28, సెప్టెంబర్ 2024, శనివారం

బయలు నవ్వింది

నిమ్మ చెట్టు ఏదత్తమ్మా  అడిగింది మోహన .  ముళ్ళ చెట్టు ఉండకూడదని నిలువునా  కొట్టేసి వాడి పైత్యపు చేష్టని పదిమందికి చాటుకున్నాడు. మీ వదినకి కూడా చెప్పా ! అట్టా  పూచే పూచే వాటిని కాసే చెట్లని నరకకూడదు. ఉణ్ణీయ రాదా అని.  ఆ సంగతి నాకు తెలుసులే అంది ఆ పెడద్దరపు మనిషి. అదసలు ఆడదే కాదు వీసమెత్తు  జాలి, దయ  లేవు  ఏం చేద్దాం అంది యశోదమ్మ. వుసూరుమనిపించింది మోహనకి. పది  గజాల్లో విస్తరించి ఉండేది. ఎన్ని కాయలు కాసేది . రెండేళ్ళ నాడు వేసవి కాలంలో వచ్చినప్పుడు రాజ్యం వదిన  కాయ రూపాయకి లెక్కన అమ్మి సవర  బంగారం కొన్న సంగతి మర్చిపోలేదు.నిమ్మకాయలమ్మటమనేది  ఇంటావంటా లేనిపని  అని అత్తమ్మ చీదరిచ్చుకుంది కూడా !

ఇంటి గోడలు నెర్రలిచ్చుతున్నాయని రావి చెట్టు,  పురుగులు వస్తున్నాయని మునగ చెట్టు ,  ఈశాన్యం ఎత్తు ఉండకూడదని కొబ్బరి చెట్లు,ఉసిరి చెట్టు అన్నీ  మాయం  అయిపోయాయి.  తోటలో మాధవయ్య గారిల్లు అనే పేరుండే తమ ఇల్లు ఇప్పుడు తోటంతా  పోయి ఆరు బయలు మిగిలింది. 




కామెంట్‌లు లేవు: