11, మార్చి 2013, సోమవారం

రాహువు మింగిన జాబిలి

రాహువు  మింగిన జాబిలి  

ఆమె ఆత్రంగా వెదుక్కుంటుంది..
అక్కడ తను పోగొట్టుకున్న దాన్ని ఏదో !
పగిలిన అద్దం ముక్కలలో జీవితం కనిపిస్తుంది..
రూపు,రేపు లేని తనంలో

ఒకప్పుడు అదే అద్దం ముందు
మెరుస్తూ అందంగా ఆమె..

ఋతువులు గతులు తప్పుతున్నా 
ప్రేమ ఋతువు ముందుగా వచ్చేసి
గుండెల్లో నగారా మ్రోగించగా
కమ్మేసిన మైకపు చీకట్లో
ఆకర్షణ వలయంలో
స్నేహం ముసుగులో,
మొహం ముంగిట్లో..
అందంగా.. రంగవల్లులు అద్దుకుంటూ..
అప్పుడు ఆమె ఆశలు లేత పచ్చగా..

ప్రేమకి పరాకాష్ట దేహాలు కలయికే
అని అతడు ఉద్ఘాటించాక..
బలమైన ప్రేమ నిరూపణ చూపాలనికుని
సందేహాలు విడిచి, ఏడడుగుల మాట మరచి
వాంఛితాల పయనంలో..
అష్టనాయికలా మురిపించింది..
రంగులద్దిన అతనే రంగులు మార్చేసుకుని..
చివరికి రంగం నుండి
నిష్క్రమించాక కానీ తెలియరాలేదు
జీవితం రంగు వెలిసిందని.

వమ్ముకాబడిన ఆశలతో 
అర్ధాంతర చావులతో,
అవమానవీయమైన దుస్థితిలో 
మూల్యం చెల్లించుకుంటూ 
సమూహంలో ఒంటరిగా,
ఒంటరిలో సమూహంగా
అర్ధం కాని  అయోమయాన్ని  మోస్తూ
నిన్నమొన్నటి కలల సారాన్ని
సుదూరంలో వెతుక్కుంటుంది.
.
బలం  కూడగట్టుకుని,
బలగాన్ని వెంటబెట్టుకుని
నయవంచకులని బహిర్గతం చేసే
నిత్య సమరశీలురాలవుతుంది.
ప్రేమ అనే నిశను చీల్చుకుంటూ ..
విచ్చే  వెలుగు రేఖ అవుతుంది.

కప్పుకున్న తమ ఆత్మ విశ్వాసపు తొడుగు..
కత్తివేటులనుండి ,యాసిడ్ దాడుల నుండి,
 మృగాల్ల  బారి నుండి  రక్షించ లేకపోయినట్లు.. 
అమాయకత్వపు ముసుగు 
నయవంచకులనుండి, 
అవాంచిత గర్భాలనుండి
బహుభార్యత్వం నుండి రక్షించ లేకపోతుంది .

అన్ని దశలలోనూ పోత్తాలు పొత్తాలుగా
జ్ఞానాన్ని అర్జించడమే కాదు
బ్రతుకే ఒక పరిజ్ఞానం అని తెలుసుకోలేకపోవడం..
బ్రతుకు అపహాస్యం కాబడకుండా
కాపాడుకోవడం  అని తెలియనంతకాలం ..
పోగొట్టుకున్న దానిని  వెదుక్కుంటూనే ఉంటుంది.

ఆమె రాహువు  మింగిన జాబిలి.  

3 కామెంట్‌లు:

జలతారు వెన్నెల చెప్పారు...

బ్రతుకే ఒక పరిజ్ఞానం ...నిజం! బాగుంది వనజ గారు.

అజ్ఞాత చెప్పారు...

నిజం చెప్పేరు. నిజమెప్పుడూ నిష్టురంగానే ఉంటుంది. చేతులు కాలేకా ఆకులు పట్టుకుని ఉపయోగం లేదనే అలోచన రావటం లేదు. వయసు ఉమ్మస్సు తెలియనివ్వటం లేదు.

Raj చెప్పారు...

Many many HAPPY RETURNS of the DAY.
HAPPY BIRTHDAY to YOU.
May your dreams comes true..