22, మార్చి 2013, శుక్రవారం

అద్భుతః

అద్భుతః ... !!?

ఏమిటి అనుకుంటున్నారా!?

వద్దు వద్దు అనేవారు కూడా లొట్టలు వేసుకుని తినే శాకం ... ఇదిగో ఇది




ఈ రోజు  ఓ ..ప్రయాణం  కోసం  కలసి వెళ్ళడం కోసం నా ఫ్రెండ్ వచ్చింది తన కిష్టం అని ఒక శాకం చేసాను కబుర్లు చెప్పుకుంటూ  భోజనం చేస్తూ .. ఈ రోజు బ్లాగ్ లో  పోస్ట్ వ్రాసే తీరుబడి లేదు అన్నాను . ఇదిగో దీని గురించి వ్రాసేయి అని కంచం లో కూరని చూపింది . భలే గుర్తు చేసావు అనుకుంటూ .. తన కన్నా ముందు గబా గబా భోజనం ముగించి ఇలా వచ్చేసాను .

సరే ... ఈ శాకం తయారు చేయడానికి  కావాల్సినవి

లేత తెల్ల వంకాయలు ఒక అరకేజీ

టమాటొ  నాలుగైదు

పచ్చి గట్టి మామిడి కాయ (పులుపు)

పచ్చి మిర్చి  నాలుగంటె నాలుగు

కొత్తిమీర

ఉల్లిపాయలు రెండు

గింజ కట్టని లేత నవ నవ లాడే వంకాయలని తీసుకుని కొంచెం పెద్ద ముక్కలుగా కోసుకోవాలి

నూనె సుమారుగా 75 గ్రాముల వరకు వేయాలి నూనె వేయడంలో తక్కువ చేయవద్దు (తర్వాత ఈ శాకం బాగోలేదని  నన్ను అనగలరు )

పొయ్యి మీద కళాయి ని పెట్టి నూనె వేసి కొంచెం ఆవాలు, జీలకర్ర ,కరివేపాకుతో తాలింపు వేసి   పచ్చి మిర్చి ముక్కలు , ఉల్లిపాయ ముక్కలు ముందు తర్వాత  వంకాయ ముక్కలని వేయాలి

వెంటనే కొద్దిగా పసుపు,కొంచెం ఉప్పు చేర్చి సన్నటి సెగపై ముక్కలని మగ్గనిస్తూ .. మామిడి కాయను తోలుతో సహా చిన్న చిన్న ప్రమిదలంత ముక్కలగా అడ్డదిడ్డంగా కోసుకోవాలి

తర్వాత టమోటా లని కూడా పెద్ద ముక్కలుగా కోసుకుని కళాయిలో మగ్గుతున్న వంకాయ ముక్కల లో వేయాలి

ఇప్పుడు అదే సెగపై గరిట  పెట్టి కదపకుండా ముక్కలని ఎగరవేసి కలుపుతూ కొంచెం సేపటి తర్వాత మూడు స్పూన్ ల సాంబారు కారం వేసి మళ్ళీ ఒకసారి ముక్కలు చిదమకుండా  కలుపుకుని పైన  కొత్తి మీర  చల్లి సన్న సేగపైనే  ఉడక నివ్వాలి.

ఈ శాకం కేవలం ఇరవై  నిమిషాల సమయం లోనే  చేయడం అయిపోతుంది. చాలా తేలిక.  రుచి మాత్రం అద్భుతః అనాల్సిందే !

నేను మొట్ట మొదట నేర్చుకున్న  శాకం ఇది. మా పుట్టింట్లో పరిచయం లేదు కానీ నెల్లూరు ప్రాంతం వారు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ కూర లేనిదే ఏ విందు భోజనాలు ముగియవు.
అంత రుచిగా ఉంటుంది వండేట ప్పటి వాసన కూడా నలువైపులా వ్యాపించి నోరు ఊరిస్తూ ఉంటుంది  మా ఇంటి చుట్టు ప్రక్కల వాళ్ళు అడుగుతూ ఉంటారు ఏమి  కూర అని.   నేను ఈ పేరు చెపితే ఇలా కూడా వండుతారా? అంటారు . సమాధానం గా ఒక గిన్నె లో కూర వాళ్లకి రుచి చూపడానికి వెళుతూ ఉంటుంది

 ఈ కూర చపాతీల లోకి,అన్నం లోకి చాలా బాగుంటుంది.  ఈ కూర చేయడం చాలా మందికి పరిచయం ఉంటే ...  అబ్బా .మాకు తెలుసు లేవమ్మా .. అనుకోకండి

తెలియని వాళ్ళు మాత్రం వెంటనే చేసేసి తినేసి ఒక కామెంట్ ఇచ్చేసి వెళ్ళండి. అప్పుడే  ఈ వంకాయ మామిడికాయ  కూరకి  నాతో పాటు  మీరు కితాబు ఇచ్చినట్లు .










5 కామెంట్‌లు:

Padmarpita చెప్పారు...

కలర్ ఫుల్ వంట ఘుమఘుమలు :-)

జయ చెప్పారు...

అద్భుత:)

భారతి చెప్పారు...

వనజ గారు !
చదివి, వండి, తిని, భుక్తాయసంతో వ్యాఖ్య పెడుతున్న - "అద్భుతః '.

శోభ చెప్పారు...

చదువుతుంటేనే నోరూరిపోతోంది వనజగారూ.. ఇక తింటే నిజ్జంగా అద్భుతః అనాల్సిందే...

ఉండండి.. ఓసారి మీవూరొచ్చి ఓ పట్టు పట్టేస్తాను... :)

sasi చెప్పారు...

వనజ గారు,
మీరు చెప్పిన విధంగా మొన్న ఆదివారం ఇంట్లో వండాం.సూపరుగా వచ్చింది.మా ఆవిడకి వంకాయ ఇష్టం లేదు.తను కూడా చాలా ఇష్టంగా తింది.
Thanks much for the super recipe