28, సెప్టెంబర్ 2015, సోమవారం

నదీ వియోగ గీతం

నదీ వియోగ గీతం

నాలోనూ ఒక నది నీలోనూ ఒక నది

అంతర్లీనంగా ప్రవహిస్తూ

అందుకే నది ఆలపిస్తున్న గీతం వినబడుతుంది మనకి 

నది పుట్టుక ఒక అనివార్యం

బిందువు గానే పుడుతుంది

సింధువుగా మారేవరకు

ఎనిమిది దిక్కులనడుమ ప్రయాణం చేస్తూ

లక్షలమంది సంతానంతో విలసిల్లుతుంది

పాయలు పాయలుగా చీలిన చీర కుచ్చెళ్ళలో

బిడ్డలు సేద్యపు దోబూచులాట ఆడుకుంటుంటే పచ్చగా దీవిస్తుంది .

అందుకే మనం నదిని పూజిస్తాము

ప్రతి సదనంలోనూ వెలుగులు నింపిన

నదీమ తల్లి ముందు మోకరిల్లి

నిండు హృదయంతో కృతజ్ఞత చెపుతాము

నదిని ప్రేమిస్తాము

నది మనసుపై ఆనందాల పడవనెక్కి విహరిస్తాము

సేదదీరుతాం ఈదులాడతాము మలినాలని విసర్జిస్తాము

అయినా నది ప్రేమతో తడిపేస్తుంది

నది ఒక క్షేత్రమైంది

క్షేత్రాన విసిరివేయబడ్డ బీజాలెన్నో మొక్కలై మానులై

పంటలై పిట్టరెట్టా పూలు ఫలాలతో ఎప్పుడూ పురిటి కంపు కొడుతుండేది

నది నేత్రమైంది

తన ఒడ్డున విలసిల్లిన నాగరికతలన్నీ

ఇసుకలో నడిచిన పాదముద్రలై

కనుమరుగై పోతుంటే నిశ్శబ్దంగా చూస్తూ ఉంది

నది తీర్ధమైంది మన కల్మషాలని కడిగేస్తూన్నా

మన దాహార్తిని తీరుస్తూన్నా

అడ్డంగా ఆనకట్టలెన్నో కట్టేస్తున్నాం

నదిగతిని మార్చేస్తున్నాం

వెలుగుల ఆకారం లాంటి నదీ

సూర్య కిరణాలని తన నీటి కెరటాలపై అలంకరించుకుని

తళ తళ లాడుతుండే నది

రాత్రివేళ జలతారుపరదాని కప్పుకుని

తనని తానూ అలంకరించుకునే నది

ఇప్పుడు బిడ్డలఇళ్ళని వెలిగించడానికి విద్యుత్పాదకమైంది


ఆకుపచ్చని మైదానాలూ  లోయలూ  

జీవరహితం

నాగరికత యెల్లువలో

నదిని నమ్ముకున్న బ్రతుకులు

కొడిగట్టే దీపాల్లా ఉన్నాయి. 

నది  ఆనవాలుగా గలగలలు బిరబిరలు 

మంద్రమైన పరవళ్ళుఏవీ వినిపించవు

శ్రావ్యమైన నది పాట ఇక మనకి వినిపించదు

ఉప్పెనై విరుచుకు పడినప్పుడు భయ విహ్వలలై

వరదై ముంచెత్తుతున్నప్పుడు నిశ్చే స్టులై తలవొంచకతప్పదు

భావితరంలో నది అంటే ..ఒక రంగస్థలం

ఆనకట్టలు విద్యుత్ కేంద్రాలు ఇసుక రేవులు ఇవే పాత్రలు

నది ఒక్కటే ! రేవులనేకం మధ్య చిక్కి శల్యమవుతున్న నది

అభివృద్ధి హస్తాల నడుమ బంధింపబడిన నది

సాగరుని చేరలేక వియోగ గీతాన్ని ఆలపిస్తూ ఉంది .

తీరం వెంట సాగుతున్న మనకి అది వినిపిస్తూనే ఉంది.


(ప్రరవే వేదిక పై చదివిన కవిత) 27/09/2015





కామెంట్‌లు లేవు: