ప్రపంచంలో ఏ మూల కూడా ఆకలి కేకలు వినబడని కొత్త బంగారు లోకాన్ని కాంక్షిస్తున్నాను.
ఆ మాటలు వినగానే అది అంత సాధ్యమా!? అనిపించింది నాకు. ఆ లోకం కోసం ఓ ఆపన్న హస్తం తన వంతు కృషి చేస్తున్నారు.
ఆకలి కేకలు అనగానే మనకి సోమాలియా నే గుర్తుకు రానవసరం లేదు. మన భారతదేశంలో కూడా ఆకలికేకలు విలయ తాండవం చేస్తున్నాయి.
గయలో బుద్దుని సాక్ష్యంగా పితృ దేవతలకు పిండం పెట్టి పెట్టకుండానే ఆ నీటిలో ఆ పిండాల ముద్దలను ఏరుకుని తినేవారు, వాటి కోసం గొడవ పడేవాళ్ళను చూస్తుంటేనే మనకు మనసు వికలమవుతుంది.
అలాగే కడప జిల్లాలో ఆకుల గంగమ్మ అనే మహిళా చేపట్టిన అన్న మహా యజ్ఞానికి వేళా పాళా లేకుండా వచ్చే అన్నార్తులు సాధించిన శ్వేత విప్లవం, హరిత విప్లవానికి ఆనవాలు ఏమో!
వీధుల్లోను, దేవాలయాల వెంబడి, బస్సు, రైల్వే స్టేషన్ లో అన్ని చోట్లా ఆకలికి మాడి అలమటించే వాళ్ళే.
“అన్నం పరబ్రహ్మ స్వరూపం” అంటారు. అన్ని దానాలలోకి అన్నదానం అత్యుత్తమమైనది అని పేర్కొంటారు. ధనవంతులు ఆడంబరంగా రకరకాల ఆహారపదార్ధాలు వండించి నాగరిక మైన వ్యక్తుల నాగరిక తిండి వల్ల టన్నుల కొద్దీ ఆహార పదార్దాలను చెత్త కుండీల పాల్జేయడం మూలంగా యేమైనా సంతృప్తి వుంటుందంటారా?
ఆడంబరంగా ఖర్చు పెట్టి అట్టహాసాన్ని ప్రదర్శించుకోవడం తప్ప.
అనాధలుగా పెరిగే వారు కోట్ల మంది, అందరూ వుండి అనాధలగా మారుతున్న కొందఱు.
అందరి ప్రాధమిక అవసరం ఆహారం. అది దొరక్క డొక్కలు అంటుకుని దీన స్థితిలో వున్న అన్నార్తులను చూసైనా రాజకీయ నాయకుల రహస్య ఖాతాల్లోని ద్రవ్య నిల్వలు బయటికి రానివ్వని కసాయి గుండెల కన్నా మన మధ్యే వుంటూ సాధారణంగా జీవిస్తూ కూడా ఆకలితో మాడే పదుగురికి అయినా పట్టెడన్నం పెట్టె ఓ..అమృత హృదయం గురించి చెప్పడమే.. ఈ పోస్ట్.
గ్రీష్మపు ఎండకి రోళ్ళు బద్దలవుతాయి అంటారు, అటువంటి ఎండా కాలం.
అసలే ఎండలు చురుక్కుమనే గుంటూరు పట్టణం.
ఓ..మహిళ వాళ్ళుండే మూడంతస్తుల మేడ పై భాగం గదుల నుండి బయటకి వస్తూ ఉంటుంది. ఆమె రెండు చేతుల్లో రెండు కేన్ లు బరువుగా వుంటాయి. అప్పుడే చేసిన వేడి వేడి పదార్దాలుతో బరువుగా. మెట్లు దిగి కొంచెం దూరం నడచి వచ్చి కూడలిలో ఆటో కోసం నిలబడుతుంది. ఆటో వాళ్లకి ఆమె తనని ఎక్కడికి తీసుకు వెళ్ళాలో చెప్పలేదు. అందుకే.. అంత త్వరగా ఆటో కిరాయికి కుదరదు.
ఓ..అరగంట అయినా నిలబడ్డాక కానీ.. ఎవరో ఒకరు వచ్చాక ఆటో యెక్కి కూర్చుని రోడ్ల వెంట వెదుకుతూ..ఉంటుంది. ఎక్కడ భిక్షువులు,వీధి బాలలు, దిక్కులేనట్టు పడి వుండే ఆనాధ వ్తుద్ధులు.. కనబడగానే ఆటో ఆపి గబా గబా వారికి తన వద్ద వున్న పేపర్ ప్లేట్లలో తాను వండి తెచ్చిన మధుర పదార్ధం ఒకటి నోటికి రుచికరంగా ఉండే పదార్థం ఒకటి వడ్డించి చేతికిస్తుంది
.
అలా..అన్నార్తులను వెదుకుతూ తాను తెచ్చినవి అయిపోయే వరకు వడ్డిస్తూ వెళుతుంది.
అలా వారానికి రెండు సార్లు.
ఎందుకు అలా మీరే వెళతారు? అంతగా పెట్టాలనుకుంటే..ఏ అనాధ శరణాలయాల్లోనో యేడాదికొక సారి డబ్బు యిస్తే సరిపోతుంది కదా అన్న మాటలకి ఆమె సమాధానం యిలా..
అందరూ కేవలం డబ్బు మాత్రమే ఇస్తూ ఉంటారు. అది కొన్ని పరిమితుల్లో కొందరికే చేరుతుంది. ఆ డబ్బు కొన్నిసార్లు అపాత్ర దానం అవుతుంది. అందుకే.. అమ్మా! ఆకలి అంటూ మన యింటి ముందుకు వచ్చేవారికి గుప్పెడు అన్నం పెట్టడమో చందాల రూపంలో డబ్బు యివ్వడం కంటే..
“నిజంగా ఆకలి కలవారెవరో గుర్తించి వారికి కడుపు నిండుగా పెట్టడం..మంచిది కదా, అందువల్ల మనము చేసే సాయం వారికే అందుతుంది. కడుపు నింపిన సంతృప్తి మనకి వుంటుంది” అంటారు.
కొన్ని దేవాలయాల దగ్గర చూడండి. కొన్ని ప్రత్యేక రోజుల్లో బీదాబిక్కి జనం పోగవుతారు. వారంతా రోజు గడవని వారేం కాదు. దాతల విరాళాల ద్వారా అన్నదానం నిర్వహిస్తూ. కొంతమందిని.. పనిపాట లేని సోమరిపోతులుగా పెంచి పోషిస్తూ వుంటారు. అది యేమి సమంజసం అనిపించుకుంటుంది?
వారి పిల్లల పుట్టిన రోజులకి, పండుగలకి యే మాత్రం డబ్బు ఆడంబరంగా ఖర్చు పెట్టకుండా ఆ డబ్బుని యిలా స్వయంగా వండి అన్నార్తులని వెదుక్కుంటూ వెళ్లి పెట్టిరావడాన్ని అభినందించ కుండా వుండలేను.
ఏ దానం చేసినా ఇంకా కొంత యిస్తే బాగుండు అనుకుంటారట. అదే అన్న దానం అయితే..కడుపు నిండగానే సంతృప్తిగా యిక చాలమ్మా అని అన్నదాతా! సుఖీ భవ అంటారు. అది చాలదా? అది భగవంతుడు మెచ్చే పని కాదా! అంటారు.
అలాగే..చాలామంది మిగిలిపోయిన, మనకి యిష్టం లేని, పనికి రాని ఆహార పదార్ధాలు ఇతరులకిస్తూ వుంటారు. అది కూడా చాలా తప్పు. మనం తినేదే యితరులకు పెట్టాలి. మనకి పనికి రాని పదార్దాలు ఇతరులకి పెట్టకూడదు అంటారు కదా అని అన్నాను.
అందుకు ఉదాహరణ శబరి భక్తి. భగవంతునికి అయినా తినకూడ వీలుకాని పదార్దములు.. నైవేద్యంగా పెట్టకూడదట అని..మా నానమ్మ చెప్పే మాట చెప్పాను ఆమెకి.
ఆమెకి భర్త సహకారమే కాదు అలా చేయమని ప్రేరేపించేది ఆమెకి పనులలో సాయపడేది, ఒకోరోజు ఎక్కడెక్కడ ఆకలికి బాధ పడే వారెక్కడ వుంటారనేది బైక్ పై తిరుగుతూ అన్వేషించేది కూడా అతనే!
అతను.. నా మిత్రుడు కూడా.
అతను,అతని భార్య యిద్దరు కలిసి చేసే ఆ సేవలో నిజాయితీ వుంది.
పైగా అతను పెద్ద ధనవంతుడు కాదు. ఓ..మాస్టర్ టైలర్.
అతని పేరు పరిమళమే! భావాలు పరిమళమే! ఇవే కాకుండా అనాధలైన పెద్దలను, పిల్లలను హోమ్స్ లో జాయిన్ చేయడం అప్పుడప్పుడు వెళ్లి వారిని పలకరిస్తూ వుండటం అతని కిష్టమైన వ్యాపకం కూడా.
డబ్బు కావాలంటే.. ఎవరైనా ఇస్తారు. మనం సేవ చేసి చూపాలి అనడం పరిపక్వత కల్గిన ఆలోచన అనిపిస్తుంది నాకు.
అంతకు క్రితం నేనూ ఏదైనా సాయం చేయాలంటే ద్రవ్య రూపంలో..యిచ్చేదాన్ని. ఇప్పుడు ఆలోచిస్తాను. నాకు ప్రేరణ కల్గించే విషయం యిది. విషయం మీక్కూడా నచ్చిందా!?
7 కామెంట్‌లు:
బాగుందండి వనజవనమాలి గారు కేవలం ప్రచారం కోసం దానాలు చేసేవారు కొందరు ..ఎలాంటి ప్రచారం ఆశించకుండా తమ సంతృప్తి కోసం ఇలా దానం చేసే తల్లులకు వందనం
ఈ దారిద్ర్యాన్ని ఎంతమంది రూపుమాపగలరు. నిజంగా ఇంతమంచి బంగారులోకం ఏర్పడితే ఎంత బాగుంటుందో. ఆమె పుణ్యాత్మురాలు. ఆమె అకుంఠిత దీక్షకి నా నమస్సులు.
మనిషి బ్రతకడానికి విజయం సాధించడానికి డబ్బు మాత్రేమే కాదు భుజం తట్టి నేను ఉన్నాను అనే ఆత్మీయులు కావాలి.ఆదరించే అభిమానం కావాలి అని ఈ శీర్షిక ద్వారా భాగా చెప్పారు.మురళి గారు అన్నట్టు ఎలాంటి ప్రచారం ఆశించకుండా తమ సంతృప్తి కోసం ఇలా దానం చేసే తల్లులకు వందనం.
చాల మంచి విషయమును తెలియపరిచారు వనజవనమాలి దన్యవాదములు
మురళి గారు..స్త్రీ మూర్తులకి.. ఆకలిగొన్న వారికి..వండి వడ్డించే ఓపిక సహనం..భగవంతుడు ఇచ్చిన వరం.అందుకే..ఆమె అలా చేయ గల్గుతుంది.
@తెలుగు పాటలు .. ధన్యవాదములు. ప్రేరణ పొందాలని..చిన్ని ఆశ తో..పరిచయం చేశాను. ధన్యవాదములు
@ జయ గారు..నిజంగా ఆమెని మెచ్చుకోవలిసిందే..స్పూర్తిదాయకం కదండీ!.. మీరు నా బ్లాగ్ దర్శించినందుకు ..ధన్యవాదములు
@ పైడి నాయుడు గారు ధన్యవాదములు
ఆ భార్యాభర్తల నిస్వార్థ సేవకి వందనాలు.పూర్వం శ్రీమతి డొక్కా సీతమ్మ గారు కూడా ఇలాగే భర్త సహకారంతో 24 గంటలు అన్నార్తుల ఆకలిని తీర్చేవారు.
chaalaa spoortikaramgaa undhi. chaalaa panulu andharam cheyalem. kontha mandini choosthe appudappudainaa alaa chesthe baaguntundhi anipisthundhi. Think different ani marosaari Rujuvaindhi.
కామెంట్‌ను పోస్ట్ చేయండి