర్వక ధన్యవాదాలు .

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శ్రీనివాసరావు గారు ధన్యవాదములు .