5, ఏప్రిల్ 2012, గురువారం

గడపదాటని స్త్రీ ల జాబితాలో నేను

ఈ రోజు ఒక సంఘటన విని.. చాలా భాదపడ్డాను. ఆడపిల్లలకి ఏ మాత్రం భద్రతా లేని మాట నిజం. ఒక వారం రోజుల క్రితం పొలం పనులకి వెళ్ళిన పదహారేళ్ళ అమ్మాయి పై కొందరు భూస్వాముల కొడుకులు సామూహికం గా అత్యాచారం చేసి పరారైపోయారు. అమ్మాయి తరపు వారు పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు. నేరం నిరూపితం అయింది.కానీ వాళ్లకి శిక్ష పడటంలో జాప్యం,సాక్ష్యాలు తారుమారు ... అత్యాచారం లో పాల్గొన్న వారు.. డబ్బు,అధికారం,పలుకుబడితో.. ఏ విధమైన శిక్ష లేకుండా అదేదో..ఘనకార్యం అనుకుని.. తలెత్తుకుని తిరుగుతుంటే..శరీరానికి అయిన గాయం కన్నా..మనసుకి తగిలిన గాయం తో అత్యాచారానికి గురి అయిన అమ్మాయి మాత్రం ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ అమ్మాయే కాదు ..ఆయేషా..మరణానినికి కారణం అయినవారు కూడా మా కళ్ళముందు నిత్యం దర్జాగా తిరుగుతుంటే.. రక్తం సల సలా మరిగిపోతూ ఉంటుంది. ఆయేషా తల్లిదండ్రుల పోరాటం చేసి చేసి అలసి పేదవాడి చేతకానితనంగా మిగిలిపోయింది నేరారోపణ వీగిపోయింది. దోషులు ఎవరో.. తెలిసినా న్యాయం జరగని వ్యవస్థలో.. చాలా మంది అమ్మాయిలు గుర్తుకు వచ్చి చాలా బాధ కల్గుతుంది కూడా. ఒక నత్త గుల్ల కూడా..తన ఉనికి కి ప్రమాదం కల్గుతుందని ఊహించిన క్షణలో.. తన షెల్ లోకి తానూ ముడుచుకుని తనని కాపాడుకోగల్గుతుంది. ఈ నాటి ఆడపిల్లకి అలాటి రక్షణ కూడా లేని స్థితిలో నత్తగుల్లకన్నా..హీనమైన స్థితిలో.. బతుకులు బుగ్గిపాలు అవుతూ ఉన్నాయి. కాముకత్వం నిడిన లోకంలో..ఆడపిల్లలు ఒంటరిగా మెలగడం అన్నది ఎంత అరక్షితం అయిపోయిందో. కంటికి రెప్పలా ఆడపిల్లలని కాపాడుకోవడం తమ కర్తవ్యమ్ గా చేసుకుని ..అమ్మలు వారిని కనిపెట్టుకుని ఉంటున్నారో! నిత్యం ఎంతో మంది చిన్న చిన్న పిల్లలపై..జరిగే లైంగిక దాడులు. పసి మొగ్గలపై..కాముకత్వం చేసిన రాక్షస క్రీడలు. వింటుంటేనే భయం,గగుర్పాటు. అమ్మలు బిడ్డలని జాగ్రత్తగా పోదివిపెట్టుకోవడం.. ఎవరిని నమ్మరాని పరిస్థితి లో వారిని కాపాడుకోవడం చాలా కష్టమైపోతుంది. స్త్రీల పై సాముహిక లైంగిక దాడి ఎంత అమానుషం . ఎంత అతిహేయం. ఆడవాళ్ళ భద్రతకి ఎంత మాత్రం ఆస్కారం లేని రోజులివి. నిత్యం ఎక్కడో ఒక చోట ఆడదానిగా పుట్టిన పాపానికి వావి వరస,వయసు తారతమ్యం లేకుండా లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎవరైనా పురుషుడి పై ప్రతీకారం తీర్చుకోవాలంటే .. వారి ఇంటి ఆడవారిని అతి నీచంగా తిడుతూ అవమానపరచాలి. లేదా వారి పై దాడులకి పాల్బడాలి. చరిత్రలో రాజులు,రాజ్యాలు కాలంలో కూడా అంతే! ఎందుకంటె..స్త్రీల మాన మర్యాదలు కేవలం స్త్రీలకి మాత్రమే కాక ఆ కుటుంబానికి,లేదా ఆ రాజ్యానికి వారి శౌర్యపరాక్రమాల్కి సంభందించిన విషయాలు. పరాయి రాజులు రాజ్యాలపై దండెత్తినప్పుడు..వారి అంతఃపురాలని చుట్టుముట్టి రాజకుటుంబాల స్త్రీలని బంధించడం వారి పట్ల అమర్యాదగా ప్రవర్చించడం ఉండటం మూలంగా ఆనాటి అంతఃపుర స్త్రీలు పరాయి వారి దాడులు జరిగినపుడు వారి చేతికి చిక్కకుండా ప్రాణత్యాగం చేసుకునే వారు. ఇప్పటి కాలంలో ఇంకా ఎక్కువ అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. స్త్రీ ని భయకంపితం చేసి చెరపట్టి..శారీరకంగా హింశించి..మాససికంగా చంపి.. బలహీన మనస్కిపై జరిపే అత్యంత జుగుప్సాకరమైన అతి నీచమైన చర్య.. మానభంగం. అది సామూహికంగా జరపడం మృగ లక్షణం. మృగాలు కూడా.. అయిష్టత వ్యక్తీకరించిన మరో జంతువూ పై.. లైంగిక దాడికి పాల్పడవేమో! వివేకం కల్గిన మానవుడుని చూసి ఆ జంతువులూ సిగ్గుపడే కాలం లో మనం బ్రతుకుతున్నాం.. మన పరిధిలో ఆడవారిపై.. లైంగిక దాడి జరిగినప్పుడు..వాళ్లతో మాట్లాడం కూడా పాపం చుట్టుకుంటుంది..అనే విధంగా ప్రవర్తించే మనుషులని చూస్తుంటాం. వారిని వేలివేసినట్లు,ఘోరమో,నేరమో చేసినట్లు చూడటం కన్నా.. వారికి సానుభూతి చూపడం కన్నా ..వారికి అండగా నిలబడి..దైర్యం చెప్పి ఒక మానసిక ఆలంబన కలగచేసి ఉంటె.. ఇలాటి మరణాలు ఉండవు కదా..అనుకున్నాను. మన భారతీయ సమాజంలో..తామంతట తాము విశృంఖలత్వంతో.. నడుచుకునే వారు ఉండవచ్చు. అలాటి వారు ఉన్న సమాజంలోను . దేహశీలతకి అత్యంత విలువనిచ్చే వారు కూడా కలసి ఉన్నారు. లైంగిక దాడిని శరీరానికి మాత్రమే జరిగిన గాయం గా భావిస్తూ. అతి తేలికగా తీసుకునే మనస్తత్వం లేదు. అలాటప్పుడు..మరణమే శరణ్యం అనుకునే వారు.. బలవన్మరణం పాలబడుతున్నారు.. నువ్వేమి చేశావు పాపం ..నిన్నెక్కడ అంటుకుంది..మలినం.. పాటలని,సినిమాలని మెచ్చుకునే మనం అదంతా..రెండు గంటల సినిమాకే పరిమితం అనుకుంటాను. నిజ జీవితంలో వేలివేసినట్లే ఉంటున్నాం. అప్పుడెప్పుడో..వాకపల్లి లో జరిగిన ఉదంతం అంతే! ఇప్పటికి వారికి న్యాయం జరుగనే లేదు. అవమామానమైన స్థితిలో.. సగం చచ్చి బ్రతుకున్న వారికోసం అప్పుడు..నేను వ్రాసిన కవిత. ఆ సంఘటన జరిగినప్పుడు.. "భూమిక" ఆధ్వర్యంలో ఒక యాత్ర చేపట్టి వారి వద్దకు వెళ్లి రచయిత్రులందరూ.. వారికి అండగా నిలిచి గళం కలిపారు. 

ఆ నెలలోనే.. అక్టోబర్..భూమికలో ప్రచురితమైన ..నా కవిత ఇది.

  ఒక మౌనం వెనుక 

 కాలం ఏదైతేనేం .. కారణాలు ఏదైతేనేం ... 
సాధించాడటానికి, శోధించటానికి, 
శోభిల్లడానికి అబలల శరీరాలే కావాలి .. 
కూడబెట్టుకోవాదానికో, దోచిపెట్టడానికో .. 
సహజ సంపదలే కావాలి... 

 ఈ కల్కి యుగంలో మానమర్యాధాలని కాపాడటానికి ..
 ఏ గోపాలుని అదృశ్య హస్తం రాదని, 
విరబోసిన కురులకి రక్తతర్పణం చేయగల పతి ఉండడని తెలుసు.. 
 
నట్టడవిలోను, నడిరోడ్డు పైనా 
ఆత్మ రక్షణకై కూడా చంపడానికి వెనుకాడే ఆ చేతులు 
నరకడం కూడా తెలిసిన ఆ చేతులు .. 
న్యాయం కోసం అర్దిస్తాయి 
సిగ్గు విడిచి ఆక్రోశిస్తాయి.. 

 పాలెగాళ్ళ నేరాల గుట్టుని విప్పని రాక్షస రాజ్యంలో 
రాజకీయరాబందుల వీక్షణంలో 
 తీక్షతని కోల్పోయినా.. 

చేయని తప్పుకి - ఏలినవాడి సానుభూతికి మధ్య 
ప్రశ్న తలెత్తి రుతువుల కాలమానం తో .. 
మానని గాయం పై ముల్లులా గుచ్చుతూనే ఉంది. 

 పచ్చిగాయాలు పచ్చగా ఉండటం
 మన తప్పు కాదు తల్లీ.. చెల్లీ..!!
 దారి తప్పిన మదగజాలని ప్రయాసకోర్చి పట్టి 
జంతుశాలకి పంపిన నాగరికులకి 
గూడాలపై బడిన మృగాలని శిక్షించలేక 
న్య్యాయం కళ్ళు మూసుకుంటే 
 ఆటవిక న్యాయం కన్నుతరచి కుక్షిని చీల్చ లేకా కాదు... 
వధ్యశాలకి పంపడం చేతకాక కాదు .. 

వేటాడం, భూమిని దున్నడం తెలిసిన 
వారికి సానబెట్టం తెలుసు.. 
మూగ భావాలతో గుండెల్ని తడమడం తెలుసు. 
బాణాలతో .. గుచ్చి చంపడం తెలుసు.. 

 అలసిన న్యాయ పోరాటాల వెనుక, 
ఆయేషా కథ మలుపుల మధ్య మరో.. 
పూలందేవిన్ల ఆవిర్భవంకి బీజం పడే ఉంటుంది. 
 ఈ.. అత్యాచారాల నెలవులో .. దురంధురుల కొలువులో.. 
ఎన్నో దురాగతాల సాక్షిగా.. 
మౌన సంఘటితాల మధ్య శక్తుల కొలుపు జరుగుతూనే ఉంటుంది. 

ఒక మౌనం వెనుక,,, 
ఒక విస్ఫోటనం ఉండనే ఉంటుంది.. 
అరణ్య రోదనలోను .. ఆరని కసి .. 
నివురుకప్పిన నిప్పులా.. ఉంటుంది .. 
 గాయ పడిన పులి పంజా రుచి చూపడానికి పొంచి ఉంటుంది. 
మూగపోయిన కలం నాలుక 
చీలిక చీలికలుగ మారి దునుమాడటానికి సిద్ధంగానే ఉంది.. 



 (ఏమిటో.. స్పందన వ్రాతలకే మిగిలిపోతుందని..భాదపడుతూ) ఏమన్నా మాట్లాడితే..మనకెందుకు..అదొక తలవంపుల సమస్య.. అంటూ..కనులుండి చూడలేని ఈ దురదృష్టకర వ్యవస్థలో ... బాధితుల పట్ల సానుభూతి చూపడానికే ఈ రాతలు తప్ప.. గడపదాటని స్త్రీ ల జాబితాలో నేను ఒక సగటు స్త్రీని. అంతే!ప్చ్.. :-(