16, ఏప్రిల్ 2024, మంగళవారం

మా..కృష్ణాజిల్లా వాళ్ళంటే…

 ఒక మధ్యతరగతి కుటుంబం. తల్లి తండ్రి కొడుకు కోడలు ఇద్దరు పిల్లలు అందరూ కలసి జీవిస్తున్నారు. తల్లిదండ్రులు వృద్దులైపోయారు. ఒంట్లో ఓపిక సన్నగిల్లింది. అయినప్పటికి ఏదో ఒక పని చేసి కొడుకుకి ఇతోధికంగా సహాయపడాలనే తాపత్రయంతో వుంటారు ఇద్దరూ కూడా! కొడుకు ఒక ప్యాక్టరీ లో టెక్నీషియన్ గా  చిన్న ఉద్యోగం చేస్తూ వుంటే కోడలు కూడా ఓ పచ్చళ్ళ తయారీ కేంద్రంలో గంటల లెక్కన పనిచేస్తూ.. చన్నీళ్ళకు వేణ్ణీళ్ళు తోడు అన్నట్లుగా పొదుపుగా గుట్టుగా జీవనం సాగిస్తూ వున్నారు. తండ్రి అనారోగ్యంతో వుండగా అతనికి హాస్ఫిటల్ మెడికల్ ఖర్చులకు చాలా ఖర్చు చేయాల్సివస్తుంది. కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ సరైన పోషకాహారం కూడా తీసుకోని పరిస్థితులు నెలకొనివుంటాయి. 

ఉదయాన్నే అర లీటరు పాలు తీసుకుంటే పెరిగే పిల్లలకు ఇవ్వాలా అనారోగ్యంతో వున్న వృద్ధులైన తల్లిదండ్రులకు ఇవ్వాలా అనే  సంశయంతో ఆ కొడుకు నలిగిపోతూ వుంటాడు. సాయంత్రం ఇంకో అర లీటరు పాలు కొని మజ్జిగ అవసరాలకు వాడుకుంటూ వుంటారు. భర్త అసహాయతను అర్ధం చేసుకున్న భార్య కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఆమె కొంత చురుకుగా తెలివిగా ఆలోచించింది. ఉదయం పాలు రాగానే అందులో నుండి పావు వంతు పాలు చేసి ఆ పావు వంతు నీళ్ళు కలిపి కాచి పిల్లలకు ఇచ్చింది. ఆ పావు వంతు పాలతో ఇంకో రెండు పావులు నీళ్ళు కలిపి తేయాకు పుదీనా అల్లం వేసి మంచి టీ తయారుచేసి అత్తమామలకు ఇచ్చింది. 

మర్నాడు కొడుకు అదనంగా మరొక పేకెట్ పాలు తీసుకువచ్చి  తల్లితండ్రులకి కూడా పాలు ఇవ్వమని చెబుతాడు భార్యకు. భర్త ఫ్యాక్టరీ నుండి కొంత దూరం స్నేహితుల బైక్ ఎక్కి కొంత దూరం నడిచి వచ్చి ఆ డబ్బుతో పాల పేకెట్ తెచ్చినట్లు తెలుసుకుంటుంది.  కొడుకు చేస్తున్న ఆ పనికి తల్లిదండ్రులు చింతించారు. పాలు తాగితే అజీర్తిగా వుందని పాలు తాగమని గట్టిగా చెప్పేసారు. ఇంకా కోడలు చేసే తేనీరు చాలా నచ్చిందని చెప్పారు. తల్లిదండ్రుల మాటలకు కొడుకు కొంత తెరిపిన పడ్డాడు.

కోడలు ఆలోచిస్తుంది.  పాలు పోషకాహారమే కానీ చాలా ఆహారపదార్థాల లో కన్నా పాలల్లో పోషక విలువలు లేవని చదివి తెలుసుకుంది కాబట్టి.. 5 అరలీటర్ల పాలు కొనడం బదులు అదే ఖర్చుతో కేజీ నువ్వులు కేజీ బెల్లం కొని తెచ్చి.. నువ్వులు మంచి సువాసన వచ్చేదాకా వేయించి బెల్లం వేసి రోట్లో  దంచి  ఉండలు చేసి పిల్లలకు అత్తమామలకు ఇవ్వడం మొదలెట్టింది. ప్రతి రోజూ కోడలు చేసిన హెర్బల్ తేనీరు తాగ్రుతూ.. ఉత్సాహంగా వుంటున్నారు.  నువ్వు వుండలు తినడం వల్ల శరీరానికి కాల్షియం ఐరన్ లభించడంతో వృద్దుడైన తండ్రికి. కొంచెం ఓపిక వచ్చింది కూడా. 

కొడుకు తన ముందున్న  సమస్య తీరినందుకు సంతోషపడ్డాడు.   భార్య వివేకంగా పొదుపుగా సంసారాన్ని నడుపుకుని రావడం చూసి చాలా అభినందించాడు. నేను ఎక్కువ సంపాదించడం లేదని అసమర్థుడిని అనుకోకు. నిజాయితీ వున్నవాళ్ళు అడ్డదారులు తొక్కలేరు. అప్పులు ఎగకొట్టలేరు. నా సామర్థ్యం ఇంతే! అని చెప్పాడు.  నా తల్లిదండ్రులను బాగా చూసుకోగల్గిన మంచిమనసు వున్న వివేకవతివైన భార్య వి నువ్వు నాకు లభించడమే నా అదృష్టం. నేను ఇంకో చిన్న ఉద్యోగం చేయడానికి కష్టపడతాను అని భార్యకు మాట ఇచ్చాడు. 

  ఇక్కడ ఈ వాస్తవ కథలో  చెప్పిన విషయం మాములుగా వుండే విషయం కావచ్చు. కానీ ఇక్కడ ఆ ఇల్లాలిలో కనబడిన వివేకం తన భర్తని సంక్షోభంలో నుండి గట్టెక్కించింది అని తెలుసుకోవాలి. 

మధ్యతరగతి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ వుండేవే! భర్త ఆర్థిక పరిస్థితిని బట్టి భార్య సహకరించడం నేర్చుకోవాలి. కుటుంబ నిర్వహణ ఖర్చులను లెక్కించుకోవడం, అనవసరమైన వస్తువులు,  ఎక్కువ బట్టలు కొనకుండా వుండటం నగ నట్రా కొనకుండా వుండటం, బంధువులకు మిత్రులకు ఎక్కువ రోజులు ఆశ్రయం ఇవ్వకుండా వుండటం వివేకవంతమైన ఆలోచన. బంధుమిత్రులు పడిమేసిన ఇల్లు గుల్ల అది ఏనాటికి కోలుకోలేదు  అని పెద్దలు సామెత చెప్పారు. అది నిజం కూడా.  అలాగే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అనవసరమైన వేడుకలు నిర్వహించకుండా అప్పుల పాలవకుండా జాగ్రత్త పడటం మరీ అవసరం. ఇతరులతో పోల్చుకోవడం వల్ల అసంతృప్తి తప్ప ఏమీ వుండదు. 

ఎంత సంపాదించారు అన్నది కాకుండా ఎంత ఖర్చును అదుపులో వుంచితే అంత అప్పుల పాలు కాకుండా వుండగలుగుతారు అని తెలుసుకోవాలి. కళ్ళు వెళ్ళిన చోటుకల్లా కాళ్ళు వెళ్ళకూడదు. అప్పుల్లో పుట్టి అప్పుల్లోనే జీవితాంతం బతికే పరిస్థితి తెచ్చుకోకూడదు. చిన్న సంసారం చింతలు లేకుండా వుండాలంటే కొంత ప్లానింగ్ గా ముందుకు వెళ్ళడం కొంత సర్ధుబాటు, కొంత త్యాగం అవసరం.  మధ్యతరగతి మందహాసంలో ఎన్నో అణచివేతలు వుంటాయి. అవి ప్రతి ఇల్లాలికి అనుభవం లోకి వచ్చేవే! కోరికలే గుర్రాలైతే కాళ్ళు విరగడం కూలబడటం మాత్రం  ఖాయం. అందలాలకు అర్రులు చాచటం వల్ల ఎలాంటి ప్రయోజనం వుండదు. భర్తలకు భార్యలు సహకరిస్తే కుటుంబం శాంతిగా వుంటుంది. సర్ధుబాటు చేసుకోవడం సాధ్యాసాధ్యాలు అంచనా వేయడం వలన  ఎవరి జీవితమైనా ఒడిదుడుకులు లేకుండా సాగుతుంది. 

ఇంతకీ చెప్పోచ్చేది ఏమిటంటే.. ఈ పై కథలో చెప్పినట్లు.. మా కృష్ణాజిల్లా ఇల్లాళ్లు వివేకవంతులు ముందు చూపు వున్నవారు. పెరట్లో కాయించిన కూరగాయలు తిని అవి లేకపోతే జాడీ కూరలు తిని పాలు పెరుగు నెయ్యి అమ్మి మజ్జిగ తాగి సాదా కాటన్ చీరలు కట్టుకుని సింపుల్ గా బతుకుతూ..వుండేవారు. వీరే ఎక్కడైనా పెండ్లిపేరంటాలకు హాజరైతే వొంటినిండా నగలు పెద్ద అంచు పట్టుచీరలతో ధగధగలాడిపోతూవుంటారు. వారి పిల్లలు చదువుకుని మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయి వుంటారు. అదీ మా ఇల్లాళ్ల ముందు చూపు. 

మా కృష్ణాజిల్లా వాళ్ళు అంటే.. 

“పక్కింట్లో పెళ్ళి అయితే బంధువుల్లో ఎవరిదో ఒకరిది పట్టుచీర అడిగి తెచ్చుకుని దానికి మ్యాచింగ్ బ్లౌజ్ కుట్టించుకుని విజయా బ్యాంగిల్ స్టోర్ లో అద్దె నగలు తెచ్చుకుని డంబాసారం ప్రదర్శించే వాళ్ళు కాదబ్బా.. “ అనేది మా పెద్దమ్మ. 

ఓ భుజాలు తడుముకోకండి.. 🤣🤣 విజయా బ్యాంగిల్ స్టోర్స్ ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం 😊👍
కామెంట్‌లు లేవు: