29, నవంబర్ 2010, సోమవారం

ఒక మౌనం వెనుక...







ఒక మౌనం వెనుక 

కాలం ఏదైతేనేం .. కారణాలు  ఏవైతేనేం 
సాధించాడటానికి, శోధించటానికి,
శోభిల్లడానికి అబలల  శరీరాలే కావాలి  ..
కూడబెట్టుకోవడానికో , దోచిపెట్టడానికో ..
సహజ సంపదలే కావాలి...

ఈ కల్కి యుగంలో మానమర్యాదలని కాపాడటానికి ..
ఏ గోపాలుని అదృశ్య  హస్తం రాదని,
విరబోసిన కురులకి  రక్తతర్పణం చేయగల
పతి ఉండడని తెలుసు..

నట్టడవిలోను, నడిరోడ్డు పైనా
ఆత్మ రక్షణకై కూడా చంపడానికి
వెనుకాడే   ఆ చేతులు
నరకడం కూడా తెలిసిన ఆ చేతులు ..
న్యాయం   కోసం అర్దిస్తాయి
సిగ్గు విడిచి ఆక్రోశిస్తాయి..

పాలెగాళ్ళ నేరాల గుట్టుని విప్పని రాక్షస రాజ్యంలో
రాజకీయరాబందుల వీక్షణంలో  తీక్షతని కోల్పోయినా..
చేయని తప్పుకి - ఏలినవాడి   సానుభూతికి  మధ్య  
ప్రశ్న తలెత్తి  రుతువుల కాలమానం తో ..
మానని గాయం పై ముల్లులా   గుచ్చుతూనే ఉంది.
పచ్చిగాయాలు పచ్చగా ఉండటం
మన తప్పు కాదు తల్లీ.. చెల్లీ..

దారి తప్పిన మదగజాలని  ప్రయాసకోర్చి పట్టి
జంతుశాలకి పంపిన నాగరికులకి
గూడాలపై బడిన మృగాలని శిక్షించలేక
న్య్యాయం కళ్ళు మూసుకుంటే  
ఆటవిక న్యాయం కన్నుతెరిచి 
కుక్షిని చీల్చ లేకా కాదు...
వధ్యశాలకి  పంపడం చేతకాకా  కాదు ..

వేటాడటం , భూమిని దున్నడం తెలిసిన
వారికి  సానపెట్టడం  తెలుసు..
మూగ భావాలతో  గుండెల్ని తడమడం తెలుసు.
బాణాలతో  .. గుచ్చి చంపడం తెలుసు..
అలసిన న్యాయ పోరాటాల వెనుక,
ఆయేషా కథ మలుపుల మధ్య
మరో.. పూలందేవి  ఆవిర్భవానికి 
బీజం పడే ఉంటుంది.

ఈ.. అత్యాచారాల నెలవులో ..
దురంధరుల కొలువులో..
ఎన్నో దురాగతాల   సాక్షిగా..
మౌన సంఘటితాల మధ్య
శక్తుల కొలుపు జరుగుతూనే ఉంటుంది.

ఒక మౌనం వెనుక... 
ఒక విస్ఫోటనం ఉండనే ఉంటుంది..
అరణ్య రోదనలోను .. ఆరని కసి ..
నివురుకప్పిన నిప్పులా.. ఉంటుంది ..
గాయ పడిన పులి
పంజా  రుచి  చూపడానికి పొంచి  ఉంటుంది.

మూగపోయిన కలం నాలుక
చీలిక చీలికలుగ  మారి 
దునుమాడటానికి  సిద్ధంగానే  ఉంది..   

(వాకపల్లి    ఉదంతం పై వ్రాసిన కవిత .. భూమిక లో ప్రచురితమైన కవిత )         

కామెంట్‌లు లేవు: