కథలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కథలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, జులై 2026, గురువారం

పర్సనల్ స్పేస్

 

మిత్రులారా! సరి కొత్త కథ “పర్సనల్ స్పేస్” చదవండీ.. ఈ మధ్య రచయిత గా చచ్చేంత చావు వచ్చి పడుతుంది కథ రాస్తే ఇది కథ కాని నిజమైన కథా? అంటారు. పోనీ కథ కాని కథ రాస్తే.. కథ బావుంది అంటారు. అందుకే నిజం లాంటి అబద్ధంగా అబద్ధం లాంటి నిజమైన కథ రాసాను. ఇటీవల కాలంలో ఎక్కడో ఒకచోట ఇలాంటి కథ వినే వుంటారు. ఈ కథ రాసానని నీకు ఆడపిల్లలు లేరా? ఇలాంటి కథ రాసావ్ అని తిట్టకండి. మారుతున్న కాలంలో మార్పు ని సహజంగా చూపించే కథ. కథ చదవండి. మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు 🙏

***************

పర్సనల్ స్పేస్    - వనజ తాతినేని 


“ఇదిగో ! ముందే చెబుతున్నా! ఈ కండీషన్ మీద అయితేనే.. నీతో పెళ్లికి ఒప్పుకుంటా” అంది సిరి.


“ఓకే యార్, నీ స్వేచ్ఛ కు నేనెప్పుడూ అడ్డురాను. నీ సేవింగ్స్ నీ షాపింగ్ అంతా నీ ఇష్టం” అన్నాడు సంపత్. 


అతని ఆలోచనలు నేలమీద వున్నాయి. “ఎక్కడో వెనుకబడిన జిల్లాలో చిన్న పట్టణంలో పుట్టి పెరిగిన అమ్మాయి. ఇంచుమించు నాతో సమానంగా చదివి నాతో సమానంగా సంపాదించే ఆడది, ఆ మాత్రం చిలకపలుకులు వల్లించడం మాములే! ఇంతకు ముందు ఎంతమంది అమ్మాయిల మాటలు వినివుండలేదు.  మహా అయితే శాలరీ అంతా పేరెంట్స్ కి చీరలకు నగలకు ఖర్చు చేస్తుందేమో! కొన్నాళ్ళు చూసి చూడనట్లు ఊరుకుంటే సరి” 


సంపత్ ఆలోచిస్తూ వుండగానే సిరి  ఏదో చెప్పింది. అతను “అలాగే” అన్నాడు మళ్ళీ. 


ఆమె “సరే మరి. పేరెంట్స్ కి మన నిర్ణయం చెప్పేద్దాం” అంది.


“ఓకే డాళింగ్” అంటూ సంపత్ ఆమె నడుము చుట్టూ చేయి వేసాడు మొహమాటంగా. సిరి ఉరప్ శిరీష కాదనుకుండా వీలైనంత ఎక్కువ సిగ్గు నటించింది. 


ఇదంతా కిటికీ పరదా వెనుక నుంచి ఊపిరి బిగపట్టి చూస్తున్న తల్లి సరళ గుండెలపై మండుతున్న నిప్పుల కుంపటిని తీసి పక్కన పెట్టినట్లు తేలికపడి ఊపిరి వదిలింది. 


సంపత్ తల్లిదండ్రులు ముఫ్పై ఆరేళ్ళ కొడుక్కి దరిదాపుగా అదే వయసు వున్న అమ్మాయి తోనైనా పెళ్ళి జరుగుతుందని సంతోషించారు. ఆ సంతోషంలో చేతికి ఎముక లేనట్టు ఐదు రోజులు పెళ్ళిని రంగ రంగ వైభవంగా జరిపించారు. అసలు వో కావో తెలియని వజ్రాల నగలు, బెనారస్ పైథానీ చీరలు, మహారాజా షేర్వాణి ల ప్రదర్శనలు భారీ పూల అలంకరణలు, జానపద పాట కచేరీలు, వెస్ట్రన్ కల్చర్ హాట్ డ్రింక్ ఆతిథ్యం, క్రేన్ షూటింగ్ లు ఖరీదైన రిటర్న్ గిఫ్ట్ లు అతిథులను బాగా అలరించాయి. చూడటానికి కళ్ళు నొప్పి వినడానికి చెవుల నొప్పి తినడానికి పొట్ట నొప్పితో బాధ పడుతూ ఈర్ష్య పడ్డారు బంధుమిత్రులు. సంపత్ మనసులో విసుగుని దాచుకుని పురోహితులు,కెమెరా మెన్ లు చెప్పినట్లు మర్యాదగా నడుచుకున్నాడు. సిరి క్రీగంట చూపులతో సంపత్ ని చూస్తూ పదహారేళ్ళ కన్నెపిల్లలా సిగ్గుపడుతూ తాళి కట్టించుకుని భర్త పాదాలకు భక్తితో నమస్కరించి చేతులు కళ్ళకు అద్దుకుంది. 


ఇవ్వన్నీ చూస్తున్న నేను ఆశ్చర్యాన్ని పదే పదే అరువు తెచ్చుకోవలసి వచ్చింది. 


హైటెక్ సిటీలో సంపత్ కొనుక్కున్న విల్లా హౌవుస్ లో గృహప్రవేశం కూడా జరిగింది. నవదంపతులు హనీమూన్ కి శ్రీలంక వెళ్ళారు. 


 “ సిరి  మంచి కుటుంబంలో అడుగుపెట్టింది. ఇకనైనా పద్ధతిగా ఉండాలని మనసులో పదే పదే కోరుకుంటున్నాను” అన్నాడు నా మిత్రుడు రాజారావు. అవునన్నట్లు తలపంకించాను. 


ఒకోసారి భయపడినదే జరుగుతూ ఉంటుంది. పెళ్లైన రెండు నెలల తర్వాత.. 


 “శ్రీధర్ అంకుల్ మీతో మాట్లాడాలి. సాయంత్రం వస్తాను. క్లుప్తంగా చెప్పి కాల్ కట్ చేసాడు సంపత్.


పెళ్ళికి ముందు ఏ వివరాలు అడగని సందేహాలు వెలిబుచ్చని అతను… ప్రత్యేకంగా నాతో ఏం మాట్లాడాలి?  పైగా గుడివాడ నుండి ఒంగోలు వరకూ వస్తున్నాడంటే..మనసులో ఏదో జంకు గానే వుంది. సాయంత్రం ఆఫీసుకు వచ్చాడు. అసలే ముహూర్తాల కాలం. నాతో మాట్లాడుతున్న వారిని సాగనంపి సంపత్ తో మాట్లాడటానికి గంట సమయం పట్టింది. ఓపికగా కూర్చున్నాడు. 


“ఏమిటి బాబూ! ఎలా జరిగింది హనీమూన్ ట్రిప్. సిరి బాగుందా” అడిగాను.


ఫోన్ తీసి డ్రైవ్ ఓపెన్ చేసి చూపించాడు. అందులో సిరి మ‌రొకత‌ను సన్నిహితంగా వున్న ఫోటోలు. 


“మేమంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మే సంపత్. ఆ ఫోటోలో వున్న అబ్బాయి కూడా మాకు తెలిసిన అబ్బాయే, సిరి అతను చిన్ననాటి స్నేహితులు”. సర్ధి చెప్పబోయి ఆగిపోయాను.. ఎదురుగా కనబడుతున్న ఫోటో చూసి. 


“మీరేదో దాచి పెట్టి మీ స్నేహితుడి కూతురితో నాకు సంబంధం కుదిర్చారని తప్పు పట్టడానికి రాలేదు. ఈ విషయం ఇంతటితో ముగిసిపోతే మంచిది. హనీమూన్ ట్రిప్ లో వున్నప్పుడు సిరి స్నానం చేస్తున్నప్పుడు యదాలాపంగా ఆమె ఫోన్ చూస్తే ఈ ఫోటోలు వున్నాయి. ఎవరతను అని అడిగాను. బాయ్ ఫ్రెండ్ అని బెంగుళూరు లో వున్నప్పుడు కలిసే వున్నామని చెప్పింది. అతన్ని లవ్ చేసానని అతను వేరే డబ్బున్న అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడని అతనిపై కోపంతో నన్ను పెళ్ళి చేసుకున్నానని చెబుతుంది. గతం గతః. ఇక అవన్నీ ఒదిలేసేయ్, నేను నిన్నేమి అడగను అని కూడా చెప్పాను. నేను ఆఫీస్ కి వెళ్ళినప్పుడు అతను వచ్చి మా ఇంట్లో వుంటున్నాడు.అది భరించలేకపోతున్నాను. నా తండ్రికి ఈ మధ్యనే ఓపెన్ సర్జరీ అయింది.నేను వారితో ఈ దారుణమైన విషయాన్ని పంచుకోలేను. ఈ మోసాన్ని నమ్మకద్రోహాన్ని  గరళంలా మింగి బతకలేను. మీరూ అంకుల్  వచ్చి సిరి ని మందలించి నాలుగు మంచి మాటలు చెబుతారని చెబుతున్నాను” అన్నాడు.


నలభై ఏళ్ళ నుండి మ్యారేజ్ బ్యూరో నడుపుతున్న నేను ఏనాడు ఇంతగా సిగ్గుపడి తలదించుకోలేదు. రాత్రికి రాత్రి  హైటెక్ సిటీకి చేరుకున్నాం రాజారావు నేనూ! తప్ప తాగి బాయ్ ఫ్రెండ్ తో ఇంటికి చేరుకున్న కూతురిని చూసి నిశ్చేష్టుడయ్యాడు ఆ తండ్రి. తన కళ్ళముందే ఇద్దరూ బెడ్ రూమ్ లోకి వెళ్లి  తలుపులు మూసుకుంటే సిగ్గుపడి అరచేతుల్లో ముఖం దాచుకున్నాడు. 


రెండు రోజులు వుండి మందలించి హిత వచనాలు చెప్పి భర్త ఎంత మంచివాడో విడమర్చి చెప్పే ప్రయత్నం చేసాం. 


“నేను నా పర్సనల్ స్పేస్ తీసుకుంటానని అతనికి పెళ్ళికి ముందే చెప్పాను. అతను ఒప్పుకున్నాకే పెళ్ళికి అంగీకరించాను” సిరి మూర్ఖంగా వాదించడం మొదలెట్టింది. రాజారావు మండిపడి కూతురిపై చేయి చేసుకున్నాడు. మరింత మొండిగా తండ్రి మరింత సిగ్గుపడేలా సమాధానం  చెప్పింది. ఏమి చేయలేని నిస్సహాయతతో తిరిగి వెనక్కి వచ్చాం.


పది రోజులకు సంపత్ సిరిని తీసుకుని వచ్చి పుట్టింట్లో దించి వెళ్లాడని ఇక తన ఇంటికి రానవసరం లేదని తెగేసి చెప్పి వెళ్ళాడని ఫోన్ చేసి చెప్పాడు రాజారావు. అత్తగారు సరళ సర్ధి చెప్పబోయింది అంట.


“ఆంటీ! మీరు కూడా మా అమ్మ లాంటి వారే! మీ అమ్మాయిని ఇంత విచ్చలవిడిగా పెంచారేమిటి అని అడగను నేను. నువ్వేమైనా వర్జిన్ వా ఏమిటి? నీ ఖాతాలు ఎన్ని వున్నాయో ఏమో!  కావాలంటే నువ్వూ.. నీ గర్ల్ ఫ్రెండ్ తో  తిరుగు, నేను అభ్యంతరం చెప్పను’’ అంటుంది. ఇంత ఫాస్ట్ కల్చర్ లో నేను పుట్టలేదు పెరగలేదు.మీ అమ్మాయిని భరించడం నావల్ల కాదు.” చేతులు జోడించి వెళ్లిపోయాడు అని కూడా చెప్పాడు.


రాజారావు పై కోపం ముంచుకొచ్చింది. సిరి కి ఇరవై ఏళ్ళు దాటినప్పుడు నుండి చెబుతానే వచ్చాడు. మంచి సంబంధం చూస్తాను, పెళ్ళి చేయమని. అదింకా చిన్న పిల్ల అప్పుడే పెళ్లేమిటి అన్నారు భార్యాభర్తలిద్దరూ నిర్లక్ష్యంగా. 


ముందు చదువులు తర్వాత ఉద్యోగం ఆ తర్వాత బాగా సెటిల్ అవ్వడం. కారు ఇల్లు నగలు సమకూర్చుకునే వరకూ వయసు మడి కట్టుకుని కూర్చుంటుందా? గోడలు దూకి అల్లరయ్యే పని లేకుండా ఆడ మగ కలిసి రూమ్ షేర్ చేసుకోవడం అన్నంత తేలికగా సహజీవనాలు గడుపుతున్న కాలం ఇది. ముంబాయి లో చదివి బెంగళూరు లో ఉద్యోగం చేసిన పిల్ల. థర్టీస్ మిడిల్ లో  పెళ్ళి చేసుకుంటూ వర్జినిటీ గురించి మాట్లాడటం అంత హాస్యాస్పదం ఇంకోటి లేదని తెలిసినా కూడా..


స్నేహితుడి కూతురు సిరి గురించి చూచాయగా తెలిసినా తను ఎప్పుడూ పాడే పాటే పాడేడు.  “అమ్మాయి తండ్రి పెద్ద ధనవంతుడు కాకపోయినా అమ్మాయి బంగారు బొమ్మ, గుణంలో కల్తీ లేని బంగారం అండీ,” అంటూ అందరికీ చెప్పినట్టే కల్లిబొల్లి మాటలు చెప్పాడు.  “


“అబ్బాయి కుటుంబం మంచి సంప్రదాయమైన కుటుంబం అండీ, ధనవంతులు, అబ్బాయి గుణవంతుడు” అని చెబుతుంటాడు సాధారణంగా. ఈ అబ్బాయి సంపత్  గురించి పొల్లు తేడా లేకుండా అరుదుగా కనబడే నిజమే చెప్పాను. ఏమిటో ఈ పిల్ల జీవితాన్ని తన చేతులతో తనే కాల్చుకుంటుంది అని బాధపడటం తప్ప ఏం చేయగలను?    


**********


అంతా భ్రాంతి యేనా.. 

అంతా భ్రాంతియేనా జీవితాన వెలుగింతేనా

ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా.. 


సిరి గొంతు చించుకొని పాడుతుంది. తల్లి గబగబా కిటికీ తలుపులు మూసేసి టివి సౌండ్ పెంచింది. తండ్రి ఆందోళన గా బెడ్ రూమ్ తలుపు ముందు తచ్చాడుతున్నాడు. కూర్చున్న నేను లేచి వెళ్ళి రాజారావు పక్కన నిలబడ్డాను. పూర్తిగా మూసుకోని తలుపు సందులో నుంచి లోపలికి చూసా. పొట్టి నిక్కరు ప్రీ సైజ్ టీ షర్ట్ విరబోసుకున్న జుట్టు అసహ్యంగా కనిపిస్తున్న పెట్టుడుగోళ్ళు. ఓపెనర్ లేకుండానే రమ్ బాటిల్ మూతను తెరిచి గుటకలు వేస్తూ రెండో చేతిలో వున్న మొబైల్ చూస్తూ  పాడుతుంది. 


ఈ సారి ఆంగ్ల కవిత అందుకుంది.

Do I contradict my self? Very well then I contradict myself, I am large, I contain multitudes.


 చదివింది IIT లో CS యే కానీ పాత పాటలు పాత కవితలు కొట్టిన పిండి. ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేసిన రాజారావు కూతురికి ఆంగ్ల సాహిత్యాన్ని ఉగ్గు గిన్నెలో  రంగరించి తాగించాడు అన్నప్రాసనలో తినిపించాడు. సరళ క్రోధంతో చూస్తూ చెవుల్లో దూది పెట్టుకుని సోఫాలో కూర్చుంది. రాజారావు తలుపు తోసుకుని లోపలికి వెళ్ళాడు. 


“ తల్లీ! ఇంత డార్క్ ఆల్కహాలిక్ గా తయారవుతావని నేను కలలో కూడా అనుకోలేదు. తల్లిదండ్రుల ముందు అత్తమామలు ముందు ఇంత సంస్కారహీనంగా మెలుగుతున్నావ్, మమ్మల్ని తల దించుకునేటట్టు చేస్తున్నావు. నీ అత్తమామలు నీతో మాట్లాడాలని నాలుగు గంటలుగా ఓపికగా ఎదురుచూస్తూ కూర్చున్నారు. వారితో మాట్లాడమ్మా, ఇకపై అలాంటివి జరగవు అని చెప్పమ్మా!” బతిమాలాడు. 


విసురుగా బెడ్ పై నుండి లేచి తండ్రిని చేయి పట్టుకుని లాక్కొని హాలులోకి తీసుకొచ్చి గట్టిగా మాట్లాడింది సిరి. 


“ వాళ్ళు మీరు కలిసి నాన్సెన్స్ చేయకండి నాన్నా! నేను పెళ్ళికి ముందే చెప్పాను సంపత్ తో. నా స్పేస్ నాకు వుండాలి అని. అతను అప్పుడు ఒప్పుకుని ఇప్పుడు పత్తిత్తు కబుర్లు చెప్పడం నాకు నచ్చలేదు. నాకు నచ్చినట్లే నేనుంటాను.కావాలంటే అతనికి నచ్చినట్లు అతన్ని వుండమనండి. ఇవన్నీ మీకు నచ్చకపోతే కళ్ళు మూసుకోండి. లేదా ఆ పల్లెటూరుకు వెళ్ళి కృష్ణ రామ అంటూ కాలక్షేపం చెయ్యండి. ఇదే నా ఫైనల్ డెసిషన్” తలుపులు ఉలిక్కి పడేంత గట్టిగా దడాల్న మూసుకున్నాయి.


కోడలి ప్రవర్తన మాటలు కళ్ళారా చూసిన  నరేంద్ర సుజన తొలుత ఆశ్చర్యపోయారు

పిమ్మట భయభ్రాంతులయ్యారు. మరోమాట లేకుండా నమస్కారం పెట్టి మరీ వెళ్లిపోయారు. వాళ్ళ వెనుక నేను.


కారు ఒంగోలు బాట పట్టింది.

“ఇంత చూసాక నా కొడుకుతో దానితో కాపురం చెయ్యమని చెప్పను. నేను పెళ్ళికి ఖర్చు పెట్టింది నా వెంట్రుకతో సమానం” అని తిట్టడంలో సంస్కారం చూపించాడు నరేంద్ర. 


సుజన ఆవేశం ఆక్రోశం ఏడుపు సమపాళ్లలో చూపించింది. 

“పదిహేను లక్షలు కెమెరా వాడికే ఇచ్చాం. దానికి పెట్టిన నగలు చీరలు తలుచుకుంటే గుండె బద్దలవుతుంది. సన్నాసి ము.. నా కొడుకు జీవితంతో ఆడుకుంది. వాడికి మళ్ళీ పెళ్ళి అవుతుందా? పెళ్ళి లో ఎంత అమాయకంగా సిగ్గుల మొగ్గలా నటించింది. అదంతా నిజమే అనుకున్నా. ఇలాంటి దానికి కోసి కారం పెట్టాలి” 


సుజన మాటల్ని తప్పు పట్టాలనిపించడం లేదు. ఆలోచిస్తున్నాను. 


“ఏమైంది ఈ అమ్మాయిలకు!? కాదు కాదు ఆధునిక మహిళ లకు. చదువు, ఉద్యోగం, సహజీవనం, తాగడం చిందులు వేయడం. మళ్ళీ ఏమి ఎరుగని నంగనాచిలా పెళ్ళి పీటలు ఎక్కడం. మూడుముళ్ళ బంధానికి విలువలేదు. కలిసి బతికేవాడి మాటకు విలువలేదు. తనకు నచ్చినట్లు జీవించాలని అనుకున్నప్పుడు పెళ్ళి ఎందుకు? సరదా తీర్చుకోవడానికా? మగవాడిని బకరా చేయడానికా? ఎందుకు! ఎందుకు!! ఎందుకు!? 


ఇది జరిగిన వారంలోపే సిరి కి పెట్టిన నగ నట్రా ఏమీ వాపసు ఇవ్వకుండానే మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో విడాకులు తీసుకున్నారు. 


విడాకుల పత్రాలపై సంతకం పెట్టాక   సంపత్ సిరి తో వ్యంగ్యంగా ఒక మాట అన్నాడు. “పెళ్ళి తర్వాత కూడా  బాయ్ ఫ్రెండ్ ని మర్చిపోలేన్నట్లు నన్ను కూడా మర్చిపోలేకపోతే అప్పుడప్పుడూ   పిలుస్తూ వుండు. మళ్ళీ పెళ్ళైన తర్వాత కూడా వస్తూనే వుంటాను.

గిఫ్ట్ లు కూడా వుంటాయి అదనంగా” 


సిరి కోపంగా “ఫక్” అంటూ నాలుగు వేళ్ళు మడిచి మధ్య వేలిని చూపించింది. 


ఇదంతా వింటూ చూస్తున్న  నరేంద్ర “షటప్” అని కొడుకు చెంప చెళ్ళు మనిపించాడు. “నువ్వు కూడా దిగజారి పోయావు” అన్నాడు ఊగిపోతూ. 


ఇద్దరూ యధావిధిగా ఒకరిపై ఒకరు బురద చిమ్ముకున్నారు. సంపత్ నపుంసకుడు అని,  గే అని సిరి ప్రచారం చేస్తోంది  కాబట్టి సంపత్ కూడా శ్రీలంక లో ఆమె ఫోన్ నుండి తన ఫోన్ కి పంపించుకున్న ఫైల్ ఓపెన్ చేసాడు. సిరి తన బాయ్ ఫ్రెండ్ తో సన్నిహితంగా వున్నప్పుడు తీసుకున్న ఫొటోలు వీడియోలు తమకు వారికి వున్న కామన్ ఫ్రెండ్స్ అందరికీ ప్రసాదంలా పంచిపెట్టాడు. 


ఐదు రోజుల పాటు ఆడంబరంగా జరిగిన పెళ్ళి గురించి వారం రోజుల పాటు ఎలా చెప్పుకున్నారో అలాగే ఈ కాలపు ఆడపిల్లల స్వేచ్ఛ గురించి  హద్దు అదుపు లేకుండా తిరిగే విచ్చలవిడి జీవితం గురించి కూడా అలాగే చెప్పుకున్నారు. 


పక్కింట్లో దొంగలు పడితే ఎలా జాగ్రత్త పడతామో అలాగే చుట్టుపక్కల వాళ్ళు తమ ఇంటి ఆడపిల్లలపై ఓ కన్నువేసి వుంచుతున్నారు. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకునే క్రమంలో నేను పెళ్ళిళ్ళ పేరయ్య అవతారం చాలించాను. 


వంద అబద్ధాలు ఆడి ఒక పెళ్ళి చేయమని అన్నారు పాత కాలం వారు. ఒక నిజాన్ని దాచి కాపురం నిలబెట్టలేం అన్నది ఈ నాటి నానుడి. 

సంపత్ బయోడేటా ని వేరొక మ్యాట్రీమోని లో రిజిష్టర్ చేయించాను. వారానికల్లా సంపత్ కి పెళ్ళి నిశ్చయం అయింది. వధువు ఎవరో కాదు. నిండా పాతికేళ్ళు కూడా లేని నా కూతురు మాధవి. ఆశ్చర్యంగా “నీకూ అతనికి పన్నెండేళ్ళు తేడా వుందమ్మా “ అని అభ్యంతరం చెప్పాను.


 “పర్వాలేదు నాన్నా!  మనఃస్పూర్తిగా అతను నాకు నచ్చాడు. ఆస్తులు ఉద్యోగం చూసి కాదు. సహనం, జీవితాన్ని అతను అర్ధం చేసుకునే తీరుని బట్టి” అంది. 


సంపత్ కొన్ని నెలలు టైమ్ తీసుకున్నాడు. తర్వాత సరే అన్నాడు. సింపుల్ గా తిరుమలలో పెళ్ళి జరిగింది. నా కూతురిని ఇచ్చి చేయడానికే సిరిని సంపత్ ని కావాలని విడదీసానని లోకులు కాకులై కూసారు. రాజారావు సరళ నా ఇంటికి వచ్చి అమ్మాయిని ఆశీర్వదించి వెళ్ళారు. అది చాలు నాకు. 


పదిరోజుల తర్వాత నా కూతురు మాధవి ఫోన్ చేసింది. ఆయన  నా పర్సనల్ స్పేస్ నాకిచ్చారు నాన్నా! నేను దాన్ని ఎప్పటికీ దుర్వినియోగం చేయను. ముందు పిల్లల్ని కంటాను. తర్వాత వాళ్లను మీకు ఇచ్చి చదువుకుంటాను అంది. హాయిగా నవ్వాను నేను. కథ కంచికి వెళ్ళడానికి స్పేస్ లోకి ఎగిరింది. 


************

(పిల్లల భవిష్యత్తు పట్ల చీకూ చింత లేకుండా హాయిగా నవ్వుకునే అవకాశం 

 తల్లిదండ్రులకు ఇవ్వండి పిల్లలూ! ఆ స్పేస్ ఇచ్చిన పిల్లలకు అంకితం.. ఈ కథ) 


4, జులై 2026, శనివారం

కథేమో ఆమెది. జీవితమేమో నాది

 కథేమో ఆమెది. జీవితమేమో నాది.

ఆమె అంత అందంగా ఏమి వుండదు. నిజం చెప్పాలంటే నాకన్నా అందమైనదేం కాదు. కానీ చురుకైనది తెలివైనది. ఏ విషయమైనా త్వరగా ఆకళింపు చేసుకోగలదు. మనసారా నవ్వగలదు. బేషరతులు లేకుండా ఇతరులను ప్రశంసించగలదు. కపటం లేకుండా ప్రేమించగలదు. ఆమె ఎల్లప్పుడూ నా తలపుల నిండా కిక్కిరిసి వుండేది. ఆమె పట్ల ఈర్ష్యతో నా హృదయం భగభగమండుతూ వుండేది. నా భర్త తో కూడిన ఏకాంత సమయాల్లో కూడా ఆమెను పదే పదే స్మరించేదాన్ని. కొన్నిసార్లు స్వగతంలా. కొన్నిసార్లు సాధింపుగా. అతను ఓపికగా భరించేవాడు. లేదా  వెళ్లి పిల్లల దగ్గర పడుకునేవాడు.


నా ఈ ప్రవర్తన వెనుక కారణం వుంది. నా భర్త హృదయంలో ఆమె  చెరపలేని పచ్చబొట్టుగా ముద్రింపబడి వుంది.  అలా అని ఆమె చెడ్డది  నాకు ద్రోహం చేసే మనిషి కాదని కూడా నాకు నిశ్చయంగా తెలుసు. ఒక విధంగా ఆమె నా పాలిట దేవత. ఆమె మాటల్లో మాయ మంత్రం ఏమైనా వున్నాయేమో అని నాకు అనుమానం. ఆమె ఏం చెపుతుందో ఏమో!  నా భర్త తు చ తప్పకుండా పాటిస్తాడు.  ఆ విషయం మా అత్తగారు కూడా హెచ్చరిస్తుంది దృవ పరుస్తుంది. . “ఇదిగో .. సుధా! మీ కాపురం చక్కబడుతుందని నేను కలలో కూడా అనుకోలేదు.అందుకు కారణం ఆమె” అనేది. నాకు లోలోపల అగ్గి రాజుకునేది. మనిషి మాటల్లో సత్యం కరుకుగా అయినా వుండాలి. అబద్దం ధర్మం కోసమైనా చెప్పివుండాలి. మొదటిదే నిజం.


నిజమే! నా అనుమానపు చూపులు సూటీపోటీ మాటలు వల్ల దుకాణంలో ఆడవాళ్ళను పనిలోకి పెట్టుకోవడం మానేసాడు నా భర్త. అయినా నా అనుమానపు జబ్బు ఆముదం జిడ్డులాగా నా మనసును అంటిపెట్టుకుని వుండేది. కారణం నా భర్త అందగాడు.అతన్ని ఎవరైనా నాకు దూరం చేస్తారని నా భయం. ఈ విషయం వల్లే మా మధ్య తరచూ గొడవలు జరిగేవి. అవి తారాస్థాయికి చేరుకుని నేను పిల్లలను కూడా వదిలేసి పుట్టింటికి చేరుకున్నాను. రెండేళ్ళ తర్వాత మళ్లీ కలిసాం. అప్పుడే చెప్పాడు ఆమె గురించి. మన హితం కోరే మనిషి మనల్ని విడదీసే మనిషి కాదని. ఒకసారి బిల్ బుక్ ల మధ్య ఓ కాగితం చూసాను. ముత్యాలకోవ లాంటి దస్తూరి. ఆ దస్తూరి నా భర్తదే! 


“ఆమె చిటారు కొమ్మన వున్న మిఠాయి పొట్లం కాదు అందని పండు కాదు. చిటారు కొమ్మన ఊయలలూగుతున్న యెన్నడూ రాలని దేవతా పుష్పం.  అయినా దోసిలి పట్టే వుంచాను. ఆమె తలపు నాలో ఏదో తెలియని అతి మృదువైన బాధను రేపుతుంది. ఏకాగ్రతగా పని చేసుకుంటున్నప్పుడు ఆమె మాటల్లో కర్తవ్యదీక్షను బోధించే తాత్వికత,  ఏదైనా పాట వింటున్నప్పుడు సంగీతం విన్నట్లుండే ఆమె పలుకులు గుర్తుకు వచ్చేవి.  పుస్తకం చదువుతున్నప్పుడు పుటల్లో ఆమె రూపం ప్రత్యక్షమై.. నేను నేను కాకుండా పోయిన రోజులవి. ఆమె ఎల్లప్పుడూ  అదృశ్య నీడ రూపంలో సున్నితమైన స్పర్శను నా శరీరంపైనా, మనసుపైనా ప్రసరింపజేస్తూ వుండేది.” అని. 


అత్తెసరు చదువులు చదివిన ఆ రాత లోతులు అర్థం కాకపోయినా  ఎవరిని ఉద్దేశించి రాసుకున్నాడో నాకు అర్థం అయ్యింది. ఆ రాత్రి పెద్ద యుద్ధమే జరిగింది. 


“ఫేస్ బుక్ లో రాసుకుంటూ వుంటాడు కదా! ఆ కవిత్వం కాకరకాయ ఏమో! అంతా నీ అనుమానం” అని కొట్టిపారేసింది అత్తగారు. 

అలా లేదని నేను వాదిస్తుంటే ..

“నువ్వసలే అనూరాధ నక్షత్రంలో పుట్టావ్ , నీది అసూయ ఈర్ష్య ద్వేషాల స్వభావం. నీలాంటి అనుమానపు పిశాచాన్ని కట్టబెట్టి నా బిడ్డ గొంతు కోసాను అంది. 


చుట్టం చూపుగా వచ్చిన మా అమ్మ కల్పించుకుని పదహారేళ్ల పిల్లనిచ్చి పెళ్ళి చేసాను. పదహారేళ్ళ నుండి ఇవే తగువులు. మా పిల్ల మాకు బరువు కాదు. తీసుకుని పోతాం” తగ్గేదే లేదు అన్నట్లు. 


నేను కొంచెం తగ్గాను. అప్పటికి  గొడవ సద్దుమణిగింది. ఆ రాత్రి నా భర్త స్థిరంగా స్పష్టంగా చెప్పాడు. “ ఆమె నా స్నేహితురాలు మాత్రమే! అంతకుమించి ఏమీ కాదు, కాబోదు. నువ్వు ప్రతిసారి ఇలాగే గొడవపడితే నీతో  నేను గొడవపడలేను విడాకులు ఇచ్చేస్తాను” అని. నేను జంకాను. నా అనుమానం  నిరాధారమైనది కాదు కానీ.. నా భర్త ఆమె స్నేహం అంతకు మించి అభిమానం ప్రేమ గొప్పవి. హద్దులు ఎరిగినవి. అనుబంధాలు ఎంత సున్నితమైనవి . ఒక చోట తెగి పోయి మరొక చోట పెనవేసుకుంటాయి . బాహ్యంగా కాదు అంతర్లీనంగా, దృఢంగా.  


మళ్ళీ ఒకసారి చెబుతున్నాను. కథంతా ఆమెదే! జీవితమే నాది. నాకేం లోటు లేదు సంతోషం కూడా నిండుగానే వుంది. కానీ.. కానీ.. నా భర్త హృదయంలో ఇప్పుడు ఎప్పుడూ ఎల్లప్పుడూ కూడా ఆమె వుంటుంది. ఏం చేసి కూడా ఆమెను తొలగించడం సాధ్యం కాలేదు. ఆ విషయం తల్చుకుంటే దుఃఖం పొంగుతుంది. ఒకసారి ఏమైందంటే… నేను  ఆత్మహత్య ప్రయత్నం చేసాను. హాస్పిటల్ లో బెడ్ మీద నేనున్నప్పడు నా భర్త హృదయవిదారకంగా రోదించడం నాకు తెలుస్తూనే వుంది. అదెలాగంటే ఆమెకు ఫోన్ చేసి .. “చూడు నేస్తం ! ఈ పిచ్చిది ఎంత పని చేసిందో! పిల్లలు వచ్చి అమ్మనేంటి  ఇలా చేసావ్ నాన్నా!  అంటే నేను ఏం సమాధానం చెప్పాలి? నా చుట్టూ ఎన్ని గాలి వార్తలు పోగయ్యేవి. నీ చుట్టూ ఎన్ని  అపవాదుల గోడలు కట్టేసేవారు” అని. ఆ సమయంలో కూడా  ఆమె కోసం కూడా  సమానస్థాయిలో తల్లడిల్లిపోయాడు. అంతకన్నా విషాదం ఏముంటుంది నాకు. పరమసత్యాన్ని జీర్ణించుకుంటూ బతకడానికే బతికాను అనుకుంటా.  మేము విడిపోయి మళ్ళీ కలిసిపోయేటప్పుడు కంటికి రెప్పలా కాపాడతానని మా వాళ్ళకు మాటిచ్చాడు. ఏనాడూ మాట తప్పలేదు. కానీ .. కానీ అతని హృదయంలో నాకు స్థానం లేదు. అది నాకు కచ్చితంగా తెలుసు. 


ఇదంతా జరిగి 15 సంవత్సరాలు గడిచిపోయాయి. పిల్లలు చదువులు పూర్తై ఉద్యోగాల్లో కుదురుకున్నారు. నేను కూడా కళ్ళకున్న అనుమానపు పొరలు తొలగించుకుని మనసును విశాలం చేసుకున్నాను. మా కుటుంబాల మధ్య  స్నేహం బలపడింది. 


బాల్య వివాహాలు చేయడం సరియైన నిర్ణయం కాదని “పుత్తడి బొమ్మ పూర్ణమ్మ” కథ చెప్పినట్లు భర్తల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ప్రియురాళ్ళ గురించి భార్యల దుర్భర వేదన గురించి కూడా కథలు కథలుగా  చెప్పాలి. వివాహానంతరం కూడా  స్త్రీ పురుషుల మధ్య కలిగే ఆకర్షణ వల్ల జరిగే పరిణామాలు గురించి చెప్పాలి. తలలు బోడులైనా తలపులు బోడులా అనే వేమన పద్యం ఉదహరించుకోవాలి. శారీరక ఆకర్షణలా? భావసారూప్యత  పట్ల కలిగే ఆకర్షణలా.. లేక నిజంగానే తన వారందరినీ కూడా  మరిపించే ప్రేమ అనే దివ్యౌషధం అనేది ఒకటి వుందా? అది యాదృచ్ఛికంగా తారసపడుతుందా? నా భర్త హృదయంలో నాకు స్థానం లేకపోవడం అనే నష్టాన్ని ఎవరు పూడుస్తారు? తప్పు నా భర్త దా? ఆమె దా? లేక నాదా? 


హృదయాలలో ప్రేమ దివ్వె వెలిగించడం ఎవరు నేర్పిస్తారు? నేను మరొక పురుషుడి రూపాన్ని హృదయంలో ప్రతిష్టించుకున్నాను అంటే నా భర్త భరించగలడా? 


అనూరాధ నక్షత్రంలో పుట్టిన వారికేనా   ఈ ఆలోచనలు ప్రశ్నలు?  మా అత్తగారిని అడగాలి జవాబు ఏం చెబుతుందో! 


ఇప్పటి వరకూ.. నేను చెప్పిన కథ విన్నారు కదా! మరొక భాగంలో కథ చూపిస్తాను. 

వేచి వుంటారు కదూ!   _ సుధ. 


కథ చదవడానికి తయారుగా వున్నారా!? 

ఇది  ప్రేమ కథేమో అని మీరు భావిస్తే లేదా ఒక అనుమాన పిశాచి చెబుతున్న కథ అని భావిస్తున్నట్లైతే.. ఇది వారిద్దరి స్నేహం అమలిన  ప్రేమ వల్ల జరిగిన నా హత్య కాని హత్యకు పోస్టుమార్టం రిపోర్ట్ అనుకోండి. జరుగుతున్న కథ మీరే చూడండి. 

ఎవరి కథలో ఎవరు కలలా, ఊహలా కేవలం పాత్రగా మిగిలిపోయారు. ఎవరి జీవితం ఎవరితో సాగుతుంది. ఆమె  యాదృచ్చికంగా ప్రయాణంలో కలిసిన ప్రయాణికురాలేనా?. అతని హృదయంలో నిజంగా ఎవరు వున్నారు? అది తెరిచి చూడగల్గింది ఎవరూ!? మీరే చెప్పండి. ఇక కథ నుండి నేను తప్పుకుంటున్నాను. 


“కథేమో ఆమెది, జీవితమేమో నాది.”


సెలవు. సుధ. 🙏


**********


హైటెక్ సిటీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్న సుధ కొడుకు కోడలు.. వీకెండ్ రోజున లేటెస్ట్ మోడల్ సెవన్ సీటర్ ఇన్నోవా కారుతో వచ్చి సర్ప్రైజ్  చేసారు.ఇంత పెద్ద కారు ఎందుకు సన్నీ! మీకు సరిపడా కొనుక్కుంటే బాగుండేది అంది సుధ.

 

“అమ్మా! మాకు మాత్రమే కాదు మనందరి కోసం కొన్నాం కారు. ప్రతిదానికి లెక్కలు వేయకు.” మెత్తగానే అయినా గట్టిగా చెప్పాడు. ఆ రోజంతా సందడిగా గడిచిపోయింది. మర్నాడు కుటుంబం అంతా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శనం చేసుకుని హంసలదీవి బీచ్ కి వెళ్ళాలనుకుని బయలుదేరారు. హైవే పై వాయువేగంతో ప్రయాణిస్తుంది కారు. బెంజ్ సర్కిల్ దాటిన తర్వాత  సడన్ గా  సుధ అంది. “ఆంటీ వాళ్ళు ఇటువైపేగా వుండేది. ఆమెను కూడా తీసుకుని వెళదాం సన్నీ”అంది. 


డ్రైవింగ్ చేస్తున్న సన్నీ ఆశ్చర్యంగా తలతిప్పి తల్లిని చూసాడు. వెంటనే తండ్రి వైపు చూసాడు. అతను ఆశ్చర్యంగానే చూస్తున్నాడు. “ఆంటీ కి కాల్ చేయ్ రెడీగా వుండమని” అని తొందర చేసింది. తండ్రి ఫోన్ తీసుకుని నెంబర్ సేవ్ చేసుకుని కాల్ చేసాడు. ఆమె వెంటనే స్పందించింది. 

అయ్యో! నేనెందుకు మీరు ఫ్యామిలీ తో  సరదాగా వెళుతున్నారు. మధ్యలో నేనెందుకు? మొహమాట పడింది. 


“లేదాంటీ .. మీరు కూడా వస్తే బాగుంటుంది అని అమ్మ చెప్పింది. ఇదిగో అమ్మతో మాట్లాడండి.”

ఫోన్ వెనక్కి అందించాడు. “అక్కా! మీరు రాకపోతే ఎలా? తప్పకుండా రావాలి. మేము వస్తున్నాం” అని చెప్పి ఫోన్ కట్ చేసింది. 

ఆమె.. అడ్రెస్ చేంజ్ అయింది అంటూ లొకేషన్ షేర్ చేసింది. పది నిమిషాల్లో  ఆమె షేర్ చేసిన ల్యాండ్ మార్క్ దగ్గర కారు ఆపాడు సన్నీ. అతను డోర్ తెరుచుకుని దిగాడు.  


ఎదురుగా నడిచి వస్తున్న అతను ఆమె వైపు చూసాడు. అతన్ని చూడగానే ఆమె ముఖమంతా సంతోషంతో విచ్చుకుంది. కళ్లు నక్షత్రాల్లా వెలిగిపోతున్నాయి. రెండేళ్లైంది  మరి అతన్ని చూసి.  చూడగానే ఆత్మీయ భావం. కళ్ళతోనే హృదయాన్ని తడిమే పలకరింపు. ఎప్పటిలాగానే చూడగానే నవ్వు విచ్చుకుంది.  చంద్రమోహనం ఆ వదనం, చందన కలశం ఆ నయనం హమ్  చేయబోయి బలవంతంగా అణచుకొంది. మర్యాదగా సన్నీ కూడా కారు దిగాడు. ఒకొరికొకరు కుశల ప్రశ్నలు వేసుకునే సమయంలో  భార్యని చెల్లెల్ని బ్యాక్ సీట్ లోకి కూర్చోబెట్టాడు సన్నీ. “అయ్యో! నేను రావడం మూలంగా పిల్లలు వెనక్కి సర్దుకోవాల్సి వస్తుంది. లేకపోతే సరదాగా ఎంజాయ్ చేసే వాళ్ళు కదా” అని నొచ్చుకుంది ఆమె. 


 “వాళ్లు యూత్! వదిన మరదళ్లు మరిన్ని కబుర్లు చెప్పకుంటారు లే అక్కా! మాతో పాటు మీరు రావాలనే కదా మా అందరి కోరిక.” మా అందరి అనే మాటను నొక్కి పెట్టి అంటున్న తల్లి వైపు నిశితంగా చిన్నపాటి అనుమానంగా  చూసాడు సన్నీ.


తండ్రిని తన పక్కనే కూర్చోమని తల్లిని ఆమెను  మిడిల్ లో కూర్చోమన్నాడు. బీచ్ వైపుగా ప్రయాణం. సుధ మనసు గందరగోళంగా వుంది. అయినా నిబ్బరంగా కనబడటానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంది. అత్తమామల ఆరోగ్యం, అమ్మాయి ఉద్యోగం,పెళ్ళి ప్రయత్నాలు గురించి ఆమె ప్రశ్నలు. సుధ సమాధానాలు. ఆమె పిల్లల క్షేమసమాచారాలు గురించి సుధ అడిగి తెలుసుకుంది. 


“ఆంటీ! మీ ఫోన్ ఇవ్వండి. మీ  ప్లేలిస్ట్ కనెక్ట్ చేస్తాను అన్నాడు సన్నీ. బ్లూటూత్ కనెక్ట్ అయ్యాక వరుసగా నాలుగైదు పాటలు ప్లే అయ్యాక సుధ అంది. మీ ఫ్రెండ్స్ ఇద్దరూ వినే పాటలు ఒకటే! భలే బాగుంటాయి అక్కా!” అని. సన్నీ నవ్వుకున్నాడు. 


నిన్న సాయంత్రం  తండ్రికి తనకు జరిగిన సంభాషణ గుర్తు చేసుకున్నాడు.


 తండ్రి డ్రైవింగ్ లో వుంటే ఫోన్ తన చేతిలో వుంది. స్క్రీన్ పై వాట్సాప్ కి వస్తున్న నోటిఫికేషన్ చూసాడు. “ఆర్ యూ ఓకే!”  అని అడుగుతూ వున్న సందేశాన్ని. 


“ఆంటీ ఏదో అడుగుతున్నారు నాన్నా!” అన్నాడు. 


“మీరు వచ్చారు కదా! పనుల్లో బిజీగా వుండి గుడ్ మార్నింగ్ మెసేజ్ కి రిప్లై ఇవ్వలేదు.”  అంటూ ఆర్కైవ్ లో వున్న మెసేజ్ ఓపెన్ చేసి కొడుకు చేతికి ఇచ్చాడు. తండ్రి ఇష్టదైవం లైవ్ స్క్రీన్ షాట్ గుడ్ మార్నింగ్ చెబుతూ ఒక పువ్వు. డిలీట్ చేయని చాట్ అంతటా అదే వరుస.ఎప్పుడైనా పంచుకున్న పాటలు అటు ఇటు వైపు నుండి. అంతే! 


కారు స్టేడియం పక్కనే ఆపాడు అతను. సన్నీకి తెలుసు. తండ్రి తనతో ఏదైనా మాట్లాడాలి అనుకున్నప్పుడు పార్క్ దగ్గరకో, స్టేడియం దగ్గరకో తీసుకుని వచ్చి ఒంటరిగా మాట్లాడతాడని. అది తన చదువు విషయమైనా, ఉద్యోగ విషయమైనా, రెండేళ్ళపాటు నలిగిన తన ప్రేమ వివాహం  విషయమైనా,  ఆర్ధిక విషయాలైనా, 


నడుస్తూ.. కొడుక్కి చెప్పాడతను. “నేను రిప్లై ఇవ్వకపోతే ఆంటీకి భయం సన్నీ! సమ్ థింగ్ రాంగ్ అనుకుంటుంది. మీ అమ్మ అసలు మా స్నేహమే సమ్ థింగ్ రాంగ్ అనుకుంటుంది. నిత్య జీవిత సమస్యల్లో కష్టనష్టాల్లో భావ ప్రపంచపు అలజడిలో మేము ఒకొరికొకరం మనసైన ఓదార్పు. మా స్నేహం వల్లో మా అనుబంధం వల్లో ఇరు కుటుంబాల్లో ఎవరికి కూడా చీమంత కూడా హాని కలగలేదు కలగబోదు కూడా! ఇంకా చెప్పాలంటే మా స్నేహం వల్ల మా జీవితాలను ఉన్నతంగా నిలబెట్టుకున్నాం. అది గర్వంగా చెప్పుకుంటాం.” అతని గొంతు సన్నగా వణికింది. కళ్ళల్లో సన్నని తడి. 


సన్నీ విచలితమై “అర్థమైంది నాన్నా!”  అంటూ తండ్రిని హగ్ చేసుకున్నాడు. 


“నువ్వు మాత్రం జాగ్రత్తగా వుండు, అమ్మాయిలతో స్నేహం చేయకు, స్నేహం ఎలాంటిదైనా జీవితాల్లో చిచ్చు పెడుతుంది.నరకప్రాయం చేస్తుంది.అందులో నీ భార్య జాబ్ చేస్తుంది. ఏమైనా తేడాలొస్తే వెంటనే విడాకులకు రెడీ అయిపోతారు.’’


“నాకు అలాంటి ఇబ్బంది రాదులే నాన్నా! మీ కోడలికి అండర్ స్టాండింగ్ ప్రేమ ఎక్కువే!”


“మీ అమ్మకు మాత్రం అవి లేక అలా చేస్తుందా! ఎక్కువై ఎక్కువ ఊహించుకుని అలా చేస్తుంది. నీకూ చెల్లికి తెలియనిది ఏముంది?”


“అవును, చెల్లి చెబుతుంది అమ్మ బిహేవియర్ ఒకోసారి నాన్సెన్స్ గా వుంటుంది అని.”


చెబుతూ సాలోచనగా చూసాడు తండ్రి వైపు. 


“నీకో విషయం తెలుసా!? ఆంటీని నేను కళ్ళతో చూసి ఏడేళ్ళు అయింది. మళ్ళీ  మీ పెళ్ళికి వచ్చినప్పుడు చూడటమే! కానీ మీ అమ్మకు అనుమానం చావదు” 


సన్నీ ఈసారి ఆశ్చర్యంతో పాటు జాలిగా చూసాడు తండ్రి వైపు. 


“సన్నీ!  నాదో రిక్వెస్ట్!”


“చెప్పు నాన్నా! చెల్లి పెళ్ళికి పర్సనల్ లోన్ తీసుకుంటాను. పది లక్షల వరకూ ఇవ్వగలను. మీరు డబ్బు గురించి బెంగ పడవద్దు.”


“విషయం అది కాదు రా! సడన్ గా నాకేమైనా అయితే అమ్మను చూసుకున్నట్టు కాకపోయినా ఆంటీ గురించి కూడా నువ్వు పట్టించుకోవాలి. ఫైనాన్షియల్ గా కాదు, క్షేమ సమాచారాలు అవీ కనుక్కుంటూ వుంటే చాలు.” 


“ అయ్యో నాన్నా! మీరిలా చెప్పడం బాగాలేదు, మీకేమవుతుంది? మేమంతా లేమూ” ? తండ్రి భుజం చుట్టూ చేయి వేసాడు.


“లేదు రా, ఏదైనా చెప్పి రాదు కదా!  నీకు ఒక మాట చెబితే నాకు తెరిపిగా వుంటుంది అని.”


సన్నీ తండ్రిని మళ్ళీ హగ్ చేసుకుని చాలా సేపు అలా వుండిపోయాడు. గతంలో  వచ్చిన స్ట్రోక్ సంగతి  గుర్తుంది. మనసులో తెలియని భయం ప్రవేశించింది.తండ్రితో వీలైనంత ఎక్కువ గడపాలి అనుకున్నాడు.


 డ్రైవింగ్ సీట్లో  తండ్రిని కూర్చోబెట్టాడు. ఇద్దరూ కలిసి నగరం అంతా తిరిగారు.స్నేహితులను బంధువులను కలిసి స్వీట్స్ పంచుకున్నారు.


“రేపు బీచ్ కి వెళదాం నాన్నా! బాపట్ల వద్దు. హంసలదీవి వెళదాం. చెల్లి కూడా చూడాలంటుంది”


“మీ ఇష్టం, మీరు ఎక్కడికంటే అక్కడికి”..


*********

ఆలోచనలు నుండి బయటకు వచ్చి తండ్రి వైపు చూసాడు. 


నిన్న తండ్రితో జరిగిన సంభాషణ వల్ల  ఆంటీతో మరింత గౌరవంగా మసలుకున్నాడు సన్నీ. 

మనసులో ఇలా అనుకున్నాడు. 


“వారిద్దరి మధ్య కేవలం దూరం మాత్రమే వుంది.అది చాలా ఉద్దేశపూర్వకమైన దూరం.

వారిద్దరూ వారి అనుబంధాన్ని ఎన్నడూ బయటికి వ్యక్తం చేయడం వుండదు. అలాగే వందలసార్లు ప్రశ్నించినా దాన్ని ఖండించే ప్రకటనలు కూడా వుండవు.


తల్లి మనసులో ఏం వుందో తెలియదు. ఆంటీని ఏమీ అవమానించదు కదా! కావాలని అందుకే పిలిచిందేమో! చిన్నపాటి అనుమానం మొలకెత్తింది. కానీ అటువంటివి ఏమీ లేకుండా ట్రిప్ అంతా సరదాగా గడిచిపోయింది. రిటర్న్ లో ఆమెను ఎక్కిన చోటున దించి వెళ్లారు. “రేపు రండి అక్కా! చాలా రోజులైంది మీరు వచ్చి” అని ఆహ్వానించింది.”అమ్మాయి పెళ్లికి వస్తాను. ఇప్పుడు మిమ్మల్ని అందరిని చూసానుగా” జవాబు ఇచ్చింది. ఆమె అతను కళ్ళతో వీడ్కోలు తీసుకున్నారు. 


హైబ్రిడ్ జాబ్ కావడం వల్ల సన్నీ, వల్లి సిటికీ వెళ్ళడానికి తొందరపడలేదు. 

మర్నాడు ఉదయం తొమ్మిది గంటలప్పుడు టీ కప్ లు తీసుకుని తల్లిని టెర్రస్ పైకి పిలుచుకుని వెళ్లాడు సన్నీ.కాసేపు పిచ్చాపాటీ మాట్లాడాక విషయంలోకి దిగిపోయాడు.


“అమ్మా! రోజూ నాన్నను సాధించి చావగొడతావ్, మళ్ళీ నువ్వే ఆమెను పిలుస్తావు. సొంత అక్క చెల్లెళ్ళు అన్నంత ఇదిగా వుంటావు. నువ్వేంటో అసలు నాకు అర్థం కాకుండా పోయావు నాన్న ఫోన్ కి చాట్ లాక్ కూడా వుండదు. నువ్వెందుకు ఆయన మీద గూఢచర్యం చేస్తావు.పదే పదే ఫోన్ చెక్ చేస్తావు, ఎవరితో నైనా మాట్లాడుతున్నాడేమోనని ఫోన్ చేసి చెక్ చేస్తావ్, నాన్న వాట్సాప్  లైవ్ లొకేషన్ నీ ఫోన్ కి ఎందుకు పెట్టుకున్నావు.ఈ మధ్య యూట్యూబ్ నాలెడ్జ్  బాగా పెరిగిపోయింది నీకు. నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను. నువ్వు ఇంకా మారావా!?  నాన్న కాబట్టి నిన్ను భరించాడు.” కోపంగా ప్రశ్నించాడు. 


సన్నీ! నేనేంచేయను? నా మనసు స్థిమితంగా వుండదు. మీ నాన్న నాకు దూరమై పోతాడేమోనని నాకు భయం. నిన్న ఆంటీ ని రమ్మని పిలవడం వెనుక నాది ఒక స్వార్థం వుంది. మీ ఆంటీ మీ నాన్న కళ్ళెదుట లేనప్పుడు ఎప్పుడూ ఆయన మనసులోనే తిష్ట వేసుకుని వుంటుంది. భార్య గా నాకు ఆ సంగతి బాగా తెలుసు. కనీసం ఆమె ఎదురుగా వున్న కాసేపైనా మీ నాన్న హృదయంలో నేను వుండాలనే తాపత్రయంతో ఆమెను గుడికి బీచ్ కి రమ్మని పిలిచానంతే! అంటూ గట్టిగా ఏడ్చేసింది. 


తల్లిని ఆ స్థితిలో చూసి చలించిపోయాడు. “ఎంత అమాయకత్వం అమ్మకి!”  అంటూ జాలిపడ్డాడు. తల్లి కన్నీరు తుడుస్తూ తాను కన్నీరు పెట్టుకున్నాడు. 


“నువ్వు అనుకున్నట్టు ఏమి వుండదు అమ్మా! అంతా నీ ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్. నాన్నను అనుమానించి అనుమానించి ఆయనకు నీపై ప్రేమ లేకుండా చేసుకున్నావు. ఇతరులవైపుకు ఆయన్ని నువ్వే నెట్టేసావేమో ఆలోచించుకో!  నాయనమ్మ ఏం చెప్పిందో తెలుసా!  మీ అమ్మ నాన్న కలిసి వుండాలని నేను ఎంత కృషి చేసానో ఆమె కూడా అంత కృషి చేసింది. రెండు మూడు సార్లు ఆమెను కలిసి మాట్లాడాను,మంచి మనిషి. మన మంచి కోరే మంచి స్నేహితులు వుండాలి” అని క నా చిన్నప్పుడే చెప్పింది. నీకు తెలియకుండా నాన్న ఎక్కడికైనా వెళ్ళగలడా చెప్పు?  నీ అనుమానంతో నాన్నను నిత్యం సాధిస్తే నాన్నకు గుండె పోటు రాక ఏమొస్తుంది? నీ ఆలోచన మార్చుకో, క్షణం క్షణం మారిపోయే నీ చిత్తాన్ని మార్చుకో. మా నాన్నను కాస్త ఎక్కువ కాలం  బతకనీయమ్మా! చేతులు జోడించాడు. ఆ చేతులు పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది సుధ.


“అమ్మా! నీ జీవితం ఎప్పుడూ సుధామధురమే! నువ్వు ఊహించుకున్న కథ కథగానే వుంటుంది. వేరే కథగానే మిగులుతుంది. కథలెప్పుడూ వాస్తవం కాదు. వాస్తవంగా కనబడే మరు మరీచకలు. నువ్వు మా నాన్న గురించి ఊహించుకుంటున్న కథ కూడా అంతే!” ఏడుస్తున్న తల్లిని అలాగే వదిలేసి కిందికి వచ్చి చెల్లిని తల్లిని ఓదార్చమని పంపాడు.


తర్వాత రోజు కుటుంబం అంతా  మ్యారేజ్ రిసెప్షన్ కి వెళ్లారు. ఎన్నడూ లేనంత సంతోషంగా కనబడింది సుధ. చక్కగా రెడీ అయింది కూడా! భర్త పక్కన నిలబడి రెండు మూడు ఫోటోలు తీయించుకుంది. అమ్మ చాలా సంతోషంగా వుంది. నేనిచ్చిన కౌన్సిలింగ్ కూడా బాగా పనిచేసినట్టు వుంది అనుకున్నాడు సన్నీ.  


ఈ కథకు ఎవరూ చూపించగల పరిష్కారం లేదు. అసలు ఏమీ లేని కథకు  పరిష్కారం ఏముంటుంది?. చక్కని ముగింపు కూడా లేదు. కేవలం ఒక నిశ్శబ్దం మాత్రమే వుంది.అది అర్థమైన వారికి అర్ధమైనంత! అపోహలు పడేవారికి పడినంత, పట్టనంత.


అతనికి ఆమెపై ఆకాశమంత ప్రేమ, ఆరాధన వుంది. 

ఆమెకు  ఎనలేని ఆత్మ స్వేచ్ఛ వుంది.

జ్ఞానం నిండిన అహంకారం వుంది. 

అతను ఆమెను  యెన్నడూ నిరోధించడు.

కానీ ఆమె అతని ప్రేమకు తనని తాను బందీ చేసుకుంది. 

వారిరువురు వేరు వేరుగా  జీవిస్తూ ఒకరి జీవితంలో మరొకరు మైలు రాళ్ళు.

ప్రయాణం చాలానే వుంది. సాగుతుంది. 


**************


15, జులై 2024, సోమవారం

పయిలం బిడ్డా!

 పయిలం బిడ్డా! -వనజ తాతినేని

మనుమడా! నా బంగారు తండ్రీ! ఎట్టా వుండావ్? నేను ఫోన్ చేస్తే నీకు అందుతుందో లేదో తెలియడంలా, అందుకే ఈ ఉత్తరం ముక్క రాస్తుండా. ఏడేళ్ళు అయిపోయింది నిన్ను చూసి. ఎప్పుడు వస్తావు రా నాన్నా! ఒక్కసారి వచ్చి ఈ ముదుసలి నాయనమ్మను చూసి పో. వొంటి నిండా హత్తుకుని  పౌత్ర స్పర్శ ని అందించి పో. ఈ ఎండా కాలం దాటిస్తానో లేదో.. భగవంతుడికి యెఱుక.  ఎండలకి భయపడి మీ అమ్మ దగ్గరికి వెళ్లడంలేదు. అన్నట్టు నీకు ఈసారి కొడుకు పుడితే తాత పేరో నాన్న పేరో పెట్టుకోవాలి. పెద్దల పేరు పెడితే పిల్లలు ఉజ్వలంగా వర్ధిల్లుతారని నానుడి. ఇదే మాట మీ అమ్మతో చెబితే మీ అమ్మ విసుక్కొంది. “ తాత ముత్తాల ఆస్థులు కావాలి కానీ వాళ్ళ పేర్లు ఎవరికి కావాలి” అని.  


అబ్బాయ్ ! మీ అమ్మ నీ దగ్గర్నుండి వచ్చాక చాలా నలిగిపోయింది రా. దిగులు ముఖంతో నవ్వడం మర్చిపోయింది. అడగ్గా అడగ్గా.. “ఏం చెప్పను అత్తమ్మా, అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలు కాదుగా” అని వాపోయింది.  


ఒరేయ్ పొంగుమాలినోడా! నిన్నొక మాట అడుగుతాను చెప్పు?  నీ ఇంట్లో నీ అమ్మ గెస్ట్ ఎట్లా అయితది, నీ పెళ్ళాం బాబాయి కూతురు ఫ్యామిలీ మెంబర్ యెట్లైతదిరా! నేను పాత కాలం యెనిమిదవ తరగతి చదువుకున్నా. మా పంతుళ్ళు యెవరూ యిట్టా చెప్పిండ్లా. నీకు అమెరికా చదువులు యిట్టా నేర్పి వుండాయేమో మరి. మీ అమ్మ ఆ మాట తల్చుకున్నప్పుడల్లా కుమిలి కుమిలి యేడుస్తా వుంటది. నీ తాత మీ నాయన అహంకారం నీ మెదడుకి బాగా యెక్కినట్టు వుంది. నీ భార్యకు మీ అమ్మ గురించి తెలియదే అనుకో, నీక్కూడా తెలియకుండా పోయిందా? అంత మాట అనుడు ఏంట్రా! నేను అక్కడ వుంటే చెంపకి వొక్కటి ఇచ్చి పడేద్దును. 


ఇంకో సంగతి. అదేదో అమెజాన్ లో పుస్తకాలు అమ్ముకుంటారంట గందా, నేను కూడా అప్పుడప్పుడు అంట్లు తోముకునే స్క్రబ్బర్ లు కూడా  తెప్పించుకుంటాలే. అందులో మీ అమ్మ తను రాసిన పుస్తకాలను పెట్టి అమ్ముకోవాలనుకునిందే అనుకో.. ఆ సేల్స్ మేనేజ్మెంట్ తో మాట్లాడేదానికి ఇంగ్లీష్ మాట్టాడాలంట. నాకు ఇంగ్లీష్ మాట్లాడం రాకపోయే, కాస్తో కూస్తో వచ్చినా జంకు అత్తమ్మా, అబ్బాయిని కోడలిని ఆ పనేదో చేసిపెట్టమని రెండు మూడు సార్లు అడిగా. ఇద్దరూ గమ్ముగా వుండినారు తప్ప ఆ పని చేయలేదు అని బాధ పడింది. నిన్ను చదివించడానికి మీ అమ్మ యెంత కష్టపడింది రా! ఇల్లిల్లు తిరిగి చీరలమ్మింది. డబ్బులు వసూలుకు తిరిగింది. ఎక్కడెక్కడ నాణ్యమైన చీరలు తయారైతాయో తెలుసుకుని అక్కడికిబోయి చీరలు గుత్తంగా కొనుక్కొచ్చి అమ్మేది. చీరలపై కుట్టుపూలు కుట్టేది. పదిమందిని పెట్టి కుట్టించేది.మగరాయుడిలా నిలబడి నీ కోసం కష్టపడితే చైతన్య హాస్టల్లో చదివినోడివి కాదు నువ్వు. ఆ రెండేళ్ళు నువ్వు చదివినందుకే మూడెకరాల పొలం అమ్మిందన్న సంగతి నువ్వు మర్చిపోయావు. నీ కాబోయే భార్య ని ఎమ్మెస్ చదివించుకుందామని నువ్వు చెబితే.. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగని భవిష్యత్ లో నీకు చేదోడు వాదోడు గా వుంటుందని సంతోషించి సరేనంది. ఆ అమ్మి అమెరికా వచ్చాక ఫీజులు కట్టేదానికి డబ్బులు లేవని నువ్వూ, ఆ పిల్లను కన్నోళ్ళు కాడి కిందపడేస్తే.. అప్పటికప్పుడు తన చేతి గాజులు తీసి అమ్మి చిట్ పాడి ఎల్ ఐ సి లోన్ తీసుకుని నానా అవస్థలు పడి మొదటి సెమిస్టర్ ఫీజు డబ్బులు పంపింది మీ అమ్మ కాదూ! నీ భార్య ఉద్యోగం వచ్చాక తన తల్లికి గాజులు చేయించుకుందంట గాని మీ అమ్మకి ఏమైనా ఇచ్చిందంట్రా! “ఆ అమ్మి కన్నకూతుర్లాంటిదే అనుకున్నా! ఎంత బాగా చూసినా కోడలు  కోడలే! ఎన్నటికీ కూతురు కాలేదు” అని దిగులుగా చెప్పింది మీ అమ్మ. 


 నీ భార్య ని రెండేళ్ళు చదివించిన సొమ్ముతో ఆ నాడే మీ అమ్మ కి ఓ ఇల్లు అమిరివుంటే.. ఇంత వయసొచ్చాక ఇల్లు బాడుగకి ఇచ్చినోళ్ళు యెప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేయడానికి నానా అవస్థలు పడేది కాదుగా, ఆమెకు మీ నుండి చిన్నమెత్తు సాయం లేదు వీసమెత్తు గౌరవం లేదు. ఎందుకే వాళ్ళపై నీకంత భ్రమత అని నేను చివాట్లు పెడతా. అయినా వినదు. నా కోడలికి ఆ చీర బాగుంటది ఆ నగ బాగుంటది. నా మనుమరాలికి అది కొనాలి ఈ నగ చేపియ్యాలి అని పరుగులు తీస్తది. నువ్వు పంపిచ్చిన డబ్బులను ఎగాదిగా వాడకుండా పొదుపుగా వాడుకుని మీకే అమర్చిపెట్టుద్ది. నీ కన్నా నేనే నయం గదే! దేశమంతా యాత్రలు తిరిగివచ్చా. నువ్వు పక్కనున్న చంద్రగిరి కోట చూడలేదు అరుణాచలం పోలేదు. ఎప్పుడు డబ్బులు లేవు లేవు అంటావ్, అని మందలిస్తే.. నేను కూడా చెడీబడీ కొనేసి దేశమంతా చుట్టేసి ఖరీదైన చీరలు చుట్టేస్తే నీ మనుమడు చేసిన అప్పులు తీరేవా? బిడ్డ నష్టపోయాడు, మోసపోయాడు, అప్పుల పాలై పోయాడు. వాడికి  నేనెలాగూ  సంపాదించి పెట్టలేను ఈ మాత్రం అండగానైనా వుండకపోతే యెట్టా! కొందరు జల్సాగా అనుభవించడానికే పుట్టి వుంటారు. కొందరు నాలా కష్టపడటానికి పుట్టి వుంటారు అని వేదాంతం చెబ్బుద్ది. అత్త కట్టిన సామ్రాజ్యంలో కోడలు రాజ్యమేలుద్ది అంటారు.మరట్టాగే వుంది నీ ఇంట్లో నీ భార్య తీరు  దానికి నువ్వు వకాల్తా పుచ్చుకుని మీ అమ్మ మీద విరుచుకు పడటమూనూ. 


మీ అమ్మను యెన్నోతూర్లు ఛీత్కరించినావంట. యెన్నోతూర్లు నువ్వు  అమెరికా కి ఇక రాబాకు అని అన్నావంట.  నువ్వెళ్ళిన పద్నాలుగేళ్ళకి మూడుసార్లు కాబోలు నీవుండే కాడికి వచ్చింది. వచ్చినప్పుడల్లా రానూపోనూ విమానం టిక్కెట్లు వచ్చాక ఆడ కట్టే హెల్త్ ఇన్సూరెన్స్  కలిపి నీకు భారం యెక్కువైతదే అనుకో, అయినా అట్లా ఛీత్కరించుకోవడం యేమైనా పద్ధతిగా వుందంట్రా? నిన్ను ఏరా! అంటేనే నచ్చని నువ్వు అమ్మని మాత్రం అగౌరవపర్చవచ్చా! పాపం! మీ అమ్మ మనసు యెంత గాయపడిందో! పద్దాక తల్చుకుని తల్చుకుని ఏడుస్తాది. నీకు ఫోన్ చేస్తే ఇరవై సెకన్లు ముప్పై సెకన్లు. ఫ్రెండ్స్ తో వుంటానంటివి ఆఫీసులో వుంటానంటివి. నీ కోడలికి ఫోన్ చేయ్ అని కట్ చేస్తావు.మీ ఆవిడకి ఫోన్ చేస్తే రెండు మూడు మాటలు. పిల్లదానితో ముచ్చట్లాడదామంటే పైన వుంది అంటది. మూడు నాలుగు రోజులకు ఒకసారి కూడా పిల్ల కనబడేది లేదు. నీ భార్య బాబాయి కూతురికి నీ పిల్లను మాలిమి చేసేస్తిరి. మీ అమ్మ పక్కన పడుకుని పిల్ల రైమ్స్ చూస్తుంటేనో పాటలు పద్యాలు చెప్పుకుంటూ వుంటేనో  దాన్ని బలవంతంగా తీసుకుపోయి నిద్రబుచ్చి చెల్లెలు పక్కన పడుకోబెట్టి బయటకుపోతారు మీరిద్దరూ. అప్పటికి మీ పిల్లను ఆ పిల్ల భద్రంగా చూసేది మా అమ్మ చూడనిది అని అర్థమా!?  ఆ క్షణాల్లో మీ అమ్మ మనసు యెంత నొచ్చుకుని వుంటది, ఆలోచించి చూడు. మీ అమ్మ దగ్గర  నేను వుండినప్పుడు మీ వేషాలన్నీ చానా  చూసాను లే! 


మీ అమ్మ అదేదో ప్రపంచ ప్రసిధ్ది గాంచిన  పుస్తకం కావాలని అడిగిందంట. ఇరవై డాలర్ల ఖరీదు చేసే ఆ పుస్తకం కొనిపెట్టకపోతివి. ఆ పుస్తకం ఆన్ లైన్ లో కుస్తీ పడి చదువుకుంది అంట. బాగా నచ్చింది అంట ఆ పుస్తకం. మీ నగరంలోనే మీకు అరగంట ప్రయాణదూరంలో వున్న ఆ రచయిత్రి స్మారక  కేంద్రం చూడాలని ఉవ్విళ్ళూరిందంట. సంవత్సరన్నర కాలంలో మీ అమ్మకు ఆ ఇల్లు చూపించడానికి నీకు తీరికేలేకపోయిందా? అంత బిజీగా వుండార్రా మీరు? నీకు క్రికెట్ ఆడుకోవడానికి,సినిమాలు చూడటానికి నీ భార్యా పిల్లతో కలిసి ఫ్రెండ్స్ ఇళ్ళకు పార్టీలకు వెళ్ళడానికి తీరుబడి వుంటుంది కానీ మీ అమ్మ అడిగిన చిన్న కోరిక తీర్చడానికి సమయంలేదా? మీ ఇంటికి రెండు మైళ్ళ దూరంలో వున్న లైబ్రరీ లో తను రాసిన పుస్తకాలు వుంచుదామని తనను తీసుకు వెళ్ళమని అడిగి అడిగి అలసి పోయిందట. అందుకూ తీరిక లేదు నీకు. ఇక అక్కడే వున్న తన స్నేహితురాలికి ఆరోగ్యం బాగుండక ఆపరేషన్ చేస్తే  చూడటానికి వెళ్దామని అడిగి అడిగి రోత పుట్టి అడగడం మానుకుంది అంట. ఏం బిడ్డవి రా అయ్యా! మీ అమ్మ ఏమన్నా విమానాలకి టికెట్లు కొని నయాగరా ఫాల్స్ చూపమని అడిగిందా వైట్ హౌస్, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూపించమని అడిగిందా? అరగంట దూరం కార్లో పోయి వచ్చే ప్రదేశం చూపమని అడిగింది. దానికి అయ్యే ఖర్చు నువ్వు ఒకరోజు రెస్టారెంట్లో చిరుతిండి తినే ఖర్చు. నీ భార్య తినే ఐస్ క్రీమ్ అంత ఖర్చు. మీరు ఆర్డర్ పెట్టుకునే పిజ్జాలంత ఖర్చు.  తల్లి చిన్నపాటి కోర్కెను తీర్చలేని నువ్వేం బిడ్డవి రా!? నీకు నచ్చినవి ఇవ్వడం కాదూ అమ్మ అడిగినవి ఇవ్వడం తెలియదూ నీకు. 


మీ అమ్మ ఖరీదైన బహుమానాలు అడిగిందా, విహార యాత్రలు,విందు భోజనాలు అడిగిందా? తలకు మించిన భారం మీదేసుకుని పుట్టినరోజు పండుగలు చేస్తావుంటే చూసి ఊరకుండలేక పెద్దదానిగా, మంచి చెడు బిడ్డకు చెప్పుకుందామనుకుంటే వినే ఓపిక లేకుండే నీకు. కరోనా వచ్చి గదిలో పడివుంటే పదకొండు గంటలైనా ఇన్ని కాఫీ నీళ్ళు దాని ముఖాన పొయ్యకపోయే, అయ్యా!మందులు వేసుకోవాలి గా, ఇంతవరకూ ఏమీ తినకపోతే  యెట్టా?  ఏమైనా పట్టుకుని రా!  అని నీకు ఫోన్ చేసి చెబితే నువ్వు విసుక్కుంటూ కాసిని  పాలు అవెన్ లో కాచి అందులో నాల్గు బ్రెడ్ ముక్కలు వేసుకొచ్చి యిచ్చి యింకెప్పుడూ యిక్కడికి రాబాకు. నా భార్య నీకు చేసిపెట్టదు అని అమ్మను విసుక్కొనే బదులు నీ భార్యను   మందలించవచ్చు కదరా! అంత దద్దమ్మ వి అయిపోయావా నువ్వు? నువ్వు నీ భార్య కలిసి ఎంత అగమానం చేసి పంపినారు!!.

మీ నిరాదరణ  మీ ఛీత్కారాలు మీ మాటలు అన్నీ తల్చుకుని తల్చుకుని గట్టు తెగిన వాగు అవుతది. అట్టాంటప్పుడు దాన్ని చూస్తే కడుపు తరుక్కుపోద్ది. 


మీ అమ్మ కపటం లేని మనిషి రా! మీ నాన్న భర్త గా యెంతో ద్రోహం చేసినాడు. పీకలదాకా తాగొచ్చి తల పగలగొట్టాడు మక్కెలిరగదన్నాడు. ఎంతగానో అవమానించాడు. అలాంటి దుర్మార్గుడి నుండి తప్పించి మీ అమ్మను మేమే దూరంగా పంపించేసాం. నిన్ను పెట్టుకుని ఇరవై యేళ్ళు నీ కోసమే బతికింది పాటుపడింది. అటువంటి మీ అమ్మకు రోగమొస్తే యిన్ని మంచినీళ్ళు పొయ్యడానికి ఇంత కూడు పెట్టడానికి కష్టం అయిపోయిందా నీకు. మీ అమ్మ నీ దగ్గర వుండేదానికి యిష్టపడేది యెందుకో తెలుసా! నీ పిల్లను వొళ్ళో వేసుకుని ఆడించేది ఉప్పుమూట మోసోది, యెత్తుకుని మోసేది స్నానం చేపిచ్చి గోరుముద్దలు తినిపించేది ప్రేమ నిండిన హృదయంతో.  నీ పిల్ల ముద్దు మురిపాల్లో  చిన్నప్పటి  నిన్ను  చూసుకోవడం కోసం.  ఆ పసి స్పర్శ లో వుండే స్వచ్ఛత కోసం. ఆ ప్రేమలో ఆ స్పర్శ లో తన బాధలు కష్టాలు అన్నీ మర్చిపోవడం కోసం అక్కడ వుంటది. ఆమెకు మీ కన్నా యెక్కువగా యెవరుండారని  యిక్కడ వుండాలి చెప్పు.  ఒంటరితనం అనే పెద్ద రోగమే కాకుండా అనేక అనారోగ్యాలకు మందు మనుమరాలు అని, కొడుకు కోడలు దగ్గర వుంటే ఏ బాధలు తన దరిదాపుల్లోకి రావు అని అనుకోవడమే అది చేసిన తప్పా!? అదే పెద్ద శిక్ష అయిపోయింది దానికి. ఆప్యాయంగా కంచంలో ఇంత కూడు వెయ్యకపోయినా పెద్ద దరిద్రం యింట్లోకి వచ్చి కూర్చుంది అనే నవనాడులు కృంగ దీసుకునే మాట అనిపించుకుని గుడ్లనీరు గుడ్ల కుక్కుకుని మనవరాలి కోసం  సంవత్సర కాలం  వుండివచ్చింది. ఇన్ని చూసినాక ఒక సామెత గుర్తొచ్చింది. నీకు అమ్మ అల్లం పెళ్ళాం బెల్లం అయిపోయింది అని. మీరు చేసినవి చెప్పాలంటే యింకా చాలా వుండాయిలే, కతలు కతలుగా చెప్పింది మీ అమ్మ.  ఎనబై ఏళ్న ముసలిదాన్ని.  సరిగా గుర్తుండక అన్నీ అడగలేకపోతున్నా.  అవన్నీ జ్ఞాపకం చేసుకుని ఇంకోసారి ఉత్తరం రాస్తానులే!


ఎక్కడో అక్కడ తప్ప తల్లులు  బిడ్డలకు ఏం ద్రోహం చేస్తారు రా నాయనా! కోడలు కూడా ఓ ఇంటి కూతురే కాబట్టి తప్పు దారిన నడుస్తుంటే  తమ బిడ్డే అని పక్షపాతం చూపకుండా   కొడుకుని మందలిస్తారు. ధర్మం చెబుతారు. నేను మీ తాత అదే చేసినాము. మీ నాన్న ను పెడన పెట్టాము. నిన్ను కూడా అప్పుల పాలు కాకుండా కాపాడుకోవాలని మీ అమ్మ మంచి సెబ్బర చెప్పబోద్దేమో, అంతేగా! నువ్వు మీ అమ్మ మాట ఏనాడైనా విన్నావా పెట్టావా?  మీ అమ్మ నిక్కచ్ఛిగా మాట్లాడుతుంది. మాట కరుకు కావచ్చోమో గానీ దాని  మనసు వెన్న. నేను మంచానా పడితే చూసేది కూడా మీ అమ్మే! నలుగురు కోడళ్ళున్న అత్తగా నేను మీ అమ్మ మనసు వరుస తెలిసిన మనిషిగా చెబుతున్నా! అంతెందుకు? మీ నాన్న పరాయిదాన్ని పెట్టుకుని  ఇరవై యేళ్ళ మిమ్మల్ని వొదిలేసి పోతే కయ్యలు పశువులు మోటరుబండ్లు అన్నీ అమ్ముకుని నాశనం చేస్తే నిన్ను నిలబెట్టింది మీ అమ్మ కాదూ! నీ పెళ్ళప్పుడు వచ్చి  దిష్టిబొమ్మలా నిలబడటం తప్ప మీ అయ్య చేసింది ఏముందిరా కూరలు బాగోలేదు, మర్యాదలు బాగా జరగలేదని వొంకలు పెట్టడం తప్ప. అట్టాంటి మీ నాన్న కు నయం కానీ రాచపుండు పుడితే యింటికి తెచ్చి హాస్ఫిటల్ కి తిప్పుతూ లక్షలు ఖర్చు పెట్టింది.  వచ్చిపోయే మీ నాన్న మరో సంతానాలను ఆదరించి మీ నాన్న కూసే వొంకర కూతలన్నీ భరించింది. ఏడాదిపాటు నరకం చూస్తూ కూడా  మనిషి బతికితే చాలని తాపత్రయపడింది. మీ నాన్నను అరచేతుల మధ్య  పెట్టుకుని చూసింది.ఆఖరికి మీ అమ్మ చేతుల మధ్యనే ఊపిరి వదిలాడు. దూరంగా వుండి  డబ్బులు పంపడం తప్ప మీ అమ్మ మీద రంకెలేయడం తప్ప నువ్వు చూసింది చేసింది ఏడ అని? మీ అమ్మ దగ్గర ఇంకా నీకు ఈయటానికి ఏమీ లేవు ఎముకలు తప్ప. సొమ్ము లేకపోయేసరికి మీ అమ్మ నీ కంటికి గౌరవంగా కనబడటం లేదేమో! అమ్మంటే అంతు లేని సొమ్ము అంటారు.మీ అమ్మ ను పరుల ముందు చులకన చేసుకోబాకు. నువ్వే చులకన చేస్తుంటే నీ భార్య యెట్లా గౌరవిస్తాది విలువనిస్తాది చెప్పు. వాసం గ్రాసం చూస్తున్నావు కదా అని అమ్మ ని బిచ్చగత్తె లాగా చూడకు.తల్లి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేరు నాయనా!   


అమెరికా కో ఇతర దేశాలకు పోయినాళ్ళందరూ కాసిన్ని డబ్బులేసి మనుషులు పోయినప్పుడు వాట్సాప్ కాల్ ల్లో కన్నీళ్ళు పెట్టడం కాదు కావాల్సింది. బతికి వున్నప్పుడు అమ్మా తిన్నావా! ఆరోగ్యం బాగుందా? అని అడగడంతో పాటు అక్కడ మనవాళ్ళ చుట్టూ యెవరెవరు వుండారు? వాళ్ళతో మన సంబంధ బాంధవ్యాలు యేమిటి అని ప్రశ్నించుకోవాలి. ఎవరితోనైనా అంటీముట్టనట్లుగా వుంటే  ఇక్కడ  మీకు బంధువులు స్నేహితులు ఎట్టా వుంటారు? నాకు ఎవరూ లేరు అనుకోవడం యెందుకు? ఉన్న వాళ్ళను నువ్వెంత విలువగా ఇష్టంగా పలకరిస్తున్నావ్ చెప్పు? ఈ ముసలి ముండకైనా యెప్పుడన్నా ఫోన్ చేసి మాట్లాడావా? మీ అమ్మ దగ్గర వుంటే నేను  వాట్సాప్  కాల్లో  మాట్లాడటం తప్ప.  అంతెందుకూ! మీ పిన్నమ్మ నిన్ను చిన్నప్పుడు రెండేళ్ళు పెంచింది.తన దగ్గర పెట్టుకుని చదివించింది. నీ ముడ్డి కడిగి నీ మూతి తుడిచి పక్కలో పడుకోబెట్టుకుని చక్కంగా ప్రేమగా పెంచింది. పెరిగి పెద్దవుతుంటే నీకు మంచి భవిష్యత్ వుండాలని తాపత్రయపడింది. అమెరికా లో ఇంకో మూల వున్న దాని బిడ్డ ఏదో ఇబ్బందిలో పడిందేమోనని వెళ్ళి చూసి రమ్మని వేడుకొంది. నువ్వు వొంకలు చెప్పావ్  ఆఖరికి పెడ చెవిన పెట్టావ్. రక్తసంబంధం వున్న వాళ్ళు నీకు ఆప్తుల్లా కనబడకుండా పోయారు. అమ్మ వైపు కానీ నాన్న వైపు కానీ బంధువులు ఎవరూ నీ వాళ్ళు కాకుండా పోయారు. భార్య తరపు బంధువులు ఆత్మ బంధువులై పోయినట్టున్నావ్. నీలాంటి వాళ్ళను చూసే అయినవాళ్ళకు ఆకుల్లో కాని వాళ్ళకు కంచాల్లో అని అంటారని నీకు తెలియదేమో!.  


పయిలం బిడ్డా! అన్ని బంధాలను పెడన పెట్టి డబ్బు సంపాదనే లోకంగా భార్య మాటే వేదవాక్కు గా బతకబాకు. బతకనేర్చిన మాటలు మాట్టాడబాకు. మళ్ళీ చెబుతుండా, మీ అమ్మ కుమిలి కుమిలి ఏడుస్తా వుండింది. అది మొగుడు లేకుండా బతకగల్గింది కానీ  బిడ్డ  చూసే  పెడసరపు చూపు భరించలేకపోతుంది. అయినా మీ అమ్మ బతకడం తెలిసిన మొగలాయి. మీ నాన్న ను వొదిలేసి బతికినట్టు నిన్ను నీ పాటికి వొదిలేసి బతకగలదు. అయ్య లేనివాడిగానే పెరిగావ్. వాడూ పొయ్యాడు.  ఇక అమ్మ కూడా లేకుండా  యెవురూ లేని వొంటి గాడివి అయ్యి నీ భార్యబిడ్డలు చాలనుకుని ఒంటిగా బతికేయకు బిడ్డా, పయిలం బిడ్డా! ఈ వేలు కు ఆ వేలు యెడం అంటారు. ఏడనో  సముద్రాల అవతల వున్నవాడివి, మనసులో నైనా ఆలోచనలో నైనా మీ అమ్మ లాగా మనఃస్ఫూర్తిగా నా వాళ్ళు అని అనుకోవడం నేర్చుకో. మనసు నిబ్బరంగా వుంటది.మంచికి చెడుకీ మనుషుల అండ వుంటది. అయినవాళ్ళను దూరం చేసుకోబాకు. మనిషికి రవొంత డబ్బున్నా కొండలాంటి అండ వుండాలి. అది పోబొట్టుకోబాకు.  ఇంట్లో పెద్ద బాలశిక్ష పెట్టుకొని యింటిల్లపాది చదువుకోండి చాలు. అప్పుడు  బయట భగవద్గీత చెప్పబడల్లేదు నువ్వు. అమ్మల గురించి బిడ్డలు బిడ్డలు గురించి అమ్మలు గర్వంగా చెప్పుకోవాలి. ఫిర్యాదు చేయకూడదు. వుంటాను మనుమడా! శుభాశీస్సులతో ..  నాయనమ్మ.  


పిల్లవాడిని మనిషిగా చేయడానికి తల్లికి ఇరవై ఏళ్ళు పడుతుంది. 

అతడిని మరో స్త్రీ ఇరవై నిమిషాల్లో 

“పూల్ “ ని  చేస్తుంది.  - రాబర్ట్ ప్రాస్ట్. 


(బహుళ త్రైమాసిక అంతర్జాతీయ మహిళా పత్రిక - ఏప్రిల్-జూలై సంచిక లో ప్రచురితం)