15, అక్టోబర్ 2011, శనివారం

నేటి వీక్షకుడు


 అబ్బ! బతకడం మహా బరువుగా ఉంది.. పువ్వులా నదిలో.. తేలియాడే బతుకు బతకడానికి కూసింత అదృష్టం అయినా చేసుకుని పుట్టవద్దూ.. పోనీ అలా పుట్టలేకపోయామని పువ్వు మీద నది ప్రవాహం మీద దుగ్ధ ఎందుకు గానీ .. కూసింత అయినా ఉలికి పడి చూసి చుట్టూరా చూడండీ.. మనం చూడనవసరం లేదు మీడియా మనమీద దయ తలచి మెరుగైన సమాజం కోసం లాటి శీర్షికలతో.. పారాహుషార్ లాటి డజన్ల కొద్ది  ఉపశీర్శికలతో జనాలని నిద్రపొనీయకుండా.. దోమలు చంపుకుంటూ(అవినీతి దోమలని పెంచుకుంటూ) మరి చూడమని..సరి కొత్త కథనాలు ఎందుకిస్తుంది అనుకుంటున్నారు..భాద్యత అండీ భాద్యత. భాద్యతని కూడా సెన్సేషనల్ గా చూడాలని మీడియా అప్పుడప్పుడు చెవుల్లో శంఖం పూరించి నిదుర లేపి మరీ చెబుతుంది. నిద్ర ఎప్పుడు పోయా మంటారా అని అడగకండి.

ప్రభుత్వం అంత హాయిగా నిద్ర పోతుంటే మనకెందుకు రాదండి నిద్ర.. రేపుద్దున్నేకి..గ్యాస్ రేట్ పెరగవచ్చు.ఉల్లిపాయ రేటు బాంబులా పేలవచ్చు.చమురు ధర దీపావళి వెలుగుల్లో వేలగావచ్చు.పప్పు .. పప్పా!అదేమిటి అని కొత్తగా మాటలు నేర్చుకునే చిన్నారులు చూడనిదాన్ని అడగా వచ్చు. చింతాల్ సబ్బు మానేసి సంతూర్ కొనుట  అలవాటు పడినాము.ఆకు కూరలు లాభం లేదు..మునగాకు మంచిదంట ఇంటి పక్క ఏ గోడమూల చూసో..ఆ మొక్క నాటేద్దాం.ఆకు కూరల బదులు మునగాకు కూర మంచిది అని నలుగురికి చాటి చెపుదాం. వంటింట్లో ఏ సరుకు తగ్గించుకుని.. డబ్బు ఆదా చేసి కార్పోరేట్ స్కూల్ ఫీజు కో పొడుపు చేద్దాం లేకపోతె కార్పోరేట్ ఆసుపత్రికో! పెద్దగా తేడా ఏం లేదు కదా!. 

ఓ పద్నాలుగేళ్ళ నాడు "గాయం' చిత్రంలో.. ఒక పాట నేపధ్యంలో సిరివెన్నెల గారు..  (ఆయన నోరు చల్లంగా ఉండ ) ఓ మంచి చెడ్డ మాట చెప్పారండి. నిజాలు శోధించి,సాధించి ఈ గొర్రె జనం కి చెబితే ఏం జేస్తారు.. ? సెన్సేషనల్ న్యూస్ గా చూసి కాసేపు ముచ్చటించుకుని  పేపర్ పక్కన పడేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు..అని చెప్పిన స్థాయి నుండి.. మన మీడియా యెంత ఎదిగి పోయిన్దండీ.. మొన్నటికి మొన్న అన్నాఅవినీతి యుద్దాన్ని క్షణ క్షణం చూపింది. సామాజిక సృహ పెంచింది. అలాగే తారాజువ్వలా పైకి లేచి టప్పున   పడిపోతుంది. జనాని కేమో మీడియాలో చెపితేనే వార్త. మన పక్కిల్లు కాలితే కూడా.. మనం చూస్తున్న వార్తల్లో చూపిస్తుంటే కానీ మనకి  తెలియదు. బిన్ లాడెన్ ని పాకిస్తాన్ ప్రభుత్వానికి కూడా తెలియకుండా గాలించి గాలించి పట్టుకుని మట్టుబెట్టిన వైనం లా.. మీడియా ఎన్ని సాహసాలు చేస్తుంది.అర్ధం చేసుకోరూ.. సొల్లు కబుర్లు,చెత్త సినిమాలు,రేటింగ్లు పక్కన పెట్టి ప్రజాస్వామ్య దేశంలో..అచ్చరాల నోటుని,వోటుని చూపించాక..కూడా ప్రజలకి బుద్ది రాలేదు జ్ఞానం రాలేదు అని ఊరుకోదాయే!   అన్నిటిలో దూరిపోయే సూది కున్న బెజ్జం లాటిది. అందరి దగ్గరా ఇమిడిపోయే సేల్పోన్ లాటిది.మరీ మాటాడితే ఇంద్రుడుకి వళ్ళంతా కన్నులున్నట్లు సహస్ర అవతారి. ఇన్ని అవతారాలు ఎత్తినా పోద్దస్తమాను ఇవే చెప్పేసి  కూడా.. చెప్పిందే చెపుతాడు.వాడు ఏం చెప్పాడు వీడెం చెప్పాడు అని తెగ ఆసక్తితో..ఇంట్లో ఆడాళ్ళని సీరియల్స్ చూడనీయకుండా.. వాడి వాదన నిజమా వీడి వాదన నిజమా? అని తెగ ఆలోచించినట్లు నటించి జుట్టుపీక్కుని మరీ  నిజం కోసం భూతద్దంతో..శోదించి.. ఆ శోధించడంలోను, నటించడంలోను విసుగొచ్చి.. అమ్మో!కరంట్ బిల్లు షాక్ కొడుతుందని గుర్తొచ్చి ..టప్పున టీవి  కట్టేసి పొద్దునే లేచి మళ్ళీ ఏం జరుగుతుందని ఆసక్తి తో..టీ.వి ఆన్ చేసే  సగటు జీవి... మన భారతీయుడు. ఇంతకన్నా ఇంకేమన్నా ట్యాగ్ లైన్ ఉంటె చెప్పండోచ్! నేను తెగ వెదుకుతున్నా.        

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

chala baga chepparu....i accept ur words...Y. Ram Kumar