నాశనం చేసినదాన్ని చూసి దుఃఖించడానికి కాదు
ఎలా నాశనం అయ్యిందో పరిశీలించడానికి కాదు
నీ పురాతన ఆత్మ అక్కడ సంచరిస్తున్న ఆనవాళ్ళు కూడా వున్నాయనే ఎరుక తో వచ్చాను.
ఈ పరిసరాల్లో ఈ ప్రకృతి లో ఆ సూర్యోదయాల్లో ఆ గాలిలో ఆ పువ్వుల్లో తెరవబడక బావురుమంటున్న పుస్తకాల్లో మనసు చిలికిన ఆ కవిత్వంలో వానకు తడిసి పరిమళాలు వెదజల్లుతూన్న మట్టిలో.. ఏవో నిశ్శబ్ద వర్ణ చిత్రాల గుసగుసల్లో నువ్వు జీవిస్తున్నావని.
సగం తెరిచి వుంచిన తలుపు
సగం మాత్రమే పంచుకున్న మనసు
అర్ధోక్తి తో ఆగిపోయిన మాటలు
ఏనాటికైనా పూర్తి అవుతాయనే ఆశను కూకటివేళ్లతో పెకిలించిన ఆ పరువు హత్య
లోకం దర్పణంలో ముక్కలై ఏడుస్తున్న నా ప్రతిబింబాన్ని చూసి జాలిపడుతూ ఎగతాళిగా నవ్వుతూ మీరు
లోపల యుద్ధం జరిగినాక వెలుపల యద్ధం చేయాల్సిన పనిలేదు.
శాంతి పతాకం యెగరేయడం మినహా
ప్రపంచానికి తెలియని రహస్య దుఃఖాలను మోస్తున్న నేను
నీ ఆత్మ ను వెదుక్కుంటూ వచ్చాను వస్తూనే వుంటాను నాశనం చేయలేని ప్రేమతో
నీవు హృదయాన్ని మాత్రమే ఇచ్చావు
నేను జీవితాన్నే విడిచి వచ్చాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి