9, సెప్టెంబర్ 2012, ఆదివారం

పాలబువ్వ తీపిఈమధ్య టీవి లో వచ్చే ప్రకటనల్లో నిమిషాల్లో తయారయ్యే మొక్క జొన్న పేలాలని చూడగానే నేను గతంలోకి వెళ్ళిపోయాను.

కొన్ని స్థలాలు, కొన్ని జ్ఞాపకాలు మనం ఎంత వద్దనుకున్నా మనని వదిలిపోవు. ఎందుకో ఆ జ్ఞాపకాల ముద్ర అంత బలవత్తరమైది .

పడమటింట్లో సూరీడు విశ్రాంతిగా ఒదిగిన వేళ ,,ఆ మసక చీకట్లో పొంత పొయ్యి రాజుకుంది. కాసేపటికే ఆ పొయ్యి పై పెట్టిన మట్టి కుండలో నీళ్ళు సల సల మరుగుతున్న శబ్దం. కట్టెలు కాలి  ఆ మంట కుండ క్రిందకన్నా వెలుపలవైపే  సెగ ఉండటం చూసి కట్టెలు ఎగతోద్దామని అక్కడికి వెళ్ళింది ఆమె. ఆ పొయ్యి నిండా పెట్టిన సీమ తుమ్మ కట్టెల నుండి..బుస బుసమంటూ.. బయటకి వస్తున్న రాగి రంగు ఆవిరి పదార్ధం చేతికి అంటుకుని చురుక్కుమంది.
అబ్బ..అంటూ చేయి గబాల్న వెనక్కి లాక్కుని..

అచ్చమ్మా .! త్వరగా రావాలి.. కుండలో ఎసరు కాగింది.. అంటూ కేక వేసాను  . 

వస్తున్నానమ్మా.. అంటూ.. ఇంటికి ఎదురుగా ఉన్న ఇంట్లో నుండి అచ్చమ్మ ..బయటకి వచ్చింది.

అచ్చమ్మ మా   పొరిగింటి పెద్దామె. స్నానం,నిద్ర తప్ప ఆమెకి తీరిక ఉన్న సమయాలు మొత్తం ఆ  ఇంట్లోనే అవసరమైనప్పుడల్లా మాకు పనులలో సాయం చేస్తూ ఉండేది. ఇంట్లో మగవాళ్ళందరూ పనుల కోసం బయటకివెళితే ఎవరు కనబడని చోట నాకు ,మా అత్తమ్మకి మాట్లాడటానికి బయట విశేషాలు చెప్పడానికి ఉన్న ఏకైక మూడో మనిషి.

అప్పుడే స్నానం చేసి ..నుడుటున ఇంత కుంకుమ బొట్టు పెట్టుకుని తళ తళ లాడే తెల్లరాయి ముక్కెర మెరుస్తుండగా.. ఆకు వక్క వేసుకుని ఎర్రగాపండిన పెదవులతో గబా గబా వచ్చింది.

"అప్పుడే భోజనం తినేసావా? ఆకు వక్క వేసేసావు.."అంటూ.. అచ్చమ్మ ని పరీక్షగా చూసాను. పాటూరు లో నేసిన నూలు చీర కి బిర్రుగా గంజి పెట్టి..ముడత లేకుండా  సాపుగా చేసుకుని  బిళ్ళ మడతలు పెట్టి ఇస్త్రీ చేసినట్టున్న చీర కట్టి రెడ్డిసానిలా అందంగా కదిలి  వచ్చింది.

పెద్దాయనకి అన్నంపెట్టి ఆ చేత్తో..నేను తినేసే వచ్చానమ్మా..! అంటూ నే ..

"ఏమ్మా.. అప్పుడే ఎసరు కాగిందే!మరిన్ని కట్టెలు వేసినట్లు ఉన్నావు..ఎప్పుడెప్పుడు .. అన్నం తినాలా.. అని తొందరగా ఉన్నట్టుంది నీకు " ..అంటూ..మేలమాడింది.

"మరి  నువ్వు తొందరగా వండాలి . ఎలా ఉంటుందో తిని చూడొద్దు " అన్నాను ఆత్రంగా..

నా ఆ..  ఆత్రంకి కారణం ఏమంటే.. ఆ సంవత్సరం మా దిబ్బ మీది తోట ఒకటిన్నర ఎకరా లో.. మొక్క జొన్న తోట వేసారు. మిట్టగా ఉండటం వల్ల ఆ దిబ్బ మీద తోటకి సరిగా నీరు పారదు, అందుకనే  ఆ మడి  చెక్కల్లొ  ఆరు తడి పంటలు వేస్తుంటారు.

కంకుల్ని విరిచే టైం కి మొక్కజొన్న కంకుల్ని చేను లెక్కన  గుత్తానికి అమ్మేస్తారేమో..అనుకున్నాను.

"అమ్మడానికి కాదు మొక్క జొన్నకంకుల్ని ఎండబెట్టి అన్నం వండి రోజు మన మూడు జతల ఎద్దులకి దాణా పెట్టటానికి" అని మా అత్తమ్మ చెప్పారు.

అంతకు ముందు రోజు రాత్రేళ  నేను చూస్తూండగా మొక్క జొన్న అన్నం వండి..చల్లార్చి  ఆ పదార్ధాన్ని తెల్లవారే  ఎద్దులకు తవుడుతో కలిపి దాణా గా పెట్టారు.

 మా చిన్నప్పుడు మా దొడ్లో ఎద్దులకు పెట్టె పచ్చ జొన్న అన్నం గుర్తుకు వచ్చింది. "అదేమిటి ? జొన్న అన్నం కదా పెట్టేది? " అడిగాను.

" మొక్క జొన్న అన్నం బలం అంట... ఇప్పుడందరూ ఉలవలు కూడా మానేసి ఇదే పెడుతున్నారట  పశువుల డాక్టర్ చెప్పారంట "అని చెప్పారు.

"ఈ మొక్క జొన్నలతో.. అన్నం వండుకుని తింటారు తెలుసా! ?" అని అడిగింది అచ్చమ్మ.

"తెలియదు. జొన్న అన్నమే తెలుసు. మా ఊరులో మాగాణి పొలం లేని వాళ్ళు ఒక పూట జొన్న అన్నం తినడం తెలుసు కాని మొక్క జొన్న అన్నం సంగతి తెలియదు"  అని చెప్పాను.

"రేపు చేస్తాను తిని చూడమ్మా.. అసలు వదిలిపెట్టవ్.." అని ఊరించింది....అచ్చమ్మ.

తెల్లవారి.. బస్తాలలో కట్టి ఉంచిన మొక్క జొన్నలని తీసి ఓ..నాలుగు కేజీల వరకు శుభ్రం చేసింది. ఇసుక ఉంటుంది..బాగా శుభ్రం చేయి అచ్చమ్మా ..అంటూ అత్తమ్మ హెచ్చరికలు.

మళ్ళీ ఆమెని సంతృప్తి పరచడానికన్నట్లు  ఇంకొక సారి శుభ్రం చేసి.. మూడు కిలోమీటర్ల దూరం లో ఉన్న లేగుంటపాడు కి నడచి వెళ్లి ఆ మొక్క జొన్నలని మిల్లులో సన్నగా రవ్వలాగా పట్టించుకుని వచ్చింది.

సాయంత్రం ఎప్పుడు అవుతుందా .. అచ్చమ్మ మొక్క జొన్న అన్నం ఎప్పుడు వండుతుందా ! అని ఎదురు చూస్తున్నాను. .

మా అబ్బాయి నెల్లూరు టౌన్ లోకి స్కూల్ కి వెళ్లి వచ్చాడు.లేగుంటపాడులో స్కూల్ బస్ దిగే సమయానికి ఇంట్లో ఉన్న మగవారిలో ఎవరో ఒకరు అక్కడ రెడీగా ఉండి స్కూటర్ పై ఎక్కించుకుని తీసుకు వచ్చేవారు. అది వాళ్ళ డ్యూటీ .

 స్కూల్ నుండి వచ్చి గంట సేపటికి తర్వాత కూడా.. తువ్వాయిలతో..ఆటలాడుకుంటున్న అబ్బాయిని పిలిచి స్నానం చేయమంటే..... అమ్మా ! ఇంకా కాసేపు ఆడుకుంటాను "అంటూ పేచీ పెడుతున్న అబ్బాయికి .. తొందరగా స్నానం చేస్తే.. నీకొక కొత్త బువ్వ పెడతాను అని నమ్మకంగా చెప్పాను.

అంతే.. నా మాట నమ్మి గబ గబా స్నానం చేసాడు. హోం వర్క్ చేస్తూ.."అమ్మా.. కొత్త బువ్వ ఎప్పుడు పెడతావు.. తొందరగా పెట్టమ్మా.. "అంటూ.. అడగసాగాడు.

అచ్చమ్మ వచ్చి పొయ్యి వెలిగించి ఎసరు పడేసి వెళ్ళింది. మళ్ళీ వచ్చి మధ్యాహ్నమే ..నానపెట్టి ఉంచిన మొక్కజొన్న రవ్వని మరొక మారు కడిగి మసలుతున్న ఎసరులో వేసింది. వెంటనే తెడ్డు తీసుకుని ఒక సారి కదిపింది.

అలా అప్పుడప్పుడు కలపకపోతే అన్నం ముద్ద కట్టుద్ది..అని అడగకుండానే చెప్పింది. ఒక అరగంట పైన ఉడకనిచ్చి జల్లి మూతవేసి గంజిని వేరే దబరలోకి ఒంపింది. ఆ గంజి తెల్లగా చిక్కగా ఉంది. తెల్లవారిన తర్వాత ఆ గంజిలో మజ్జిగ కలిపి తాగితే చాలా చలువ,మంచి  బలం అని కూడా చెప్పింది.

కాసేపు పొయ్యిపై ఆ అన్నం ని అలా సెగన పెట్టి..దించి పెట్టింది. ఇదంతా అయ్యేటప్పటికి ఒక గంట పైనే పట్టింది.
అప్పటి వరకు అమ్మ అన్నం ఎప్పుడు పెడుతుందా అని చూసే "అబ్బయ్య " ఆవలింతలు మొదలు పెట్టాడు.

ఆరు బయట మంచం వేసి.. ఆ మంచం పై అబ్బాయిని కూర్చోపెట్టి ఆకాశంలో ఉన్న చందమామని,చుక్కలని చూపిస్తూ.. కథలు చెపుతూ.. కొసరి కొసరి తినిపించడం .. అమ్మ అలవాటు. నానమ్మకి, అమ్మకి స్కూల్ లో జరిగిన ముచ్చట్లు చెపుతూ.. మారాం చేస్తూ అన్నం తినడం అబ్బాయి అలవాటు.

అచ్చమ్మా .. తొందరగా అన్నం పెట్టు .."చంద్ర బాబు " ఆవలింతలు పెడుతున్నాడు..అని అప్పుడే బయట నుంచొచ్చిన   తాతగారు తొందర చేసారు

ఇదిగో..ఇప్పుడే వస్తున్నాను బాబు.. అంటూ అచ్చమ్మ పళ్ళెంలో మొక్క జొన్న అన్నం ని పలుచగా పరచుకుని విసనకర్రతో.. ఆరబెట్టుకుంటూ. అబ్బాయి కూర్చున్న మంచం దగ్గరకు రాసాగింది. అచ్చమ్మ వెనుకనే నానమ్మ కూర గిన్నె, నేతి గిన్నె తీసుకుని వస్తూ ఉంది.

ఇంతలో టక్కున కరంట్ పోయింది.

అరె! ఏమొచ్చి చచ్చిందమ్మా..వీడికి!? బిడ్డ అన్నం తింటుంటే కరంట్ తీసేసాడు.. అంటూ.. అమ్మా.!. ఈ పళ్ళెం పట్టుకో.. దీపం ఎలిగించుకుని వస్తా..అంటూ.. అమ్మకి పళ్ళెం ఇచ్చి వెళ్ళింది.

అసలే ఆశ్వీయుజ మాసం. పైగా నవమి వెన్నెల. మసకగా ఉంటేనేం తేటగా ఉంది. చుట్టూ ఉన్న పైర గాలి తో కలసి.. వెన్నెల చల్లగా, తెల్లగా ఉంది.

ఆ వెన్నెలతో పోటీ పడుతూ.. తెల్లని మొక్క జొన్న అన్నం పళ్ళెంలో మిడిసి పడుతుంది. సంభ్రమం గా చేత్తో తాకి చూసింది. ముని వేళ్ళతో.. కాస్త అన్నం ని పైకి తీసింది. పలుకు పలుకుగా.. తెల్లగా అన్నం. .మళ్ళీ పట్టుకుని చూడాలన్నట్లు మునివేళ్ళ మధ్య ఉన్న అన్నంని పళ్ళెంలో వదిలింది. ఉప్పు పలుకుల్లా జల జల విడివడ్డాయి.

అచ్చమ్మ కిరోసిన్ దీపం వెలిగించి తెచ్చింది. నానమ్మ ఆ అన్నంలో కలుపుకోవడం కోసమే నాలుగైదు రకాల కూరగాయలు కలిపి చిక్కగా వండిన పులుసు కూరలో.. కమ్మగా కాచిన నేయి వేసి.. మళ్ళీ ఇంట్లోకి  వెళ్లి మనుమడి కోసం తాగేందుకు నీళ్ళు తెచ్చి ఇచ్చింది.

ముక్కాలి పీట వేసుకుని కూర్చుంటూ.. "బంగారం" కొత్త బువ్వ బాగుందా.. !? అడిగింది..

"చాలా బాగుంది..పాపమ్మ.."అంటూ ఇష్టంగా తింటూ చెప్పాడు.

 అమ్మకి ఆ అన్నం ఎప్పుడెప్పుడు రుచి చూద్దామా అనిపించింది. కానీ అందరూ కలసి తినేవరకు ఆగక తప్పదు కదా!

అమ్మ మనసులో మాట గ్రహించినట్లు.. "అమ్మా.. నువ్వు..తిను..! "అంటూ.. తన చిన్ని చేతితో.అమ్మకి అన్నం ముద్ద ని నోట్లో పెట్టాడు.

" నిజంగానే చాలా బాగుంది " అంది  అమ్మ.

చూసావా..అచ్చమ్మా .. బాబు వాళ్ళ అమ్మకి ముద్దలు పెడుతున్నాడు కాని నాకొక  ముద్ద అన్నా పెట్టాడేమో చూడు" అంది నిష్టూరంగా నానమ్మ.

అలా అమ్మా,అబ్బాయి ఒకరికొకరు తినిపించుకుంటుంటే

చంద్ర బాబూ !మీ అమ్మకనా.. అంత ఇష్టంగా పెడుతున్నావు నాకు  కూడా పెట్టవచ్చుగా!! ఒక్క బువ్వ ముద్దయినా  నాకు   పెట్టలేదేమిటి?  అంటూ నిష్టూరంగా ముద్దులాడింది.  అంతలోనే  ఉక్రోషంతో నాకు ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు.. వాళ్ళు  చిన్నప్పుడూ ఇలాగే నాకు  నోట్లో ముద్దలు పెట్టేవాళ్ళు  అని నవ్వుతూ పోల్చుకుంది నానమ్మ.

కూరన్నం తినడం అయిపొయింది. ఇంకొంచెం అన్నం పెట్టి ..అందులోకి కుంపటి పై కాచిన మీగడ పాలు పోసి తెచ్చిచ్చింది  అచ్చమ్మ.

ఆ అన్నం ని మెత్తగా కలిపి అబ్బాయికి తినిపించింది అమ్మ. కూర అన్నం కన్నా రుచిగా ఉన్న మొక్కజొన్నపాల అన్నం ని ..ఇంకా ఇష్టంగా తిన్నాడు అబ్బాయి.

"అచ్చమ్మా..నువ్వు రోజూ  ..ఈ అన్నమే వండు. నేను ఇదే తింటాను." అని చెప్పాడు.

అలాగే..నాయనా.. నువ్వు తినాలే  కాని నేను రోజు చేసి పెట్టనా .. అంది ప్రేమగా. అచ్చమ్మ.

ఆ పాల బువ్వ తీపి.. ఆ పైర గాలులు.. పచ్చని పొలాలు.. ఇప్పుడు జ్ఞాపకాలలో సజీవంగా, మధురంగా ఉండనే ఉన్నాయి.

కొన్నేళ్ళ క్రితం మరణించిన అచ్చమ్మ కళ్ళలో మెదిలింది . కళ్ళలో నీళ్ళు ఉబికాయి..ఆమె ప్రేమని, అభిమానంని తలుచుకుంటూ..

కానీ ఆ పరిసరాలే.. వారికిప్పుడు  పరాయివి  అయిపోయాయి.
ఆ జ్ఞాపకాలు మాత్రం ఎవరు విడదీయరానివి,  ఏ స్వార్ధం దోచు కుందామన్నా దోచుకోలేనివి.
పాల బువ్వ లోని తీపి లాంటివి. అమ్మ మురిపాలంత  గొప్పగాను,  చిరకాలం సజీవంగా  ఉండేటివి కూడా!!! .


22 వ్యాఖ్యలు:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

ఇంట్లో వరి బువ్వ తినకుండా చేన్లో జీతగాళ్ళతో కలిసి జొన్న బువ్వ,కొర్ర బువ్వ తిన్న రోజులు గుర్తుకు వచ్చాయి.చక్కటి టపాకు అభినందనలు.

అజ్ఞాత చెప్పారు...

జ్ఞాపకాలెప్పుడూ తీయనైనవే!

meraj fathima చెప్పారు...

వనజా , మీరు రాసిన ఆ జ్ఞాపకాలు ఎంత మధురంగా ఉన్నాయో.
నెల్లూరు రైతుకుటుంబలో పుట్టిన నాకు మొక్కజోన్నా అన్నం తెలీదు.
ఉలవలూ,పిల్లిపెసరలూ వాడకం తెలుసు.మీరు రాసేవిదానం బాగుంది,meraj

Raj చెప్పారు...

బాగున్నాయి మీ జ్ఞాపకాలు..

లక్ష్మీదేవి చెప్పారు...

కమ్మటి కథ చెప్పినారండి.

జలతారువెన్నెల చెప్పారు...

చాలా చాలా చాలా బాగుంది టపా వనజ గారు..
మీ జ్ఞాపకాలు మాతో పంచుకుని మాకు కూడా కంట నీరు తెప్పించారు. నాకు ఇప్పుడు అర్జంట్ గా మొక్క్క జొన్న పాల అన్నం తినాలనై ఉంది. ఎలాగో చెప్పాలి మీరే వనజ గారు.

అజ్ఞాత చెప్పారు...

కేవలం నాటి జ్ఞాపకాలనే కాదు.. బందాల్లోని తీయదనాన్ని, కనుమరుగైపోయిన నాటి పల్లె వాతావరణాన్ని చక్కటి కథనంతో ఆవిష్కరించారు..superb and heart touching narrative

శశి కళ చెప్పారు...

నిజంగా మొక్క జొన్న అన్నం అంత బాగుంటుందా?
నేను ఎపుడూ తినలేదు.కుక్కర్ లో వందోచ్చా?
వనజగారు యెంత బాగా వ్రాసారు..ఇప్పుడు నాకు నివాస్ గుర్తుకు వచ్చాడు :(

Manasa Chatrathi చెప్పారు...

వనజ గారూ, భలేగా వ్రాశారు. కొన్ని పదాలు కూడా నాకు కొత్తగా అనిపించాయి - అవి ఒక ఎత్తు - మురిపెమంతా రంగరించి వ్రాసారేమో - నాకూ ఇప్పటికిప్పుడు అలా వేడి వేడిగా తినాలనిపించేత నచ్చింది :)

శ్రీ చెప్పారు...

ఇలా ప్రతి పదాన్నీ చదువుతూ
అనుభూతుల జల్లులో తడవాలంటే...
మీ బ్లాగ్ క్రమం తప్పకుండా చూడాలంతే...:-)
చాలాబాగుంది...
బాల్యాన్ని గుర్తు చేశారు వనజ గారూ!
@శ్రీ

skvramesh చెప్పారు...

వనజ గారు నిజంగా పాలబువ్వంత కమ్మగా ఉంది మీ టపా అబినందనలు

రసజ్ఞ చెప్పారు...

దీని గురించి ఎన్నో సార్లు వినటమే తప్ప ఏనాడూ తినలేదు, వచ్చాక మీ దగ్గరికే వస్తా రుచి చూపించాలి మరి!
మళ్ళీ యధావిధిగా టపాలు వస్తున్నాయి కనుక మీరు పూర్తిగా కోలుకున్నారనే భావిస్తున్నాను.

రాజి చెప్పారు...

మీ చంద్రునికి వెన్నెల్లో మీరు తినిపించిన గోరుముద్దలు మా చిన్నతనాన్ని కూడా గుర్తు తెచ్చాయండీ..

పాలన్నం నాకు కూడా ఇష్టమే..ఇప్పుడు మీరు చెప్పిన మొక్క జొన్నతో కూడా ట్రై చేయాలి :)

chinni v చెప్పారు...

అర్జెంటుగా ఎలోగల మొక్కజొన్న రవ్వ చేసి అన్నం వండి తినాలి అనిపించేంతగా వుంది మీరు రాసిన విధానం ..ట్రై చేస్తాను .

వనజవనమాలి చెప్పారు...

చిలమకూరు విజయ మోహన్ గారు.. మరలా మీరు గతంలోకి వెళ్లి మీ జ్ఞాపకాలని గుర్తుచేసుకునేలా ఈ పోస్ట్ ఉన్నందుకు సంతోషం కల్గింది. ధన్యవాదములు.
@కష్టేఫలె మాస్టారు.. జ్ఞాపకాలు నిజంగా మధురంగా ఉండాలనే కోరుకుందాం. కానీ చేదు జ్ఞాపకాలు ఉండవచ్చు. నేను ఇలాగే అంటే ఒకసారి కొంచెం చర్చ జరిగింది. ఆ విషయం వ్రాస్తే ఒక పోస్ట్ అవుతుంది. కనుక బ్లాగ్ లో వ్రాస్తాను..మీ స్పందనకి ధన్యవాదములు.
@మేరాజ్.. చిరుధాన్యాలు అన్నీ మనం తినదగినవే కదా! నా పోస్ట్ నచ్చినందుకు థాంక్ యు ఫ్రెండ్.

వనజవనమాలి చెప్పారు...

రాజ్ గారు.. థాంక్ యు సో మచ్. :)
@శశి కళ గారు.. మొక్క జొన్న అన్నం కుక్కర్ లో వండవచ్చు కాని ముద్దగా అయిపోతుంది.. అంతా బావుండదు. ఈ సారి మీరు వస్తే స్పెషల్ అదే! నివాస్ గురించి దిగులు పడకండి. చక్కగా చదువుకుంటున్నాడు.
@మానస..మొక్కజొన్న అన్నం చాలా బావుంటుంది. ఆ రుచే నా వ్రాతలో కనబడింది మీకు. థాంక్ యు వెరీమచ్ మానసా..
@ఎస్.వి.కే. రమేష్ గారు.. టపా నచ్చినందుకు ధన్యవాదములు.
@శ్రీ గారు మీ అభినందనలకి,మెచ్చుకోలుకి.. ఎనర్జీ వచ్చింది. థాంక్ యు వెరీమచ్.

వనజవనమాలి చెప్పారు...

లక్ష్మీ దేవి గారు.. మీ ప్రశంస కి మిక్కిలి ధన్యవాదములు. సంతోషం అండీ!!
@జలతారు వెన్నెల గారు.. మనం చాలా వాటిని కోల్పోతున్నాం. మళ్ళీ ఈ వోట్స్,గీట్స్ని మన ఆహారంలో భాగంగా మార్చుకోకుండా.. మన చిన్నప్పటి ఆహార పదార్ధాలు చేసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. కానీ మనకి సమయం ఉండదే! మొక్కజొన్న అన్నం నేర్పటానికి ఒక పోస్ట్ వ్రాస్తాను సరేనా.. మీ కంట నీరు తెప్పించిన ఈ పోస్ట్ కన్నా..నా పట్ల మీకున్న అభిమానమే..అని నా నమ్మకం. థాంక్ యు మై డియర్ ఫ్రెండ్.

వనజవనమాలి చెప్పారు...

రాజీ గారు..అమ్మ ముద్ద కమ్మదనం మనకందరికీ తెలిసిందే! చిన్ని చేతులతో..అమ్మకి బిడ్డ పెట్టిన ప్రేమ ..మధుర జ్ఞాపకం కదా!.
పోస్ట్ నచ్చినందుకు.. జ్ఞాపకాల లోకి వెళ్లి.. నాకు అభిమానంగా స్పందన తెలిపినందుకు ధన్యవాదములు.
@చిన్ని.వి.. గారు.. వెంటనే మొక్కజొన్న అన్నం చేసేయండి. కానీ ఉప్పుడు రవ్వ కన్నా.. ఇంకా లావుగా రవ్వ పట్టించడం మరవకండి. అప్పుడే బావుంటుంది.
చిన్నికి కూడా తినిపించండి. థాంక్ యు హిమబిండువులు గారు.
@mhsgreamspet రామకృష్ణ గారు.. పాలబువ్వతీపి నచ్చినందుకు సంతోషం. ధన్యవాదములు.

అభిమానంగా నా బ్లాగ్ ని దర్శించి స్పందించి మీ విలువైన సమయాన్ని కేటాయించి.. వ్యాఖ్య చేసిన మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుతూ..
మీ వనజ వనమాలి

వనజవనమాలి చెప్పారు...

రసజ్ఞ.. నీ అభిమానానికి ధన్యవాదములు. ఇండియాకి రాగానే తప్పకుండా రావాలి. తప్పకుండా.. మొక్కజొన్న అన్నం తినిపిస్తాను.
నీ బ్లాగ్ చూడలేక పోతున్నాను తల్లీ! ఎందుకంటె నాకు నువ్వు వ్రాసిన విషయాలు అర్ధం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది.అది అందులో గొప్పదనం. కొన్నాళ్ళ తర్వాత అన్ని చదువుతానే! థాంక్ యు ,థాంక్ యు .. రసజ్ఞ .. గాడ్ బ్లెస్స్ యు!!

జ్యోతిర్మయి చెప్పారు...

వెన్నెల పాలబువ్వ...కమ్మగా వుంది వనజ వారు.

సామాన్య చెప్పారు...

ఏం చెప్పాలి ? ఏం చెప్పాలో తెలియడం లేదు .ఇప్పుడే చదివి వచ్చిన టాగోర్ ''కాబూలి వాల''కథ చదివినపుడు ఏమనిపించిందో అదే అనిపించింది మీ చివరి వాక్యాలు చూసాక .

murali smiles చెప్పారు...

మా గ్రామమే లేగుంటపాడు