ఈస్తటిక్ సెన్స్ కథా సంపుటిలో “ప్రేమే నేరమౌనా!?” కథ పై కథా సమీక్ష (వ్యాఖ్యానం) అందించారు -రాధ మండువ. అది మీకు పరిచయం చేస్తున్నాను. రాధ మండువ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు..
***********
వనజ తాతినేని గారు బ్లాగర్ గా, కవయిత్రిగా, రచయిత్రిగా పదేళ్ళకు పైగా పరిచయం. ఆమె తన అముద్రిత కథలను సంపుటిగా వెలువరించే క్రమంలో ఒక కథని పరిచయం చేయమని అడిగిన వెంటనే అంగీకరించాను.
"ప్రేమే నేరమౌనా!?" కథను చదివిన తర్వాత కథను విశ్లేషించాలన్న ఆసక్తి కలిగింది. కథ చదువుతుంటే ఆ కథలోని కథానాయకి పై ఇష్టం ఏర్పడింది. ఆమె ఆలోచనా పరిథి లోని విస్తృతి ఆశ్చర్యం కలిగించింది.
సాధారణంగా కనిపిస్తూ అసాధారణమైన కథగా ముగియడం ఈ కథలోని విశేషం. జీవితం ఇలా కూడా ఉండవచ్చు లేదా మలుచుకోవచ్చు కదా అనిపించింది.
ఎన్నో ఆలోచనలు మనలో కదలాడుతాయి - ఆవేదన కలిగించేవి. కుటుంబ బంధాలనే సంకెళ్ళ నుండి, తన మానసిక వేదన నుండి స్త్రీ విముక్తి కోరుకోకూడదా!? అనేదే ఈ కథలో చర్చించుకోవలసిన విషయం.
స్త్రీలకూ వ్యక్తిత్వ సృహ ఉండాలన్న మేల్కొలుపు ఈ కథా నాయకి దేవకి లో కలిగింది. కలగడమే చైతన్యమైతే ఆమె నిర్ణయం పాఠకులకి ఒక విభ్రాంతిని కలిగిస్తుంది.
స్త్రీలు కుటుంబం కోసం కొవ్వొత్తిలా కరిగిపోయాను అనే ఆరోపణలు చేసుకుంటూనో లేదా అర్ధం చేసుకున్న కుటుంబ సభ్యుల మధ్య వారి సానుభూతితో బ్రతుకుతూనో ఉండాలి తప్ప తమకి ఇష్టం వచ్చినట్లు ఉండకూడదా!? తమకి నచ్చని వాటిని స్వేచ్ఛగా వ్యక్తీకరించకూడదా!!? లాంటి భావాలు పాతవే కానీ వాటిని సరికొత్తగా, ఎప్పటికీ గుర్తుండిపోయేలా రచించడం, ముఖ్యంగా కథ ముగింపులో ఓ బలమైన కెరటం ముఖాన్ని తాకిన అనుభూతిని కలిగించడంలో రచయిత్రి ప్రతిభ కనపడుతోంది.
*
ఇక కథలోకి వెళితే -
ప్రేమించి పెళ్లి చేసుకున్న దేవకి భర్త సహకారంతో ఉన్నత చదువులు చదువుకుని, ఉద్యోగం సంపాదిస్తుంది. ఇద్దరి బిడ్డలకి తల్లి అవుతుంది. వారి పిల్లల పెంపకం భర్త చేతికిచ్చి ఆమె ఆదాయ వనరుగా మారిపోయింది. అది ఎంతలా అంటే - తండ్రి గారాబంలో పిల్లలిద్దరూ తల్లి మాటను లక్ష్య పెట్టనంతగా... తల్లిని గడ్డిపోచలా తీసి పారేసేంతగా...
ప్రేమ, గౌరవం ఇవ్వాల్సిన పిల్లలే ఆమెని మానసిక వ్యాధిగ్రస్తురాలిగా ముద్ర వేశారు. క్రమశిక్షణ లేని, సోమరిపోతులైన, సంపాదనాపరులైన పిల్లల మాటతీరు, ప్రవర్తన భరించలేకపోతుంది. వారికి భర్త వంతపాడటం జీర్ణించుకోలేకపోతుంది.
ఏం చెయ్యాలో నిర్ణయించుకునే కోర్టు మెట్లెక్కింది. జడ్జితో తన ఆక్రోశాన్ని స్పష్టంగా చెప్పగలిగింది. 'తన భర్తనుండి, పిల్లలనుండి గౌరవం, ప్రేమ కావాలి అని కోరుకున్నాను, అవి లభించవని గ్రహించాను' అని చెప్పిందే తప్ప వాళ్ళని నిందించలేదు. ఈ నేల మీద నిలబడటానికి తనకి కొద్దిపాటి ఊతం చాలు అనుకోగలిగింది కనుకనే తన సంపాదన ని నాలుగు భాగాలు చేయమని కోరింది. ఆమె ఆలోచనల్లో దూరదృష్టి, ఆమె నిర్ణయంలో స్పష్టత ఉంది.
దేవకి తీసుకున్న నిర్ణయం, కోర్టులో జడ్జి గారితో ఆమె మాట్లాడిన విధం, భర్త కానీ, పిల్లలు కానీ ఆమె తీసుకున్న నిర్ణయానికి ఎలాంటి మాటలు అంటారో ఊహించడంలో ఆమె చూపించిన పరిపక్వత ... కథ చదివితే పాఠకులకి అర్థం అవుతుంది.
ఆమె ఆలోచనల్లోని పరిపక్వత నేటి ప్రతి స్త్రీలోనూ ఉండాలనిపించింది. రచయిత్రి వనజ తాతినేని గారు స్త్రీల అంతరంగాలని ఆవిష్కరించడంలో గొప్ప పరిశీలన చేశారనిపించింది. ఓ స్త్రీని మరో స్త్రీ మాత్రమే అర్థం చేసుకోగలదు అనే సత్యం మరోసారి ఋజువయింది.
పాత్ర యెక్క ప్రతి ఆలోచననూ, ఆమె తీసుకోబోతున్న నిర్ణయాన్ని పాఠకులు అర్ధం చేసుకోవడానికి అవకాశమిస్తూ వనజ గారు కథని మలిచారు.
పాఠకులకు అందాల్సిన కోణాలు మరెన్నో చర్చకు రావడానికి అవకాశాన్ని కూడా ఇచ్చారు.
కులాంతర, మతాంతర ప్రేమ వివాహాలలో స్త్రీ నిమ్న కులానికి చెందినదైతే ప్రతి భారతీయ వివాహంలో ఉండే పురుషాధిక్యతతో పాటు కుల అహంకారాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందనే సూక్ష్మమైన విషయాన్ని కథలో జొప్పించి ప్రతిభావంతంగా చెప్పగలిగారు.
ఆధిపత్యభావన, అహంకారపు ధోరణులను భరించలేక నలిగిపోతున్న ఎంతో మంది స్త్రీల ఆవేదనే ఈ కథ.
గుర్తుండిపోయే కథను రాసిన వనజ గారికి అభినందనలు. ఆమె అముద్రిత కథా సంపుటి "ఈస్తటిక్ సెన్స్" కథా సంపుటిలో చోటు చేసుకున్న మిగతా కథలను, సహరచయితల విశ్లేషణలను చదవడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
వనజ తాతినేని గారికి మరోసారి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ - రాధ మండువ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి