3, మే 2024, శుక్రవారం

వదిలేసాక

 










వదిలేయండి వదిలేయండి 

అంటారు. 

తీరా వొదిలేసాక.. 

పట్టించుకోలేదు కటిక మనసు 

అంటారు. 


ఎప్పుడెంత వొదిలేయాలో 

ఎప్పుడెంత పట్టించుకోవాలో 

వారు నిర్దేశిస్తారట

మనం పాటించాలట. 


మనం కన్నవాళ్ళే 

వాళ్ళకో తోడు దొరికాక.. 

గుండెల్లో గునపాలు దించుతారు

మనసును చిత్రవధ చేస్తారు


చేతిలో దిండు లాక్కుపోయినట్టు 

పిల్లలను లాక్కెళ్ళిపోతారు

వాళ్ళకు కావాల్సినవాళ్ళకు చేరిక చేసి

మనకు అవమానపు తొడుగువేసి

నవ్వుకుంటారు. 


మనం కూడా పిల్లలను అలాగే పెంచి

వారికి ధార పోసామని మర్చిపోతారు

హక్కులు భలే గుర్తుంటాయి 

ముఖాన కప్ కాఫీ పొయ్యకపోయినా.


ఇనుప అడ్డుగోడలు

కట్టుకున్నాక.. బంధాలను

పెంచుకొనుట తెంచుకొనుట

చాలా సులభం సౌఖ్యం కూడా! 


కోతిని రాణి ని చేసి సింహాసనమెక్కించి

కొండముచ్చులు భజన చేసినట్టు

వుంది రాజ్యం. 

సౌఖ్యాన్ని మరిచి సొద లెందుకు 

వ్యధలెందుకు నరుడా! 


నన్నంటుకోకు నామాలకాకి

అన్నట్టు ఏకాకివై మిగలిపో

కొడుకులను కన్నందుకు నీకిది శిక్ష

నావ ఏ తీరమో చేరకపోదుగా.. 

ఏదో ఒక తీరాన్ని వదిలేయక తప్పదుగా! 


-వనజ తాతినేని

03/05/2024.

కామెంట్‌లు లేవు: