5, ఫిబ్రవరి 2022, శనివారం

చైతన్యం ఆవిరైతే నైరాశ్యమే గతి

మేఘ రాగమ్ -2

ప్రియనేస్తం నీలాంజనా..


ఎలా వున్నావ్!  కొత్త సంవత్సరంలోకి ప్రవేశించాం అన్నమాటే కానీ పెద్ద ఉత్సాహం యేమీ లేదు. పైగా నిరాశ వైరాగ్యం కలగాపులగంగా యాంత్రికంగా కొత్త కేలండర్ ను చూడటం మొదలుపెట్టాం అంతే అనిపించింది నాకు. 


  కోవిడ్ -19 రూపం మార్చుకుని ఒమిక్రాన్  గా విరుచుకుపడుతున్న ఈ కాలంలో మరొకమారు భయం  గుప్పిటలోకి మనం బంధింపబడబోతున్నాం. ఇపుడిపుడేగా కొంచెం కోలుకుని సాధారణ స్థితిలోకి వస్తున్నాం అనుకుంటున్న తరుణంలో చెదలు రేగినట్టు అలజడి రేగింది. నేను కొంచెం ముందుగానే ఒకింత అతిగానే ఊహించుకుని ట్రావెల్ బేన్ విధించకమునుపే దేశాన్ని దాటి కొడుకు గూటికి చేరుకున్నాక బోలెడంత భద్రత లభించిందని సంతోషించాను. ఆనందించాను. దాదాపు ఇరవై నెలలు భయం గుప్పిట్లో ఒంటరితనంతో మానసిక అశాంతితో అతిభారంగా రోజులు గడిపిన తర్వాత లభించిన సంతోషం వెల కట్టలేనిది కదా! 

 

అలా ఒక పదిరోజులు గడిపానో లేదో.. మళ్ళీ అనేక దిగుళ్ళు మనసును కమ్మేసాయి. దేశీ సమాచారం కోసం ఛానల్ మార్చితే చాలు. ఒక నైరాశ్యం అలుముకుంటుంది. ఒకటి రెండూ చానెల్స్ మినహా అన్నింటిలోను అమరావతి రైతుల పాదయాత్ర గురించిన వార్తలే! ప్రత్యక్ష ప్రసారాలలో మహిళా రైతుల ఆవేదనను చూస్తే దుఃఖం కల్గింది. ప్రత్యక్షపోరాటంలో భాగస్వామ్యిని కాలేనందుకు త్రాణం సిగ్గిల్లింది. 


అమరావతి ప్రాంతం నుండి ఒక ఉద్యమం ప్రారంభమైనది. నిజానికి ఆ ఉద్యమం రెండేళ్ళ క్రిందటే మొదలైంది కానీ మన రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలని వారు ప్రారంభించిన ఈ యాత్ర ఎన్నో కష్టనిష్ఠూరాల మధ్య ఎందరో ధూర్తులు దుష్టపన్నాగాలు పన్నినప్పటికి  అవాంతరాలు కల్పించినప్పటికీ వాటిని ఎదుర్కొంటూ వారు ముందుకు సాగిన పోరాటపటిమ అభినందనీయం. ఎంతోమంది ప్రజల ఆదరభిమానాల మధ్య ఎంతో ఉత్సాహంగా సాగినతీరు చూస్తే ఒడలు పులకరించింది. రాజధాని ఉద్యమానికి  ప్రజలందరి మద్దతు లభించి విజయవంతమైనది కదా అనే గర్వం మధ్య ఒక అసంతృప్తి కూడా వెంటాడుతుంది. 


తమ భావాలను ఆలోచనలనూ అక్షరాలగా మార్చి వెదజల్లే వనితలు మనస్సును కదిలించగలరు.మేధస్సూ గొంతుకలు కల్గిన వనితలు ప్రపంచానికి తామేమిటో తెలియజేయగలరు అనుకునేదాన్ని. కానీ పొట్టకోసినా అక్షరం ముక్క రాని సాధారణ స్త్రీ మూర్తులు పండు ముదుసలి స్త్రీలు కూడా గళమెత్తి పదం  కలిపి రెండేళ్ళ పైబడి పోరాటం చేస్తున్నారు. ధ్వంసమవుతున్న కల కేవలం ఆ ప్రాంతం వారివే కాదు. రాష్ట్ర భవిత కూడా. అయితే  ఒకరే ఇద్దరో తప్ప మనలాంటి కవులు రచయితలూ కళాకారులు ఎవరూ కూడా అమరావతి మహిళా రైతుల ఉద్యమానికి సంఘీభావం ప్రకటించలేదు. అది ఎంత దురదృష్టకరం. 


సాహిత్యంలో కృషి చేసిన మహిళలు గురించి వల్లె వేసే   రచయిత్రులు ప్రజాపోరాటాలను ఉద్యమాలను ఓ వాలు చూపుతో గమనించి గమనించనట్లు గెంతుకుంటూ వారి స్థానాన్ని స్థాయిని పెంచుకుంటూవుంటారు తప్ప నిజమైన ఉద్యమాలకూ అమరావతి ప్రజల పోరాటానికి మద్దతునివ్వరు వారి గురించి ఒక ముక్క వ్రాయరు మాటాడరు. వీరు కాగితపు పులులు. సామాజిక చైతన్యం రాజకీయ చైతన్యం లేని ఏ వ్యక్తిగత చైతన్యమైనా బానిసత్వంలో మగ్గాల్సిందే.

మేథావుల మౌనం మంచిది కాదు. వారు స్వప్రయోజనాలకు తలవొంచినంత కాలం వారితోపాటు వారి జాతిని అథఃపాతాళానికి తోసేస్తారన్నది పచ్చి నిజం కదా!


మనచుట్టూ వున్న సమస్యలకు స్పందించని వారు ఆప్ఘనిస్తాన్ లో జరిగే పరిణామాల పట్ల అక్కడ స్త్రీలు పిల్లల పట్ల స్పందిస్తున్న తీరు చూసి ఆశ్చర్యం నవ్వూ రెండూ వచ్చాయి. కవులంటే రచయితలంటే లాలిత్యం కలవారు అని కదా అర్దం. మరి వీరేమిటి ఇంత లౌల్యం కలిగివున్నారు అనిపించింది. అందుకే ఒక పుస్తకం చదవాలని కానీ ఒక కవిని కానీ రచయితను కానీ కలవాలనే ఉత్సాహం ఆసక్తి మంటగలసిపోయాయపుడే!


 చరిత్రను చదివినపుడల్లా స్త్రీలు చేపట్టిన ఉద్యమాలు విజయం సాధించడానికి కొంత జాప్యం జరగవచ్చేమో కానీ  యెపుడూ పరాజయం పొందలేదు అనుకున్నాను.


అమరావతి రైతులు తమ తాత ముత్తాతల నాటి నుండి వారసత్వ  సంపదగా ఘనతగా  వచ్చిన భూములను పెద్ద మనసుతో రాష్ట్ర రాజధాని కోసమిచ్చి  ఇప్పుడు రోడ్డున పడ్డారు. తమ బిడ్డల భవిష్యత్ తో పాటు భావిపౌరుల భవిష్యత్  బాగుంటుందని భావించిన వారికి వారి బిడ్డల భవిష్యత్ ను ముళ్ళకంపలపై ఆరేసామని అర్దమై ఆవేదన చెందుతున్నారు. 29 గ్రామాల ప్రజల జీవన విధ్వంసానికి పాల్పడుతున్నది   రాజ్యమే అయితే వారి గోడు న్యాయదేవతకు తప్ప వేరెవరికి విన్నవించుకోగలరు. వారి వేదన మాటున అణువణువు అగ్నికణం రగులుతుంది. వారి గోడును చోద్యం చూస్తూ అవహేళన చేస్తూన్న కొందరిని చూస్తే అసహ్యం విరక్తి కల్గుతుంది.


ఎక్కడ చూసినా గనులను లోడేస్తు కొండలను తవ్వేస్తూ తీరాలను ఆక్రమిస్తూ ధనదాహం భూదాహం  అంతా దాహం దాహం. ఈ దాహాలను తీర్చుకోవడానికి రాజకీయ రాబందులు మనిషిని సాధారణంగా బ్రతకనీయడంలేదు. ప్రతి మనిషి మనిషి కాకుండా మట్టి కాకుండా మతం కులం అయిపోయారు. ఆ అమరావతి ప్రాంత  ప్రజలందరూ కొక్కిరాయి తగిలిన పిట్టల్లా కముకుదెబ్బ తిన్న ఎనుముల్లా జీవచ్చవాలుగా జీవనం బండి లాగుతూ కనబడుతున్నారు. అయినా అలుపెరుగని ఉద్యమం చేస్తున్నారు. వారి ఇక్కట్లు పట్ల సహానుభూతి ప్రదర్శించడం తప్ప నేనూ ఏమీ చేయలేకపోయాను. నిర్వేదంతో చూస్తూ వుండిపోవడం అపుడపుడు ఇలా ఆక్రోశం వెళ్ళగక్కడం తప్ప. అన్యాయాలను ప్రశ్నిస్తే రాజకీయ అరాచక మూకలచేత ట్రోల్ చేయబడటం మినహా ఏమీ కానరావడం లేదు.


మనిషికి తోటి మనిషే కాదు సతుల్ సుతుల్ హితుల్ అంతా డబ్బు కంపు కొడుతున్నారు. మంచి అన్నది కొంచెమైనా మిగిలినప్పటికి  ఏ రంగు రుచి వాసన లేని రుతువుల ధాటికి ప్రకృతి కి తలొంచక తప్పడంలేదు. 


ఏ రాజకీయ నాయకుడైనా దోచుకోవడానికి దాచుకోవడానికి వచ్చినవాడు తప్ప ప్రజల సంక్షేమం కోరుకుంటూ.. ప్రజారంజకంగా పాలించడానికి వచ్చినట్లు కనబడతుందా.. అసలు ఆ రోజులు వస్తాయా? సొంత ఊరులో బ్రతకలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. గత ఏడాది మన రాష్ట్రం నుండి ఏభై అయిదువేల మంది పిల్లలు ఉన్నత విద్య పేరిట విదేశాలకు వలస వెళ్ళారట. భావితరాలకు భవిష్యత్ అగమ్యగోచరమైన చోట నిరాశ కారు మేఘాలు కమ్ముకోవడం సహజమే కదా! అనేక దేశాల మధ్య యుద్దం వ్యాపారం అయిపోయింది. త్రాగేనీరు వ్యాపారం అయిపోయి రెండు దశాబ్దాలు దాటింది. పీల్చేగాలి వ్యాపారం కాబోతున్న దురదృష్టకరమైన రోజుల్లోకి మనం నెట్టబడుతున్నాం. చుక్కలనంటుతున్న ధరలు, సామాన్యుడి నడ్డి విరుస్తున్న పన్నుల మోత. వీటన్నింటి మధ్య నిరాశ నైరాశ్యం కాక ఏముంది చెప్పు? ఏమి చూసి విడవలేని మమకారంతో సొంత ఊరిలో వుండగలం అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను.


నీలోనూ నాలోనూ వొక మనిషున్నాడు. వాడిలోనూ కీకారణ్యం వుంది.  కులం మతం రంగు వేసుకున్న రాజకీయ మృగం  వాడిని మాయం చేస్తూ  వుంది. ఏదో వొక జెండా కత్తిని చేతపట్టి మరో మృగాన్ని వేటాడే తర్ఫీదు నిస్తుంది. కచ్చితంగా ఇక్కడే మనిషి మాయమైపోతున్నాడు.ఒక బాధ్యత కల్గిన పౌరుడు కూడా మాయమౌతున్నాడు. ఏదో వొక రంగు జెండాను తొడుక్కుంటున్న  మనుషుల ముఖాలను  బిక్క ముఖం వేసుకుని చూస్తూ  తిరణాలలో తప్పిపోయిన పసిపాపలా నేను నీవు మరికొందరూ.. అందరూ ఇలాగే వగస్తున్నారనుకుంటా. 


నువ్వక్కెడో ఆస్ట్రేలియా లో నేనిక్కడ అమెరికా సంయుక్తరాష్ట్రాలలో.. కానీ మన మూలాల గురించి అంతులేని వ్యధతో ఈ విషయాల ముచ్చట. మన తర్వాత మన పిల్లలకు మూలాలపై ఆసక్తి అనురక్తి రెండూ లేవనిపిస్తుంది. వారికి కావల్సిందేమిటో వారికి స్షష్టంగా తెలుసు. ఏది ఎక్కడ వదిలేయాలో వారికి స్పష్టత వుంది. మన పిల్లలతో మనను మనం పోల్చుకోకూడదు కానీ.. పిచ్చి మనసు ఊరుకోదు. నేను నా కుటుంబం నా ఇల్లు లాగానే నా ఊరు నా రాష్ట్రం నా దేశం అంటూ ఊగిసలాడుతూ ఇలా ఆలోచిస్తూ బాధపడుతున్నాం. నాకెందుకో  మణిరత్నం “అమృత” సినిమా బాగా గుర్తొస్తుంది. మనిషి చెట్టుకొకరు పుట్టకొకరూ పరాయీకరణ కావింపబడిబోతున్నారా.?


మన ప్రాంత ప్రజలంతా  కూడా అలా దూరంగా విసిరివేయబడుతున్నారా.. దిగులేస్తుంది నీలాంజనా! బ్రతుకు భద్రత కరువై తల్లులూ బిడ్డలూ  విడదీయబడుతున్నారా? మన లాగానే తల్లులు బిడ్డల సాంగత్యం కోసం అలమటిస్తారా.. వద్దు వద్దు. వద్దమ్మా వద్దు. అలాంటి దుస్థితి ఎవరికీ రాకూడదంటే ఉన్నచోట బతుకు భద్రత వుండాలి. ఆ బాధ్యత మనం ఎన్నుకున్న నాయకుల కర్తవ్యం కదా! అదే లోపించింది ఇక్కడ. ప్చ్ 😢


 ఉదయం తొమ్మిదింటికి కూడా మేలుకోని అట్లాంటా నగరంలో మంచు పొరల మధ్య బద్దకపు ముసుగు తొలగించుకుని ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తుంటే మన ఊరు మన గాలి గుర్తుకొచ్చి ఉక్కిరిబిక్కిరై పోయి వెనువెంటనే అయినవాళ్ళతో గొంతు కలిపాను. వారితో పాటు కౌలు రైతుకు ఫోన్ చేసాను. రెండో పంట వేయవద్దన్నారమ్మా.. పదును పోయాక మరో పంట అదీ అపరాలు అసలు వేయలేం. భూమి ఖాళీగానే వుందమ్మా అన్నాడు. పచ్చగా అలరారు భూములను బీడు భూములుగా మార్చడం  వెనుక  ఉన్నది రాజకీయమే. అలా చేయడం మొదలైందనిపించినపుడు అదోరకం నైరాశ్యం అలముకుంది. మన రాష్ట్రం బాగుండాలి మన వాళ్ళందరూ బాగుండాలి… అని మనఃస్పూర్తిగా కోరుకుంటూ వుండటం తప్ప ఏమి చేయగలం. 


కాసేపు మన చిన్నప్పటి రోజులు తలచుకుంటూ ఆకాశం వైపు చూస్తూ ఆ జ్ఞాపకాలలో మునిగిపోయాను. అనంతమైన ఆకాశం, లెక్కించలేని నక్షత్రాలు మనందరికీ గొడుగు పడుతున్నట్టూ  మన హృదయాలు, ఆత్మ దాని లయతో నృత్యం చేస్తున్నట్టూ  ఊహించుకుంటూ ఎన్నో కబుర్లు చెప్పుకుని మురిసిపోయాం.  ఇపుడు నువ్వు నేను నిలబడిన నేల వేరు వేరు కావచ్చు కానీ ఒకే ఆకాశాన్ని అవే నక్షత్రాలనూ చూస్తుంటాం. కానీ నా భావనలు నీ భావనలు వేరు వేరుగా వుంటాయేమో. అలాగే ఈ మనుషులందరూ ఒకే సమస్యను చూస్తున్నా  స్పందనలు మాత్రం వేరు వేరు అనుకుని నిట్టూర్చడమే !


ఏమి వ్రాయగలను.. మంచి తరుణం కొరకు వేచి చూడటం తప్ప . ఉంటాను మరి.

                                                            ప్రేమతో.. ప్రియ నేస్తం

                                                                “అమృత”



కామెంట్‌లు లేవు: