28, ఏప్రిల్ 2024, ఆదివారం

చిధ్రమైన అనుబంధాలుఖలీల్ జిబ్రాన్ ఈ మధ్య  బాగా నచ్చుతున్నాడు. ఎందుకంటే.. 

భద్రమైన బంధాలు మాయమైపోతున్నందుకు.


ఒక తల్లి అంటుంది.. 

నా కొడుకుకి నేను మాటలే నేర్పాను కానీ 

వాడెందుకో ఈ మధ్య చిలకపలుకులు మాత్రమే పలుకుతున్నాడు.

 నాకెందుకో ఆశ్చర్యంగానైతే లేదు. కొంత ఊహించినదే!  

పుత్రుడే కానీ ఒకోసారి  పురుషుడి విశ్వరూపం చూపెడతాడు.

అమ్మనే కానీ అర్భకురాలిని కదా వణికిపోతాను లోపలా బయటా. 


మగవాడు భర్తగా మారగానే భార్య చేత 

హైజాక్ చేయబడతాడు. 

మొదట మాటలతో తర్వాత చూపులతో 

తర్వాత మెదిలే ఆలోచనతోనే   పూర్తిగా నియంత్రించబడతాడు. 

రహస్య తీర్మానాలన్నీ పడకటిల్లు వంటిల్లు మధ్య లిఖించబడతాయి.


వారు రావడం రావడంతోనే తల్లిదండ్రులు రక్త సంబంధీకుల 

 మధ్య ఓ అగాధాన్ని సృష్టించడానికి 

ఆయుధాలు సమకూర్చుకునే వుంటారు. 

పంపకాలు వాటాల లెక్కలు మనసులో గుణించుకునే వుంటారు. 


వంశపారంపర్యంగా వచ్చే ఆస్థులు బహుమానాలు అన్నీ ఆశిస్తూనే…

  వారి భర్తలు బిడ్డలు అత్తింటి వైపు వారికి అతుక్కపోతారేమోనని 

కంటికి కనబడని  అనేక ఆంక్షలు విధిస్తారు. 

మనుషులకి మనసులకు అంటరానితనం  అపాదించి చులాగ్గా నెట్టేస్తారు. 


బిడ్డలు తల్లిదండ్రుల ప్రేమను 

అమృతంలా జుర్రుకుని విషాన్ని  వెల్లగ్రక్కుతుంటారు. 

వారు బయటకు విసరక ముందే 

గౌరవంగా వదిలించుకోవడం శ్రేయస్కరం


ప్రేమ దాహం పట్టుకున్న తల్లిదండ్రుల ప్రేమలకు 

రిటైర్మెంట్  ఏజ్ వుంటే బాగుండును. 

ఆశ్రమ జీవనం బదులు వనవాసం శిక్ష వేసినా బాగుండును. 

అడవులైనా విస్తరిస్తాయి. అదిప్పుడు అత్యవసరం కూడా! 


రెక్కలొచ్చాక పక్షులు ఎగిరిపోయినట్టు 

లోహ విహంగాలనెక్కి పిల్లలు యెగిరిపోతున్నారు. 

దారం తెగిన గాలిపటాల్లా ఎక్కడెక్కడో 

చిక్కుకుని పోతారేమో అని భయపడతారు

 కానీ.. . 


ఎర వల రెండూ వున్న జాలరి చేతికి  

చేప చిక్కినట్టు ఆలస్యంగా గ్రహిస్తారు.

మంచి చెడు విచారించే పాణిగ్రహణం చేసి  

అప్పజెప్పామని మర్చిపోతారు.


కడకు నిర్లక్ష్యం చేయబడ్డ తల్లిదండ్రులు.. 

ఏ తీరం వొడ్డునో పడ్డ చేపల్లా గిలగిలలాడతారు. 

ఊపిరి వదిలాక కూడా అంతిమ సంస్కారానికి 

బిడ్డలొస్తారని మార్చురీలో  పడి ఎదురుచూస్తారు. 


నిజాలు అబద్ధాలు మధ్య ఖాళీ కొద్దిగానే  వుంటుంది. 

అది పూరించుకునే సమయానికి 

ఓ జ్ఞాపకంగా కూడా మిగిలివుండలేని తల్లిదండ్రులు 

గోడల మీద వేలాడటం అసహ్యమనిపించి

డేటా లో  పదిలంగా దాగుంటారు.


 అందుకే… ఖలీల్ జిబ్రాన్ ఈ మధ్య  బాగా నచ్చుతున్నాడు. 

బంధాలను తేలిగ్గా వొదిలించుకుంటే మనిషి 

మరింత సుఖపడతాడనే పాఠం కొత్తగా నేర్చుకుంటున్నాను. 

భద్రమైన బంధాలు భ్రమలు మాత్రమే

నేను మాత్రమే నిజం అని అనుకోవడమే మిగిలింది గనుక. 


28/04/2024 -వనజ తాతినేని.కామెంట్‌లు లేవు: