25, ఏప్రిల్ 2012, బుధవారం

ఊరు ఎందుకు వెళ్ళాలి!?

వేసవి కాలం వస్తుందంటేనే.. ప్రతి ఇంటికి .. ఓ..కొత్త ఆనందం పుట్టుకొస్తుంది. పదినెలల పుస్తకాల మోతతో .. అక్షర సాగరంలో పరీక్షా నావ నెక్కి ..మునిగామో,తేలామో.. కాస్త ప్రక్కన పెట్టి సేదదీరాలని ఓ..ఒడ్డున పడతారు.. పిల్లలకే పరీక్షలు కాదు. పెద్దవాళ్ళకి అంతకన్నా భయంకరమైన పరీక్ష కదా!

ఇక కొంత మంది పిల్లలకైతే.. చదువుల  నుండి విముక్తే లేదు. సమ్మర్ కోచింగ్ లు.కంప్యూటర్  క్లాసులు.. విధివిధానంగా ఉండనే ఉంటున్నాయి. ఈ యాంత్రిక మైన నగర జీవనం నుండి పిల్లలని కాస్త పల్లె వైపు అడుగులు వేయించి .. వారికి పల్లె లని పరిచయం చేస్తే..చాలా బాగుంటుంది కదా అనుకుంటే అక్కడ ఎవరున్నారు.. ? సందేహం..పుట్టుకొస్తుంది. ఎందుకంటే..మన అనుకున్న అందరూ కూడా పట్నవాసులు గా మారి ఓ..తరం గడచిపోయింది.  మా ఇంటి పిల్లలు ముద్దుమురిపెం గా..  ఎక్కడికి వెళ్ళే వీలు లేని పరిస్థితి. 
అమ్మమ్మ ఉండి   ఉంటె.. వెళ్ళేవాళ్ళం కదా ..అంటారు పైకే! మేమేమో.లోలోపల అనుకుని మూగబోతాం.  ఈ యాంత్రిక జీవనం నుండి కాస్తంత బయట పడి..స్వేచ్చగా,హాయిగా ఉండే చోటుకి వెళ్లాలని మనసు ఉబలాటపడుతుంది. అలా ఉండగల్గే చోటు.. మా వూరు ఒక్కటే! అయితే .. . 

నాకు మా ఊరు వెళ్ళాలంటే భయం . అక్కడంతా.. మొండి గోడలు,నిర్మానుష్య వీధులు..పలకరించే వారు లేక.. టీవీల మోత లో ..ప్రక్కన నడచి వెళ్ళేవారిని  కూడా పట్టించుకోని మైమరపుల మధ్య.. గ్రామీణులు..పట్టణ పోకడల్ని అరువుపుచ్చుకుని..ప్లాస్టిక్ నవ్వులని వెదజల్లడం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది .

 ప్రతి ఇంటి ముందు పశువుల కొట్టం లేకపోయినా.. ఏ  హీరో..హోండా నో..  ఠీవి గా నిలబడి ఉంటుంది. ఉన్న ఒక బస్సు  ఆటో ల తాకిడికి చిత్తు అయిపోయి కొన ఊపిరితో ఉన్నట్టు  ఉండి ఉండక  మొక్కుబడిగా తిరుగుతుంటుంది. పల్లె ముఖ చిత్రం దాదాపుగా ఇదే! ఇంటింటికి సాఫ్ట్ వేర్  ఇంజినీరో.. విదేశి నివాసో..ఉంటున్నారు. ఆత్మీయత .కల్లాకపటం ఎరగని మనుషులని అనుకునే వాళ్ళలోను కాస్తంత బాగానే"గీర" కనబడుతుంటుంది.

ఇప్పుడు మా పిల్లలని తీసుకుని వెళ్లి అక్కడ ఏం పరిచయం చేయగలం.. ? మా జ్ఞాపకాలలో ఇంకా సజీవంగా మిగిలి ఉన్న ఆనందాన్ని వాళ్లకి పరిచయం చేయగలమా!?

వేసవి వచ్చిందంటే.. ఎన్ని అదనపు సోయగాలు..  గుండు మల్లెలు, సన్న జాజుల పరిమళాలు.. ఆరు బయట మంగళగిరి నూలుతో చేసిన నులక అల్లిన మంచాలు పై పడుకుని చల్లగా అప్పుడప్పు తాకే చిరు గాలి తాకిడిలో.. చిరు చెమటల చిత్తడిలో..  వడియాల పులుసులు, కొత్త ఊరగాయ పచ్చళ్ళ రుచి, సాయంత్రం వేళ ఏ పచ్చి పులుసో, పప్పు చారు తోనో వడియాలు నంజుకుని తింటుంటే వచ్చే ఆనందం.. ఏ గార్డెన్ రెస్టారెంట్ లో కూర్చుని తింటుంటే రాదు కదా!  

పచ్చని తోటల్లో ఎగబడి కోసే అనేక రకాల కాయలు,పండ్లు..తాటి ముంజెలు,ఈతకాయలు,సీమతుమ్మ కాయలు, చింత కాయలు,మామిడి కాయలు..పనస కాయలు,ముంత మామిడి కాయలు..,విరగబడి కాసిన మునగ చెట్లు.. ఆలస్యంగా వచ్చే పైరు వేరు సెనగ కాయలు.. ఓహ్.. ఎన్నని చెప్పం? 

అలాగే తిన డానికి పనికి రాని కాయలు.కూడా ఎన్నెన్నో!.ఎర్రటి,నల్లటి కలబోతతో..అందంగా కనబడే గురివింద గింజలు, గచ్చకాయలు..  బూరుగ చెట్లు.. ఎన్ని .. వర్ణాలు... ఎక్కడ వాటి ఆచూకి వెతికి ఇవ్వగలం. ? 

చెరువులు ఎండి పోయి.. బావులు అడుగంటి..  మంచి నీటి బావి మాయం అయి.. మినరల్ వాటర్ ప్లాంట్ లు వెలిసి.. "శివుని శిరం నుండి.. వాటర్ బాటిల్ లో కి ఒదిగిన  గంగమ్మ పరవళ్ళు ని చూసి విచారము  ముంచుకొస్తుంది.

మా వూర్లో ఏ ఇల్లు చూసినా వాస్తు పిచ్చితో.. నామ రూపాలు లేకుండా మారిపోయి..మండువా లోగిళ్ళు,  పెంకుటిల్లు ,తాటాకు ఇల్లులు  స్తానే.. కాంక్రీట్ ఇల్లులు కనబడుతుంటాయి.  కాలికి మట్టి అంటని సిమెంట్  రోడ్లు సాదించిన ప్రగతికి ఆనవాళ్ళు గా దర్శనమిస్తాయి.

పాల సేకరణ  కేంద్రం స్థానం లో.. విజయ డైరీ పార్లర్ కనబడుతుంది. లైబ్రరీ లో  పుస్తకాలు స్థానంలో  రెండు మూడు టీవిలలో..క్రికెట్,సినిమాలో..సాక్షాత్కరిస్తూ ఉంటాయి.. ఉన్న జనాభాలో సగాని కి పైగా ఏబైలు పై బడిన వారు. .యువతంతా.. చదువుల కోసం, మధ్య వయస్కులంతా వ్యాపారం పేరిట విజయవాడ, ఉద్యోగస్తులు వివిధ నగరాలలో.. సెటిల్ అయిపోయి.. పల్లె నిరక్షరాస్యుల ఉనికి తో.. కాలం వెల్లబుచ్చుతుంది. అక్కడికి  మా పిల్లలని తీసుకుని వెళ్లి ఏ ఘనమైన ఆనవాళ్ళని చూపించగలం!?

జనానికే కాదు..ఊరుకి వృద్దాప్యం వచ్చినట్లు ఉంటుంది.. ఏ వృద్దులని కదిలించినా.. ఊరు పొమ్మంటుంది..కాడు రమ్మంటుంది..అని అంటారు. 

పుట్టిన ఊరు అనే మమకారం తప్ప మన అనే అనుకునే సంబందీకులు లేక.. ఒక పూట అయినా ఆత్మీయంగా వడ్డించే వారు లేక.. ముఖమున ఇంత కుంకుమ బొట్టు పెట్టి..రవిక ముక్క పెట్టె ప్రేమ లేకపోయాక.. మా వూరు ఎందుకు వెళ్ళాలి అనిపించడం తప్పు కాదు కదా!

అక్కడ అన్నీ ఉన్నా.. అమ్మ లేని ఆ ఇంట ..నాన్న కూడా  ఉన్నారు.. ఆయనే చేయి కాల్చుకుంటూ..పుట్టిన గడ్డపై..మమకారం చావక.

కన్న తల్లి-జన్మ భూమి ని ఎవరు ఇస్తారు?  ఎన్ని సంపదలు ఉన్నా.. నా అన్న వాళ్ళు కరువైతే ఇలా అనిపించక తప్పదు. సిరివెన్నెల గారు..అన్నట్లు.. "పదుగురితో పంచుకొని ఆనందమైనా పచ్చికైన పెంచలేని ఎడారి కదా!"..అని .
ఓ..నాలుగు ఏళ్ళ క్రితం మా అబ్బాయిని తీసుకుని నేను వెళ్ళినప్పుడు.. నాలో కల్గిన బాధకి గుర్తుగా.. ఈ కవిత   వ్రాసుకున్నాను. 

ఇది చూడండీ..

21 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

సొంత వూరి పై మమకారాన్ని, ఆర్తిని చక్కగా వ్యక్తీకరించారండి . టపా చదువుతుంటే, నా సొంతూరి జ్ఞాపకాల మరీచికలు కంటి ముందు కదలాడాయి.

satya చెప్పారు...

okkasari ga maaa vuruni gurthuki techaru .... eppati palle prajallo apyayatha chala taggipoyaye... kani palleturu vathavaranam matram alane vundi ... pachhani pirrlu, pilla gallu .. , ennenno pakshulo.. enno chjettu ( meru cheppina ) ... avulu , gedhalu ... ela anni enka mana ee palleturilo vunnaye ... eeppatiki palleturilo andaru aru bayate ne padukuntaru .... evvanii ante enti amma ??? ani pillalu adigite tharuvata manam answer cheyalemu kadha ... andukey pillalani eppudunna ee palleturiki tesukelladam chala manchidani naa vudhesham ...
thank you

లక్ష్మీ శిరీష చెప్పారు...

చాలా బాగా చెప్పారు అండి. నిజం గా మన రోజుల్లో "వేసవి సెలవులు" ఆటవిడుపే ! ఇప్పటి పిల్లలకి అసలు సెలవలు అంటే - నిరంతరాయం గా TV చూడటం. మీరు చెప్పినట్టుగా పల్లేటుళ్ళ ముఖచిత్రం మారిపోయిందని నేను ఎకీభవిస్తాను. మీ కవిత కుడా చాల బాగుంది .

మానస.. చెప్పారు...

మీలోని ఆవేదన అర్ధం చేసుకోగలను... మీ కవిత బాగుంది.
మనం చెయ్యగలిగినది ఏముందండీ!!!

నే చిన్నప్పుడు .. హాస్టలు నుంచి సెలవలకి వూరిలో బస్సు దిగి మా ఇంటికి నడుస్తూ వుంటే..కనపడిన వాళ్ళందరూ ఆప్యాయంగా "చినబాబూ" అని పిలిచి.. పలుకరిస్తే... :) మరోసారి ఉరు వెళ్ళినప్పుడు వాళ్ళకు కనపడకుండా త్వరగా ఇంటికి పారిపోవాలని ప్రయత్నించే వాడిని. :)

ఇప్పుడు అలా ఎవరన్న పిలిస్తే.. ఆశగా పలుకరిద్దమన్నా!!.. ఏదో.. మీరన్నట్టు..అంతా నటన.. పై పై మెరుగులు.... పై పై పలుకరింపులు..

సంపాదన రేస్ లో పడి.. స్వచ్ఛతను కోల్పోయాము....
అదృష్టవంతులు.. కనీసం ఆ అనుభవాలను అన్నా పంచుకోగాలుగుతున్నారు


"ఇప్పుడు మా పిల్లలని తీసుకుని వెళ్లి అక్కడ ఏం పరిచయం చేయగలం.. ? "
- నా అని చూడకపోతే!.. చాలా మంది వుంటారు. ఇప్పటికీ బస్సు కూడా రాని పల్లెలు ఇంకా చాలా వున్నాయి.

"మా జ్ఞాపకాలలో ఇంకా సజీవంగా మిగిలి ఉన్న ఆనందం ని వాళ్లకి పరిచయం చేయగలమా!? " - చెయ్యొచ్చు..... మీరు active part తీసుకుని...
ఖర్చు పెట్టడానికి వెనుకాడకపోతే... తప్పకుండా.. చెయ్యొచ్చు.
చలా మంది.. అలా గడుపడానికి ఆశపడుతూనే వుంటారు... అలాటి వారందరూ కలిస్తే.. :) సాధ్యమే...!

రసజ్ఞ చెప్పారు...

ఏ దేశమేగినా ఎందు కాలిడినా, పుట్టి పెరిగిన నేల మీద మమకారం పోదుగా! నాకూ మా ఊరంటే చాలా చాలా ఇష్టం. ఎప్పుడెప్పుడు వెళ్దామా అనిపిస్తుంది! హ్మ్మ్ కాని ఏం చేస్తాం??? వేసవి, పండుగలు, ఎప్పుడూ ఏదో ఒకటి ఇంటి మీద బెంగని పెంచడానికి :(

జలతారువెన్నెల చెప్పారు...

మా అమ్మమ్మాగారి ఊరు వెళితే కూడా ఆ పూర్వ వైభవం లేదండి.
చిన్నతనంలో అక్కడ గడిపిన రోజులు కూడా ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాను.
కవిత కూడా చాలా బాగుందండి వనజ గారు

Meraj Fathima చెప్పారు...

Madam,నాకూ అనుభవం ఐంది ఇరవై సంవత్సరాల తర్వాతా ఊరెళ్తే. ఈ ఆవేదన నేనూ అనుభవించాను. మార్పు సహజం కదా. మీ ఆవేదన బాగా వ్యక్తం చేసారు.

అజ్ఞాత చెప్పారు...

మావూరొచ్చెయ్యండి.మేం పేదవాళ్ళం ఏం పెట్టలేముకాని మమత పంచగలం.

అనగనగా ఓ కుర్రాడు చెప్పారు...

నేను చాలా కాలం గా నేను పెరిగిన పల్లెటూరు నా పిల్లలకి చూపించాలని అనుకుంటున్నాను. మీ టపా చదివాక తొందరపడాలేమో అనిపిస్తోంది లేక పోతే మా ఊరికీ వృద్ధాప్యం వచ్చేస్తుందేమో...

ఫోటాన్ చెప్పారు...

>>ఇంటింటికి సాఫ్ట్ వేర్ ఇంజినీరో.. విదేశి నివాసో..ఉంటున్నారు. ఆత్మీయత .కల్లాకపటం ఎరగని మనుషులని అనుకునే వాళ్ళలోను కాస్తంత బాగానే"గీర" కనబడుతుంటుంది.<<

నిజం అండీ..
మీ కవిత బాగుంది.

వనజవనమాలి చెప్పారు...

రామ కృష్ణ గారు.. ధన్యవాదములు. మన తరం కి పల్లెటూరి జ్ఞాపకాలు అయినా మిగిలాయి. ఇప్పటి తరానికి ఆ జ్ఞాపాకాలకి బదులు చదువుల ఖార్ఖానా మాత్రమే గుర్తు ఉంటుంది. దయనీయం కదండీ!
@ సత్య గారు..ఇప్పటి తరం పిల్లలని తప్పకుండా పల్లెటూర్లకి తీసుకు వెళ్లి వ్యవసాయ రీతుల్ని పల్లె ప్రజల జీవన విధానం ని తప్పకుండా పరిచయం చేయాలి. మీ స్పందనకు ధన్యవాదములు.
@ లక్ష్మి శిరీష గారు.. ధన్యవాదములు. కథా సుధ ద్వారా .మన తెలుగు బాషని, నీటి కథల ద్వారా భావితరాలకి పరిచయం చేస్తున్నతీరు అభినందనీయం.

వనజవనమాలి చెప్పారు...

మానస గారు.. మీ స్పందనకి ధన్యవాదములు. మీరు అన్నట్లు.. కొంచెం శ్రద్ద తీసుకుని.ఖర్చు పెట్ట గల్గితే..
నిజమేనేమో!పల్లె నుండి పట్టణానికి రావడమేకాని..మళ్ళీ వెనక్కి వెళ్ళే ఉద్దేశ్యం లేకపోవడం మూలంగా నేమో పల్లె నిర్మానుష్యం అయిపోతుంది. పట్టణం పల్లెకి వెళితే కాని ఆ లోటు పూడుతుంది.కానీ ఆధునికంగా..

వనజవనమాలి చెప్పారు...

రసజ్ఞ .. మీరు జన్మ భూమి పై దిగులు పడటం సహజమే కదా! కానీ కొన్నాళ్ళ తర్వాత మీరు ఆ వూరు వెళ్ళేటప్పటికి ఆ వూరు ఆనవాలు మారితే.. అక్కడ మనం మనగల్గే వీలు లేనట్లు ఉంటే మన వాళ్ళు అన్నవారి ఆదరణ లేకుంటే.. బాధ కదా.. అలాటి అనుభవం ఎదురైతే.. మనకి ఆ ఊరిపై యెంత మమకారం ఉన్నా వెళ్ళ లేకపోయే విరక్తి కల్గుంది. ఆ ఆవేదనే..ఈ పోస్ట్. పల్లె ఆనవాలని మిగిల్చుకునే ప్రయత్నం చేయాలి .. అది మీతరం చేయగలరేమోనమ్మా! థాంక్ యు!

వనజవనమాలి చెప్పారు...

జలతారు వెన్నెల గారు.. మీ స్పందన కి చాలా చాలా సంతోషం. మరి మరీ ధన్యవాదములు.

వనజవనమాలి చెప్పారు...

మేరాజ్ ఫాతిమా ..గారు.. మీ స్పందనకి.. ధన్యవాదములు.
@ కష్టే ఫలే..మాస్టర్ .. మీ అభిమాన పూర్వక ఆహ్వానానికి కనులు చెమర్చాయి అండీ!!
ప్రేమ అభిమానాలు కావాలి కాని ఆస్తులు-అంతస్తులు కాదండి. మీ ఆహ్వానానికి కృతజ్ఞతలు. తప్పకుండా వచ్చే ప్రయత్నం చేస్తాము.

వనజవనమాలి చెప్పారు...

అనగనగా ఓ..కురాడు..గారు.. తప్పకుండా.. మీ వూరికి పిల్లలని తీసుకుని వెళ్లి చూపండి. వీలయితే..పల్లె తూరిలో అప్పుడప్పుడు ఉండే ప్రయత్నం చేయండి. మీ స్పందనకి ధన్యవాదములు.

వనజవనమాలి చెప్పారు...

పోటాస్.. గారు.. పల్లెలలో మార్పుని మీరు గమనించారా!? నిజం కదూ! మీ వ్యాఖ్య కి ధన్యవాదములు.

శ్రీ చెప్పారు...

వనజ(వనమాలి)గారూ!
పల్లెల్లో ఆప్పటి ఆప్యాయతలు,
అనురాగాలు,
ప్రేమలు,....
అన్నీ కాలం తుఫానులో దూది పింజెల్లా
ఎగిరిపోయాయనిపిస్తోందండీ!...
మీ రచన బాగుంది...
@శ్రీ

జ్యోతిర్మయి చెప్పారు...

ఊరు గురించి పిల్లలకు చాలా కబుర్లు చెపుతాను. వెళ్లి చూసేసరికి అవి కాశీ మజిలీ కథలైపోయాయి.

oddula ravisekhar చెప్పారు...

బ్లాగులున్నాయి కాబట్టి సరిపోయింది.ఈ మాత్రం జ్ఞాపకాలయినా పంచుకోవటానికి.చాలా బాగా వ్రాశారు ఊరి గురించి.

వనజవనమాలి చెప్పారు...

Thank you very much..Ravi shekhar..gaaru.