#తెలుగుకథలు #వనజతాతినేని #వనజవనమాలికథలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
#తెలుగుకథలు #వనజతాతినేని #వనజవనమాలికథలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, నవంబర్ 2025, ఆదివారం

Cross roads - క్రాస్ రోడ్స్




వాట్సాప్ కి కొడుకు పంపిన వీడియో చూస్తూ “కోపం తెచ్చుకోవడం ఎందుకు? పోష్ కల్చర్ అంటే ఇంతేగా” అనుకుంది నీరజ.

అదే మాట సమాధానమిచ్చింది కొడుక్కి.

తిరిగి సమాధానంగా రెండు యాంగ్రీ ఎమోజీలు. “పర్లేదు వీడిలో ఓ సాధారణమైన మగవాడు వున్నాడన్నమాట” అనుకుంది.

పైట కాస్త పక్కకు తొలిగితే ఆఫ్ ఇడ్లీ అని కామెంట్ వినాల్సి వస్తుందేమో అని భయపడిన తరం తమది అనుకుంటూ ఆ వీడియో మరోసారి చూసింది.

కూతురు శ్రావ్య ఉలిపిరి వస్త్రాలతో అర్ధనగ్న దేహంతో ముందుకు వేలాడిల్సిన గొలుసులు వెనుకగా వేలాడుతూ వెనుక వేలాడాల్సిన జుత్తు ముందుకు వేసుకుని తాగుతూ తూలుతూ జోగుతూ అశ్లీలంగా జోక్స్ వేస్తూ ఇద్దరు యువకుల మధ్య వేలాడుతుంది. కాసేపటి తర్వాత ఆ యువకులిద్దరూ ఆమెను వెలుతురు లేని పొడవైన కారిడార్ లోకి తీసుకుని వెళుతున్నారు.

ఆ తర్వాత.. !?ఏం జరుగుతుందో ఊహించండం మానేసింది. ఆ మసక చీకట్లో దేహాలు మునకలు వేస్తూ ఏ వేకువజాముకో బాహ్య సృహలోకి తేలుతారు. సూర్యుడు తెల్లగా మారే సమయంలో ఇంటికి చేరుకుంటుంది శ్రావ్య.
కొన్నేళ్ళుగా భయపడటం దిగులుపడటం మానేసింది నీరజ. జరిగేది కళ్ళు అప్పగించి చూస్తూవుండటమే!

బ్రేక్ఫాస్ట్ చేయడానికి టేబుల్ ముందు కూర్చున్నప్పుడు “కాస్త పెందలాడే ఇంటికి వచ్చేయ్ శ్రావ్యా!” .

“ఇంట్లో ఏముంటుదమ్మా బోర్ తప్ప! పబ్ లో అయితే మ్యూజికల్ హిట్స్ తో డాన్స్ యమ్మీ యమ్మీ పుడ్, డ్రింక్స్, సరదా కబుర్లు, ఇవి కాక లైఫ్ లో అనుభవించడానికి ఏం వుంటాయి చెప్పు? తిరిగి ప్రశ్న ఆమెకే !

“ఇలా వారానికి రెండు రోజులు పబ్ ల చుట్టూ తిరుగుతూ మంచినీళ్ళ ప్రాయం లా డబ్బు ఖర్చు పెట్టే బదులు సేలరీ లో కొంత సేవ్ చేసుకోవచ్చు కదే! “

“యూ ఆర్ రాంగ్ మమ్మీ, ఆల్కలైన్ వాటర్ లా ఖర్చు పెడుతున్నావ్ అనాలి. అయినా మీ పెద్దాళ్ళంతా ఇంతే! ఇరవై లక్షలు పెట్టి డైమండ్ జువెలరీ కొని లాకర్ లో దాచుకోవాలి అనుకుంటారు. అదే మా యంగ్ మైండ్ సెట్ ఎలా వుంటుందో తెలుసా! ఆ ఇరవై లక్షలతో కారు కొని ఇంటి ముందు పెట్టుకుని ప్రెస్టీజ్ పెంచుకోమని చెపుతాం. బోడి నగలెవడిక్కావాలి? ఏవి సిల్వర్ నగలో డైమండ్ నగలో ఏవి వన్ గ్రామ్ నగలో ట్వంటీ టూ కేరెట్ నగలో ఎవడూ చెప్పలేడు.”

కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూసింది నీరజ.

కొన్నాళ్ళ తర్వాత విదేశాల్లో ఉన్న వరుడి బయోడేటా ముందు పెట్టింది చూడమని.

“పెళ్ళా!? వాట్ నాన్సెన్స్ ! నేను చేసుకుంటానని చెప్పానా? ఈ పెళ్ళి అనే లంపటం నాకొద్దు. నేనిలాగే లైఫ్ ఎంజాయ్ చేస్తాను. ఆ పెళ్ళికి అయ్యే ఖర్చులన్నీ నాకిచ్చేయ్, నేను ఫ్లాట్ కొనుక్కొని అందులోకి మారిపోతాను.

“పెళ్ళి చేసుకోక ఏం చేస్తావ్, ఇలాగే రోజుకొకడితో ఊరేగుతావా? రాజేష్ కోపంగా చెంపచెళ్ళుమనిపించాడు అక్క ని.
ఇది ఊహించని పరిణామం.

“ ఏయ్! అసలు నువ్వెవడివిరా నన్ను కొట్టడానికి, మందలించడానికి సుద్దులు చెప్పడానికీ. బి యువర్ లిమిట్స్! అంతగా కావాలంటే నువ్వు చేసుకో పెళ్ళి. అమ్మను నీ కుటుంబం తో సంతోషంగా వుంచు. నీళ్ళ గ్లాస్ ని టేబుల్ మీద వున్న మొబైల్ ని వెంట వెంటనే విసిరికొట్టింది. అదే కసితో తమ్ముడిని తిరిగి టపటప వాయించింది.

నీరజ నివ్వెరపోయి చూస్తుంది. ఇద్దరినీ వారించాలని కూడా తోచనంతగా. ఎదురుగా వేలాడుతున్న భర్త ఫోటో వంక చూస్తూ.. “పిల్లలిద్దర్ని ఎంతో క్రమశిక్షణతో పెంచాం. అడిగినప్పుడల్లా తాహతు కొద్దీ వాళ్ళ చిన్న చిన్న సరదాలన్నీ తీర్చాం. మన పెంపకంలో ఎలాంటి నిర్లక్ష్యం లేదు. చదువులు పూర్తయ్యాక ఉద్యోగాలు చేసే కాలానికి వీళ్ళిలా ఉన్మత్తంగా తయారయ్యారేంటో” .

చెరొక బ్యాగ్ తగిలించుని ఇంటి నుండి నిష్క్రమించాక పగిలిన గాజు ముక్కలు ఏరుకుంటూ ఆలోచిస్తుంది.

శ్రావ్య లాగానే ముఫ్పై పైబడిన అమ్మాయిలు పెళ్ళి అంటే సముఖంగా లేరు.ఇక విదేశాల్లో వున్న యువతీ యువకులల్లో పెళ్ళి మాటంటే చేదు మాత్ర మింగిన మొహం పెడతారు. తన పరిధిలో ఓ ఇరవైమంది ఆడమగ ఉంటారు పెళ్ళి వద్దనేవద్దు అంటున్నవారు.

ఆ మాటే ఫ్రెండ్ సుజాత తో అంటే ..” అయ్యో! వాళ్ళకు పెళ్ళి అవసరం లేని అచ్చట్లు ముచ్చట్లు అన్నీ బహిరంగంగా జరిగిపోతుంటే పెళ్ళి అనే పనికిమాలిన మాటలు, ఖర్చు ఎందుకు? అదో దండగ మారి వ్యవహారం. మనకూ పిల్లలున్నారు. ఎవరెప్పుడు ఏ ఆపద తెచ్చి పెడతారోనని భయంగా వుంది. నా ఫ్రెండ్ లక్ష్మి కూతురు శిల్ప పెళ్ళై పన్నెండేళ్లు అయినా పిల్లలను కనడం ఇష్టం లేదంటూ వాయిదా వేస్తుంటే చూసి చూసి భర్తకు విసుగు వచ్చి విడాకులు ఇచ్చాడు. ఆ పిల్ల ఇప్పుడు కెనడా నుండి వచ్చేసి ఈ నగరంలోనే వుంటుంది. ఇంకా నీ కూతురు నయం. పెళ్ళి చేసుకుని ఎవడో ఒక మగాణ్ని బకరాను చేయడం లేదు, సంతోషించు” అంది.

మనసు కలుక్కుమంది ఆ మాటకు. ఆ రోజంతా ఆ మాటనే తల్చుకుంటూ బాధపడింది. తర్వాత సుజాత నిర్మొహమాటంగా చెప్పినా నిజమే చెప్పింది లే అని సర్దుకుంది.

పెళ్ళి అంటే స్త్రీ పురుషుల మధ్య కమిట్మెంట్. చాపల్యంతో మగవాడు పక్కదారి పట్టినా కొనవరకూ బాధ్యతగా భావించేది స్త్రీ . ఆ బాధ్యతను మోయడం ఇష్టం లేని స్త్రీలు ఎక్కువైపోయారు. శ్రావ్య,రమ్య, శిల్ప .. ఇలా ఎందరో ఆ బాటలో. ఉన్నత చదువులు ఉద్యోగాలు వల్ల స్త్రీలు స్వేచ్ఛా జీవులయ్యారు. కుటుంబం కావాలనుకునే వాళ్ళు తక్కువగా స్వేచ్ఛగా బతకాలి అనుకునేవారు ఎక్కువగా.. మద మత్సరాలతో అక్రమ సంబంధాలతో ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఒకవేళ అడ్డం అనుకుంటే మట్టుబెట్టుకోవడం దాకా వచ్చింది. వివాహ వ్యవస్థ బోలుదనం అంతా బట్టబయలు అయ్యింది. ఈ వొంటరి జీవితాలు ఎక్కడ ఎలా కడతేరిపోవాలో? తల బద్దలుకొట్టినట్లు బాధ పెడుతున్న ఆలోచనలు.

గేటు దగ్గర చప్పుడైంది. కిటికీ లోంచి చూసింది. చెల్లెలు కూతురు విజేత. పక్కనే ఇంకొక యువకుడు.
పెద్దమ్మా! అంటూ దగ్గరకొచ్చి ఆత్మీయంగా హత్తుకుంది. కుశల ప్రశ్నలు వేసింది. వినయ్ అంటూ ఆ యువకుడిని పరిచయం చేసింది. అతను నీరజ పాదాలను అంటి నమస్కరించాడు.

“అమ్మ నాన్న ఎలా వున్నారు? నువ్వు ఏం చేస్తున్నావు?”

“నీకు రెండు సంతోషకరమైన విషయాలు చెప్పాలి పెద్దమ్మా” అంది. స్వీట్ బాక్స్ తీసి ఓ ముక్క తినిపించి “నేను డి ఎస్సీ లో సెలక్ట్ అయ్యాను. ఉద్యోగం వచ్చింది. మా ఊరి స్కూల్ కి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాను”

నీరజకు కళ్ళలో సంతోషం పొంగుకొచ్చింది. విజేతను హత్తుకుని ఆనందం వ్యక్తం చేసింది.

“రెండో విషయం ఏమిటంటే.. వినయ్ ని పెళ్ళి చేసుకుంటున్నాను. అమ్మ నాన్నకు ఇష్టం లేదు. ఉద్యోగం కూడా వచ్చింది. పనిపాటా లేనోడితో నీకు పెళ్ళి యేంటి అంటారు.కట్నం ఇవ్వలేదని వొదిలేసి పోయినోడ్ని మళ్ళీ నాకు అంటగట్టే ప్రయత్నాలు మొదలెట్టారు కూడా! కానీ నన్ను ఇష్టపడే వాడు మాత్రమే నాక్కావాలనుకుంటున్నాను. కులం కానివాడ్ని చేసుకుని పరువు తీస్తావా అని నాన్న చిందులు. వినయ్ వాట్లింట్లోనూ అభ్యంతరాలు. మొగుడు వదిలేసిందే కావాలా నీకు అని. నాకు ప్రేమ పెళ్ళి పెద్దలు కుటుంబం పిల్లలు అన్నీ కావాలి పెద్దమ్మా! పెద్ద వాళ్ళ అంగీకారం కోసం ఎదురుచూస్తున్నా!”

ఆశ్చర్యంగా చూసింది. ఎంత స్పష్టంగా ఉంది విజేత! ఇలాంటివారు వుంటేనే ముందు ముందు కుటుంబం వుంటుందేమో!

“మా పెళ్ళికి నువ్వు తప్పకుండా రావాలి పెద్దమ్మా” మరీమరీ చెప్పి వెళ్ళింది.

**************************

కెఫటేరియా లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరూ. రాజేష్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అంది దివ్య .
“ఏంటి మరొకసారి చెప్పు? మీ అమ్మ అక్క తో కలిసి ఆ ఇంట్లో వుండటమా? నెవ్వర్ వాళ్ళను పూర్తిగా వదిలేసి వస్తేనే నీతో పెళ్ళి. మీ అక్కని చూస్తే ఎవతైనా నిన్ను పెళ్ళి చేసుకుంటుందా? వరస్ట్ ఫ్యామిలీ అని అంటే బాధపడతావని అనడం లేదు”

రాజేష్ నొచ్చుకున్నాడు. దివ్య తో తొలి పరిచయాన్ని గుర్తు చేసుకున్నాడు.

ఓ ఫ్రెండ్ బర్త్ డే ఫంక్షన్ లో డిజె సాంగ్ కి ఊగిపోతూ.. “పుష్పకవిమానంలాంటి నా హృదయం లో ఎంతమందికైనా చోటుంది రండి రండి” అని పిలుస్తుంటే చూసాడు దివ్య ని.ఆమె ఒక వర్ధమాన గాయని. ముందుకు అడుగు వేయబోతుండగా.. ఫ్రెండ్ హెచ్చరించాడు.

“ఒరేయ్! ప్రివ్యూ ఫ్రీ గానే ఉంటుంది. తర్వాత ఆమెను భరించలేవు రా ! జాగ్రత్త” అని. అయినా వినలేదు.కుంభ కుచములు, చిరునవ్వు ఉదయించినట్లు వున్న పెదవుల పొందిక చూసి ఆకర్షణలో పడిపోయాడు. ఇప్పుడు ఆ వలలో నుండి తప్పించుకుని బయటపడలేకపోతున్నాడు. వారానికి ఒకరోజు కలిసి తిరగడం షాపింగ్ లో క్రెడిట్ కార్డు లిమిట్స్ దాటడం. అవి కట్టడానికి ఫ్రెండ్స్ నో తల్లినో దేబిరించడం. పెళ్ళి చేసుకుందాం అంటే ఏవేవో షరతులు, గొంతెమ్మ కోరికలు.

“ఏంటీ వింటున్నావా? మీ అమ్మను వొప్పించి ఇల్లు నీ పేరున మార్పించుకో. నీకు ఉద్యోగం వొకటి వుంటే సరిపోతుందా”
సరేనన్నట్లు తలూపాడు.

మరోమీటింగ్ లో .. “మీ అక్క ఏమిటి మరీ అలా తయారైంది? బాగానే సంపాదిస్తున్నట్లుంది. ఫ్లాట్ తీసుకుంది అంటగా”

నువ్వు మాత్రం తక్కువా?పీల్చి పిప్పి చేస్తున్నావ్ గా! మా అక్క ను ఎందుకు అంటున్నావు అని పైకి అనలేకపోయాడు.

“డౌన్ ఫేమెంట్ అమ్మ కట్టింది. లోను కూడా అమ్మ కడుతుంది. ఆడపిల్ల కి సొంత ఇల్లు వుండాలని మా అమ్మ తాపత్రయం.”

“ఇక మీ అమ్మ దగ్గర నుండి నీకేం రాలవన్నమాట. పోనీ మన పెళ్ళి అయ్యాకైనా ఆమె ఆ ఇల్లు వదలుతుందా లేదా?”

“లేదు, అమ్మ తర్వాతే మనకి ఆ ఇల్లు. ఆమె ఎక్కడో పైన గదిలో ఉంటుంది. నీ స్వేచ్ఛ కేమి అడ్డం కాదు, ప్లీజ్! పెళ్ళి కి వొప్పుకో దివ్యా” బతిమాలాడు.

“సారీ! మరీ ఇంత తక్కువ స్టేటస్ లో వున్న వాడిని కట్టుకుంటావా? ఆ ఫ్యామిలీ కూడా మంచిది కాదు అని మా పేరెంట్స్ అబ్జెక్షన్. బ్రేకప్ చేసుకుందామా రాజేష్”

“ఎలా చేసుకంటావ్ బ్రేకప్! నా చేత లక్షలు లక్షలు ఖర్చు పెట్టించావ్,” అరిచాడు.

“పిచ్చివాడిలా మాట్లాడకు, నీ సరదా నీది నా సరదా నాది. దట్సిట్!”

“యూ” గట్టిగా అరిచాడు. విలాసంగా నవ్వి వెళ్ళిపోయింది.

రాజేష్ దిగులుగా చేతుల్లో ముఖం దాచుకున్నాడు.

*********
అమ్మా! ఈ ఇల్లు నా పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? అలా అయితేనే దివ్య నన్ను పెళ్ళి చేసుకుంటానంటుంది” తల్లి ముఖం చూడకుండా తలొంచుకుని అడిగాడు.

నీరజ ఆశ్చర్యపోలేదు.ఊహించిన విషయమే!

“ఇలా అడిగేనని ఏమీ అనుకోకు. దివ్య అంటే నాకు చాలా ఇష్టం అమ్మా! ఆమె లేకుండా నేను బతకలేను” ముక్కు ఎగబీలుస్తూ అన్నాడు.

“శ్రావ్య తనకు నచ్చినట్లు తను బతుకుతుంది.దాన్ని మార్చలేం. రేపటి గురించి ఆలోచన లేదు. తనకో రక్షణ ఉంటుంది అనో ఒక ఆధారం అంటూ వుండాలనో ఆ ఇల్లు కొనిపెట్టాను. అదీ నా పేరుతోనే వుంది. ఇదీ నా పేరుతోనే వుంది. నా తర్వాత మీ ఇద్దరికీ కనీసం చెరొక ఇల్లు వుండాలని నా తాపత్రయం.”

ఆ మాటలు నచ్చనట్లు చిరాకుగా చూసాడు రాజేష్.

దివ్య మనస్తత్వం చాలా ప్రమాదకరమైనది. భవిష్యత్తులో ఆమెతో నీకు కష్టాలు వస్తాయి నాన్నా! అని అనునయంగా చెప్పాలనుకుంది. ఆ చెప్పడం వల్ల వచ్చే వ్యతిరేకత ఏమిటో కూడా తెలుసు గనుక మౌనంగా భోజనం ముగించింది..

నీరజ తన గదిలో పడుకుని ఆలోచిస్తుంది.ఎటూ తేల్చుకోలేకపోతుంది. రాజేష్ ని తన తమ్ముడు కూతురు శ్రీ వల్లి ని చేసుకోమని బతిమాలింది. ఆ పల్లెటూరు పిల్ల నాకొద్దు అన్నాడు. శ్రీవల్లి ఇంజినీరింగ్ చదివింది. అమెరికా పిల్లాడొకడు వచ్చి ఆ పిల్లను ఎగరేసుకుని వెళ్ళాడు. ఎవరి రాత ఎవరు మార్చగలరు? శ్రీవల్లి పెళ్ళి పీటల మీద కూర్చుని ఎంత గర్వంగా చూసింది రాజేష్ వైపు.

ఒకవిధంగా శ్రావ్యలో స్పష్టత వుంది.స్పష్టత లేనిది రాజేష్ లోనే! ఒకోసారి దివ్య లేకపోతే బతకలేను అంటాడు. మరోసారి నన్ను పూర్తిగా బికారిని చేసి అది జంప్ చేస్తుంది అంటాడు.

నిజమే! ఎన్ని వినడం లేదు!! ఈ తరం పిల్లలు కొందరు పచ్చి స్వార్థపరులు. కని పెంచిన తల్లిదండ్రులు దగ్గర వున్నదంతా ఊడ్చి పెట్టి అప్పులు చేసి విదేశాలకు పంపిస్తే అక్కడే ఉద్యోగం సంపాదించాక ఏళ్ళ తరబడి తల్లిదండ్రులు లతో మాట్లాడకపోవడం. ఫోన్ నెంబర్ తెలియనీయకుండా జాగ్రత్త పడడం. తల్లిదండ్రులు నానా అగచాట్లు పడి వారి క్షేమ సమాచారం తెలియక తల్లడిల్లి ఎలాగోలా నెంబర్ తెలుసుకుని కాల్ చేస్తే వాళ్ళ నెంబర్ బ్లాక్ చేసుకొని తమ అడ్రస్ కూడా తెలియకుండా జాగ్రత్త పడటం. లగ్జరీ లైఫ్ స్టైల్ తో తనకు నచ్చిన వాడితో సహజీవనం చేయడం. తాను సంపాదించిన ప్రతి డాలర్ తమకే ఖర్చు చేసుకోవాలనే స్వార్థంతో ముఖం చాటేయడం. తల్లితండ్రుల ప్రేమను రక్తసంబంధాలను అపహాస్యం చేయడం.

కొందరు తల్లిదండ్రులేమో పిల్లలను డబ్బు కోసం పీక్కుతినడం మామూలైంది.మొత్తంగా మనుషులే స్వార్థంగా మారిపోయారు.

యవ్వనదశలో వున్నవాళ్ళంతా రకరకాల వ్యసనాలకు బానిసలై మీదు మిక్కిలి వ్యామోహాలతో గతి తప్పి పోతున్నారు. కొంతమందికి కెరీర్, కొంతమందికి డబ్బు పవర్. మద్యం, మగువ, మజా.ఇలా అనేక రకాలుగా. జీవితం ఏ వైపుగా నడుస్తుందో తెలియని పరిస్థితిలో అయోమయానికి లోనవుతూ.. కూడలిలో నిలబడుకుని వున్నారు చాలామంది.
ఈ నిలబడుకోవడం వెనుక వర్తమాన సామాజిక ఆర్ధిక పరిస్థితులు రాజకీయ కోణాలు లేవా? ఇల్లు పెళ్ళి పిల్లలు స్కూల్ హాస్పిటల్ ఆఫీస్.. అన్నీ రాజకీయమే!

స్పష్టంగా కొంత, అస్పష్టంగా మరికొంత. అర్హత వుంటే ఏ రంగంలోనైనా ఉపాధి అవకాశాలు వుంటాయి. పెళ్ళిళ్ళు వద్దంటే కుటుంబరంగం మాయమై పోవడమేనా? ముందు ముందు గృహిణి ఉద్యోగం మాయమైపోతుందా? భలే! వినడానికి ఆలోచించడానికి కొత్తగా వుందీ విషయం. గట్టిగా నవ్వుకుంది. అంతలోనే విజేత, శ్రీవల్లి లాంటి వారు మదిలో మెదిలారు.

********
రాజేష్ డాక్యుమెంట్ రైటర్ తో మాట్లాడుతున్నాడు గిఫ్ట్ డీడ్ అని రాస్తే ఎంత ఖర్చు అవుతుంది అని, పేపర్స్ రెడీ చేయమని. శ్రావ్య వారం రోజులైంది ఇంటికి వచ్చి. శ్రీలంక ట్రిప్ లో వున్నానని. రోజుకొక మెసేజ్. అప్పుడప్పుడు వాట్సాప్ లో ఫోటోలు.

ఏమీ తేల్చుకోలేకపోతుంది. తను కూడా ఇప్పుడు కూడలిలో నిలబడి వుంది. కూతురికి తన అవసరం లేదు. కొడుక్కి తన అవసరం లేదు. ఇద్దరికీ తన వద్ద ఏం వుందో అది కావాలి. తక్షణం ఇచ్చేయాలి. తనకేది దారి!?

పిల్లలను వారి స్వేచ్ఛ కు వారిని వదిలేస్తూనే తన సర్వస్వాన్ని వారికి అప్పగించడం లేదా వారి పాటికి వారిని వదిలేసి తన భద్రతను తాను చూసుకోవడం.

పిల్లలకేనా స్వేచ్ఛ!! తల్లిదండ్రులకు స్వేచ్ఛ వుండకూడదా! తీసుకోలేరా!?

శ్రావ్య పదే పదే అనే మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి. “ఒక వయస్సొచ్చాక పిల్లల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు , వదిలేయాలి”

“నిజమే! వారిని గూటి నుండి ఎడ తోలాలి, ఎల్లెడలా తన రెక్కల కింద సంరక్షించాలని అనుకోకూడదు. వారి గూడు వారే నిర్మించుకోవాలి.తనకెందుకు ఈ తాపత్రయం!? రివర్స్ ప్రొవిజనింగ్! సామానంతా పై గదిలోకి మార్చేసింది. రెండు ఇళ్ళకు టు లెట్ బోర్డు పెట్టకుండానే పరిచయస్థులకు అద్దెకు ఇచ్చింది.

పెయిడ్ సీనియర్స్ లివింగ్ లో చేరిపోయింది. రోజూ ఫోన్ ఇరవైసార్లు అయినా మోగుతోంది. చిద్విలాసంగా నవ్వుకుంటూ సైలెంట్ మోడ్ లోకి మార్చేసింది. కథ ఇంకా మిగిలేవుంది.

**************సమాప్తం*************

సారంగ వెబ్ పక్ష పత్రిక  2025 నవంబర్ 15 ప్రచురితం. 




6, అక్టోబర్ 2025, సోమవారం

కలవరమాయే మదిలో

ఇటీవల రాసిన 3 కథల్లో మొదటి కథ చదవండీ..

 కలవరమాయే మదిలో    - వనజ తాతినేని.(ప్రజాశక్తి స్నేహ ఆదివారం సంచికలో 05/10/2025 న ప్రచురింపబడిన కథ)


ఎలా వున్నావు ! చూడాలనిపిస్తుంది. ఎంత కాలం స్టేటస్ అప్డేట్ ల్లో చూసుకుని కొండంత అండ ఏనుగంత బలం అనుకుందాం? ఒక్కసారి వచ్చిపో.. 


నిద్ర రావడంలేదు.పుస్తకం చేతుల్లో పట్టుకుని మోసే ఓపిక లేదు, స్క్రీన్ కి కళ్ళు వొప్పగించడమే. వృద్దాప్యం ముంచుకొచ్చే సూచన నిద్ర తగ్గిపోవడం అనుకుంటున్నా కానీ ముఖ్య కారణం మాత్రం స్క్రీన్ టైమ్. ఏం చేయను మరి!?  గతకాలపు చేదు తీపి జ్ఞాపకాలతో వర్తమానం యెలా వుంటుందో తెలియని అయోమయంలో యీ రోజు  నిరాశగా గడుస్తుంది. ప్రతిరోజూ ఇలాగే గడుస్తుంది. ఏ ఆలోచనలు లేని ఖాళీ బుర్ర. ఇంకేం చెప్పను!? 


నీకో సంగతి చెప్పనా! నవ్వకూడదు, అందం యెంత తగ్గిందో అని కాదు కానీ యెలా వున్నానో చూసుకోవాలని అద్దం చేత్తో పట్టుకున్నాను.  ఎడమ కనుబొమ లో తెల్ల వెంట్రుక చూసి ఉల్కిపాటు. ఎందుకో మనసు అంగీకరించడం లేదు వయస్సై పోతుందని. నా వయస్సు ఇరవై యెనిమిది దగ్గర ఆగిపోయి ఇరవై యేళ్ళైంది. నా మనస్సేమో నిండు యవ్వనంతో జీవన లాలసతో కొట్టుమిట్టాడుతుంది. ఏదో చేయాలని ఆశ, చేయలేని అసక్తత. కొన్ని జన్మలింతే! 


“ఇంకేం కావాలి నీకు? భర్త లేకపోయినా సమర్ధవంతంగానెట్టుకొచ్చావ్!   పిల్లలిద్దరూ చక్కగా సెటిల్ అయ్యారు. వాళ్ళను చూసుకుంటూ “కృష్ణ రామ”  అనుకుంటూ   గడిపేయడమే!” అని చెప్పే హితోక్తులు ఇనుప సంకెళ్ళే!.  వీళ్ళకూ వాళ్ళకు  చెప్పానా నాకేం కావాలో! నా మనసులో ఏముందో యెవరికైనా చెప్పానా!? కనీసం నీకైనా!  Freedom is the ultimate luxury.  దాన్ని కాపాడుకోవడం విజ్ఞత.  సదా ఆ పనిలోనే వుంటాను కదా! ఎవరికో సంజాయిషీలు యెందుకివ్వాలి?. 


“ఒక్కసారి వచ్చిపో!  కళ్ళ నిండుగా నిన్ను చూసుకోవాలి.  నా జీవితకాల ప్రేమికుడా! వస్తావుగా! ఎదురు చూస్తూ వుంటాను “ సెండ్ ఆప్షన్ నొక్కుతూ వుండగా నిస్త్రాణంగా కళ్ళు మూతలు పడ్డాయి.


*******************


కాలింగ్ బెల్ మోగింది. అతనే అయి వుంటాడు. చీర సర్దుకొని ఉత్సాహం కొని తెచ్చుకుని తలుపు తీసాను. కళ్ళనిండుగా కనిపించాడు. లోపలికి ఆహ్వానించా. ఏవో కానుకలు తెచ్చాడు. అతిథి మర్యాదలు చేయబోయి ఓపికలేక కూర్చుండి పోయా.


ఎలా వున్నావ్! గుండెను చీల్చి గుండె పెట్టినట్లు వుంది పలకరింపు.


సమాధానం బదులు దుఃఖం ముంచుకొచ్చింది. అతను చేతులు చాచాడు. ఒక్క ఉదుటున అతని హృదయం పై తలవాల్చి వెక్కి వెక్కి యేడ్చింది.బేలగా యేడ్చింది. ఘనీభవించిన దుఃఖం అంతా కరిగి నీరై కాల్వలు కట్టేలా యేడ్చింది. హృదయంలోని భారమంతా తీరిపోయేలా యేడ్చింది. ఆ అరగంటసేపు అతను యేమీ మాట్లాడకుండా  వెన్ను సవరిస్తూ తల నిమురుతూ సాంత్వన కలిగించాడు. 


 హేయ్ పిచ్చీ! ఇది నువ్వే నా అసలు ? ఏమిటీ బేలతనం. మరీ ఆరోగ్యం బావుండలేదా ఏమిటీ?  సోఫాలో కూర్చోబెట్టి పక్కనే కూర్చుని చేయి అందుకున్నాడు. జ్వరం కూడా  బాగా వుందే అనుకుంటూ నుదుటిని కూడా తాకి చూసాడు. 


 డైనింగ్ టేబుల్ పైన పెట్టిన టాబ్లెట్స్ ని పట్టి పట్టి చూసి..జ్వరానికి వేసుకునే టాబ్లెట్ తీసుకుని నీళ్ల సీసా కోసం వెతికాడు.అతనికి ఈ ఇల్లు కొత్త. వంటిల్లు ఏదో వెతుక్కొని సీసాలో నీళ్ళు నింపి తెచ్చాడు. 


ముందు ఈ టాబ్లెట్ వేసుకో.. కొద్దిగా ప్రెష్ అయితే హాస్పిటల్ కి వెళదాం. బుద్దిమంతురాలిలా మందు వేసుకున్నాను. స్వయంగా కాఫీ కలిపి తాగించాడు. అందని చోట వచ్చిన భుజం నొప్పికి మందు రాసాడు.బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లి పడుకోబెట్టాడు. కాళ్ళనొప్పులకు కొబ్బరి నూనె రాసి మసాజ్ చేశాడు. జ్వరం తగ్గేవరకు  నా తల తన ఒడిలో పెట్టుకుని కూర్చున్నాడు. నేను స్నానానికి వెళితే పక్క శుభ్రం చేసి బెడ్ షీట్ పిల్లో కవర్లు మార్చాడు. సూప్ చేసి తాగించాడు. ఇంకో డోస్ మందు వేసి పడుకోబెట్టి తాను తెచ్చిన లిల్లీ పూలగుత్తులను ప్లవర్ వాజ్ లో అమర్చాడు. గదంతా సన్నటి పరిమళాలు వెదజల్లుతూ ఉండగా నేను నిద్ర లోకి జారుకున్నాను.


ఒళ్ళు నొప్పులు మొదలయ్యాయేమో కాళ్ళు చేతులు వేళ్ళు విరుచుకుంటూ మూలుగుతూ వుంటే. కాళ్ళు చేతులు నొక్కుతూ వుండిపోయాడు. రెండు గంటల తర్వాత  జ్వరం తగ్గింది.  యాపిల్ ముక్కలు తినిపించి దుప్పటి కప్పి  వెళ్ళడానికన్నట్టు  లేచాడు. చప్పుడుతో  కళ్ళు తెరిచి చూసి . దగ్గరగా రమ్మని చేతులు చాచాను. అతను నా చేతుల్లో వాలిపోయాడు. పన్నీరా కన్నీరా తేడా తెలియలేదు ఇద్దరికీ. అతని స్పర్శ లోని ప్రేమ నిండిన తడి నన్ను చల్లబరుస్తుంది. ఉద్వేగంతో వొణికిపోతున్నాను. కళ్ళు తెరిచి చూస్తే..అతను సముద్రపు అలలా నను  ముంచేస్తున్నాడు. నేను నదిలా కరిగిపోతున్నాను కలిసిపోతున్నాను. సహజంగా అతను తనలోకి లాక్కుంటున్నాడు. ఉధృతి తగ్గి వేగంగా వచ్చిన అల నెమ్మదిగా వెనక్కి మళ్ళిపోతుంది. ఆ అల నన్నూ లోపలికి లాక్కెళుతుంది.మెల్లగా చల్లగా లోతుగా. ఎంత హాయిగా వుందీ సముద్రం. ఇది చాలు.. ఇది చాలు అనుకుంటూ.. సుఖానుభూతితో కూడిన మైకంలో మునిగి పోయాను..


శబ్దాలేవో వినబడుతున్నాయి.  కళ్ళు తెరిచి చూస్తే  చుట్టూ వెలుగు. సముద్రంలో నుండి మర్మైడ్ లేచినట్లు తేలికగా లేవబోయాను. బెడ్ పై కూలబడి పోయి అయోమయంగా చూసాను. మరికొద్ది సేపటికి తెప్పరిల్లాను. నేను కలలో నుంచి మేల్కొన్నానని అర్థమైంది.  నిరాశ నిండిన నోటి వెంట పావురం మూలుగు లాంటి శబ్దం వెలువడింది. బెడ్ పై మళ్ళీ కూలబడ్డాను.

ఎందుకీ కల!?  తెగ కలవర పడిపోయాను. తీరని లోపలి వాంఛలే కలలు అన్నాడు ఫ్రాయిడ్.

నిజమేనేమో! 


నాలో ఏమో నవరస రాగం పిల్లన గ్రోవి వూదింది

మోహాలేవో మోసులు వేసి ఊహాగానము చేసే

కలవరమాయే మదిలో నా మదిలో


***********************


చిలక పలుకుల కాలింగ్ బెల్ మోగుతుంది. ఒకటి, రెండూ, మూడు, నాలుగుసార్లు. ఓపిక చేసుకుని అతి కష్టం మీద తలుపు తెరిచింది. ఇంటి యజమాని తో పాటు అతను. 


నీరసం మగత నిండిన నా కళ్ళల్లో ఆశ్చర్యం.


“నువ్వు రమ్మని పిలిస్తే రాకుండా వుంటానా” కళ్ళతోనే అతని జవాబు. 


ఎవరితను? అన్న ప్రశ్నతో పాటు ఇంటి యజమాని అనుమానపు చూపు. 


“మా బంధువులే లెండి” అతను లోపలికి రాగానే గ్రిల్ గేట్ మూసింది. తన అనుమానపు ఆసక్తి చూపులతో మా ఇరువురిని కలిపి కడిగేసి మళ్ళొకసారి జాడించడానికి వస్తానన్నట్టుగా చూసి అయిష్టంగా లిఫ్ట్ వైపు నడిచాడు ఇంటి యజమాని. 


“ఎలా వున్నారు!? ఒంట్లో బాగోలేదనిపించింది. వెంటనే వచ్చేసాను”  ఏ మాత్రం మర్యాద హద్దులు దాటని పురుషోత్తముడి పలకరింపు. 


“ఊ.. పర్వాలేదు” 


అతిథి సత్కారాలు అవసరం లేని మనిషి అయిపోయాడు క్షణంలో. చేయందుకున్నాడు తన రెండవ చేతిని  కలిసిన ఆ కరచాలనం పై  వుంచి ఏదో తెలియని భద్రత భరోసాన్ని కలిగించాడు. నుదుటిపై చేయి వేసి జ్వర తీవ్రత ను లెక్కించాడు. 


“ఎన్ని రోజుల నుండి యిలా?  హాస్పిటల్ కి వెళ్ళలేదా?” 


“ చిన్న జ్వరమే, బ్లడ్ టెస్ట్ కి ఇచ్చాను. వచ్చాక వెళ్తానులే “ 


‘’ చిన్నవే అని కొట్టి పడేయటం నీకలవాటు” 


వెలుపలి ద్వారం వద్ద మళ్ళీ అలికిడి. అతనే వెళ్ళి చూసాడు. ఈ సారి ఇంటి యజమానురాలు. 


‘’ చుట్టాలొచ్చారుగా, పాలు వున్నాయో లేవో నని వచ్చాను’’


“ప్రిడ్జ్ లో రెండు మూడు పేకెట్ లు వున్నాయండీ. వద్దులెండి’’


“అదేలే, ఇన్నేళ్ళలో యెప్పుడూ రాని కొత్త చుట్టం లా వున్నాడు ఈయన అని మా ఆయన చెపితే, ఎవరో అని చూసి పోవడానికి వచ్చాను’’ 


చూసావు కదా! నా పరిస్థితి  అన్నట్టు చూసాను అతని వైపు. 


అతను యే వరుస బంధువో అసలు బంధువో కాదో తెలుసుకుని తీరాలన్నట్లు అక్కడే తచ్చాడుతూ.. ‘’ అంత మరీ బాగోకపోతే మీ అక్క కో అన్నయ్య కో ఫోన్ చెయ్యక పోయారా, లేకపోతే రమ్మంటే నేనైనా తోడు వచ్చేదాన్ని హాస్పిటల్ కి” 


“ చేసానండీ, అన్నయ్య కాసేపట్లో వస్తానన్నాడు “ అని చెప్పాక కానీ ఆమె కదల్లేదు. 


‘’ రక్షణ వ్యవస్థ పటిష్టంగా వుంది” నవ్వాడతను. 


“మరేమనుకున్నావు” తోడుగా నవ్వింది.


అతని వైపు దీర్ఘంగా చూసింది. ఇది చాలు అన్నట్టు చూసింది. కృతజ్ఞతగా చూసింది. ఇంకేం లేదన్నట్టూ చూసింది. 


అతను లేచి నిలబడ్డాడు. వస్తాను అన్నట్టు కళ్ళల్లోకి  చూసి చేతిని అందుకుని రెండు హస్తాల మధ్య మృదువుగా బిగించి వదల్లేక వొదిలాడు.  రాత్రి తాలూకు కల గుర్తొచ్చింది. కలవరపడింది.అతన్ని కాసేపు వుండు అని అనకుండా త్వరితంగా లిఫ్ట్ వరకూ వచ్చి వీడ్కోలు పలికింది. 


తీరా అతనెళ్ళాక నా  ప్రాణం అతను తీసుకుపోయినట్లు  నిస్సత్తువుగా బరువుగా అడుగులు వేస్తూ ఇంట్లోకి వచ్చి ద్వారం తలుపులు మూసి   బోల్టు బిగించి తలుపుకి ఆనుకుని నిలబడి.. “అసలెందుకు అడిగానూ అతన్ని, ఒక్కసారి వచ్చిపో! “అని  ప్రశ్నించుకుంది. 


ఊగిసలాడకె మనసా! నువ్వు ఉబలాట పడకే మనసా! SP శైలజ గొంతు యేళ్ళ తరబడి  నరనరాన ప్రవహించే నెత్తుటి చుక్కలో కలిసిపోయి నాట్యం చేస్తుంది. అర్ధం లేని అనుమానం యేదో పీడిస్తూ అతన్ని దూరం పెడుతుంది. మళ్ళీ కావాలనుకుంటుంది. ఊగిసలాడే మనసు తీరని ఆశను పట్టుకుని వేలాడే మూర్ఖురాలు.

 

చుట్టూరా వెరపు లేని సహజీవనం కాలం నడుస్తోంది. వంటరైన వృద్దుల వివాహాలు జరుగుతున్నాయి. నాకు మాత్రం మనసైన స్నేహితుడు  ఇంటికొచ్చి వొక అరగంట గడిపే వీల్లేదు. అయినవాళ్ళ  పరాయివాళ్ళ మోరల్ పోలీసింగ్. కన్నీరు ముంచుకొచ్చింది. అనారోగ్యంగా వున్న తను ఓ ఆత్మీయ స్పర్శ కోరుకోవడం తప్పెలా అవుతుంది?  . 


ఎవరికి ఎవరు సొంతమూ ఎంతవరకీ బంధం!? తెప్పరిల్లింది. మనస్సు దృఢం చేసుకోవాలనుకుంది.  


భారంగా..ఓ నిట్టూర్పు విడిచి కూతురి పురిటికి హాస్పిటల్ కి వెళ్లడానికన్నట్టు సదా  సిద్ధమై వుండే తల్లి లా యెప్పుడూ సిద్ధంగా వుంచుకునే  బేగ్ ని తీసి బయట పడేసి స్నానానికి వెళ్ళింది. 


హాస్పిటల్ ఫైల్ తీసుకుని డెబిట్ క్రెడిట్ కార్డ్ లు పెట్టుకుని  ఫోన్ చూసుకుంటూ బేగ్ తీసుకుని  లిఫ్ట్ వద్దకు వచ్చింది.ఫస్ట్ ప్లోర్ నుండి పైకి వచ్చిన ఇంటి యజమానురాలు. ఆమె ప్రశ్నలకు తావివ్వకుండా..


“హాస్పిటల్ కి వెళుతున్నాను. మా వాళ్ళు యెవరైనా వస్తే క్యూర్ హాస్పిటల్ కి రమ్మని చెప్పండి”  


బుక్ చేసిన ఆటో కోసం ఎదురుచూస్తూ వాట్సాప్ మెసేజ్ లు చూసుకుంటూ.. భృకుటి ముడిచింది.


“ఆటో రావడం ఆలస్యం అవుతుందేమో!  హాస్పిటల్ దగ్గర నన్ను దించమంటారా?” వెనుక వాచ్ డాగ్ లా నిలబడి వున్న ఇంటి యజమాని. 


కాచుక్కూచుని వుంటాడు అంట్ల వెధవ! మనసులో తిట్టుకుని..

“ వద్దండీ, ఆటో వచ్చేస్తుంది. అన్నట్టు మీ అమ్మాయి ఇంట్లోనే వుందా?” 


అదేం ప్రశ్న?  అయినా మా అమ్మాయి సంగతి మీకెందుకన్నట్టు చూసి.. “ఇప్పుడెందుకు ఇంట్లో వుంటుంది కాలేజ్ కి వెళ్ళింది” అన్నాడు దబాయింపుగా. 


“ ఏం లేదు, రాత్రి నాకు తాను వున్న లొకేషన్ షేర్ చేసింది. ఎక్కడో సిటీకి దూరంగా వుంది అది. ఆ మెసేజ్ యిప్పుడే చూసాన్నేను. ఇంటికి వచ్చిందా లేదా ఏదైనా ప్రమాదంలో వుందేమోనని చెపుతున్నా” 


ఇంట్లోకి పరిగెత్తాడు. వెంటనే భార్యతో పాటు బయటకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆమె కూతురు పెట్టిన మెసేజ్ చూపించమని అడిగింది. ఆయన  చెప్పలేని భాష లో  భార్యనూ,  కూతుర్ని తిడుతూ వుండగా.. ఆటో వచ్చింది. ఎక్కుతూ అంది.


 “ఇరుగు పొరుగు కదలికలపై చూపే శ్రద్ధ, యెవరింటికి యెవరొచ్చారో,  యెవరు -యెక్కడికి వెళుతున్నారో తెలుసుకోవడం మానేసి  మీ  గూఢచర్యం మీ పిల్లల పై పెట్టండి.వాళ్ళు కనీసం సేఫ్ గా నైనా వుంటారు. అన్నట్టు మీ అమ్మాయి పంపిన మెసేజ్ మీకు ఫార్వార్డ్ చేసాను. ఇక పై నన్ను విసిగించకండి”  ఏళ్ళ తరబడి భరించిన చిరాకు మొహమాటం ఆ క్షణంలో బద్దలైంది.  


ఆటో ఆగేటప్పటికే  అప్పటికే సిద్దంగా వున్న నర్స్ బేగ్ అందుకుంది. మరో నర్స్ మళ్ళీ బాగా వత్తిడికి గురయ్యారా? ఆస్ధమా ఎటాక్ చేసింది?” అని ఆరా తీసింది బిపి పరీక్షిస్తూ.


“లేదు, ఒక వారం రోజులైనా మీతో సేవ చేయించుకోవడానికి మనసైంది”అన్నాను.


జాలిగా చూస్తూ.. “రూమ్ సిద్ధం చేయమంటారా?”


“ఊ” 


వరుసలో నిలబడిన మరో పేషంట్  టెంపరేచర్ బిపి చూస్తూ..“పిల్లలేమో విదేశాల్లో,  ఈమె పుట్టింటికి వచ్చినట్లు అప్పుడప్పుడూ యిక్కడికి  వచ్చి నయం చేయించుకుని వెళుతుంది.  


ఇకపై యీ మాటలు వినడం కూడా అలవాటు చేసుకోవాలి కాబోలు అనుకున్నాను. 


ఇదే హాస్పిటల్ లో జనరల్ ఫిజీషియన్ డాక్టర్ సరస్వతి నా  స్నేహితురాలు.

నన్ను చూడగానే “ఏమిటీ అవతారం! బాగోకపోతే వెంటనే రావు. మానసిక ఒత్తిడి కారణంగా కూడా ఆస్త్మా పెరుగుతుంది అని చెప్పాను కదా!” అంటూ ఆక్సిజన్ పెట్టమని తొందర చేసింది.సీనియర్ పల్మనాలజిస్ట్ ని పిలిపించి చూపించింది. మందులు తెప్పించి  ప్రత్యేకంగా నర్స్ నియమించి. రౌండ్స్ కి వెళ్ళిపోయింది. ఓ పి ముగిసిన తరువాత వచ్చి పక్కనే కూర్చుంది.మూడు గంటల పాటు ఆక్సిజన్ అందిన తర్వాత తెరిపి గా ఉంది ప్రాణం. 

 

“ ఏం ఆలోచిస్తున్నావ్! ఇంకా పిల్లలు, బంధువులు గురించేనా!? మనసు విప్పి చెప్పవే! మా తల్లి వి కదూ!  లాలనగా అడిగింది. 


సైగ చేసాను.  రాసి చూపిస్తానని. పెన్, పేపర్ అందించింది సరస్వతి. 


“సరూ! నా భర్త చనిపోయాక నన్ను నేను చాలా  కుదించుకున్నాను. బిరడాలో బిగించుకున్నాను. ఎవరితోనైనా అదీ అభిరుచులు  కలిసిన వాళ్ళతో నైనా ఎక్కువ  మాట్లాడితే  అది స్నేహమే అయినా కూడా తప్పే అయింది. లోకుల అవాకులు చెవాకులు బిడ్డల చెవిన పడకూడదు అని. 

సత్యమేమిటో తెలియజాలని బిడ్డల మనసు కల్లోల సముద్రంగా మారుతుంది అని. అయినా అపవాదు కాటు నుండి తప్పించుకోవడం సాధ్యం కాలేదు. ఇప్పుడేమో పిల్లలు దూరంగా. నన్నేమో ఒంటరితనం అభద్రతాభావం రాకాసి లా చుట్టేస్తోంది. నేనేం చేయను? 


చదివిన సరస్వతి తలెత్తి చూసింది. 


అపరాధి లా తలొంచుకున్న నన్ను చూసి జాలిపడింది. 


“ఇంకా నీ మనసులో ఏదో ఉందే! అది కూడా చెప్పు!  నేను తెలుసుకుని తీరాలి.”


“ఏం లేదు.” తల అడ్డంగా ఊపింది. 


ఊహూ! . చెప్పాల్సిందే! మొండి పట్టు పట్టింది.


కొంచెం రిలాక్స్ గా కూర్చుని హాస్పిటల్ ఫైల్ వొత్తుగా పెట్టుకుని మనస్సంతా అక్షరాల్లో కూర్చింది.. 


“చెవి ఒకటి ఒగ్గి నా హృదయ ఘోష ని  వినేవాడు 

గడ్డకట్టిన మౌనాన్ని చూపుల విల్లంబుతో చేదించినవాడు 

అనివార్య అవసరాల్లో తోడుగా నిలిచినవాడు. 

నా చెవి లోపలి చెవి నా లోపలి స్వరం అతను. 

అతని సమక్షంలో నేను అన్నీ మర్చిపోతాను. 

పసిపాపలా మారిపోతాను. 

అతను కావాలని నాకు  బలంగా అనిపిస్తుంది. 

ఫిజికల్ నీడ్ కాదు, అచ్చంగా కూడా కాదు.

అప్పుడప్పుడు మాత్రమే! మనస్సు దాహంతో అలమటిస్తుంది.

అది ప్రేమ దాహార్తి.  


ప్చ్ !  కానీ అది యెన్నటికీ సాధ్యం కాదు సరూ!  


“ఎందుకు సాధ్యం కాదు,అతనితో నేను మాట్లాడనా! డాక్టర్ గా మాట్లాడతాను” 


 “వద్దులే, వదిలేయ్”. 


“అతనెవరో నాకైనా చెప్పవా మరి.”


 “ ఊహూ! చెప్పను,  


బలవంతం చేయలేదు సరస్వతి. “ ప్రశాంతంగా వుండు, మళ్ళీ రాత్రి కి ఇంటికి వెళ్ళేటప్పుడు వస్తాన్లే!”  


వెనుక నుండి స్నేహితురాలిని చూస్తూ మనసులో మూగగా అనుకున్నాను. “సరూ! అతను నీ భర్త సాగర్  అని నీకెలా చెప్పనూ?” నో నెవ్వర్!! ఇంకోసారి నీతో యుద్ధం చేయలేను. నేను అనేక రకాలుగా నీకన్నా బలహీనురాలిని. 


కానీ ఒకటి మాత్రం నిజం. నా జీవితానికి మాత్రం నిన్న రాత్రి వచ్చిన కల చాలు!  

కలలు కాఫీ లాంటివి. జీవితానికి stress buster 

కల వరమాయె మదిలో నా మదిలో. హమ్ చేస్తున్నాను.


రాత్రి ఎనిమిదిన్నరకి  సరస్వతి  వచ్చింది.  వేడి వేడి ఇడ్లీ తక్కువ కారం తో స్వయంగా తినిపించింది. వెళ్ళబోతూ మళ్లీ అడిగింది. “ఎవరే అతనూ.. చెప్పవూ! . 


తల అడ్డంగా ఊపాను. 


“కొంపదీసి అతను మా ఆయన కాదు కదా! రెండో ఇన్నింగ్స్ లో కూడా మా ఆయన్నే ప్రేమించానని చెప్పేవనుకో.. అస్సలూరుకోను. ఫ్రెండ్ వని కూడా చూడకుండా ఏ ఇంజెక్షెనో యిచ్చి చంపేస్తాను.’’ బెదిరించింది. పిడుగు పడినట్లుగా చూస్తున్న నాతో  “ఆయనే కావాలని ఎంతో కష్టపడి పోటీపడి డాక్టర్ ని  అయ్యాను. ఆయన కుటుంబానికి  బోలెడంత యెదురిచ్చి ఆయన్ని  దక్కించుకున్నాను మరి.”  నవ్వుతూనే మాటలంటించింది.  


గతుక్కుమన్నాను. నల్లబడిన నా ముఖం కనిపెట్టకుండా చేయి అడ్డం పెట్టుకుని రాని దగ్గు దగ్గాను.

తనకు కావాల్సిన దాని కోసం యెంతకైనా తెగించే సరస్వతి ని నేను మర్చిపోతే కదా! మా తొలివలపుల  తెప్పను నిర్ధాక్షిణ్యంగా  ముంచేసి  సాగర్ ని తన బోట్ లోకి లాక్కోవడం ఆమె నాకు చేసిన అన్యాయం కాదూ! సాగర్ కి  ఆ సంగతి బాగా తెలుసు. ఇంకెప్పుడూ.. నావైపు నుండి అతనికి   “ఒక్కసారి వచ్చిపో” అన్నమాట జారకుండా గుండెను ఇనుప గుండెగా మార్చుకోవాలి. ఇనుప గుండెకు ఏ రక్షణ కవచం అవసరం లేదు ఏ తూటా గాయపర్చలేదు. మహా అయితే తుప్పు పట్టి శిథిలం కాగలదు.  


………………………………0……………………………..……










 

1, మార్చి 2025, శనివారం

నువ్వు - నేనూ -కనకాంబరం



 నువ్వు నేనూ - ఓ కనకాంబరం.   -వనజ తాతినేని


“సావేరి”  నేనొక స్వర విపంచిని. 


పాట వినిపించే మానసిక స్థితి కాదు నాది. పోనీ, కథ చెప్ప మంటారా! కథ కేమి తక్కువ!? బ్రతుకు కథ చెబుతాను, వేయి కథలతో పాటు.


ఒక్కో కథకి మూలం ఒక్కోలా ఉంటుంది. నా కథ మూలం ఎందరో స్త్రీల కథ లాంటిదే! ఇంకాస్త విభిన్నంగా ఎందుకు లేదూ.. అనే ఆరోపణ నాక్కూడా వుంది. 


నెలాఖరు రోజులు. చేతిలో పైసలు నిండుకున్నాయి.  ఎవరికీ యెప్పుడూ కూడా మనసు విప్పి చెప్పుకోలేని  మొహమాటం లాగానే అప్పు అడగలేని మొహమాటం. మూడు నెలల అద్దె బకాయి. డ్యూటీ చార్ట్ ఖరారు కాకముందే ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ దగ్గరకు వెళ్ళి తరువాత నెలలో ఆఖరి వారంలో తన షో స్ వుండేలా చూడమని రిక్వెస్ట్ చేసాను. అతను దయతలిస్తే  కాస్త ఊపిరి పీల్చుకున్నాను. పిల్లను తీసుకుని హైదరాబాద్ పయనమయ్యాను. అక్క దగ్గర అతిథిగా కొన్నాళ్ళు  వుండి కొన్ని జింగిల్స్ చేయాలి. రాసి రికార్డ్ చేసుకున్న జావళి లు వినిపించి ఏదైనా ఛానల్ లో అవకాశం కోసం ట్రై చేయాలి. అదృష్టం కలిసొస్తే యేదైనా అవకాశం లభిస్తే ఈ ఎఫ్ యెమ్ ను వదిలేయాలి. అంతకన్నా ముందు భర్త నుండి విడాకులు తీసుకోవాలి, అక్క మహిళా కోర్టు జడ్జి గా చేస్తుంది. ఆమె సాయం వుండనే వుంటుంది అనుకున్నాను. కొన్ని అనుకున్నట్టే అవుతాయి. ముఖ్యమైనవి తప్ప. 


వచ్చిన రెండు రోజుల తర్వాత అక్కను విడాకులకు అప్లై చేస్తానని అడిగాను. అక్క యేమీ మాట్లాడకపోవడం బాధ కల్గించింది.కాస్త వివరంగా చెప్పాను.


“అతన్ని భరించడం చాలా కష్టంగా వుంది. ఎప్పుడెక్కడ వుంటాడో  అసలు ఆఫీస్ కి వెళతాడో లేదో తెలియదు. పాప నేసుకుని వెళ్ళి షో చెయ్యడం కష్టంగా వుంది. ఆ జాబ్ చెయ్యకపోతే యింటి ఖర్చులకు కూడా డబ్బులుండవు. జెరాక్స్ సెంటర్ కూడా మూసేయక తప్పలేదు. షట్టర్ తెరిస్తే అప్పుల వాళ్ళ తాకిడితో మెదడు మొద్దుబారిపోతుంది. మూడేళ్ల నుండి యిదే వరుస. అవన్నీ వొకెత్తు.  అతను యింటికొస్తే యింకో నరకం. నోటితీట, జుగుప్సాకరమైన మాటలు,చేతలు భరించలేకున్నాను అక్కా!” మనసులో బాధను  కళ్ళనీళ్ళతో  గుమ్మరించాను.


“కారణాలు గట్టిగానే వున్నాయి. కానీ విడాకులు వరకూ వెళ్ళే ముందు యింకోసారి గట్టిగా ఆలోచించు చెల్లీ!  పిల్లదానికి తండ్రి అనేవాడు వుండాలి కదా” అంది. 


“ఇంకెప్పుడూ అక్కతో కష్టాలు చెప్పుకోకూడదు” దృఢంగా అనుకున్నాను. ఫ్రెండ్స్ సహకారంతో అవకాశాల కోసం ప్రయత్నించాను.రెండు జింగిల్స్ చేసి కొంత డబ్బు చేతికందాక పర్వాలేదు, ఈ మాత్రం ప్రోత్సాహం వుంటే లైఫ్ లాగించేయవచ్చుననే ఆశ వేళ్ళూనుకుంది. . 


 “పిల్లకు నీకూ పండుగ కి బట్టలు కొనుక్కో”  అని చేతికి పదివేలు యిచ్చింది అక్క. 


“వద్దక్కా! యిప్పటికే నీకు చాలా రుణపడి పోయాను” అని సున్నితంగా తిరస్కరించాను. 


 “తోడబుట్టిన వాళ్ల మధ్య రుణం అనే మాటలుంటాయటే” అని మందలించింది.తర్వాత నేను చూడకుండా యింకొంత కలిపి నా బ్యాగ్ లో పెట్టింది.


బస్ యెక్కించడానికి అక్క బావ యిద్దరూ వచ్చారు.  కదలబోతున్న బస్ యెక్కేముందు “అక్కా, బావ గారూ! మీ యిద్దరిని వొక మాట అడగనా?”


“చెప్పమ్మా సావేరి, ఏ హెల్ప్ కావాలన్నా నిస్సంకోచంగా అడుగు” మాటిచ్చాడు బావ. 


“నాకేదైనా జరిగితే నా పాపను చూస్తారు కదూ!” సమాధానం కోసం చూడకుండా బస్ యెక్కేసింది. వాళ్ళిద్దరి చూపుల్లో దిగులు వీడ్కోలు బాధలో మిళితమైంది.


**********

జీవితంలో అన్ని రోజులు ఒకేలా వుండవు. జీవితాన్ని మలుపు తిప్పే పరిచయాలు జురుగుతుంటాయి. అప్పటికి అది మాములు పరిచయమే ! ఆ రోజు   ఎఫ్ ఎమ్ లైవ్ లో వుంది. నానారకాల పైత్యాలు భరించిన తర్వాత అతని కాల్. 


“నా పేరు శ్రీకాంత్! “

 

“నైస్!  ఇంకొంచెం చెప్పండి మీ గురించి?”


“నౌ ఐ యామ్ ట్వంటీ యెయిట్.  సినిమాలు అమ్మాయిలు చాట్స్  ప్రేమలు పిక్నిక్ స్పాట్స్  ఫ్రెండ్స్ తో వీకెండ్ పార్టీలు అన్నీ రొటీనైపోయి లైఫ్ బోర్ కొట్టేసింది. నన్ను యెప్పుడూ విడిచిపెట్టనిది పాట వొక్కటే, పాట నా చేతివెన్నముద్ద.  ప్రస్తుతానికి దాన్నే పట్టుకుని వేలాడుతున్నాను. మీ స్వరం మీరు ప్లే చేసే పాటలు చాలా బాగుంటాయి.”


“పాట పట్టుకుని వేలాడుతూ వుండటానికి కూడా ఇంకేదో పట్టుకుని వేలాడాలి కదా! అదేంటో చెప్పే సేయండీ”


“చెప్పాలంటారా, చెప్పక తప్పదంటారా?”

 

“బలవంతం ఏమీ లేదు, fm యెవరు వింటున్నారు అనే సర్వే కోసం అనుకుని చెప్పేస్తే వొక పనై పోతుంది”అని హింట్ పాస్ చేసింది. 


“సాఫ్ట్ వేర్ అన్నాననుకోండి” అన్నాడతను. 


“ఓకే.. ఓకే. మీకిష్టమైన పాట చెప్పండి?”


 “కీరవాణి  ప్రణయమా! ప్లే చేయండి.”


“ ఓ! మీది 90’ స్ టేస్ట్ అన్నమాట, మీరు  కొంచెం పాడవచ్చు కదా! “


అడగడమే తడవు అతను  పాట అందుకున్నాడు. విబ్రాంతి గా వింటూ అనుకున్నాను. 


“పాడమని అడిగితే తన ప్రాణాన్ని పాటలో నింపే వాడితను. పాట సాహిత్యానికి జీవం పోసేవాడితను అని.”


ఆ తర్వాత రెండు రెండురోజుల పాటు అతని పాట మెదడులో గింగిరాలు తిరుగుతూనే వుంది.


ఇంకోరోజు.. అతనే! పాట తోనే  పలకరింపు. 


“నీవే అమర స్వరమే సాగే శృతిని నేనే” అంటూ. పాట కోసం యెవరూ ఫోన్ చేయరు. మీతో మాట్లాడటానికే చేస్తారు” అన్నాడు.


అలా అన్న అతను రుజువు చేయడానికే అన్నట్టు నిత్యం నా షో కి మాత్రమే కాల్ చేసేవాడు. మిడ్ నైట్ కి గంట ముందు యెండ్ అయ్యే షో కి కాల్ చేసినపుడు సంభాషణల్లో డిన్నర్ గురించి ప్రస్తావన. 


“మీకేం, మీరు హాయిగా తినేసి రిలాక్స్ అవుతూ కాల్ చేస్తున్నారు. నేను యింటికి వెళ్ళి వొండుకుని తినాలి” అంది. 


సైన్ ఆఫ్ చేసి  బయటికి వచ్చి పార్కింగ్ వైపుకు వెళ్ళబోతుండగా  “సావేరి  మేడమ్!” అని గట్టిగా పిలిచాడో వ్యక్తి.  అప్రయత్నంగా తల తిప్పి చూసింది. 


అతను వేగంగా  సమీపించి “మీరు వెజ్ ఆర్ నాన్ వెజ్ ? “


చిరాకుపడి “మీరెవరు? అసలు ఆ విషయం మీకెందుకు?”


“ఇప్పుడు యింటికి వెళ్ళి యేం వొండుకొని తింటారు లెండి. వెజ్ అయితే ఇది తీసుకోండి నాన్ వెజ్ అయితే ఇది తీసుకోండి” చేతులు రెండూ చాచి చూపుతూ అన్నాడు. 


“ఆర్ యు శ్రీకాంత్!” ఆశ్చర్యంగా అడిగింది. 


“యెస్ మేమ్. తప్పుగా అనుకోకండి. ఆకలి తో యెవరున్నా  యిలాగే పుడ్ అందిస్తాను. ఆకలి యెలా వుంటుందో నాకూ బాగా తెలుసు గనుక.”  ఈ సారి అతను చూపుల్తో   స్నేహ సేతువు కడుతున్నాడు 


 ఏవో పాజిటివ్ వైబ్స్. అతని చేతిలో వెజ్  పేకింగ్ ని అందుకుని థ్యాంక్స్ చెప్పింది. ఆ అందుకునే క్రమంలో అతని చేతివేళ్లు తగిలి మనసు ముట్టుకున్నట్టు అనిపించింది. 



“ఏంటి విశేషం? కొందరు నీ షో కి మాత్రమే కాల్ చేస్తారు. వారికి ఏం మంత్రదండం వేసావ్” అని నవ్వుతూ కో ఆర్జేస్  అడిగినా అందులో  కనబడని ఓ వెక్కిరింత ఈర్ష్య కలగాపులగంగా వుండేవి. 


“అదేంలేదు, ఏదో పాటల టేస్ట్. అంతే!”


నిజంగా అప్పటికి అంతే! ముందు ముందు ఏం కాబోతుందో నాకు మాత్రం ఏం తెలుసు? 

విధి వల్లనో వరం లాగానో ప్రేమ దేవతల కరుణ వల్లనో నాకు తారసపడ్డాడు.


అతను కాల్ చేయగానే.. ఎందుకో నా కళ్ళలో మెరుపు. పెదవి పై లేనగవు అంకురిస్తూ వుంటుంది. 


అనేక చికాకులు సమస్యల్లో వున్న  నాకు అతని పరిచయం నచ్చింది. నా బాధల గురించి మర్చిపోయే వెసులుబాటు నిచ్చింది. అతని ఆలోచన రిలీఫ్  నిచ్చింది. పర్సనల్ ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకోవడం జరిగిపోయింది. ఫ్లూట్ ప్లేయర్ రాజేష్ చేర్తాల, శాక్సోఫోన్ లిపిక సమంతా ని వారి స్వరనాదాల తీయదనాన్ని  పరిచయం చేసింది  అతనే!  ఎన్నో కబుర్లు, క్లాసికల్ మ్యూజిక్, పుస్తకాలు గురించి అతని మాటల్లో అవలీలగా దొర్లిపోయేవి. అతని నేపథ్యం సంగీతసాహిత్యంతో ముడిపడి ఉందని అర్ధమైంది. అప్పుడప్పుడు ఏ పార్క్ లోనో బీచ్ లోనో కలవడం. సరదా కబుర్లు. లిరిక్స్, స్క్రిప్టులు ఇచ్చిపుచ్చుకోవడం. ఇద్దరం కలసి  కొన్ని పాటలు రికార్డ్ చేసాము. 


అతనొక ప్రేమ సముద్రం. ఒడ్డున వున్న రాయిలాంటి నన్ను  అలల కళ్ళతోనే  నిలువెల్లా సృశిస్తుంటే తడిసి ముద్దై  సజీవంగా మారినట్లు వుంది. మదిలోకి   చొరబడుతుంటే టక్కరిగా  ఓరగా తలుపు తీసి మూసి దాగుడుమూతలు ఆడింది.వమూసిన కిటికీ తలుపులపై వాన తన మృదువైన స్పర్శతో సంతకం చేసినట్లు అతని గుండె గుసగుస నా గుండె వరకూ చేరింది. 


ఏకాంతమున నేల యెదురైతినే తనకు

లోకాధిపతికేల లోనైతినే

చేకొనిదె మన్నించె శేషాద్రివల్లభుడు

పైకొనిదె మమ్మేల పాలించెనే - పదే పదే పాడుకున్నాను.


మనసు ముట్టుకున్నవాడు బాహ్యంగా దూరంగా ఎలా వుంటాడు?  

అటుఇటూ తేల్చుకోలేక ఊగిసలాడాను. మధనపడ్డాను. బిడ్డ తల్లిని కదా..  నేను అని నాలుగునాళ్ళు ఊగిసలాడాను. ఆఖరికి సందేహాన్ని జయించాను. 


“ఉత్తమ వ్య క్తినించివొచ్చే వున్నత ప్రేమ మన జీవనానికి పరమ అవసరము, మకుటము అని చలం అనలేదూ”  ఆహ్వానించకపోవడం తప్పు కదూ! నా మోహ గిరి అతను.  వశం తప్పుతున్న శరీరానికి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాను. 


మంచులా గడ్డకట్టిన నా దేహం కరగడం మొదలైంది. జడము చైతన్యంతో కలిసి ప్రవహించిది. ఆ కలయిక కు పారిభాషిక పదజాలం ఏమిటి? నువ్వు నా స్వైరిణి వి అన్నాడు అతను. ఉలికిపడ్డాను. నిజమే కదా! అతనితో అనుభవం నా జీవితానికో వరం. 


అతను ఏ పని చేసినా మనఃస్పూర్తిగా అంకితభావంతో చేస్తాడు. పాపాయి కి పాలు పట్టడం ముక్కు తుడవడం డైపర్ మార్చడంతో సహా. ఆల్కాహాల్ మానేయమని అడిగాను.. మారుమాటాడకుండా వదిలేసాడు. అంతే! తనను పూర్తిగా అతనికి వదిలేసుకుంది.


మూడు నెలలు సెలవు పెట్టేసింది. ముందుకు అడుగు వేసింది. అతని తల్లి నివాసముంటున్న ఇంటికి తీసుకువెళ్లాడు. కోనసీమ లో ఓ పల్లెటూరు.  అప్పుడు ఆమె  కలకత్తాలో వుంది అని చెప్పాడు. ఆ ఇల్లు గోదావరీ తీరం లో వుంది. గ్రంథాలయంలా పూలవనంలా చిత్రకళా కుటీరంలా  వుంది. “ఎంతో రసికుడు దేవుడు ఎన్ని పూవులెన్ని సొగసులిచ్చేడు” పాట పదే పదే పాడుకున్నాను. 


అది మండు వేసవి. ఆ మూడ్నెల్ల  కాలం ఎలా గడిచిందో చెప్పలేను. నా జీవితంలో గడిపిన అత్యద్భుత కాలం అది. ఏటిలో పడవ ప్రయాణం లా భావగీతంలా సాగిపోతుంది. అతనొక ప్రేమ ప్రవాహం. రేపటి గురించి ఆలోచన లేదు భయం లేదు. స్వేచ్ఛగా హాయిగా కలసి పాడుకుంటూ ఆడుకుంటూ వంట చేసుకుంటూ పిల్లదాన్ని అపురూపంగా పెంచుకుంటూ. 


నల్లగా నిగనిగలాడే (ఆకుపచ్చ ) తోటలో అనేక రంగురంగుల కనకాంబరాలు.  ఆ రంగులంటే అతనికిష్టమట. పొద్దున్నే పూసి సాయంత్రానికి రాలే పువ్వులు కావవి. తీయని మకరందంతో విరాజిల్లుతూ తుమ్మెదలను ఆకర్షిస్తాయి అని చెప్పాడు. పాపాయి ని ఆ పూలతోటలో నిలుచుండబెట్టి పదుల సంఖ్యలో ఫోటోలు తీసాడు. దాన్ని గుండెలకు హత్తుకుని నువ్వు నా కనకాంబరానివి అనేవాడు. ఈర్ష్య గా చూస్తున్న నన్ను హత్తుకుని నువ్వూ నా కనకాంబరానివే! అనేవాడు ఆకాశాన్ని చూపిస్తూ.కాలం అలా స్తంభించిపోతే బాగుండును అని పదే పదే అనిపించేది కూడా! 



“సావేరి, పాపను ఎవరికీ ఇవ్వవద్దు. మన దగ్గరే వుంటుంది. అమ్మకు అంతా చెప్పాను. అభ్యంతరం చెప్పలేదు. మనం ఇక్కడే వుండిపోదాం. సిటీ కి వెళ్ళవద్దు” అని పదే పదే అనేవాడు. 


 ఇతను ఎల్లప్పుడూ ఇదే ప్రేమ ఇవ్వగలడా? అన్న అనుమానం కల్గేది నాలో. మళ్లీ అంతలోనే ఛీ! నేను తప్పుగా ఆలోచిస్తున్నాను అని మొట్టికాయలు వేసుకొనేదాన్ని. “అయినా ఈ నగ్నదేహాల బిగింపుల బలమెంతో కాలమే చెప్పాలి” అని అనేక సంశయాలతో అనుకున్నాను.  అయినా నాకు యిదే కావాలి అదొద్దు అనడానికి మనమెవరం ? నాకిపుడు ఇది ఇలా జరగాలని రాసి పెట్టి వుంది కాబోలు అనుకునేదాన్ని. 


కాలం అలా గడిచిపోతే ఎలా? ఆడియో సంభాషణలతో సరిపెడుతున్న నన్ను వీడియో కాల్ చేయమని బలవంతపెట్టసాగింది అక్క.  నేను ఏదో కుంటిసాకులతో దాటేసేదాన్ని. ఆమెకేదో అనుమానం పొడచూపింది. ఆరా తీయడం మొదలెట్టింది. వచ్చి చూస్తే  ఖాళీ ఇల్లు వెక్కిరించింది. కొలీగ్స్ ని ఆరాతీసారు. ఎలాగైతేనేం మా ఆచూకీ కనుక్కొన్నారు. రెండు కార్లలో మేమున్న ఇంటికి వచ్చి పడ్డారు.


అప్పుడు శ్రీకాంత్ ప్రక్కనే వున్న టౌన్ కు వెళ్లాడు. అది వాళ్ళకు అనుకూలంగా మారింది.


“చూస్తూ కూర్చుంటే యేకు మేకు అవుతుంది మేకు బాకవుతుంది” అంది అక్క. 


బావ గారు “ఇదేం పని అమ్మా! ఫలానా జడ్జి చెల్లెలు ఇలా చేసింది అంట అని చెప్పుకుంటుంటే  మీ అక్క కు ఎంత అవమానం? పరువు తక్కువ?“ అన్నారు. 


“జీవితాన్ని ఆస్వాదించడానికి అనుభవించడానికి అనుభూతి చెందడానికి సరైన జోడి కావాలి. వయస్సు రాగానే ఎవరినో వొకరిని  చూసి ముడి పెట్టేసి చేతులు దులుపుకుంటారు. కనీస అభిరుచులు కూడా కలవకుండా శరీరాలు మాత్రమే కలుస్తూ మనసులు యుద్ధాలు చేస్తూ నిత్యం నటిస్తూ రోజులు గడుపుతారు. కాబట్టే.. ఆ జీవితం నిస్పృహ గా మారింది. దానికి తోడు ప్రేమరాహిత్యం, అతగాడి వ్యసనాలు, ఆర్థిక పరిస్థితులు, అప్పులు, బాధ్యతలు నా జీవితాన్ని నరకం చేసాయి”  అని గట్టిగానే చెప్పాలనుకున్నాను. కానీ గొంతు పెగల్లేదు. 


ఎలాగో నోరు విప్పి “నాకు నచ్చిన పని నేను చేసాను. అతను నాకు వద్దు. విడాకులకు అప్లై చేస్తాను.”


“అలాగే! విడాకులు తీసుకున్న తర్వాత అతన్ని పెళ్ళి చేసుకుందువు. అప్పటి వరకూ నా దగ్గర వుందువు గాని వచ్చేయ్” అంటే  అక్కను నమ్మి వారి వెంట వచ్చేసాను. 


అక్కడికి చేరుకున్నాక  ఇరువైపు పెద్దలూ చేరి  చూపుల చురకత్తులతో మాటల గునపాలతో గుచ్చి గుచ్చి చంపారు. నీకు వాడే కావాలి అనుకుంటే  పిల్లను వొదిలేసి వెళ్ళిపొమ్మని పిల్లను లాక్కుని రెండు రోజులు కనబడనీయకుండా చేసారు.  


“పాప కావాలా? శ్రీకాంత్ కావాలా!? అంటే ఏం చెబుతాను.” నిస్సహాయంగా చూస్తూ వుండిపోయాను. ఈ లోపు ఎక్కడ వున్నాడో తెలియని భర్తను వెతికి పట్టుకొచ్చి ఇంటికి వొంటికి కాపలా పెట్టారు.  శ్రీకాంత్ ని కలవనీయకుండా మాట్లాడకుండా విశ్వాసం కల కుక్కలా అనుక్షణం కనిపెట్టి అనుసరించే వుండేవాడతను. అత్తమామలు సైనికుల్లా కాపలా. తన చేతిలో ఫోన్ అనేది లేకుండా చేసి గృహ ఖైదు చేసేసారు. శ్రీకాంత్ రెండు రోజులు ఇంటి చుట్టూ తిరిగాడు. అక్క కంప్లైంట్ చేసింది. అతన్ని పోలీసులు తీసుకు వెళ్ళారు. ఏం జరిగిందో తెలియదు. అలజడి,భయం,ఏవో పీడకలలు. ఇంట్లో గుసగుసలు. అతని గురించి ఆందోళన.తిండి లేదు, నిద్ర లేదు.  


ఎలాగోలా వాళ్ళ కళ్ళుగప్పి పక్కింటి అమ్మాయి నడిగి ఫోన్  తెప్పించుకుని రహస్యంగా శ్రీకాంత్ కి ఫోన్ చేసాను. ఇంట్లోనే వున్నాడు. ఎంత చిక్కిపోయాడో! అంత నిరాశగా వున్నాడు. 

.

“సావేరీ! పాపను తీసుకుని వెంటనే వచ్చెయ్, విడాకుల సంగతి తర్వాత చూసుకుందాం” గొంతు రుద్దమై  మాట కన్నీటి మడుగులో చేప పిల్లలా ఈదులాడింది. 


 “రాలేనేమో శ్రీ” అన్న నా మాట విని ధారగా  కన్నీరు కార్చాడు. అతన్ని ఓదార్చడం నా వల్ల కాలేదు.

 “శ్రీ! ఇప్పుడు నేను నీ ప్రేయసిని కాదు,ఆ నాటి స్వరఝరి ని కాదు. పరాజయ కంఠధ్వని మాత్రమే! ఓ బిడ్డకు తల్లిని మాత్రమే!  కుటుంబ గౌరవాన్ని కాపాడే బానిసని మాత్రమే! నన్ను అర్థం చేసుకో! ప్లీజ్!”


“నాకు రెండు నాల్కలు, రెండు గుండెలు, రెండు జీవితాలు లేవు సావేరి.  వసంతంలో పుట్టి శిశిరంలో రాలిపోయేది కాదు నా ప్రేమ. నేను రాలిపోవడమే తప్ప!”


“నీకేమైనా పిచ్చిపట్టిందా! లేక  బ్లాక్ మెయిల్ చేస్తున్నావా ? నన్ను మర్చిపొమ్మని చెబుతున్నాను కదా!” అరిచేసాను. 


అవతల ఫోన్ పగిలిపోయిన శబ్దం. 


“ప్రయత్నిస్తాను అని కూడా తాను ఎందుకు చెప్పలేకపోయింది? అంటే  ప్రయత్నించడం లేదనే కదా! ప్రశ్న ప్రశ్నించింది. అపరాధభావంతో  ఓ నిట్టూర్పు విడిచాను. ఆలోచించడం మొదలెట్టాను. పాపతో సహా  వెళ్ళిపోవడానికి మార్గాలు వెతకసాగాను.


వారం రోజులు గడిచాయేమో! ఆడదాన్ని తిరస్కారాన్ని మగవాడు భరించలేడు. మొగుడైతే మరీనూ. ఆ మొగుడనే వాడు  నన్ను తన దారిలోకి తెచ్చుకో ప్రయత్నం చేసాడు. అతన్ని దూరంగా  నెట్టి కచ్చితంగా చెప్పాను.


“మనం భార్య భర్త  అన్న గీత దాటిపోయింది. ఎవరి సరదాలు సుఖాలు సంతోషాలు  వారివి గా  మారిపోయాయి. నలుగురు స్త్రీలతో నాకు అక్రమ సంబంధం వుండొచ్చు కానీ నువ్వు మాత్రం నాకు ప్రతివతా శిరోమణి  అయిన భార్య గానే వుండాలి అంటే  కుదరదు. అసలు నీతో జీవితం కొనసాగించాలంటేనే నాకసహ్యమేస్తుంది.  విడాకులు కావాలి. ఇచ్చేయ్!” అని అరిచాను. 


జుట్టు పట్టుకుని ఈడ్చాడు. విచక్షణా రహితంగా కొట్టాడు. అసహ్యంగా తిట్టాడు. భరిస్తూనే మొండిగా చెప్పాను.


“నేను అతనితో గడిపిన రోజుల్లో పొందిన ప్రేమ ఆనందం సంతోషం  నీతో గడిపిన మూడేళ్ళ లో  వీసమెత్తు కూడా దక్కలేదు. మన ఇద్దరికీ  ఏ విధంగానూ సరిపోదు. నన్ను వదిలేయ్ ప్లీజ్!” వేడుకున్నాను కూడా!. 


అయినా వినలేదు. పశు బలంతో దాడి చేశాడు.ఆ మృగం ముందు నా దేహం ఓడిపోయింది. ఒడలంతా భగభగ మండిపోయింది. ఇక ఈ జీవితం ఇంతేనా? నాపై నాకే అసహ్యం కల్గింది. 


నిస్త్రాణంగా పడిపోయిన నేను తడి స్పర్శకు కళ్లు తెరిచాను.  లేచి పాపాయి కి డైపర్ మార్చబోయి అది పొడిగా వుండేటప్పటికి జరిగింది గ్రహించాను. అదొక అవమానం. అసహ్యంతో బాత్ రూమ్ లోకి పరిగెత్తాను.


స్నానం చేసి వచ్చి కారిడార్ లో నిలబడ్డాను. అప్పుడే గుడి గంట మ్రోగింది. గోపురం వైపు చూసి హృదయ నమస్కారం చేసుకున్నాను.ఆ చర్య నాలో పాపభీతి కాదు. నేను మనసా వాచా కర్మణా శ్రీకాంత్ తో గడిపానని అర్థమైంది. అంతలో  పక్కింటి అమ్మాయి కంగారుగా కారిడార్ లోకి వచ్చింది. సైగ చేసింది. ఫోన్ నాకే అంది. అందుకుని లిఫ్ట్ చేయగానే  శాపనార్ధాల వర్షం శరాఘాతంలా తడిపేసింది. ఓ తల్లి గుండె శోకాలు పెడుతుంది. ఆమె శ్రీకాంత్ తల్లి. ఆమె చెప్పిన మాటలు విని..


“నో! అలా జరగడానికి వీల్లేదు” అంటూ గట్టిగా అరిచి పెద్దగా ఏడుస్తున్నాను. 


ఇంట్లో అందరూ చుట్టుముట్టారు. విషయం చెప్పాను. భర్త అనే పురుగు  నా  వైపు చూస్తున్నాడు అతని కళ్ళల్లో వికృతమైన ఆనందం నృత్యం చేస్తోంది. అందరూ  వాన కురిసి ఆగిన తర్వాత గొంతు చించుకుని అరిచే బావురు కప్పల్లా బెకబెక మన్నారు. వారందరి కళ్ళల్లో రాక్షసత్వం ద్విగుణీకృతం అయింది. ఏవో అపశకునపు మాటలు. 


నాలో ఏదో విస్పోటనం, పశ్చాతాపం. ఇంకేమీ  ఆలోచించకుండా ఒక్క ఉదుటన ఇంట్లో నుండి బయటకు వచ్చి తలుపు గడియ బిగించేసాను.  రోడ్డున పడి ఎక్కడికో, ఏమో తెలియని పరుగులు తీస్తూ..  


నిశ్శబ్దంగా జారుతున్న కన్నీరు, అడుగడుగుకి గుండె బరువు పెరిగిపోతుంది. అడుగు తడబడుతుంది. అయినా  ఆగలేదు వగరుస్తూ.. అడ్డదిడ్డంగా  అనేక మలుపులు తిరుగుతూ తిరుగుతూ.. రైల్వే స్టేషన్ వైపు.


 నేను సమాజానికి భయపడ్డానా? శ్రీకాంత్ పరిచయానికి ముందైనా భర్త తన మెడకు భారమైనా బాధ పెడుతున్నా  నాకొద్దీ  మనిషని యెందుకు త్యజించలేకపోయింది?  ఇప్పుడు మాత్రం ఏమైంది? అది బిడ్డను వదలలేని బలహీనత మాత్రమే కాదు, ఏదో బలవంతపు భరింత.


శతాబ్దాలుగా స్త్రీల మనోభావాలపై అణచివేత వున్నట్లే ఇప్పుడు కూడా తన జీవితంపై మరి కొందరి ఉక్కుపాదం, పెత్తనం, జులుం, స్వారీ. ఇంకా ఏవేవో! నచ్చని వ్యక్తి నుండి విడాకులు ఆశించడం తప్పా!? ఆ హక్కు సుదూర తీరమేనా!? 


శ్రీకాంత్ జీవితాన్ని నిర్లక్ష్యంగా సుళువుగా తీసుకునే మనిషి. ఎంత బాధను అనుభవించి వుంటే ఆ కఠిన నిర్ణయం తీసుకుని వుంటాడు?. అందుకు  కారణం యెవరూ? నేను కాదూ! ఏడేడు జన్మలకు కలిసి నడుద్దాం అనుకున్న వాగ్ధానాలు నీటి బుడగలై పోయాయి. 


“శ్రీ.. నువ్వు లేకపోతే నేనుంటానా?  నెవ్వర్! ప్రేమ ముగిసినప్పుడు జీవితం కూడా ముగిసిపోతుందని నువ్వు అనుకున్నప్పుడు నేనూ నీ దారిలోనే!  క్షణకాలం కూడా ఆలోచించకూడదు. ఈ బంధాలు బంధనాలు అన్నీ తృణప్రాయంగా విసిరేయాలి. అవును అంతే!” 


“శ్రీ !  నేను భౌతికంగా నీతో కలిసి జీవించలేక పోయానన్నమాటే కానీ.. ఈ ఎడబాటులో నిన్ను మరిచింది లేదు. కేవలం ఈ దుఃఖ దేహంతో నిలిచి వున్నాను. నా ఆత్మ  నీవు. ఆత్మను మాత్రమే నీకివ్వగలను. నువ్వు మాత్రం బ్రతకాలి,నిండు నూరేళ్ళూ బ్రతకాలి!! ఈ ప్రపంచానికి నువ్వు కావాలి. ముఖ్యంగా మీ అమ్మకు నువ్వు కావాలి.  ఎవరికైనా నువ్వు పంచే అమృత ప్రేమ కావాలి. అతి మధురమైన నీ స్వరం నిర్జీవమై పోకూడదు. నీ ప్రేమ లో తడిసి తరించే భాగ్యం  అదృష్టం నాకెలాగూ లేదు. పరువులు కోసం పడి చచ్చే పాపాత్ములు నాకు నిన్ను  మిగలనీయరు. నా కోసం నిష్కారణంగా నువ్వు మరణించకూడదు!”  అప్రయత్నంగా అంతులేని ప్రేమ నిండుకున్న నా గొంతు నుండి  నా ఆత్మ చీల్చుకుని వచ్చిందా అన్నట్లు ఓ పెనుకేక. “శ్రీ”.. అంటూ. 


చుట్టూ వున్నవాళ్ళు విచిత్రంగా చూసారు. వెళుతున్న వారు  ఆగి వెనక్కి తిరిగి మరీ చూసారు. వెనుక నడుస్తున్నవారు ఆసక్తిగా నన్నే  గమనిస్తున్నారు. లోకం అంతే! లోకానికి మరే పని లేదు ఇతరులను గమనించడం, నిందించడం తప్ప. వ్యాఖ్యానించడం తప్ప..


వేగంగా గూడ్స్ బండి దూసుకువస్తుంది. అంతవరకూ ప్లాట్ ఫామ్ పై నడుసున్నదాన్నల్లా వొక్క వుదుటున పట్టాల మీదకు దూకేసాను. పైన నిలబడినవారు వెనక్కి రమ్మని లేదా అవతలకు వెళ్లమని గోల గోలగా అరుస్తున్నారు. 


ప్రేమ అగ్ని కీల. అందులోనే దగ్ధం కాదలుచుకున్నాను.  శ్రీకాంత్ లేని జీవితం ఊహించలేను. ఆ విషాద గీతం ఆలపించలేను. నాకూ ఈ జీవితం వద్దనే వద్దు. మృత్యు భయాన్ని జయించాను. తెంపరితనంతో ముందుకు ఉరికి  ఎదురుగా వస్తున్న రైలును క్షణ కాలం అతన్ని  హత్తుకున్నట్టుగానే. అంతే! బాధల తుఫాన్ తీరం చేరడానికి సమీపంలో వుంది. 


కథ ఇంకా వుంది. పాట సాగుతూనే వుంది అంతులేని ప్రవాహంలా! 


***********సమాప్తం*****************


(ఫిబ్రవరి 15/2025 సారంగ పక్ష పత్రికలో  ప్రచురితం)