శపిస్తున్నా
పున్నమిపూట నింగి ఎందుకంత నల్లని ముసుగేసుకుందో ..
ఇంతుల కన్నుల కాటుక కరిగి మేఘంగా మారినదని తెలియదెందుకో..
మద మత్సర క్రూర మనసుకు అర్ధం కాదు ఎందుకో ..
వేదన వెల్లువై ముంచెత్తదేమి ?
ఆక్రోశం మేఘంలా గర్జించదేమి?
దుఖం సముద్రమై చుట్టేయదేమి ?
ఈ మానవ మానసం ఎంత కఠినమైనది
నాతి ఎన్ని దౌష్ట్యాలకి కునారిల్లుతుంది
రాతి లెక్కన అయినా మారలేదేమి ?
ధూళి లెక్కన దూరంగా తరలిపోలేదేమి ?
ఈ భువిపై మానవజాతిని మిగిలి ఉంచడానికి
ఇంకా ఇంకా భారాన్నిమోస్తూనే ఉన్నదెందుకు ?
యుగాల ధర్మంలో పూజ్యం కాబడిన ఔన్నత్యం ఎంత గొప్పదో
శతాబ్దాల సహచర్యంలో దక్కిన విలువలు ఏ పాటివో
గుర్తు చేసుకుంటూ తీరిక లేకుందేమో !
నగ్నత్వం నింపుకున్న వెలుగు లాగున
స్తిగ్ధత్వం నింపుకున్న పువ్వులాగున
ఉండటం పాపమైనదో,నేరమైనదో,
శాపమైనదో తెలియజాలక
జనని ని ఆశ్రయించిన జానకిలా నిర్వేదంగా
అస్త్ర సన్యాసం చేసిన ఆచార్యుడిలా విరక్తిగా
తనవారిపైనే అస్త్రం సంధించలేని పార్ధునిలా నిస్సత్తువుగా
తల్లికిచ్చిన మాట జవదాటని తనయుడిలా నీరవంగా నిలిచినట్లు
మానప్రాణాలపై దాడి చేసినప్పుడు ఎదుర్కోలేని అబలలా
పదఘట్టనల క్రింద నలిగిన పువ్వులా
పైశాచికాన్ని భరించిన పడతిలా
కాలనాగుల కాటుకు బలి అవుతూ
అడుగడుగునా రాళ్ళు ముళ్ళు నిండిన బాట లో
నలుగుతూ, నడుస్తూ నిర్వీర్యం అవుతూ..
ఈ నవీన నాగరిక సోపానాల పై ..
ధ్వంసమైన సంస్కృతికి ఆనవాలు గా నిలుస్తున్న
మానవజాతిని గొడ్రాలి గా మిగలమని శపిస్తున్నా!!
అమ్మని ..బొమ్మని చేసి ఆడినందుకు శపిస్తున్నా !!
(విహంగ వెబ్ మేగజైన్ లో వచ్చిన కవిత )
10 కామెంట్‌లు:
శపించకండి! కొందరికోసం అందరిని శపించడం న్యాయమా!!!
ఇంతటి వ్యధని అంత అందమయిన వివరణతో శపించటం నచ్చేసింది మరి !!
చాలా చాలా బాగా రాసారు , అభినందనలు !!
"పున్నమిపూట నింగి ఎందుకంత నల్లని ముసుగేసుకుందో ..
ఇంతుల కన్నుల కాటుక కరిగి మేఘంగా మారినదని తెలియదెందుకో.."
చాలా బాగా రాశారండీ
కవిత చాలా బాగుంది.
"గొడ్రాలు" పదం వాడొచ్చా?
కష్టేఫలే .. మాస్టారూ .. నిజమే .అలాగున శపించడం భావ్యం కాదు కానీ కోపం తో అలా ..
@ సాగర్ గుంటూరి గారు ధన్యవాదములు
@ రాజీ గారు థాంక్ యూ సో మచ్ !
రమణ గారు నమస్తే ! గొడ్రాలు పదం వాడ వచ్చునో లేదో కూడా నాకు తెలియదండీ!!
కానీ ఈ కవిత లో నేను ఆవేశంగా తిడుతూ శపించాను మానవ జాతి ని గొడ్రాలుగా మిగలమని శపించడం అంటే సమంజసం కాక పోవచ్చు. స్త్రీ జాతిని నాశనం చేసుకుంటూ పొతే మానవజాతి మిగిలి ఉండటం కష్టమే కదండీ! ఆ అర్ధంతో తీసుకున్నాను.
ఉదా : ఒక తల్లి బిడ్డని తిడుతుంది నువ్వు నాశనం అయిపోతావుతా అని (తిడుతుందా అని సందేహం వద్దు తల్లి తిట్టు దీవెన క్రింద లెక్క ) కోపం తోనే సుమా ! తల్లి మనసుకి ఎంత కష్టం కల్గితే ఆ మాట అంటుంది చెప్పండి ? అలాగునే ఈ కవితలో తిట్టు కూడాను
మీ స్పందనకి ధన్యవాదములు
గొడ్రాలు అనేదాని కంటే ..నిస్సంతుగా..అని వాడితే హుందాగా వుండేదేమో అనిపించింది... చాలమంది అదే అభిప్రాయమ్లో వున్నారనుకుంటాను.
naaku ela spandhinchalo ardham kaaledu chaalaa bagundi andi
ప్రిన్స్ :( స్పందనకి ధన్యవాదములు
@ కపిల రామ్ కుమార్ సర్! మీరు సూచించిన పదం బావుందండీ ! ధన్యవాదములు.
అయ్య బాబోయ్,
ఏమిటండీ, ఇట్లా భయ పెట్టేస్తున్నారు!
శాపాలు వద్దులెండి ! పోనిద్దురూ కుర్రకారు జవానీ జోరు
జిలేబి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి