20, జులై 2026, సోమవారం

జన్మ సాఫల్యం


 నేనెప్పుడూ Sticky వుండను.. నన్ను అల్లుకున్న బంధాలతో తప్ప. అప్పుడప్పుడు 

మనసులో వుంది రాసేసుకుంటాను. 

మాయా ఏంజెలో రాసుకున్న “ Yellow Pages “ మాదిరిగా. 

ఎవరైనా రాయమంటే రాయలేను,వద్దంటే ఆగలేను. ఏ పనైనా చేయమంటే చేయను. నాకు నచ్చితే తప్ప. అలా అనిపించినప్పుడు ఇలా వస్తూవుంటాయి. ఇవాళెందుకో పాతికేళ్ళు వెనక్కి వెళ్ళాను.  ఫోటో అప్పటిదే! 😊😍

రాసిందంతా philosophy నే! 😊🤗


***************


జన్మ సాఫల్యం   - వనజ తాతినేని 


చదివి చదివి పుస్తకం అంటే విసుగు పుట్టినప్పుడు 

జీవిత పుస్తకంలో ఎవరికీ చెప్పని రహస్యాన్ని చదువుకుని చూడు

 

విని విని సంగీతం కూడా విసుగు తెప్పించినప్పుడు లోన దాగిన 

రాగాన్ని బయటకు లాగి కూనిరాగం అందుకో

 

చూసి చూసి విరుల సౌందర్యం కూడా సాధారణమై పోయినప్పుడు 

ఆకుల రూపురేఖలు రంగులను గమనించు


మనుషులను ప్రేమించి ప్రేమించి విసుగు చెందినప్పుడు 

కొన్నినాళ్ళు దూరంగా జరిగిచూడు.


అసలు ఈ రెండు కాళ్ళ రథాన్ని కదిలించి చూస్తే.. 

సరికొత్త  పుస్తకాలు సరికొత్త సంగీతం

సరికొత్త రంగులు సరికొత్త అనుభూతి

అసలు ప్రపంచమే నీ కొరకే సరికొత్త ద్వారాలు తెరిచినట్టు వుంటుంది.


పాతదాన్ని మోసుకుంటూ తిరగడం అంత 

అసంబద్ధమైనది మరొకటి లేదు 

ఒకే చోట ఒకే లాగా అతుక్కుని బతకడం నీతో నువ్వు 

దాగుడు మూతలు ఆడుకోవడం లాంటిదే. 


జీవితాన్ని పైపై మెరుగులుతో అలంకరించుకోకు. 

ఆత్మతో జీవిస్తూ . ఆత్మరాగాన్ని ఆలపిస్తూ . 

జీవితాన్ని యోగంగా మార్చుకుంటామో 

యాగంలో సమిధలుగా బలిచేసుకుంటామో.. 

అంతా మన చేతుల్లోనే!


ఒక్క జీవితాన్ని గెలిపించడానికి

వందల కొలది ప్రయత్నాలు వేలకొలది గుమ్మరించే భావోద్వేగాలు  

అవకాశాలు నైరాశ్యం సహనం సర్దుబాటు ఇవి కాదు. 


ఎదుగుదల కంటికి కనిపించేది కాదు 

వెలుగు చీకటి కలిసిపోయే చోట అది కనబడని మాయాజాలం. జీవించు..  

జీవించడంలో వున్న ఆనందాన్ని అనుభవించు. 

పునర్జన్మ వుందో లేదో ఎవరికి తెలుసు!? 


( Vanaja Verses) 


#వనజతాతినేని


కామెంట్‌లు లేవు: