వీధి దీపం
కార్తీకంలో వేలాడదీసిన ఆకాశదీపంలా వీధి దీపం.
వొంటి స్తంభం గాజు మేడలో నుండి కాంతులు విరజిమ్ముతూ ఆవురావురుమంటూ చీకటిని భక్షిస్తుంది
పార్క్ లో ఆడి అలసి ఇంటికి పోయే పిల్లలందరికి తోవంతా వెలుగు పంచుతుంది
కొత్త తావుకు పోతూ బాటను దాటుతున్న ఎరను ముక్కలైపోతావని హెచ్చరిస్తుంది
ముసురు పట్టిన వానలోనూ వానలా కురిసే మంచులోనూ తడిసి ముద్దైపోతూ
అమవాస్య నాటి వెన్నెల దీపమౌతుంది
మైనస్ డిగ్రీల్లోనూ గడ్డ కడుతూ తన విధిని మర్చిపోతానేమోనని రగిలిపోతూ జాగ్రత్త పడుతుంది.
రహదారి మలుపులో నడిరాతిరి వొంటరిగా దిగాలుగా నిలబడి
ఆకురాలు కాలాన్ని చూస్తూ దీర్ఘ విషాదాన్ని మోస్తుంది పాపం!
వేకువనే హాయి గొలిపే పక్షుల సంగీతాన్ని మలయమారుతాలను ఆస్వాదిస్తూ చిన్న కునుకుదీసిందేమో ఉదయపు నడకల సవ్వడి విని ఉలికిపడి మేల్కొంటుంది
సూర్యోదయ సౌందర్యాన్ని వొంటరిగా జుర్రుకుని దిగ్విజయంగా తన పని నుండి నిష్క్రమింస్తుంది.
విధి నిర్వహణలో తాను వొంటరి నని అనుకున్నప్పుడల్లా ఓ కాంతివలయం నన్ను చుట్టుకునే వుంటుందనే సృహ కల్గిన రాత్రి సూర్యుడు వీధి దీపం
మూడు కాలాల్ని ఆరు బుుతువులను నిశ్శబ్దంగా అనుభవించిన ఒంటరి భూ నక్షత్రం వీధి దీపం
తనను చూసినప్పుడల్లా వొకటే తలపోస్తాను నేను
ప్రతి మనిషి వీధి దీపం లా నిలబడకపోయినా గూట్లో దీపంలా వెలుగునిస్తే చాలునని.
12/04/24.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి