23, అక్టోబర్ 2018, మంగళవారం

పురుషాహంకారం పై విసురుతున్న వెలుతురు బాకు

పురుషాహాంకారంపై వనజ గారు విసురుతున్న “వెలుతురు బాకు ‘ ఈ కవిత్వం “


రాజారామ్ తూముచర్ల (కవిసంగమం -కవితాంతరంగం శీర్షికలో సమీక్ష ) ఈ లింక్ లో ..



ఎవరైనా సంతోషాన్నో ఆనందాన్నో కోరుకుంటారు.దుఃఖాన్నో విషాదాన్నో ఎవరు కొరుకోరు.కాస్త దుఃఖం కావాలనిపిస్తుందని ఎవరన్నా అంటారా?.తనని తాను సేద తీర్చుకోవడానికీ దుఃఖాన్ని తోడుకోవాలని దుఃఖపు నదిని ఈదాలని ఎవరైనా ఆలోచిస్తారా?దుఃఖాన్ని ప్రేమగా ఎవరైనా హత్తుకోగలరా?. హత్తుకోలేరు.కానీ ఒక కవయిత్రి తనది కానీ నిలువెత్తు దుఃఖాన్ని ప్రేమగా హత్తుకున్నది కవిత్వంలో…

తమ నుదుట దుఃఖాన్నిదేవుడు రాసిపెట్టినాడని అనుకుంటున్న స్త్రీల హృదయాలలోని భావనని బద్దలు కొట్టి దుఃఖవారసత్వాలని మోయకుండా విసిరేసీ సవాళ్ళను ఎదుర్కోగల స్థైర్యంతో పురుషాహాంకారపు చీకటిని చీల్చడానికీ కవిత్వపు వెలుతు బాకుని ఒక కవయిత్రి విసిరింది.

“వాక్య గుచ్ఛం ముడి విప్పితే
విడివడిన అనేక పదాల్లో
నిండిన భావ పరిమళమే
నేను అనబడే నా కవిత్వం “

కవిత్వ గులాబీ ముళ్ళకి చిక్కుకొని దిగుళ్ల పల్లకీని బోయిలా మోస్తున్నహృదయం వున్న ఒక కవయిత్రి అన్న మాటలు పై వాక్యాలు. ఆకాశంలో సగం నాదేనని ఢంకా బజాయిస్తూ అంతటా విస్తరిస్తున్న మహిళా చైతన్యానికీ ప్రతీకగా కవిత్వపు మెరుపుల్ని కవిత్వపు వెలుగుల్నీ వెలుతురు బాకు గా మార్చి అసమ వ్యవస్థ మీద విసిరేసింది ఒక కవయిత్రి.

ఆ కవయిత్రి ఎవరంటే.. వనజ తాతినేని గారు. ఈవిడ కవిత్వ సంపుటిలో వున్న కవితలన్నీ చూడటానికీ స్త్రీవాద కవితలని అనిపించినా అందులో కొన్నిఆవిడ అంతరంగా మథనాలే అయినా అవన్నీ భాషలో భావంలో తొట్రుబాటు లేని కవితలు.ఈ కవితల్లో సమాజ పరిశీలనం నిశితం.వ్యక్తీకరణ కళాత్మకం.ధిక్కారాన్ని సహించని ధిషణ, రచనా దక్షత వనజ గారి కవిత్వపు సొంపులు.తోటి స్త్రీల అనుభవాలు,స్వీయ అనుభవాలు కేంద్రంగా నడిపిన కవితలివన్నీ.


వనజ గారి ‘ ద్వారాల మాట ‘ అనే కవితా ఖండిక ఒక విభిన్న అభివ్యక్తితో మంచి కవిత కావటం వల్లనేమో నన్ను వెంటాడుతూ వేటాడుతూ వుండింది చాలా రోజులు.

వస్త్వాంశాల పేర్పులో నేర్పు వుండటం అందుకు కారణమేమో.విభేదకాంశాలను వ్యక్తీకరించే పదాలను ఇందులో పొదుపుగా పొదగడం వల్లా కూడా ఈ కవిత శక్తివంతమైంది.ఆ కవిత ఇది.

“మీ కన్నా ఒక ద్వారం ఎక్కువ వున్న వాళ్ళం
ఆ ద్వారం నుండే లోకాన్ని చూడటానికి అనుమతిచ్చిన వాళ్ళం
నిత్య సాంగత్యపు గాయాల సలుపు తీరకుండానే
జీవనౌషాధాన్ని పూసుకుంటూ యంత్రాల్లా పరిగెడుతున్న వాళ్ళం
ద్వారాల పైనే ఉన్న మీ కాముక దృష్టిని మరల్చి
360 డిగ్రీలకోణం తో చూపులని విశాలత్వంతో నింపండి
ఎటు తిప్పిన ఇద్దరం కలసి తిరగాల్సిన వాళ్ళమే కదా
ప్రేమతో చెబుతున్నాం ..పరుషంగా చెపుతున్నాం
ఎలా చెప్పినా మీరిది విని తీరాలి ఇది రుధిర ద్వారాల మాట
ఇది దశమ ద్వారాల మాట “ 
( ద్వారాల మాట )

“ ప్రేమతోనో పరుషంగానో చెపుబుతున్నాం ఎలా చెప్పినా మీరు విని తీరాలి” – అని అంటున్న కవయిత్రి వనజ తాతినేని గారు.ఎందుకు అలా అన్నారంటే ఒక పీడిత వర్గంగా వున్న స్త్రీ విద్య,ఆరోగ్య,వైవాహిక,సాంసారిక ఉద్యోగాది రంగాల్లో ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక సాధికారిక శక్తిగా వనజ గారు తనను తాను ప్రతినిధిగా ఎంచుకుంటూనే జీవితంలో సహచరులైన పురుషుల వైఖరిలో రావాల్సిన మార్పుల కోసం అలా అంటున్నారు.

రోజుకొకసారైన ప్రేమ జడివానలో తడవాలని,ప్రేమార్హతకై తపించిపోతూ,నిత్య సాంగత్యపు గాయాల సలుపు తీరకుండానే జీవనౌషధాన్ని పూసుకొంటూ యంత్రాల్లా వున్న స్త్రీని భార్యగా,వంట మనిషిగా,ఇంటి పని మనిషిగా కామోద్దీపనకు ఉపయోపడే పరికరంగా మాత్రమే చూస్తున్న పురుషులతో “ మీ కన్నా ఒక ద్వారం ఎక్కువ వున్న వాళ్ళం ఆ ద్వారం నుండే లోకాన్ని చూడటానికి అనుమతిచ్చిన వాళ్లం “అని అంటూ స్త్రీ అణిచివేత పట్ల,పురుషాహంకారం పట్ల ధర్మాగ్రహాన్ని ప్రకటించారు వనజ గారు .

ఇట్లా కవిత్వం రాసే స్త్రీలు వొకప్పుడు చాలా తక్కువగా వుండేవారు.ఆడవాళ్ళు కవిత్వానికి ఆమడ దూరమని కొందరు అనుకుంటున్న సమయంలో ఈ స్థితి అనివార్యంగా మారిపోయిన సందర్భంలో ఇవాళ ఎందరో స్త్రీలు కవిత్వం రాయడం మొదలెట్టారు.

ప్రేమ గీతాలు,విరహగీతాలో కాక సామాజిక నిబద్ధత గల కవితలు రాస్తున్నారు స్త్రీలు.అశ్లీలతా ఆరోపణలకు వెరవకుండా మగవాళ్ళు కూడా స్పృశించడానికి సాహసించని వస్తువులను ఆశ్చర్యం కలిగించే శిల్పం తో ధైర్యంతో మంచి కవిత్వం సీరియస్ కవిత్వం కొందరు కవయిత్రులు రాస్తున్నారు.అలాంటి కవయిత్రుల్లో తాతినేని వనజ గారొకరు.

వెలుతురు బాకు విసరటం మగవారి సొత్తు మాత్రమే కాదు ఆకాశంలో సగం అయిన తమది కూడానని జెండా ఎగరేసి అంతటా విస్తరిస్తున్న స్త్రీ చైతన్యానికి ప్రతీకగా అభ్యుదయగామిగా కఠోర సత్యాలను నిర్మొహమాటంగా నిండు మనస్సు తో కవిత్వం చేస్తున్న కవయిత్రి వనజ గారు.పురుషాధిక్య సమాజంలో స్త్రీల కన్నీటి గాథలకు హేతువులు వెదికి తన కవిత్వాన్ని స్త్రీలకు వకాల్తా చేయాలన్న ఆలోచన ఈవిడ కవిత్వమంతా మెరుస్తుంది.

అట్లని అన్నీ స్త్రీ చైతన్య కవితల్నే వనజ గారు సృజించలేదు.భాషలో భావంలో ఏ మాత్రం తొట్రుబాటుతనం తొందరపాటు తనం లేకుండా నిశిత పరిశీలన దృష్టితో కళాత్మక వ్యక్తీకరణతో స్త్రీ సమస్యలను, వ్యవస్థ స్వరూప స్వభావాలను పరిశీలించడంలో వనజ గారు ప్రదర్శించిన తీరు ప్రశంసించకుండా ఉండలేను.కల కల్లనే ఎప్పుడు.అదునులో వాన కురువని సందర్భంలో రైతులు కన్న కలలు కల్లలైన దృశ్యానికి కూడా స్త్రీ వాద చైతన్య స్పృహనే అద్దుతుంది ఈ కవయిత్రి.

“ఉన్నట్టుండి నల్లటి పువ్వులని విరబూసిన ఆకాశం
చల్లని గాలితో ఆహ్లాదంగా రాలుతున్న చినుకుల రెమ్మలు
ఆర్తి కొంగు పట్టి వాటిని జరుపుకుంటున్న నేల కన్నె
ఒడిలో విత్తు పగిలి మూడు రుతు రాత్రులు తెల్లారితే చాలు
పచ్చని కాంతితో పిగిలిపడుతూ పూర్ణ కుంభిణిలా శోభించే పుడమి
ప్రసవ వేదన తర్వాత బిడ్డని చూసుకున్న తల్లి చిరునవ్వులా ఖాళీ భూమి “

మేఘాల్ని నల్లటి పువ్వులతో పోల్చింది ఈవిడ.స్త్రీ జీవితంలొని ప్రసవ వేదనా వ్యధని పుడమిలోంచి అంకురించే విత్తు వేదనతో పోల్చుతుంది.మొలిచిన విత్తుని చూసిన రైతు ఆనందాన్ని ప్రసవించాక తల్లి ముఖంలొని ఆనందపు చిరునవ్వుతో పొల్చి..మొలకెత్తిన పంట వానలేక వాడిపోతే ఆశలు అవిసిపోయిన రైతు దుఃఖాన్ని .. ఆ రైతుని రుణాల కరాళ నృత్యతాండవంతో బెదిరిన గొడ్డుతో సంభావిస్తుంది వనజ గారు. సమస్యల్ని 360 డిగ్రీల కోణంతో చూపిస్తుంది. 
ఈ దేశ దుర్యోధన దుశ్శాసన పర్వంలో పోలీస్ స్టేషన్స్ కూడ కౌరవ సభలు కావడాన్ని చెప్పడానికీ ఇక్కడ వస్త్రాపహరణమొక సంస్కృతి అని అంటుంది వనజ గారు. ఎఅవరి ఆయుధం వారి చేతుల్లో వుండాలని చెబుతూ పోలీస్ స్టేషన్ కు వెళ్ళేటప్పుడు చీర కొంగుల్లో చిటికెడు కారమో చేతిలో చిన్న చుర కత్తైన లేకుండా వెళ్లకండి అని చెబుతుంది.ఇంకా ఏమంటారంటే ఈ కవయిత్రి…

“జాగ్రత్త తల్లీ
ఈ సారి పోలీస్ హవుస్ లకి వెళ్ళేటప్పుడు
తోళ్ళు తాటాకులు కూడా రహస్యంగా తీసుకెళ్ళండి
ఏం జరిగిన రహస్యంగా దాచుకోండి “

రక్షించే రక్షణ వ్యవస్థే ఇట్లా ప్రవర్తించే సంస్కృతిని నిరసిస్తూ బరితెగించిన ఈ వ్యవస్థని గర్హిస్తుంది. పర స్త్రీ అనాటమీలో తమ అమ్మ అనాటమీ ని చూడలేని అనారిక సంతతి ఈ దేశంలో అనేకం. ఇంట్లో ప్రదర్శించిన వికృత మనస్తత్వాన్ని ఇంకా మిగుల్చుకున్న మగ వాళ్ళు స్త్ర్రీ శరీరాల తాకిడికై పడే వెంపర్లాటల్ని “వారు వారే “ అనే కవితలో అలాంటి వాళ్ల ముసుగుల్ని తొలగించి చూపించింది ఈ కవయిత్రి.

“హాస్టల్ లో ఉన్న ఆడపిల్లను చూస్తే
ఆక్వేరియమ్ లో అలుపు లేకుండా తిరిగే
రంగు రంగుల చేపలని చూసినట్టుంటుంది
ఎప్పుడేప్పుడు బయట పడుదామా అన్నట్లు
గేటు వైపు చూస్తుంటే
కాముకుల చూపుల వలకీ
చిక్కుకుపోతారేమోనని భయమేస్తుంటుంది”

చదువుల సముద్రంలో ర్యాంక్ ల ఓడలపై ప్రయాణిస్తున్న విద్యార్థునుల హాస్టల్ల లోని జీవితాల్ని, జ్వలిస్తూ హృదయాలు చలించే కవిత్వం చేసింది వనజ గారు.విద్యాగంధాల్ని ఆస్వాదించాల్సిన వాళ్ళు టాయిలెట్ల దుర్గంధాన్ని భరించలేని స్థితికి ఈ “హాస్టల్ గది “ అనే కవితలో అద్దం పట్టారు.

“పైటని తగిలేయాలి” అని జయప్రభ గారన్నారు .కానీ వనజ గారు పైటని చుట్టండి అని అంటున్నారు.దేహ సంపదని బజారున వేయకండి అని అంటుంది ఈ కవయిత్రి.నేర ప్రవృత్తికి సరి కొత్త ఊపిరి పోసే సంస్కతిని ,నాగరికతా భ్రమలో దేహ సంపదనుని బజారున వేస్తున్న సంస్కృతిని,ప్రపంచమంతా పువ్వులాంటి అబల నడుము చుట్టు తిప్పుతున్న వ్యాపార సంస్కృతిని, స్త్రీ దేహాన్నికాసులు పండించే పంట భూమిగా భావించే తండ్రుల ఆలోచనల్నీ, చిన్నతనంలోనే తెరమీద తన బిడ్డల్నీ చూసుకోవాలని ఆత్రుతతో తమ బిడ్డకి ఈస్ట్రోజన్ హార్మోన్ ఇచ్చే తల్లుల భావనల్నీ ఖండించడానికే ఈ కవయిత్రి “అమ్మమ్మలూ బామ్మలూ పైటని చుట్టండి దేహాన్ని కప్పండి “ అని కవిత్వంలో అన్నది.అంతే కానీ ఛాందసంతో కాదని అనుకుంటున్నా.

జనారణ్యంలో మనిషే కరువయ్యాడు. మనిషంటూ ఎవరులేరు అందరు యంత్రాలే.వడి వడిగా జడిజడిగా వొక యంత్ర విధానంలో పరిగెత్తే వ్యవస్థలోని ఒక అవస్థను చెప్పడానికే “నాకో మనిషి కావాలి “ అనే ఈ కవిత రాసింది ఈ కవయిత్రి.

“త్వరిత గతిన నాతో సంభాషించే మనిషి కావాలి
ఎవరితో నైనా మాట్లాడాలి పోనీ ఎవరిఒతోనైనా పోట్లాడాలి
ఎవరిపైనైనా కోపగించుకోవాలి ఒకరిపైనైనా కినుక వహించాలి
జాగ్రతావస్థని దాటి అపరిచుతలనైనా ఆత్మీయంగా హత్తుకోవాలి “

ప్రతి మనిషి నాలుగు గోడల మధ్యనే వుంటాడు. మనిషికి మనిషికీ మధ్య కనిపించని ఐదో గోడ ఒకటి వుందని అది ఇదేనని ఇలా చెబుతుంది.

“ఎటూ చూసినా నాలుగు గోడలేనా
అయిదో గోడ కూడా ఉంది
మనిషికి మనిషికీ మధ్యవున్న గోడ ఏ చరిత్రకందని వింత
దాని పొడవు వెడల్పుఇ ఎవరూ ఊహించనిది “

మనిషి జీవితం వొక మట్టి పాత్రలాంటిదని అది కరిగి పగొలిపోయే లోపలే కష్ట సుఖాల అనుభూతుల వర్షంతో నింపుకోవాలనే ఒక తాత్విక భావనని చిక్కని హృదయం మేఘమై తేలిపోయేలా సౌందర్య పిపాసని రంగరించి చెబుతారు వనజ గారు.

“మట్టి పాత్రలాంటి మనిషి మట్టిలో కలిసిపోయేలోగా
అనుభూతుల వర్షంతో నింపుకోవాలి ఒలకబోసుకోవాలి
నలుపు తెలుపుల జీవితం రోట్లో
కాలం రోకలి పోటుకి చిందే అమృతక్షణాలు
పిండై పోయిన ఘడియలు తిరిగి రానే రావు “
ఈ దేశంలో రావణ పాదం తాకని చోటు కీచకుని చూపు సోకని చోటు లేదేమో? సామూహిక అత్యాచారాలు,మేరిటల్ రేప్ లు నిత్యం సత్యమై కలవరపెడుతున్నాయి.చట్టలు న్యాయస్థానాలు శిక్షలు కూడా ఏవీ పని చేయని చోట క్షణానికో అత్యాచారం నిముషానికో కనిపించని ఆత్మహనం కలవరపెడుతున్న సందర్భంలో కొందరికి తగులుకున్న కామ తెగులుని ఈ కవయిత్రి ధర్మాగ్రహంతో నిలదీస్తుంది ఇలా.

“రోటీ కపడా ఔర్ మకాన్
ఎవర్రా ఆ మాటంది
వాటికన్నా ముందు
విసర్జించడానికీ స్కలించడానికి ఓ క్షేత్రం కావాలి “

మరుగుదొడ్డి కన్నా మగువ అల్పంగా, ఆవుకన్న ఆడది స్వల్పంగా ఆలోచిస్తున్న ఈ పురుషాహంకార వ్యవస్థ వికృత రూపాన్ని చూపెడుతూ మానవ దేహంలో వున్న అనేక అవయవాలు ఇతరులకీ దానం చేయడానికీ పనికి వస్తాయి.దానానికీ కూడా పనికిరాని జననాంగాలకోసం వెంపర్లాడే జాతి కక్కుర్తిని మన కలువలకళ్ళు ఎర్రకోనేరులయ్యే కోపంతో ఇలా అంటుంది.

“అమ్మల్లారా
మూకమ్మడిగా అవయవాల ఆయుధాలని విసర్జించేద్దాం కదలండి
అవయవ దానానికి కూడా పనికిరాని అవయవాల కోసం నిత్యం
కాట్లాడే కుక్కల్లా పొంచివుండే నక్కల్లా
వేటాడే హైనాల్లాంటి వారి నరాల తీపుకీ
కోట్ల యోనుల్ని ఈ నేల మీద పరిచి
రేప్ కోర్టులు నిర్మిద్దాం రండి
చప్పరింపులకీ ఆటలాడుకోడానికీ స్తన్యాలని
గుదిబండలాగా పాతేసీపోదాం పదండి
కుట్టేసిన యోనులు కోసేసిన కుచద్వయాలతో
ఇంటా బయటా అర్థరాత్రి అపరాత్రి స్వేచ్ఛగా సంచరిస్తూ… “

ఎంత తీవ్ర కలతచెందితే తప్ప ఇలా రాయలేరు ఎవరైనా. ఈ లోకాన స్వచ్ఛమైనదేదైనా వుందంటే అది అమ్మ ప్రేమే.అందుకే కవిత్వ వస్తువైంది అనేకుల ఊహల్లో.అమ్మను గూర్చి రాయని కవి బహుశా లేడేమో?ఈ కవయిత్రి వనజ గారు అమ్మను బరువు మేఘం చేశారు కవిత్వంతో.

“అమ్మంటే అస్తిత్వమని అశ్రుబిందువులతో యెలుగెత్తి చెపుతున్నా
అమ్మంటే ఆవలి గట్టుకి వంతెననని యెద పరచి ఆరేస్తున్నా
అమ్మంటే వో బరువు మేఘమని అది అంత తొందరపడి కురవదని
కురిసినా ఎవరినీ యేమీ తిరిగి ఇమ్మనిఅడగదని “

ఈ కవయిత్రి కలానికీ కోపంతో అక్షర తూణీరం నుండి కవితాస్త్రాలను సంధించడమే కాదు తెలిసింది బాధల నదిలో కొట్టాడుతున్న తెర చాపను దింపటం తెలుసు. స్వచ్ఛమైన సుకుమారపు పువ్వులాంటి భావనల్ని కవిత్వంగా నేయటం తెలుసు.

“చూడు నీ కొసం ఏమి తెచ్చానో
మనసంతా స్వఛ్చమైన సుకుమారమైన పువ్వులని
గిలిగింతలు పెట్టే సంభాషణా చాతుర్యాన్ని
గండుకోయిల రాగాలని అడవి పూల సుగంధాన్ని
వేయి వేణువుల నాట్యాన్ని
గతజన్మలోని జ్ఞాపకాలనీ “

ఈ కవయిత్రి కథలు కూడా రాస్తుంది. అందుకే ఈవిడ కవితల్లో దృశ్య చిత్రణ ఎక్కువగా కనిపిస్తుంది.బహుశా ఇలా రాయడం కథా కథనం నుంచి తెచ్చుకున్న శిల్ప విశేషం. ఇది ఈ కవిత్వానికీ అదనపు అందమే.ఈ కవిత చూడండి.
“తల పగిలిపోతుంది
రక్త నాళాలు చిట్లిపోతున్నట్లు బాధ
యాపిల్ ని కత్తితో కోస్తే రెండు చెక్కలైనట్లు
మెదడు రెండు ముక్కలైతే బావుండును
నా నుండి నేను పాయలుగా చీలిపోతున్నట్లు
శాఖోప శాఖలుగా విస్తరించినట్లు
అంతర్వేదన బహిర్వేదన”

ఇలా కథా కథన శిల్పం తో ఈ కవయిత్రికథకే కాదు కవితకు ప్రాణం పోస్తుంది. ఈ సంపుటికి ముందుమాట రాసే అవకాశాన్ని జారవిడుచుకున్నాను.కారణం ముందుమాట రాసే అర్హత నాలో లేదన్న ఒకే ఒక్క భావనతో మాత్రమే.అంతే తప్ప అలసత్వం ఏమాత్రం కాదు కేవలం అశక్తతేనని చెబుతున్న వనజ గారికీ.

స్త్రీకీ పుట్టుకతో వచ్చే ఇంటి పేరు పెళ్ళితో మారిపోతున్నది ఈ దేశంలో.ఆడదో ఈడదో లేకుండా ఏదో ఒకటి ఉండకుండా వున్నదాన్ని వదిలించుకొని అది లేకుండా నేను లేనా అని ప్రశ్నిస్తుంది ఈ కవయిత్రి.మనిషిని ఎదగనివ్వని మూలాల్ని వద్దేవద్దని చెబుతుంది. నవ్వులో కన్నీళ్ళు చిట్లించగల వొకానొక విషాదాన్ని చవి చూసిన వనజ గారు మగువ మండే భాస్వరం కావాలని కోరుకుంటున్నది.స్త్రీల కన్నీటికీ స్వేచ్ఛ కోరుకుంటున్నకవిత్వం ఈవిడది.తాను మాటై మనసై వాక్యమై రాసిన కవిత్వమిది. సర్వజన సమ్మోహిత స్వరంగా తన కవిత్వాన్ని చేయాలనుకున్న కవయిత్రి అంతరంగమీ కవిత్వం.అంతర్లీనంగా తనలో ప్రవహించే బాధా నదీ అలల చప్పుళ్ళ సంగీతం ఇది.ఈ నిశ్శబ్ద కవిత్వ రవం వొళ్లంతా చుట్టుకున్న వేళ వనజ తాతినేని గారికీ అభినందనలు చెబుతూ…


( వెలుతురు బాకు సంపుటి కవయిత్రి వనజ గారు ఈ వారం కవితాంతరంగంలో ) — with వనజ తాతినేని




1 కామెంట్‌:

Zilebi చెప్పారు...


వనజ గారికి

అంతర్లీనంగా తనలో ప్రవహించే బాధా నదీ అలల చప్పుళ్ళ సంగీతం ఇది.

ఈ నిశ్శబ్ద కవిత్వ రవం వొళ్లంతా చుట్టుకున్న వేళ వనజ తాతినేని గారికీ అభినందనలు.

వావ్ బాగుందండీ సమీక్ష


జిలేబి