7, అక్టోబర్ 2011, శుక్రవారం

సరదా బెట్టింగ్స్ !?

మీ పిల్లలు బెట్టింగ్ వలలో చిక్కుకుంటున్నారా? అదేనండీ సరదాగా ఆటలాడుకుంటూ.. బెట్ ..అంటున్నారా? జాగ్రత్త సుమండీ! పందెం లేకుండా ఆట మజా ఏముంది అనుకుంటే అది చాలా ప్రమాదకరమైన పరిణామం . బెట్టింగ్    వలలో పెద్ద పెద్ద క్రీడాకారులు ఎలా అయితే  చిక్కుకుంటున్నారో ఏమో కనీ వాళ్ళ ప్రలోభాలు వారివి. వారిని మనం ఏం చేయలేం కానీ మన పిల్లలని ఆ బెట్టింగ్ వలనుండి కాపాడుకోవడానికి  కంకణం కట్టుకోవాలి. ఇప్పుడు అంతా ఇంటర్నెట్ కాలం.పిల్లలు ఏదో వాళ్లకు కావాల్సింది చదువు కుంటున్నారో ,లేదా సెర్చ్ చేసి  చూసు కుంటున్నారో ..అని నాలా అమాయకంగా అనుకోకుండా పేస్ బుక్ లోనో,ఆర్కుట్ లోనో చాట్ చేసుకుంటున్నట్లు ఉన్నా వారి మద్య వివిధ దేశాల మద్య క్రికెట్  మ్యాచ్ లు  జరుగుతున్నప్పుడు   మీ పిల్లలు కూడా ఆ జూదం వలలో చిక్కుకుని  చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు. ఎలా అనుకుంటున్నారా?

మైదానంలో రెండు జట్ల మద్య జరిగే ఆటని నియంత్రించే మాఫియా బెట్టింగ్ లు,   అదే ఆట పై  వందల కోట్ల పై  జరిగే వ్యాపారాలు సంగతి సరే చిన్న చితక పట్టణాలలో సైతం బెట్టింగ్ లు జరుగుతున్నాయి.  ఆట  జరిగే టప్పుడు మన మద్య మనకి తెలియకుండానే గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్ వలలో..పిల్లలు చిక్కుకుంటున్నారు. అందుకు ఒక ఉదాహరణ అనాలో..ఒక అనుభవం అనాలో.. ఏమో కానీ ఒక వాస్తవ విషయం చెప్పబోతున్నాను. ఇది నా అనుభవం మాత్రమె అనుకోవద్దు.  ఇలాటి అనుభవం ఎవరో ఒకరి ఇంట్లో కూడా జరుగుతున్నాయి. 

ఒక రెండు సంవత్సరాల క్రితం అనుకుంటాను  మా అబ్బాయికి GRE  వ్రాయడానికి నేను ఫీ  ఇచ్చి పంపాను. ఆ డబ్బు అందుకు ఉపయోగించకుండా నాతొ  అబద్దం చెప్పాడు తర్వాత తెలిసిన విషయం ఏమంటే ఆ డబ్బు క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు మన దేశం గెలుస్తుందని బెట్ కట్టి మన దేశం ఓడిపోయింది,మా వాడు డబ్బు పోగొట్టుకున్నాడు. అసలు పిల్లలు చిన్న చిన్న క్రికెట్ మ్యాచ్ లు ఆడుకుంటూ కూడా బెట్ కట్టడం ఆనవాయితీ అన్న సంగతి నాకు చాలా కాలం తెలిసింది కాదు. కాలేజ్ లో చదివే పిల్లలు తల్లిదండ్రులకు తెలియ కుండా ఎన్నో నాటకాలు ఆడుతూ ఉంటారు. పిల్లలు అన్నాక యేవో కొన్ని సరదాలు ఉంటాయి కాదనం.కానీ ఇలా వేలకు వేలు తగలపోయడం మాట అలా ఉంచి..  ఆట అనేదాన్ని గెలుపు-ఓటమి నిమిత్తం లేకుండా..ఆట ఆడే విదానాన్ని తమ-పర బేధం లేకుండా ఆస్వాదించకుండా .. వారి ఆట పై..బెట్ లు కట్టుకుని ఒక ప్రమాదకరమైన వ్యసనం లో చిక్కుకుంటున్నారు.  
చాలా నెలల తర్వాత నీ GRE  ఎగ్జాం ఎప్పుడు..బాగా ప్రిపేర్ అవుతున్నావా? అని అడిగినప్పుడు కూడా సమాధానం చెప్పలేదు మా వాడు. అప్పుడు మా బావ గారి అమ్మాయి చెప్పింది."పిన్ని తమ్ముడు  ఫి కని ఇచ్చిన  ఆ డబ్బు  క్రికెట్ మ్యాచ్ పై బెట్ కట్టి పోగొట్టుకున్నాడు .నువ్వు తిడతావని చెప్పడం లేదు అని చెప్పింది. నేను మా అబ్బాయిని ఏమి అనలేదు. మళ్ళీ పీ కట్టి రమ్మని డబ్బు ఇచ్చి పంపాను. 

అసలు ఈ క్రికెట్ మ్యాచ్ బెట్ కట్టడాలు వివిధ కాలేజెస్ లలో చదివే పిల్లల్లోనే ప్రతి ఆదివారం జరుగుతాయని ఎవరో నా చెవిన వేసారు. నాన్నా! నిజమేనా? ఆ సంగతి అన్నాను. అవునమ్మా! అసలు బెట్ లేకపోతె మజా ఏముంటుంది.. అన్నాడు. ప్రతి సండే మేము ఆడే మ్యాచ్ లలో నేను క్రీజ్ లో దిగక ముందు నుండే నా రన్స్ పై బెట్ లు కడతారు. వాళ్ళు ఓడిపోకుండా ఉండటానికైనా నేను బాగా ఆడాలి అని చదువు సంద్యలు,తిండితిప్పలు లేకుండా పరుగులు పెడుతూ ఉండేవాడు.నాకు కోపం వస్తూ ఉండేది. సమయం చిక్కినప్పుడు తనకి బెట్టింగ్ అనేది  యెంత చెడ్డ విషయమో..చెప్పడం కోసం ఎదురు చూసాను. 

ఒక సారి మా ఊరిలోనే ఒక కుర్రవాడి తండ్రి మా అబ్బాయిని   వెతుక్కుంటూ  వచ్చారు. వారిని కూర్చో బెట్టి ఏమిటండీ విషయం అని అడిగాను. నిఖిల్ తో ఓ విషయం మాట్లాడిపోదామని .. వచ్చాను అన్నారు.పర్వాలేదు మాతో చెప్పండి ఎటువంటి విషయమైనా సరే! అన్నాను. ఆయన ఇలా చెప్పుకుంటూ వచ్చారు. మా వాడు పెద్దగా చదువు సంద్యలు లేకుండా పనిపాట లేకుండా అల్లరి చిల్లరగా తిరిగే మూకతో కలసి తిరుగుతూ ఉంటాడు. ఈ మద్య ఇంట్లో డబ్బులు దొంగిలించడం,బయట అప్పులు చేయడం అవి చేస్తున్నాడు. ఒకసారి మీ అబ్బాయి నిఖిల్ వచ్చి నాకు చెప్పి వెళ్ళాడు. మా వాడు ఎక్కువ మొత్తంలో డబ్బు  తెచ్చి క్రికెట్ మ్యాచ్ ల పై బెట్ లు కడుతున్నాడు . జాగ్రత్త అంకుల్. అని చెప్పి వెళ్ళాడు. మీ బాబు  వచ్చి చెప్పి వెళ్ళగానే నేను లారీ పై డ్యూటికి వెళ్లాను. నేను వచ్చేసరికి దాదాపు ఎబైవేలు రూపాయలు నేను తెమ్మాన్నానని అప్పుగా తెచ్చి బెట్ కట్టి ఓడిపోయాదట.ఆ డబ్బు గెలుచుకున్న వారు మీ నిఖిల్ కి బాగా తెలుసట .ఇప్పిస్తారేమో అని ఒక మాట అడుగుదామని వచ్చాను..అన్నారు. నాకైతే మాట రాలేదు.  బాబోయి...పట్టుమని ఇరవై ఏళ్ళు కూడా లేని పిల్లలు ఇలా చేస్తున్నారంటే..వాళ్ళు యెంత ప్రలోభానికి గురి అవుతున్నారు అనిపించింది. ఎలోగాలా.. ఆ అబ్బాయికి ఆ డబ్బు రావటానికి నానా తిప్పలు పడి ఆ అబ్బాయికి ఆ డబ్బు సమకూర్చి.. వాడికి గట్టిగా క్లాస్స్ పీకి ఒక చిన్న ఉద్యోగంలో జాయిన్ చేసి.. అమ్మయ్య అనుకున్నారు..మా అబ్బాయి,వాడి ఫ్రెండ్స్ నూ.. ఇవి పిల్లల సరదా సరదా బెట్టింగ్స్ అనుకోవాలా? 

ఇక నేను ఆ రోజు మా వాడికి గట్టిగా క్లాసు తీసుకున్నాను. బెట్ మ్యాచ్ లు ఆడినా బెట్ కట్టినా అందువల్ల వచ్చే లాభం-నష్టం కన్నా వ్యసనం యెంత ప్రమాదకరమైనదో.. అందువల్ల ఎందరు సర్వస్వాన్ని కోల్పోతారో..చెప్పాను. ఊరుకోమ్మా.. అన్నీ అంత సీరియస్ గా ఆలోచిస్తావ్? నేను వంద నుండి అయిదు వందల వరకే బెట్ పెడతాను. అన్నాడు. ఇక అప్పుడు సీరియస్ అయ్యాను. బెట్టింగ్ ద్వారా సంపాదిన్చాలనుకోవడం చాలా సిగ్గు చేటు. ఒకరి కష్టార్జితం ని ఇతరులు దోచుకు తినడం కన్నా హీనం. నువ్వు గెలుచుకున్నప్పుడు నీకు సంతోషం కల్గించే విషయం ఇంకొందరిని నష్ట పరచి .అది వాళ్ళని భాద పెడుతుంది.ఒకరిని  భాదపెట్టి ఆ డబ్బుని నువ్వు సంతోషంగా సొంతం చేసుకోవడమే చాలా తప్పు. తేలికగా డబ్బు సంపాదిన్చాలనుకోవడం సోమరితనం యొక్క లక్షణం. పని చేయకుండా తిండి వాడు దొంగ ..అన్నారు గాంధీజీ.అని చెప్పి..తల్లిదండ్రుల కష్టార్జితాన్ని ఇలా తగలపోయడం మీకు సిగ్గు అనిపించడం  లేదా?అన్నాను. ఆ..మేము కష్ట  పడకుండానే వచ్చేస్తున్నాయా ఏమిటీ? మేము ఒక మ్యాచ్ గెలవాలంటే ప్రాక్టీస్ చేసి యెంత చెమటలు కక్కుతామో..మీకేం తెలుసమ్మా.. అన్నాడు. అది తప్పు.. బంగారం. ..అంటూ..లాలనగా జూదం యెంత ప్రమాదకరమో.. ధర్మ రాజు దగ్గర నుండి మా  బంధువులలో  ఒకాయన గుర్రపు పందేలలో..సర్వస్వం ఎలా పోగుట్టుకున్నాడో..చెప్పి .. ఇలా ఈ రోజు చిన్నగా మొదలైన సరదాలు ముందు ముందు యెంత పెను ప్రమాదంగా మారతాయో  వివరించి చెప్పాను. 

అలా జరిగిన తర్వాత కొంత ఆలోచనలో పడి  బెట్ మ్యాచ్ లు  లు ఆడటం మానేసాడు. మరలా ఒక సంవత్సరం తర్వాత ఒక సంఘటన జరిగింది. అమ్మా.. నాకు ఒక అయిదు వేలు డబ్బులు కావాలమ్మా!అన్నాడు. ఎందుకు బంగారం అని అడిగాను. ఎందుకు ఎందుకు అని అడుగాతావ్? అడగకుండా ఇవ్వలేవా అన్నాడు..కోపంగా. ఇస్తాను కానీ అంత డబ్బు అవసరం నీకు ఏముంది.. బంగారం ..అన్నాను.నేను ఆర్కుట్ లో..ఫ్రెండ్స్ తో చాట్  చేస్తూ ఉన్నాను. నా చాట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి మ్యాచ్ మనవాళ్ళు గెలవరు. అంది.. నేను గెలుస్తారు అన్నాను. బెట్ అంది.. మళ్ళీ   నేను వెనుకంజ వేస్తె బాగుండదని ఓకే.. అన్నాను. మా ఇద్దరి మద్య బెట్ అయిదు వేలు. మన ఇండియా వోడిపోయింది. నేను మాట ప్రకారం ఆ అమ్మాయికి డబ్బు ఇవాలి కదా అన్నాడు. మరి ఇవ్వాలి  కదా అన్నాను నవ్వుతూ.. మరి అందుకే ఇవ్వు అన్నాడు. ఏమిటీ ఈ బెట్ ల మాయాజాలం అని ఆలోచిస్తూ.. మా వాడికి డబ్బు ఇచ్చాను. మా వాడు కూడా చాలా "షై" ఫీలింగ్ తో సారీ అమ్మా!..ఇలా ఎప్పుడూ చేయను అన్నాను. 

సరే .. వదిలేయి అన్నాను. ఎవర్రా..ఆ అమ్మాయి అని అడిగాను ఆసక్తిగా..మన సిటి లోనే ఒక పెద్ద రౌడీ నాయకుడి కూతురు..మా క్లాస్స్ మేట్.అన్నాడు. వాలా నాన్న పెద్ద రౌడీ అని భయపడి డబ్బు ఇస్తున్నావా? ఆన్నాను జోక్ గా.. కాదులేమ్మా..మాట అన్నాక మాటే కదా! అన్నాడు. అప్పుడు నాకు దిగులు కల్గింది..గర్వం కల్గింది. మాట తప్పే నైజం లేనందుకు..బెట్టింగ్ ల వలలో..ఈజీగా చిక్కు కుంటూ ఉన్నందుకునూ . తర్వాతా ఆ అమ్మాయి తన అకౌంట్ నెంబర్ చెపితే ఆ నంబర్కి డబ్బు జమ చేసి వచ్చాడు. అలా ఆ రోజు ఆ అమ్మాయి దాదాపు పన్నెండు  మంది పరిచయస్తులతో .. చాట్ లోనే  బెట్ కట్టి డబ్బు గెలుచుకుందట, ఒరేయ్..గోర్రేలమందలా అందరం ఒక అమ్మాయి చేతిలో చిక్కుకున్నాం..మా ఇంట్లో అయితే ఏం అనలేదు .థాంక్ గాడ్..అంటున్నాడు మావాడు.  బాప్ రే.. ఆమ్మాయిలు అనుకున్నాను.ఆ రోజు సాయంత్రం మా అబ్బాయికి షాపింగ్ చేసుకోచ్చుకోమని డబ్బు ఇచ్చాను. నువ్వు రామ్మా!  ..వెళదాం అంటే ఇద్దరం వెళ్లి  తిరిగి తిరిగి తనకి నచ్చినవి కొనుకున్నాడు. వాడికి అర్ధమైంది. నేను విపరీతమైన కోపంలో ఏమడిగినా వెంటనే ఇచ్చేస్తాను అని.  నేనుకూడా తనకి కావాల్సినవి అందించడానికి  యెంత ఇబ్బందిలోనే ఉన్న సరే వెనుకాడను. పిల్లలు తల్లిదండ్రుల ఇబ్బందిని గుర్తించాలి .ఆ ఇబ్బంది లో కూడా వారికి మనం యెంత ప్రాముఖ్యతని ఇస్తున్నామో అర్ధం కావాలి..అని నా ఆలోచన. అప్పటికి వారు అర్ధం చేసుకోలేక పొతే వారు మనిషిగా ఎదగటానికి.. ఆస్కారమే లేదని నా ఉద్దేశ్యం కూడా.   

ఆ రోజు అలా జరిగిన తర్వాత మరునాడు మా ఊరిలోనే కేర్&షేరింగ్  స్వచ్చంద సేవా సంస్థ నిర్వహణలో.. పూర్తిగా హెచ్.ఐ వి. బాధిత పిల్లలు ఉన్న అనాధ శరణాలయం కి వెళ్లి అక్కడ ఆ పిల్లలకి కావాల్సిన వస్తు సరంజామాని స్వయంగా కొని పెట్టి వచ్చాం. ఆ విషయం మా వాడికి చెప్పి ఏదైనా మనం ఖర్చు పెట్టిన డబ్బుకి ప్రయోజనం,సంతృప్తి ఉండాలి..అని చెప్పాను. తనని తిట్ట లేదు,కోపపడ లేదు కూడా.. చాలా సైలెంట్ గా తన తప్పుని తనకి తెలియ జెప్పడం లో.. సఫలీకృతం అయ్యాను. ఎలా అంటారా.. మా అబ్బాయి ముఖంలో..విపరీతమైన భాద+కళ్ళలో చిప్పిల్లిన నీరు.అది చాలు నాకు. 

నేను ఇంకో విషయం చెప్పనా !..నేను. మా మా అబ్బాయిని ఎప్పుడు తిడతానో తెలుసా? తుడుచుకుని తడి టవల్ కుప్పగా పడేసి వెళ్ళినప్పుడు.. భోజనం చేసేటప్పుడు వడ్డించుకుని గిన్నెలపై మూతలు పెట్టకుండా వెళ్ళినప్పుడు..నీళ్ళ సీసాల్లో నీళ్ళు త్రాగి నింపకుండా ప్రిజ్ద్ లో పెట్టకుండా..చుట్టూ.. పేర్చుకున్నప్పుడు  పిచ్చి తిట్లు తిడతాను. నువ్వు తిట్టే సమయాల్లో తిట్టకుండా ఇప్పుడు తిడతావు ఏమిటో నాకు అర్ధం కావు..అని  అనడమే కాదు..తన ఫ్రెండ్స్ కి చెప్పుకుని నవ్వుకుంటాడు కూడా.. 

మా అబ్బాయి అంతటితో మారి పోయాడని అనుకోకండి. మొన్నటికి మొన్న యు.ఎస్ నుండి వచ్చినప్పుడు.. క్రికెట్ ఆడటానికి వెళుతూ.. దాదాపు ఒక అయిదు వేలు తన వాలెట్ లో పెట్టుకుంటుంటే..ఎందుకు బంగారం అంత డబ్బు నీకు అసలే మతిమరుపు..అన్నాను. బెట్ మ్యాచ్ ఆడాలి అమ్మా..అన్నాడు.  ఇంకా నువ్వు మారలేదా? అంటే..ఫ్రెండ్స్ సరదా పడుతున్నారమ్మా..అన్నాడు. సరదా పడటం అంటే బెట్ కట్టుకోవడం కాదు నాన్నా! నీవు వాళ్లతో కలసిన సందర్భాన్ని సంతోషంగా గడపడం. అందుకోసం ఖర్చు పెట్టు.అంటే కానీ బెట్ మ్యాచ్  వద్దు అన్నాను. ఒక్క క్షణం ఆలోచించుకుని రెండు వేలు తీసుకుని మూడు వేలు అక్కడ పెట్టి.. నీ తర్వాత డైలాగ్ నే చెప్పనా.. అంటూ..
వద్దు బంగారం.సరదాకి  కి ఓ..హద్దు ఉంటుంది. ఈ డబ్బు పోగొట్టుకున్నా నీకు బాధ. నీకు వచ్చినా నాకు బాదే.ఎవరి డబ్బు అయినా కష్టార్జితమే కదా.అంటావ్ ..అన్నాడు.. నేను నవ్వుకున్నాను. అప్పుడు మావాడు తన కష్టపడ్డ   డబ్బుని  తీసుకుని వెళుతున్నాడు. ఆ డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడి ఉంటాడో..అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు కాబట్టి.. ఆలోచించ గల్గాడు. ఇదంతా చూస్తున్న మా వారు..మీ అమ్మ చేత మీ యూత్ కి కౌన్సిలింగ్ క్లాస్స్ లు పెట్టించాలి రా.. అప్పుడు గాని మీరందరూ బెట్టింగ్స్ కట్టకుండా ఉంటారు.అన్నారు. 
నిజమే కదా..సున్నితంగా..అర్ధమయ్యే విధంగా చెప్పాలి కదా.. లేక పొతే పిల్లలు అర్ధం చేసుకుంటారా? వాళ్ళ సరదాలకి అడ్డు పడుతున్నాము   అని మనని శత్రువులా చూడరూ!? 

నేను నా అనుభవాన్ని ఎందుకు చెపుతున్నాను అంటే..మా అబ్బాయి గ్రేట్ అని కాదు. పిల్లలు తప్పులు చేస్తూ ఉంటారు వారిని కొట్టి తిట్టి నానా యాగి చేసి,ఏడ్చుకుంటూ,చీదుకుంటూ..దబ దబ బాదటమో కాదో..మనం చేయాల్సింది.. స్మూత్  గా హండిల్ చేసి ఓపికగా వివరించలేక పొతే.. మనం మంచి తల్లి-తండ్రి గా  ఫెయిల్ అయినట్లే! తప్పులు చేస్తూ..పరిణామక్రమంలో.. తనని తాను తీర్చి దిద్దుకున్న వాడే.. మనిషిగా ఎదగ గలడు. తప్పులు అంటే ఎలాటి తప్పులు అని నన్ను అడగ కండీ! మన పిల్లలు మనకి తెలియ కుండాను, తెలిసీ కూడా తప్పులు  చేస్తుంటారు..వారిని  కాపాడుకోవడం, సరయిన మార్గంలో.. పెట్టుకోవడం వారిని వివిధ రకాల ప్రలోభాల బారిన పడకుండా కాపాడుకోవడం కూడా మన భాద్యత కాబట్టి..  చీటికి మాటికి ఏదో ఒక విషయంలో బెట్ లు కట్టుకుంటూ.. ఈజీగా డబ్బు సంపాదించవచ్చు అనుకుంటూ   ఈ బెట్టింగ్ ల బారిన పడే పిల్లలు ఉంటున్నారు. అందులో.. మన పిల్లలు  సారీ! మీ పిల్లలూ..ఉంటారేమో..చూసుకోండి అని చెప్పడానికి ఈ పోస్ట్.   
           

కామెంట్‌లు లేవు: