21, ఆగస్టు 2013, బుధవారం

మనం నేర్పేదేమిటీ !?

ఈ చిత్రం చూడండి.... 

వారివురు కుశలవులు ఆమె సీతమ్మ .

శ్రీరామ చంద్రుడు అవతార పురుషుడు. మానవ రూపంలో వచ్చి  ఈ లోకానికి ఉత్తమ పురుషుడు ఎలా ఉంటాడో అని చాటి చెప్పడానికి వచ్చిన  ఆదర్శ మూర్తిగా  కీర్తిన్చుకుంటాం న్యాయానికి, ధర్మానికి, నైతిక విలువలకు ఒక ప్రతీకగా నిలిచిన ఉత్తమోత్తమ పురుషుడని మన ఇతిహాసాలు మనకి చెపుతున్నాయి

యుగాలు కాలధర్మంలో కలసిపోయినా జాతిని సన్మార్గం వైపు నడిపించడానికి ఇతిహాసాలను ఉదాహరించుకుంటూ మానవాళి ముందుకు నడుస్తుంది. నడవాలి కూడా . లేకపోతే నాశనం అయిపోతాము అని చెపుతున్నాను  
ఏమిటీ రామాయణం  చెపుతున్నాను  అనుకోకండి ...  ఆ  రోజు కొంతమంది పిల్లలకి చెపుతున్న విషయాలు నేను చిన్నప్పుడు  విన్నవే ! నేనైతే అలాగే విన్నాను మా పెద్దలు చెప్పినదానిని శ్రద్దగా విన్నాను మరి

ఇప్పటి తరం నేను చెపితే అలా వినరు . వారికి ఎన్నో సందేహాలు. వాలిని ఎందుకు చెట్టు చాటు నుండి చంపాడు , (సంపూర్ణ రామాయణం సినిమాని గుర్తుకు తెచ్చుకుంటూ  అడిగిన మాటలు ) సీతమ్మని అడవికి ఎందుకు పంపాడు . ఆమె అగ్ని పరీక్ష చేసిన తర్వాతే కదా  రాజ్యానికి వచ్చింది  ! ఒక చాకలి వాని మాట విని అడవికి పంపేశాడు . తర్వాతైనా ఆమె ఎలా ఉందొ విచారించాడా? గర్భిణీగా ఉన్న భార్యని వదిలేసి రాజ సౌధంలో కూర్చుని విలపించడం ఏమిటీ !? (బాపు శ్రీరామరాజ్యం  చూసారు లెండి )

అదే సీతమ్మ చూడు రాముడు నిర్దాక్షిణ్యంగా అడవికి పంపినా తానూ సీత నని చెప్పకుండా గోప్యంగా ఉంచి బిడ్డలని కని ఆ బిడ్డలని విధ్యాబుద్దులతో  పెంచి అయోద్యకి పంపడానికే ప్రాముఖ్యతనిచ్చింది.  .రాముడు ఉత్తమ పురుషుడు అంటావు ఏమిటీ .. కలియుగపు పెద్ద జోక్ ఇది అంటూ ఒకటే నవ్వు ...

లేదు లేదు రాముడు చాలా మంచి వాడు ఒకటే భార్య  - ఒకటే బాణం . తండ్రిమాట జవదాటలేదు. ఇంకా చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి . ఆయనే మనకి ఆదర్శం కావాలి . తప్పు అలా విమర్శించకూడదు కళ్ళు పోతాయి . లెంప లేసుకొండి.. అంటూ  .. "రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములీయ గలిగెనిందరికి" అంటూ మొదలెట్టాను . "ఆపమ్మా ఆపు .. వినలేము తల్లీ ! నీ భక్తిరస గీత మాలికలు " అంటూ ..ఎగతాళిగా దణ్ణం పెట్టేసారు

నాకు కోపం వచ్చి చెప్పేవాళ్ళు లేకపోతే చెడిపోతారు, చెపుతుంటే వినని వాళ్ళు చెడిపోతారు అంటూ విసుక్కుంటూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాను


ఇది రెండేళ్ళ క్రిందటి సంగతి . ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే ఈ తరం పిల్లలకి ఇలాంటి కథలు (క్షమించాలి ఇతిహాసాలు ) చెప్పి నమ్మించగలమా? అసలు రామచంద్రుడు లాంటి కొడుకులున్నారా? రామచంద్రుడు లాంటి ఏక పత్నీవ్రతుడు ఉంటున్నారా? ఇప్పుడు ఉన్నట్టే రామాయణం మన పూర్వీకుల కాలం నుండి  ఎట్ లీస్ట్ ఒక అయిదారు తరాలు ముందు నుండి అయినా  ఉంది కదా ! మరి ఆ రామాయణం ని విని చదివి కూడా  మన ఇండియన్ పురుషులు ఎందుకు మారలేదు . రాజులు ఎందుకు అన్నేసి పెళ్ళిళ్ళు చేసుకున్నారు.   మన భారతీయ  మహిళలు  సతీసహగమంలాంటి ఎన్నో దురాచారాలు ఎదుర్కున్నారు . వంట ఇంటికే పరిమితం అయ్యారు .  కన్యాశుల్కం, వరకట్నం ,లాంటి   సమస్యలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు నువ్వు చెప్పిన రామాయణం అప్పుడు ఉంది కదా ! ఆ రామాయణం ని అప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పే ఉంటారు కదా ! మరి వాళ్ళెందుకు వినలేదు ? రామునిలా ఎందుకు ఉండలేదు ? అని అడిగింది మా చెల్లిగారి అమ్మాయి  ఆ లాజిక్ కి నాకు దిమ్మ తిరిగి పోయింది (అమ్మాయి ఐఐటి స్టూడెంట్ )నేను నోటమాట రాక వింటూనే ఉన్నాను  అమ్మాయి తన మాటలు కొనసాగిస్తూ ....

అలాగే  రాముడిలాగా  భర్తలు వదిలేసిన భార్యలు ఎంతోమంది  ఉన్నారు . వాళ్ళు సీతమ్మ లాగా పిల్లలని పెంచుకుంటూనే ఉన్నారు. మరి మగవాళ్ళు రాముడిలాగా  ఉండటం ఎందుకు నేర్చుకోరు? సీతమ్మకి లాగా సహనంగా ఉండమని ఆడపిల్లల్కే ఎందుకు చెపుతారు పాపం సీతమ్మ ! ఎంత మంచి తల్లి ! ఆఖరికైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకుంది. అసలు అమ్మాయిలకి సెల్ఫ్ డిఫెన్స్  కూడా ఉండాలి . తనకి అన్యాయం జరిగితే గళం విప్పి ప్రశ్నించాలి. అంతే కాని ఎప్పటివో పురాణాలు చెప్పి అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పడం మానేయి. ఇప్పటి కాలం ఆడపిల్లలు తండ్రి చాటు బిడ్డలు, భర్త చాటు భార్యలు కాదు. పిల్లలకి తల్లిగా మాత్రమే ఉండే   రోల్ ఒక్కటే  కాదు  విద్య,. ఉద్యోగం,  వ్యాపారం, సాంస్కృతిక పర్యటనలు  చేస్తూ అన్ని దేశాలు గిర గిర తిరిగేస్తున్నారు.  భర్త రాముడిలా ఉత్తమ పురుషుడు కాకపోయినా సీతని అడవిపాలు చేసినట్లు చేసేవారు ఉన్నారు. మీరు  రామాయణంని నేర్పించాల్సింది  అమ్మాయిలకి కాదు ముందు అబ్బాయిలకి , నేర్పండి  అని చెప్పేసి .. వెళ్ళిపోయింది

అప్పటి నుండీ  ఒక ఆలోచన నా మెదడుని  తొలిచేస్తూనే  ఉంది . రామాయణం ని ఈ తరం పిల్లలకి ఎలా చెప్పాలి ? వాళ్ళ రిసీవింగ్ ఇలా ఉన్నప్పుడు ఇంకా .. అప్పుడెప్పుడో యుగాల కాలం లో జరిగింది అనుకుంటున్న,  కొన్ని శతాబ్దాల కాలం క్రిందట అక్షర రూపంలోకి వచ్చిన ఈ ఇతిహాసాలని కథలుగా మలచి ఎలా చెప్పగలం?
ఎలా ఉన్నాయో అలా  చెప్పి జాతికి మంచి మెసేజ్ వెళ్ళాలి సమాజం లో మంచి నెలకొనాలి   అంటే ఎలా కుదురుతుంది? అదసలు సాధ్యమా . .. చెప్పండి .. ? అంతకన్నా ముఖ్యంగా ఆడ-మగ మధ్య అసమానతలు, దౌర్జన్యాలు దాష్టీకాలు రాజ్యాలేలుతుంటే .. ఈ పుక్కిటి పురాణాలు శతాబ్దాలగా  విని జనం ఏం నేర్చుకున్నారు ఏమి ఆచరిస్తున్నారు అని అనుమానం వస్తుందంటారా, రాదంటారా?..

ఇంకోసారి పిల్లలకి ఇలాంటి రామాయణ, భారతాలు గురించి చెప్పే సాహసం చేయగలరా ? వాళ్ళ సందేహాలు తీర్చగలరా ? వాళ్ళ లాజిక్ కి పిచ్చేక్కిపోదు . మన అజ్ఞానం కి పెద్దరికం ముసుగేసి .. వారిని నోర్మూసుకోండి అని ఒక్క కసురు కసిరి .. అక్కడి నుండి మెల్లగా జారుకోము .

నేను అదేపని చేసాను.

మనం నేర్పెదేమిటీ.. వాళ్ళే మనకి నేర్పుతున్నారు అనుకుంటాను  కాదనగలమా !? మరి . మీరేమంటారు ???

11 కామెంట్‌లు:

పల్లా కొండల రావు చెప్పారు...

ప్రతీది ప్రదేశం-కాలం-పరిస్తితులను బట్టి ఉంటుంది.

రాముడు సుగుణాభిరాముడు-సీత మహా పతివ్రత. అందులో డవుట్ లేదు.

అయితే ఏవి సుగుణాలు? ఆ కాలం లో అవి సుగుణాలుగా ఉన్నవి తరువాతి కాలం లో సుగుణాలుగా ఉండాలా? వద్దా? ఇది పాయింట్ గా తీసుకునే శాస్త్రీయతను అలవరచుకుంటే మనం పిల్లలకు సరిగా చెప్పొచ్చు.

రామాయణం అనేది ఓ రచన అని, అది ఆ కాలామానపరిస్తితులలో వచ్చిన రచన అనేది గుర్తుంచుకోవాలి. అలా కాకుండా పాత చింతకాయ పచ్చడి అంటూ తీసేయడం ఎంత తప్పో అందులోని అన్ని అంశాలు రైటే అని వాదించడం అంతే తప్పు.

సీతను అడవికి పంపడం - అగ్ని ప్రవేశం లాంటి అనేకం ఆనాటి భూస్వామ్య సమాజపు అవలక్షణాలు. అవి ఆ సమాజపు నీతిగా ఉన్నాయి. అది నీతి అవుతుందా? కాదా? అనేది శాస్త్రీయ ధృక్పథం తో ఆలోచిస్తే వాదించడమెలాలో, వాటినుండి ఏవి గ్రహించాలో తెలుసుకోవడం - తేల్చుకోవడం కష్టం కాదు.

రామాయణంలో చెప్పిన అనేక మంచి విషయాలు నేడు ఎందుకు ఆచరణకు సాధ్యం కాకుండా పోతున్నాయో ఆలోచించాలి. డబ్బు కు మాత్రమే ఎందుకు విలువనిస్తున్నారో అర్ధం చేసుకోవాలి.

రామాయణం ఆధారంగా మాత్రమే గాక రామాయణంలో చెప్పిన మంచిని నిలబెట్టాలన్నా - రామాయణంలో చెప్పినవాటిలో ఏవి తప్పో, ఎందుకు మార్చుకోవాలో తెలియాలన్నా రామాయణం విన్నా - చదివిన్నా తప్పు లేదు.

నా అభిప్రాయంలో రామాయణం కల్పవృక్షమూ కాదు - విష వృక్షమూ కాదు.

ఇతర రచనల లాగానే రామాయణంలో అనేక మంచి విషయాలను మాత్రం మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. ఇప్పటికీ మన సమాజాన్ని ప్రభావితం చేస్తున్న రామాయణాన్ని నెగిటివ్ గా రొడ్డకొట్టుడుగా విమర్శించడం వల్ల ప్రయోజనం కంటే ప్రమాదమే ఎక్కువ.

Narsimha Kammadanam చెప్పారు...

https://www.youtube.com/watch?v=qUl_PRhLnA0

ఈ విడియో రామున్ని రామయణాన్ని అర్థం చేసుకోవడానికి సహకరించవచ్చు.
అమ్మాయిలకి కాదు ముందు అబ్బాయిలకి చెప్పండి....అనే మాటకి సమాధానం తేలిక అండీ అందరికీ చెపాలి చెప్పడం లో భాగంగా ఎవరు ముందుంటే వారికే చెప్తాం కానీ కనిపించిన వారికి చెప్పడానికి లేని అబ్బాయిలని ఎక్కడనుండి తెస్తాం?.

Meraj Fathima చెప్పారు...

వనజా, ప్రతి కావ్యం లోనూ మంచి చెడులు ఉంటాయి. అయితే ఆ మంచి చెడులు కూడా కాల పరిస్థితులను బట్టి అనుసరించటం లేకపోవటం జరుగుతుంది. హరిశ్చంద్రుడు సత్యం పలికాడు కాని ఇప్పటి పరిస్థితులలో అది సాద్యం కాదు, కానీ మీ వివరణ సమ్మతమే కానీ ఆచరణ యోగ్యమే అసాద్యం. మీ శైలి ఎప్పటికీ గొప్పదే.

Sharma చెప్పారు...

రామాయణ మహాభారతాలు , పురాణేతిహాసాలు ఆయా దేశ కాల మాన పరిస్థితులకు ప్రతిబింబాలు .
అలాగే అందరు మానవులు వుండాలనుకోవటం అతి పెద్ద తప్పిదం . ఎందుకంటే రెండు యుగాల భేదమున్నది ఆ ఆలోచనాసరళిలో .
ఇక్కడ ఒక ముఖ్యవిషయం మనం గుర్తుంచుకోవాలి . ఈ ప్రపంచంలో ప్రతిదీ పుట్టుక పుచ్చుకొని , గిట్టి మరల పుట్టుక పుచ్చుకొంటాయి . ఇందువలన రాను రాను పుట్టుకైతే పుచ్చుకుంటున్నాయి గాని ఆ శక్తి సామర్ధ్యాలు కాన రావు . ఇదే కదా పోతులూరి వీరబ్రహ్మం గారు గ్రహించి చెప్పిన కాలజ్ఞానం .
కనుక అందులో ఒక్కొక్క యుగంలో ఎన్నో తరాల అంతరాలుంటాయి . ఇలాంటప్పుడు ఆ నాటి రామాయణ , మహాభారతాలు , పురాణేతిహాసాల లోని పరిస్థితులు లేవు , నీతులు పనికి రానివే నేటి కాలానికి .
ఆ నాడు ఆడవాళ్ళను గృహనిర్బంధం చేసి మీ బాగోగులు మేం చూసుకొంటాం , బైటకి రాకండి అని శాసించారు . తదనుగుణంగా నడుచుకొన్నారు .

నేడు ఆ పరిసరాలు కావు , పరిస్థితులు లేవు .

ఇక మీ వాళ్ళ అమ్మాయి మిమ్మల్ని అడిగిన తీరు ప్రశంసనీయమే .
నిజమే ఒక్క అమ్మాయిలకే బహు జాగ్రత్తలు , అదే ఇంటిలోని ఆ అమ్మాయి అన్నతమ్ములకు నీతులు చెప్పలేరు .నియమాలు నిర్దేసించలేరు మన సభ్య సమాజంలో . అంటే అనాదిగా తరతరాలుగా , యుగయుగాలుగా ఆడవాళ్ళకే ఎక్కడెక్కడి నియమాలు .

బాపు గారి శ్రీరామరాజ్యం చిత్రం చూసిన తర్వాత , రాముడు ఎంత ఛండాల , కుటిల మనస్తత్వీకుడొ స్పష్టంగా అర్ధమైంది . బహు గొప్ప స్వార్ధపరుడు , కీర్తి కండుతి అధికంగా కలవాడు అని అర్ధమైంది .

ఆ రామాయణ మహాభారతాలు , పురాణేతిహాసాలను అంత గొప్పగా రచించిన ఆ నాటి మహానుభావులకు నా వ్యక్తిగత అభినందనలు . ఇన్ని యుగాలు
దీన్ని బట్టి మనకు తెలియవచ్చేది ఏమిటంటే , మన రచనలలో నేటి దేశ కాల మాన పరిస్థితులను కళ్ళకు కట్టినట్లుగా వ్రాయగలిగితే , మనవి ముందు తరాలవారికి ,మార్గదర్శకాలు అవుతాయి అని .

చివరగా ,
మనం విన్న ఆ కధలలో తప్పులున్నాయని మనకే తెలిస్తున్నప్పుడు , ఆ తప్పులను నీతులుగా చెప్పి ఎలా నమ్మించగలం ? ఆ పై ఆ తప్పులను ఎలా ఆచరించమని చెప్పగలం ? అందుకే వాటిని అలా వదిలేయటమే మంచిది .

ఈ నాటి దేశ కాల మాన పరిస్థితులకు అనుగుణంగా మనం చెప్తే వాళ్ళుచక్కగా , శ్రధ్ధగా వింటారు . ఆచరణయోగ్యం చేస్తారు . అలాగని చెడుని ప్రోత్సహించమని ఎవరూ చెప్పరు .

శ్యామలీయం చెప్పారు...

దయచేసి అందరూ నా మనవి ఆలకించండి,

రాముడి గురించి తెలుసుకోవాలంటే వాల్మీకిమహర్షిగారి శ్రీమద్రామాయణం ఒక్కటే‌ ఆధారం. ఆ తరువాత వివిధపురాణేతిహాసాల్లో ఉన్న రామ కథా విషయాలు ద్వితీయ శ్రేణి ఆధారాలు.

అనంతరకాలంలో భగవద్భక్తులూ ఆర్షధర్మనిరతులూ అయిన మహానుభావులు వాల్మీకం ఆధారంగా రాసిన కథలూ, నాటకాలూ, రామాయణగ్రంద్రాలు ద్వితీయశ్రేణి ప్రమాణాలు.

ఈ‌నాటి సినీమాలూ, నాటకాలూ, రకరకాల ప్రతిభలు కల ఆధునికులు రకరకాల దృక్కోణాల్లోంచి వండి వార్చిన కథలూ, నవల్లూ విమర్శనలూ అసలు ఏ మాత్రం ప్రమాణాలు కావు.
ఎవరో స్వంతపైత్యంతో రామాయణం పట్ల అరకొర అవగాహనలతో సినిమాల్లో దృశ్యాలూ డైలాగులూ కల్పిస్తే వాటితో రామాయణ కథనూ దానిలోని పాత్రల స్వభావస్వరూపాలనూ అంచనా వేయటం తెలివితక్కువతనం.

మీకు నిజంగా రాముడి గురించో సీతగురించో తెలుసకోవాలంటే వాల్మీకి రామాయణాన్ని, వాల్నీకి దృష్టితో చదవండి - ఆధికపు పోకదల కళ్ళజోళ్లతో కాదు. ఇప్పటి కిప్పుడు రామాయణం వాల్నీకం చదవలేరా? మరి విమర్శలు చేయటానికి ఆలోచన ఉంటే ఎంతక్ష్టం అయినా, జీవిత కాలం వెచ్చించి అయినా శ్రధ్ధగా వాల్మీకిరామాయణం తెలుసుకోండి.

అల్పపాండిత్యంతోనూ అపాండిత్యంతోనూ రాముడిమీదా సీతమీదా తీర్పులు చెప్పటం అవివేకం.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శ్యామలీయం గారు .. మీ విలువైన వ్యాఖ్యకి హృదయపూర్వక ధన్యవాదములు. రామాయణాన్ని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మార్చేసే ఉంటారు అందులో ఎలాంటి సందేహం లేదు. కాలక్రమేణా అనేక కల్పనలు, వక్రీకరణలు జరిగి ఉంటాయి.వాల్మీకి రామాయణాన్ని వాల్మీకి దృష్టిలో చూడటం అంటూ జరిగితే రామాయణం అమృత కావ్యమే! ఎలాంటి వ్యాఖ్యానాలు ఉండవు. వాల్మీకి మహా ముని దృష్టి అందరికి సాధ్యం కాదేమో కదా!
మీకొక సారి నేను చెప్పినట్లు గుర్తు. భావి తరాలకి రామాయణం అంటే ఏమిటో తెలియదానికైనా మీరు బ్లాగ్ వ్రాయాలి అని.
వాల్మీకి రామాయణం ని అందుబాటులోకి తెస్తే బావుంటుంది అలాగే పిల్లలకి అర్ధంయ్యేటట్టు చెప్పే ఓర్పూ,నేర్పూ కూడా ఉండాలి . అది లేకనే .. ఎవరి వాదన వారిడిగా ఉంది. ఈ విషయంలోనే కాదు లెండి. చాలా విషయాలలో. మీ స్పందనకి మరో మారు ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కొండలరావు గారు మీ వ్యాఖ్యతో నేను ఏకీభవిస్తాను . విలువైన మీ స్పందనకి ధన్యవాదములు. మా పిల్లల తో నేను తర్కించ లేకపోతున్నాను. :)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

narasimham గారు ధన్యవాదములు . మీరు ఇచ్చిన లింక్ ఉపయుక్తం .

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మేరాజ్ మీరు అన్నది అక్షరాల నిజం . కాని చెడు వైపే ఆకర్షితులు అవుతారు. అర్ధం చేసుకునే వయసు వచ్చాక కాని అర్ధం అవదు. బహుసా మనకి ఆ స్టేజ్ దాటినాక గాని అర్ధం అయినట్లు. :) థాంక్ యూ !

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Sharma గారు ఈ నాటి దేశ కాల మాన పరిస్థితులకు అనుగుణంగా మనం చెప్తే వాళ్ళుచక్కగా , శ్రధ్ధగా వింటారు . ఆచరణయోగ్యం చేస్తారు..

ఈ విషయం ఆశాజనకంగా ఉందండి. ధన్యవాదములు

శ్యామలీయం చెప్పారు...

>భావి తరాలకి రామాయణం అంటే ఏమిటో తెలియదానికైనా మీరు బ్లాగ్ వ్రాయాలి.

అమ్మా, మీకు నా మిడ అభిమానానికీ, నమ్మకానికీ కృతజ్ఞతలు.
రామాయణాన్ని విమర్శించటానికి, ఎద్దేవా చేయటానికీ ముందుకు దూకే నేటి తరం మనుష్యులు సీతారాముల గురించి తెలుసుకోవటానికి ఏమీ ఆసక్తి చూపించరు. ఈ‌ మాట అనుభవ పూర్వకంగా చెబుతున్నాను. మీకు తెలుసు, నేను శ్యామలీయం బ్లాగులో "పాహి రామప్రభో" అనే శీర్షికను కొన్ని నెలలుగా నడుపుతున్నాను. రోజుకు ఒక పద్యం చొప్పున. ఈ‌మధ్యనే శ్రీరామచంద్రులవారి మానసిక పూజా విధానం మీద కంద పద్యాలు వ్రాసాను, వివరణలతో సహా. చదివే వాళ్ళు లేరు.

ఇలా ఎవరూ చదవటం లేదని నేను అప్పుడప్పుడు అనటంతో నాకు చదువరులు లేరన్న బెంగ ఉందని ఒక అభిప్రాయం వ్యాపించే పరిస్థితి ఉంది. నిజం‌ కాదు. నేను నా రాములవారి కోసం వ్రాసుకుంటున్నాను. ఎవరైనా చదివి ఆనందిస్తే మరింత సంతోషం. అంతే.

ఈ మధ్య కాలంలో శ్యామలీయం భాగవతం అనే కొత్త బ్లాగు తెరచి పోతనగారి భాగవతం వ్ర్రాస్తున్నాను వరస టపాలలో. కొద్ది మంది చదువుతున్నారు. ఈ‌ యజ్ఞంలో కష్టేఫలీ శర్మగారి ప్రోత్సాహం ప్రేరణా ఉన్నాయి.

రామాయణాన్ని గురించి వ్రాసే సాహసం ఇప్పట్లో చేయకపోవచ్చు. భాగవతం పూర్తికావటానికే కొన్నేళ్ళ్య్ పడుతుంది. భగవంతు డనుగ్రహిస్తే, అప్పుడు ఆలోచించ వచ్చును.